భారత్, చైనా!

    భారతదేశం తన అహింసాయుత స్వాతంత్య్ర సమర విజయ సారథి గాంధీజీ 150వ జయంతిని, చైనా తన 70వ జన్మ దినాన్ని ఘనంగా జరుపుకున్నాయి. జాతిపితగా కీర్తనలందుకుంటున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బోధనలను ఇండియా ఎంతగానో ప్రేమిస్తున్నది, ఆరాధిస్తున్నదని ఆయన తాజా జయంతి ఉత్సవాలను జరుపుకున్న తీరు సందేహానికి తావు లేకుండా రుజువు చేస్తున్నది. అయితే ఆయన బోధించిన అహింసా సిద్ధాంతం గాని, మత సామరస్య నీతిగాని, స్వదేశీ ఆర్థిక తత్వంగాని మన దేశం, […] The post భారత్, చైనా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    భారతదేశం తన అహింసాయుత స్వాతంత్య్ర సమర విజయ సారథి గాంధీజీ 150వ జయంతిని, చైనా తన 70వ జన్మ దినాన్ని ఘనంగా జరుపుకున్నాయి. జాతిపితగా కీర్తనలందుకుంటున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బోధనలను ఇండియా ఎంతగానో ప్రేమిస్తున్నది, ఆరాధిస్తున్నదని ఆయన తాజా జయంతి ఉత్సవాలను జరుపుకున్న తీరు సందేహానికి తావు లేకుండా రుజువు చేస్తున్నది. అయితే ఆయన బోధించిన అహింసా సిద్ధాంతం గాని, మత సామరస్య నీతిగాని, స్వదేశీ ఆర్థిక తత్వంగాని మన దేశం, మన జాతి నడకలో ఎంత వరకు చోటుసంపాదించుకోగలిగాయి, అవి ఏ మేరకు మనల్ని తీర్చి దిద్దగలిగాయి? అలాగే చైనా గడచిన 70 ఏళ్ల ప్రయాణంలో ఏమి సాధించింది, మరేమి కోల్పోయింది అనే ప్రశ్నలు ఈ దశలో తలెత్తడం సహజం. గాంధీజీ తన మహోన్నతమైన ఆశయాలు, జీవన సరళి ద్వారా తాను ప్రసిద్ధి పొందినంతగా తన జాతి జీవనాన్ని ప్రభావితం చేయలేకపోయారనడం సాహసమేకాని అది కాదనలేని కఠోర సత్యం.

సహనానికి, అహింసకు గాంధీజీ విశేష ప్రాధాన్యమిచ్చారు. భారతదేశంలో ఇప్పుడు వాటి అడ్రసే కనిపించడం లేదు. ప్రతి రోజూ, ప్రతి క్షణం పలు రకాల హింస చెలరేగుతున్నది. మత సామరస్యం ఐపు లేదు. ఎస్‌సిలపై అగ్రకుల దురహంకారం పడగ విప్పి కాటేస్తున్నది. లింగపరమైన వివక్ష విర్రవీగి వీరంగం వేస్తున్నది. మహిళలు పలు రకాల వేధింపులకు, పగ సాధింపులకు లక్షంగా మారుతున్నారు. గాంధీ జీవించిన నాటి భారత దేశంలో నెలకొన్న సామాజిక వైరుధ్యాలు తొలగక పోగా మరింత పేట్రేగుతున్నాయని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అంటే ఆయన బోధనలు విఫలమయ్యాయనుకోవాలా, ఈ వైరుధ్యాలకు అది సరైన పరిష్కారం చూపలేదనే నిర్ధారణకు రావాలా? ప్రవచించడానికే ఇంపుగా ఉండి ఆచరణ సాధ్యం కానిదా ఆయన ఆలోచనా విధానం? ఆయన గొప్ప ఉదారవాది, చీమకైనా హాని తలపెట్టరాదనే మహోన్నత ఆశయశీలి.

కంటికి కన్ను విధానం ఎంత మాత్రం పనికి రాదని చెప్పిన శాంతి కాముకుడు. బలహీనులను ఆదరించి అక్కున చేర్చుకోవాలని, చేయందించి ముందుకు నడిపించాలని బోధించాడు. ఎంతటి బలవంతుడైన అక్రమార్కుడినైనా అహింసాయుధంతోనే జయించాలన్నాడు. మద్య నిషేధం, స్వీయ నిగ్రహం, మచ్చలేని వ్యక్తిత్వం బోధించాడు. అవిప్పుడు అక్కరకు రానివైపోయాయి. ఆచరణలో దారుణంగా దెబ్బ తింటున్నాయి. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడం ఒక్కటి మినహా భిన్న వర్గాల, మతాల, ప్రాంతాల, భాషల, సంస్కృతుల ప్రజల మధ్య సహ జీవనం, సత్యసంధత, సమగ్ర వ్యక్తిత్వం వంటి విషయాల్లో బోధకుడుగానే గాంధీ మిగిలిపోయాడుగాని దేశ ప్రజల జీవితాల్లో, జాతి మనుగడలో వాటిని పాదుకొల్పి చూపించలేకపోయాడనడం అసత్యం కాజాలదు.

అలాగే సెక్యులర్ రాజ్యాంగానికి అనంతర కాలంలో సోషలిస్టు తరహా లక్షణాన్ని చేర్చుకున్న భారత దేశం ఆ రెండు మహత్తర లక్షాల సాధన వైపు ప్రయాణం చేసినట్టే చేసి ఇప్పుడు పూర్తిగా ఆ బాట నుంచి తప్పుకున్న దృశ్యం కళ్లకు కడుతున్నది. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో గట్టి పునాదులు పడి నిర్మాణం సాగిన పబ్లిక్ రంగం, మిశ్రమ ఆర్థిక విధానం సమాధిగతమవుతున్నాయి. ఇందిరా గాంధీ పాలనలో అమల్లోకి వచ్చి పేదలకు, సాధారణ ప్రజలకు అండగా నిరూపించుకున్న బ్యాంకుల జాతీయకరణ అవసాన దశకు చేరుకుంటున్నది. అవి ఘరానా పెద్ద మనుషుల లూటీకి గురి అవుతున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారి విధానం లోతుగా వేళ్లూనుకున్నది. 1949 అక్టోబర్ 1న ప్రజా రిపబ్లిక్‌గా అవతరించిన చైనా 70 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సాధించనదెంతో ఉంది. ఆర్థికంగా, సైనికంగా అమిత బలం పుంజుకున్నది. జపాన్‌ను వెనుకకు నెట్టి రెండవ అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారింది.

అమెరికా తెర లేపిన వాణిజ్య యుద్ధంలో దానితో ఢీ అంటే ఢీ అంటోంది. కాని 1989 నాటి తియానన్మెన్ స్వేర్ విద్యార్థుల తిరుగుబాటును నిర్దయగా అణచివేసి ప్రజాస్వామిక వ్యక్తీకరణను కాలరాసిన అపఖ్యాతిని మూటగట్టుకున్నది. ఇప్పుడు హాంకాంగ్‌లో స్వేచ్ఛావాదుల గొంతును ఇనుప బూట్లతో పాతాళానికి తొక్కుతున్నదనే అప్రతిష్ఠను వెనకేసుకుంటున్నది. మహాత్మా గాంధీ బోధనలను మరచిన భారత దేశంలో పరిస్థితి అలాగే ఉంది. ఆర్టికల్ 370 రద్దు అమల్లోకి వచ్చి రెండు మాసాలు గడుస్తున్నా కశ్మీర్‌లో సాధారణ జన జీవనం పునరుద్ధరణ కాకపోడం అంతర్జాతీయంగా భారత్‌ను బోనులో నిలబెట్టింది. ఇరుగు పొరుగు అతి పెద్ద దేశాలయిన భారత్, చైనా ఇతరత్రా ఏమి సాధించినా ప్రజాస్వామిక ప్రశాంత జీవనమనే అతి విలువైన సంపదను జారవిడుచుకున్నాయని రూఢి అవుతున్నది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్, చైనా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: