సంస్కృతికి అమ్మ బతుకమ్మ

  తెలంగాణ ప్రాంతానికి అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఉన్నది. చరిత్ర పూర్వయుగంలోనే ఇక్కడ ఘనమైన నాగరికత పరిఢవిల్లింది. ప్రపంచ కథా సాహిత్యంలోనే మొట్టమొదటిదని భావించబడుతున్న బృహత్ కథను రచించిన గుణాడ్యుడు పటాంచెరువు ప్రాంతం వాడని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే మహాకవి కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించిన ప్రఖ్యాత సంస్కృత పండితుడు కోలాచలం మల్లినాథసూరి మెదక్ జిల్లా కొల్చారం గ్రామవాసి. కోలాచలమే కాలక్రమంలో “కొల్చారం”గా మారింది. “వాణి నా రాణి” అని సగర్వంగా ప్రకటించుకున్న పిల్లలమఱ్ఱి పినవీరభద్ర […] The post సంస్కృతికి అమ్మ బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలంగాణ ప్రాంతానికి అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఉన్నది. చరిత్ర పూర్వయుగంలోనే ఇక్కడ ఘనమైన నాగరికత పరిఢవిల్లింది. ప్రపంచ కథా సాహిత్యంలోనే మొట్టమొదటిదని భావించబడుతున్న బృహత్ కథను రచించిన గుణాడ్యుడు పటాంచెరువు ప్రాంతం వాడని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే మహాకవి కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించిన ప్రఖ్యాత సంస్కృత పండితుడు కోలాచలం మల్లినాథసూరి మెదక్ జిల్లా కొల్చారం గ్రామవాసి. కోలాచలమే కాలక్రమంలో “కొల్చారం”గా మారింది. “వాణి నా రాణి” అని సగర్వంగా ప్రకటించుకున్న పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవి స్వగ్రామం పిల్లల మఱ్ఱి నల్లగొండ జిల్లాలో ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహాకవులు తెలంగాణ గడ్డపై ఉద్భవించారు. తెలంగాణ జానపద కళా సాహిత్యాలకు కూడా పురిటిగడ్డ. ఇక్కడ లేని జానపద ప్రక్రియ అంటూ లేదు. స్త్రీల పాటలు, కోలాటాలు, పేదరాసి పెద్దమ్మ కథలు, జానపద కథా గేయాలు, పారిశ్రామిక గేయాలు, తోలు బొమ్మలాటలు, వీధి నాటకాలు (బైలాటలు) మార్మికతతో కూడుకున్న తాత్విక గేయాలు, పొడుపు కథలు, సామెతలు, పిల్లల పాటలు, జాజిరి పాటలు, ఉయ్యాల పాటలు, శృంగార గేయాలు, వీర గాథలు ఇలాంటి గేయ సాహిత్యంతో పాటు జానపద నృత్యాలు, గిరిజన నృత్యాలు కోకొల్లలుగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో తరతరాలుగా మనుగడ సాగిస్తున్నాయి.

తెలంగాణలో జరిపే బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, పీర్ల పండుగ, తీజ్ పండుగ తెలంగాణ జీవన విధానానికి ప్రతీకలు. మరే ప్రాంతంలోనూ ఇటువంటి పండుగలు లేవు. నిరుపమానమైన, ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి రాజకీయ కారణాల వల్ల గతంలో కొ్ంత మరుగున పడిపోయిన మాట వాస్తవం. తెలంగాణ సంస్కృతి పట్ల మనలో స్ఫూర్తిని రగిలించిన మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. తెలంగాణ ప్రజలను రాజకీయంగానే కాక సాంస్కృతికంగా కూడా జాగృతం చేసి, మహాత్మాగాంధీ పంథాలో ఎక్కడా హింసకు తావు లేకుండా అనితర సాధ్యమైన రీతిలో 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఒక మహోద్యమాన్ని నడిపి, ముందుగా మనలో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చి, తెలంగాణ గత వైభవాన్ని మనకు గుర్తు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు మన కెసిఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. రాజకీయ నేతలందరూ కెసిఆర్‌ది అంతా వృథా ప్రయాస అన్నవారే. అయితే కెసిఆర్ ఎట్లా అయితే గాంధీజీ మన దేశానికి స్వాతంత్య్రం కంటే ముందు మనలోని అస్పృశ్యత, అశుభ్రత, అవినీతి, అనైతికత వంటి సామాజిక రుగ్మతలను నశింపడానికి ప్రజలను చైతన్యవంతులను చేశారో, అదే పద్ధతిలో కెసిఆర్ తెలంగాణకు మాత్రమే స్వంతమైన మన గత సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు గుర్తు చేసి, ప్రజలను జాగృతం చేశారు. అందులో ముఖ్యమైనవి మన బోనాల పండుగ, మన బతుకమ్మ పండుగ. నిజం చెప్పాలంటే తెలంగాణ చాలా ప్రాంతాలలో ఈ పండుగలను జనం మర్చేపోయారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మూలంగా మన సంస్కృతికి పునర్వికాసం, పునరుజ్జీవనం కలిగాయి. ఈ విషయంలో మన మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర అద్వితీయమైనది. “తెలంగాణ జాగృతి” సంస్థను స్థాపించి, బతుకమ్మ పండుగను వాడవాడలా నిర్వహించడమే కాక అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ, ఉద్యోగినులతో పాటు ఐఎఎస్, ఐపిఎస్ అధికారిణులు, మంత్రులు కలిసి ఒకే చోట బతుకమ్మ ఆడటం ఒక అపూర్వమైన సన్నివేశం. తరతమ భేదాలను మరచి సుహృద్భావ వాతావరణంలో అన్ని వర్గాల వారు కలిసి ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలలో చేయి చేయి కలిపి పాల్గొనడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన.

దేశంలోనే కాక విదేశాల్లో కూడా బతుకమ్మకు బహుళ ప్రాచుత్యం కల్పించిన ఘనత కవితకే దక్కుతుంది. ఆమె రోజుకు ఒక దేశం చొప్పున తొమ్మిది రోజుల పాటు తొమ్మిది దేశాలలో బతుకమ్మ ఆడించి, చివరి రోజైన బతుకమ్మకు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని మూడేళ్ల క్రిందట రికార్డు సృష్టించారు. మహానాయకుడు మన కెసిఆర్ కృషితో తెలంగాణ ప్రజల కలల పంటగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కెసిఆర్ నాయకత్వంలో అనితర సాధ్యమైన రీతి లో కాళేశ్వరం వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను నిర్మించుకుని, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులు తీస్తున్నది. తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలైన బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి, వీటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే సువర్ణావకాశం మనకు లభించింది. ఈ విధమైన ప్రభుత్వ ప్రోత్సాహం తెలంగాణ సంస్కృతి, కళల వికాసానికి ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ సంస్కృతిలో బోనాలు, బతుకమ్మ పండుగలు అతి ముఖ్యమైన సామాజిక ఉత్సవాలు. బోనాలు ఆషాఢమాసంలో తొలకరి ప్రారంభమైన తరువాత పంటలు వేస్తూ చేసుకునే పండుగ. బతుకమ్మ ఆశ్వీయుజ మాసంలో పొలాలు పైరు పచ్చలతో కళకళలాడుతుండగా చేసుకునే పండుగ. రెండు ప్రకృతికి సంబంధించిన పండుగలే.

బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ. బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. బతుకమ్మకు ఒక ఆకారం లేదు. ప్రకృతిలో లభించే బంతి, తంగేడు, గునుగు వంటి పూలను అందంగా గోపురంలా పేర్చి, ఆ గోపురాన్ని దేవతగా భావించి, మహిళలందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా పాటలు పాడుతూ, భజనలు చేస్తూ, కోలాటమాడుతూ తొమ్మిది రోజులు వేడుకగా చేసుకునే సామూహిక పండుగ బతుకమ్మ. తెలంగాణ నిర్మల జీవిన విధానానికి, సామాజిక ఏకత్వానికి ప్రతీక ఈ పండుగ. తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక జీవన విధానానికి అద్దంపట్టే పండుగ ఈ బతుకమ్మ. ఆశ్వీయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు ఆదిపరాశక్తిని అర్చించే పవిత్ర దినాలు.

అమ్మవారు ఈ విశ్వంలోని చరాచర ప్రకృతి అంతా నిండి ఉన్నదని తెలియజెప్పే పండుగ శరన్నవ రాత్రలు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని స్తుతిస్తూ “యాదేవి సర్వ భూతేషు…” అనే ప్రసిద్ధమైన స్తోత్రాన్ని చేశారు. దీని అర్థం ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ బుద్ధి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ శక్తి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ శాంతి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ శ్రద్ధ రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులోనూ కాంతి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ లక్ష్మి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ పుష్టి రూపంలో నిండి ఉందో, ఏ దేవి అయితే సర్వ జీవులలోనూ మాతృ రూపంలో నిండి ఉందో ఆ అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మకు చేసే ప్రార్థన ఇది.

అమ్మవారినే ప్రకృతిగానూ, ప్రకృతినే అమ్మవారిగానూ భావించి పరమ పవిత్రంగా పూజించడం బతుకమ్మ పండుగ. ప్రకృతినే ప్రేమించడం, పూజించడం అనాదిగా వస్తున్న తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతి బయట నుంచి వచ్చిన ఇతర సంస్కృతుల దాడిని కూడా ఎదుర్కొని సజీవ స్రవంతిగా కొనసాగుతున్నది. కొంత కాలం ఒడిదుడుకులకులోనై మరుగున పడినపపటికీ, తెలంగాణ ప్రజలను రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ చైతన్యపరచిన మహా నాయకులు మాన్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో తెలంగాణ సంస్కృతి మళ్లి జాగృతమైంది. ఇందుకు ప్రప్రథంగా చెప్పుకోవలసిన వ్యక్తి మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత. ఆమె తెలంగాణ ఉద్యమంలో భాగంగా “తెలంగాణ జాగృతి” సంస్థను స్థాపించి, బతుకమ్మ పండుగకు పునరుజ్జీవనం కలిగించారు. తెలంగాణ ఆడపడుచులను వాడవాడలా జాగృత పరచి బతుకమ్మ ఆడించారు.

ఇండ్ల ముందే కాక, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తరతమ భేదాలు మరచి, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల నుంచి అటెండర్లు, స్వీపర్ల వరకు అందరూ తరతమ భేదాలు మరచి ఒకే వేదికపై చేయి చేయి పట్టుకుని బతుకమ్మ ఆడే చైతన్యాన్ని రగల్చిన ఘనత కవితదే. మహాలయ అమావాస్య నుంచి మాహార్నవమి వరకు సాగే ఈ ఉత్సవంలో బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో గడపగడపనా కనువించు చేస్తుంది. మన సాంస్కృతిక సౌరభాలను వెదజల్లుతుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. అవి తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మ జడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గన్నేరు, బీర, నిత్యమల్లె పుష్పాలను ఒక క్రమ పద్ధతిలో గోపురంలా అమరుస్తారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు.

ఈమె ఈ తొమ్మది రోజులు పుట్టింటికి వచ్చినట్లు భావించి బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో /బంగారు బతుకమ్మ ఉయ్యాలో/ తంగేడు పువ్వై తరలి రావే తల్లి… / అంటూ ముత్తైదువులు పాడుతూ తమ మమకారాన్ని చాటుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో రూపంతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు సఖినాల బతుకమ్మ లేదా వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా గౌరీ దేవి అమ్మవారు పూజలందుకుంటుంది.

బతుకమ్మ వేడుకల చివరి రోజు సాయంత్రం ముత్తైదువులందరూ కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిట్లో పెడతారు. ఇరుగు పొరుగు ఇళ్లవారు కూడా తమ బతుకమ్మలను ఇదే విధంగా తెచ్చి పెడతారు. అందరూ కలిసి వలయాకారంలో మానవ హారంగా ఈ బతుకమ్మల చుట్టూ తిరుగతూ పాటలు పాడతారు. చీకటి పడే వేళకు ఆడపడుచులందరూ తమ తమ బతుకమ్మలను తలలపై పెట్టుకుని, తమకు దగ్గరలో ఉన్న చెరువుకు కాని పెద్ద బావికి గాని ఊరేగింపుగా వెళ్లి పాటలు పాడుతూ బతుకమ్మలను నీట జార విడుస్తారు. ఆ తర్వాత పంచదార, రొట్టెతో చేసిన “మలీద” అనే వంటకాన్ని బంధువులకు పంచిపెడతారు. మనిషికి, ప్రకృతికి సంబంధించిన ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఒక విశిష్ట స్థానాన్ని సముపార్జించి పెట్టింది. మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఉంది.

ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. కాని ఈ విషయాన్ని మర్చిపోయిన ఆధునిక మానవుడు యాంత్రికంగా మారి, అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి పాలుపడుతున్నాడు. విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తున్నాడు. దీని వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లభించని దుస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఎంతో దూరదృష్టితో గ్రహించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ తల్లిని పచ్చని వస్త్రంతో అలంకరించడానికి “హరితహారం” కార్యక్రమాన్ని మరొక మహోద్యమంగా ముందుకు తీసుకు వచ్చారు. మొన్న ఆగస్టు 15 నాడు గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పిమ్మట మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ కుటుంబానికి ఆరు మొక్కలు చొప్పున నాటి, అవి పెరిగి పెద్దవైయ్యే వరకు వాటిని సంరక్షించాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి ఈ ఆశయాన్ని మనమందరం చిత్తశుద్ధితో నిర్వర్తించిన నాడు ప్రకృతి మాత సంతోషిస్తుంది. అదే తెలంగాణ ప్రజలకు అసలైన బతుకమ్మ పండుగ.

Bathukamma Festival Celebrated in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంస్కృతికి అమ్మ బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.