ప్రభుత్వ భాషా, ప్రజల భాషా?

  హిందీ అనుసంధాన భాషగా ఉండాలని, అప్పుడే దేశం సమైక్యంగా ఉండి ప్రపంచంలో ఆ భాషకు గుర్తింపు వస్తుందని హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఏకత్వంతో ఐక్యత గురించి మాట్లాడుతున్నారన్న మాట. అమిత్ షా హిందీని బలవంతంగా అమలు చేస్తామని చెప్పలేదు కాని గతానుభవాన్ని బట్టి చూస్తే అలాగే కనిపిస్తోంది. 2019నాటి జాతీయ విద్యా విధానం ముసాయిదా పత్రంలోనూ హిందీని దేశమంతా అమలు […] The post ప్రభుత్వ భాషా, ప్రజల భాషా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హిందీ అనుసంధాన భాషగా ఉండాలని, అప్పుడే దేశం సమైక్యంగా ఉండి ప్రపంచంలో ఆ భాషకు గుర్తింపు వస్తుందని హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఏకత్వంతో ఐక్యత గురించి మాట్లాడుతున్నారన్న మాట. అమిత్ షా హిందీని బలవంతంగా అమలు చేస్తామని చెప్పలేదు కాని గతానుభవాన్ని బట్టి చూస్తే అలాగే కనిపిస్తోంది. 2019నాటి జాతీయ విద్యా విధానం ముసాయిదా పత్రంలోనూ హిందీని దేశమంతా అమలు చేయడం గురించే మాట్లాడారు. దీనివల్ల ‘ఒకే దేశం, ఒకే భాష‘ అన్న సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోందని స్పష్టం అయింది.

ఇది మన దేశంలో భాషా ప్రాతిపదిక మీదే రాష్ట్రాల పునర్విభజన జరిగిందన్న వాస్తవాన్ని విస్మరించడమే. నిజానికి మన దేశం ‘భిన్న భాషల సమాఖ్య’. ఆ రకంగా తమిళులు కావడానికి భారతీయులు కావడానికి తేడా లేదు. ‘ఒకే దేశం, ఒకే భాష’ అన్న సూత్రం భారత జాతీయతనే మసకబారుస్తోంది. భాషా భేదాలను, ప్రాంతీయ భేదాలను విస్మరిస్తోంది. ఇప్పటి దాకా అనుసరిస్తున్న విధానం ప్రయోజనకరంగా ఉంది. దేశమంతటికీ ఒకే భాషను రుద్దాలన్న ప్రయత్నం ఘర్షణలకు, వైరుధ్యాలకు, చీలికలకు దారి తీస్తుంది.

అసలు భాషే ప్రజాస్వామ్య వ్యవస్థ. అంతర్గతంగా అది బహుళత్వంతో కూడింది. భాషకు ప్రజలు చేసే పనితో, జీవన విధానాలతో సంబంధం ఉంటుంది. ప్రజలు బాగుంటేనే భాష కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రజలకు జీవనోపాధి మార్గాలు సవ్యంగా ఉంటేనే భాష పరిఢవిల్లుతుంది. 2010లో నిర్వహించిన ప్రజా భాషల సర్వే ప్రకారం మన దేశంలో 780 సజీవ భాషలున్నాయి. కానీ ఆ తరవాత దశాబ్ద కాలంలో 220 భాషలు అంతరించాయి. వలసలు, నిర్వాసితులు కావడంవల్ల ఈ భాషలు అంతరించాయి. భాషల్లో వైవిధ్యాన్ని ఆహ్వానించాలి, మన్నించాలి. అనేక భాషలు అంతరించినందుకు విచారించాలి.

వలసలు ఉన్నప్పుడు భాషా సంబంధమైన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి కావాల్సింది భాషల విషయంలో సజాతీయత కాదు. సహజీవనం అవసరం. బహు భాషలు మాట్లాడే నగరాల్లో ఒకే భాషను, ఆధిపత్యం చెలాయించే భాషను రుద్దడంవల్ల, రాజ్య విధానాలు, ప్రభుత్వ విధానాలు దానికి అనుగుణంగా ఉన్నందువల్ల వివిధ భాషా సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల నిరసన వ్యక్తం అవుతుంది. ఒకరి భాషకు, ప్రాంతీయ భాషలకు మధ్య సంబంధం ఎందుకు ఉండకూడదు? భాషల అభివృద్ధి సంస్కృతుల మధ్య పరస్పర సహకారంతో సాధ్యం అవుతుందా లేక ఒక భాషను బలవంతంగా రుద్దడంవల్ల సాధ్యం అవుతుందా? భిన్న భాషల మధ్య సహజీవనం, భిన్న సంస్కృతులు, ప్రాపంచిక దృక్పథాల మధ్య సంబంధాలు, సమన్వయం ఉండాలి కదా!

ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు కనక అది అనుసంధాన భాషగా ఉపకరిస్తుందన్న వాదనలున్నాయి. దక్షిణాది భాషలు మాట్లాడే వారు తమ భాషలు ప్రాచీనమైనవని, సుసంపన్నమైనవని భావిస్తారు. అలాంటప్పుడు హిందీ విశాల భారతావనికి మధ్య అనుసంధానం సాధించగలుగుతుందా? హిందీని రుద్దడం కాకుండా అది స్వతస్సిద్ధంగా ఎదగడానికి కృషి చేయవలసిన అవసరం ఉంటుంది కదా! సంస్కృతీకరణకు గురైన భాషను రుద్దడం సబబు కాదు. ఇది ఒకే భాషను రుద్దడానికి ప్రయత్నించడమే. సంకర భాషను రుద్దడానికి బదులు సుతిమెత్తని భాషను, సామాన్యులు ఆహ్వానించే భాషను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాలి. సర్కారీ హిందీ జనాన్ని దూరం చేస్తుంది, అపహాస్యానికి గురవుతుంది. హిందీని సంక్లిష్టం చేయడం, దాన్ని విశిష్టమైన భాషగా మార్చడంవల్ల ప్రయోజనం లేదని హిందీ సాహిత్యం, జనాదరణ కలిగిన భాషలు రుజువు చేశాయి. పరిశుద్ధమైన హిందీ అనడంలోనే వర్గ దృష్టి, కుల దృష్టి ద్యోతకమవుతుంటాయి. ప్రభుత్వ భాష ఎన్నటికీ ప్రజా భాష కాజాలదు. ఒక భాషను రుద్దడం అంటే సోదర భాషలను అంతమొందించడమే. అది ఉర్దూ కావచ్చు లేదా అత్యంత వేగంగా పెంపొందుతున్న భోజ్ పురి లాంటి కొన్ని మాండలికాలూ కావచ్చు. లేదా అంతరిస్తున్న కుమావూని భాషా కావచ్చు.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఆ భాషను వదిలేసి ఇంగ్లీషు మాట్లాడే వారిలాగా మారాలనుకుంటున్నారు. చాలా మందికి హిందీ మాట్లాడే వాళ్లం అనిపించుకోవడం భారంగా తయారవుతోంది. ఇలాంటి వారిలో ఆత్మ న్యూనతా భావం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అనేకమంది యువకులు తాము ఎదిగే దశలో ఇలాంటి వ్యధనే అనుభవిస్తున్నారు. తాము జీవితంలో ఎదగాలంటే ఇంగ్లీషు మీద పట్టు సంపాదించాలనుకుంటున్నారు. అందువల్లే హిందీ మాట్లాడే వారికి కూడా ఆ భాష మీద గౌరవం సన్నగిల్లుతోంది. వాళ్లు ఇంట్లో కూడా ఇంగ్లీషు మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక భాషను ఉద్ధరించడానికి చేసే ప్రయత్నం మరో భాషను రుద్దడానికి దారి తీస్తుందా?

మరో వైపున జీవితానికి ఉపకరించే భాష, నేర్చుకునే భాష మధ్య అంతరాలను రూపుమాపాలన్న ప్రయత్నమూ కనిపిస్తోంది. స్థానిక భాషల్లో తగిన బోధనా సౌలభ్యాలు ఉన్నాయా? స్థానిక భాషల్లో జ్ఞానం అందుబాటులో ఉందా? పండితులు, సాహితీ వేత్తలు స్థానిక భాషల్లో రాయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారా? సామాజిక, ఆర్థిక అంతరాలను అధిగమించి ప్రజలలో చైతన్యం కలిగించే శక్తి స్థానిక భాషలకు ఉందా అన్నది ఆలోచించదగిన అంశం. కావాల్సింది అనుసంధాన భాషగా ఒక భాషను రుద్దడం కాదు. ప్రజల మధ్య సమన్వయం సాధించే భాషను పెంపొందించాలి. ఒకే భాష కాకుండా బహుళ భాషలే భారతీయతకు గుర్తింపు.

Amit Shah says Hindi should be made national language

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభుత్వ భాషా, ప్రజల భాషా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: