దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం

శాసనసభ సమావేశాల చివరి రోజున ఆదివారం నాడు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక వైపు తన ప్రభుత్వ విధానాల విశిష్టతను వివరించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల కపట వైఖరిని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రంపై కారుతున్నవి మొసలి కన్నీళ్లేనని సోదాహరణంగా వివరించారు. అలాగే ద్రవ్యవినియోగ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ బిజెపి, కాంగ్రెస్‌లను కడిగిపారేశారు. అద్భుతమైన రెవిన్యూ చట్టం తీసుకువస్తాం కౌలుదారులను గుర్తించలేం బిజెపి, కాంగ్రెస్ దొందూ దొందే ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ […] The post దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శాసనసభ సమావేశాల చివరి రోజున ఆదివారం నాడు ద్రవ్య వినిమయ బిల్లును
ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక వైపు తన ప్రభుత్వ విధానాల
విశిష్టతను వివరించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల కపట వైఖరిని
దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రంపై కారుతున్నవి మొసలి కన్నీళ్లేనని
సోదాహరణంగా వివరించారు. అలాగే ద్రవ్యవినియోగ బిల్లుపై చర్చకు
సమాధానమిస్తూ బిజెపి, కాంగ్రెస్‌లను కడిగిపారేశారు.

అద్భుతమైన రెవిన్యూ చట్టం తీసుకువస్తాం
కౌలుదారులను గుర్తించలేం
బిజెపి, కాంగ్రెస్
దొందూ దొందే
ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే
మరి మూడు టర్మ్‌లు టిఆర్‌ఎస్‌దే అధికారం
“తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోడీ మానుకుంటే మంచిది”
కాంగ్రెస్ సభ్యుల
మాటలు అసత్యాలు
వారికి ఏది మాట్లాడాలో తెలియడం లేదు
వారిని చూస్తే జాలి వేస్తోంది
ప్రాజెక్టుల కోసం అప్పులు తేవడం తప్పా?
కాంగ్రెసోళ్లు
అప్పులు తేలేదా ?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అద్భుతమైన రెవిన్యూ చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రైతుల సంక్షే మం కోసమే తమ ప్రభుత్వం ఉందని, రైతుల భూమి కాపాడుతామని అన్నారు. వాస్తవ రైతులకు నష్టం జరగనియ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశా రు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం అ సెంబ్లీలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కౌలుదారులు ఎప్పటికప్పుడు మారుతుంటారని, అది కౌలు అనేది రైతులకు, కౌలుదారులకు మధ్య సంబంధమని పేర్కొన్నా రు. పట్టా పుస్తకాలలో అనుభవదారు కా లమ్ తొలగిస్తామని చెప్పారు. బంజారాహిల్స్‌లో అద్దెకిచ్చే బంగ్లాకు అనుభవదా రు పేరు ఎందుకు రాయరని ప్రశ్నించా రు. భూ సంస్కరణలు చేసే సమయం లో కౌలుదారులకు న్యాయం చేసేందుకు కౌ లుదారులకు హక్కులు కల్పించారని అ న్నారు. ఇప్పుడు బడా భూస్వాములు ఎ క్కడ ఉన్నారని ప్రశ్నించారు. 20 శాతం భూములు అగ్రవర్ణాలకు ఉంటే 80 శా తం భూములు దళిత గిరిజనులకు ఉన్నాయని తెలిపారు.

రెవెన్యూ శాఖలో అవకతవకలు గత ప్రభుత్వాల పుణ్యమే అని పే ర్కొన్నారు. విఆర్‌ఒలను తీసేస్తామని తా ము చెప్పలేదని, ఒకవేళ విఆర్‌ఒలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామని అన్నా రు. గతంలో అమలులో ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థలు పోలేదా అని ప్రశ్నించారు. ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోపలనే మ్యుటేషన్ అయిపోయే విధా నం తీసుకువస్తామని చెప్పారు. భారత దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తామని వెల్లడించారు. ప్రజలకు లంచాల బాధ లేకుండా నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని పేర్కొన్నారు. ఎవరో నలుగురు ఉద్యోగులకు తాము భయపడమని అన్నారు. శాసనసభ చట్టాలు చేస్తాయని, ఉద్యోగులు చట్టాలలో నిర్ధేశించిన పని చేస్తారని తెలిపారు. రెవిన్యూ చట్టం తీసుకువచ్చే ముందు అందరినీ సంప్రదించి చర్చిస్తామని చెప్పారు. రైతులు తమ అప్పులు కట్టుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు. తాము చెప్పిన కటాఫ్ తేదీ నాటికి రూ.లక్ష అప్పును తాము పంపిస్తామని, రైతుబంధు కూడా వస్తుంది కాబట్టి పెట్టుబడికి కొంత వెసులుబాటు ఉంటుందని అన్నారు.

రుణమాఫీపై రూ.6 వేల కోట్లు పెట్టామని తెలిపారు. తాము రైతుల కోసం పనిచేస్తున్నామని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పలు రకాల భూపరిహారం ఉంటుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన భూపరిహారం, మహబూబ్‌నగర్‌లో ఎలా ఇస్తామని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ విలువ, చట్టం ప్రకారం భూపరిహారం ఇస్తామని ప్రకటించారు.
గ్రామాల అభివృద్దికి పంచాయతీ చట్టం
గ్రామాల అభివృద్దికి తమకు ఉన్న అధికారాలను కూడా తగ్గించుకుని కలెక్టర్లకు విశేష అధికారాలు ఇచ్చామని సిఎం తెలిపారు. ఇదివరకు మంత్రికి స్టే ఇచ్చే అధికారం ఉండేదని, దానిని తొలగించామని పేర్కొన్నారు. జవాబుదారీతనం పెంపొందించేలా సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇచ్చామని చెప్పారు. సిఎంకు, పిఎంకు లేని చెక్ పవర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉందని పేర్కొన్నారు. గతంలో ఉన్న అధికారాలు పోయినందుకు కొంత అసంతృప్తి ఉంటుందని అన్నారు. సబ్ ప్లాన్‌లో ఎలా ఉందో అలాగే జరగాలని చెప్పారు. కొత్త పంచాయతీ చట్టం వల్ల 500 జనాభా ఉన్న గ్రామానికి కూడా రూ.8 లక్షలు వస్తాయని వ్యాఖ్యానించారు.
ఇంకా రెండు మూడు పథకాలున్నాయి.. అవి తీసుకొచ్చానో మీ పని ఖతమే
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు కుట్రలు ఆపడం లేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు డిమాండ్ చేయడం తప్పు అని తాము అనడం లేదని, అయితే తాము అనని మాటలను తమకు ఆపాదించి ఇంటికో ఉద్యోగం అనడం సరికాదని అన్నారు. యువతను అనవసరంగా రెచ్చగొట్టొద్దని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయని, అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమే అని పేర్కొన్నారు. మరో మూడు టర్మ్‌లు టిఆర్‌ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ దొందూ దొందే అని విమర్శించారు. శుష్కప్రియాలు శూన్యహస్తాలు అనే లాగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమని అడిగినా ఇవ్వలేదని అన్నారు. నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి అయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఆ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసినా 24 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఏమీ లేనోనికి ఏతులు ఎక్కువ అన్నట్లు బిజెపి వస్తుంది..వస్తుంది అని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి వస్తే ఆరోగ్యశ్రీ పోయి ఆయుష్మాన్ భారత్ వస్తుందని, రైతుబంధు పోయి కిసాన్ సమ్మాన్ వస్తుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ పథకం చాలా ప్రయోజనకరమని, రైతుబంధు పథకం కింద తమ ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తుంటే కిసాన్ సమ్మాన్ రూ.6 వేలు మాత్రమే ఇస్తుందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ కంటే రైతుబంధు ఎన్నో రెట్లు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రూ.2,016 పెన్షన్ ఉందా..? అని ప్రశ్నించారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కళ్యాణి లక్ష్మి పథకం అమలు చేస్తున్నారా…?, కెసిఆర్ కిట్, 24 గంటల విద్యుత్, పేద విద్యార్థుల విదేశీ చదువులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలు చేస్తున్నారా..? అని అడిగారు.

సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని, బిజెపి ప్రభుత్వం కంటే టిఆర్‌ఎస్ పాలన గొప్పగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని, బిజెపి పాలిత సర్పంచ్‌లు తమ గ్రామాలను తెలంగాణలో కలపమని అడుగుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసేందుకు టిఆర్‌ఎస్‌లను అక్కడి ప్రజలు కోరుతున్నారని అన్నారు.
వచ్చే వారంలో పోలీసు ఉద్యోగాల ఫలితాలు
పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు వచ్చే వారంలో వెల్లడిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. 18 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. అంతమందికి శిక్షణ ఇచ్చేందుకు మన రాష్ట్రంలో సరైన సదుపాయం లేకపోవడంతో పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేల మందికి శిక్షణ ఇస్తామన్నాని పేర్కొన్నారు.
మేం ప్రజలనే నమ్ముకున్నాం
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలనే నమ్ముకుందని ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుద్ఘాటించారు. గత కాంగ్రెస్ పాలన కంటే తమ ప్రభుత్వం ఎంతో మేలని ప్రజలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.సాహసం, త్యాగాల మీదనే టిఆర్‌ఎస్ పుట్టిందని, రాజీనామాలు, సవాళ్లు ఎదుర్కోవడం తమకు కొత్తేమి కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు.
ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే
కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రాలకు సంబంధించిన అనేక హక్కులను కేంద్రం హరించిందని సిఎం అన్నారు. రాష్ట్రాలకు ఉన్న చాలా అధికారాలు కేంద్రం ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. గోవాలో జరిగిన జిఎస్‌టి సమావేశంలోనూ రాష్ట్రాల అధికారాలపై గొంతెత్తి మాట్లాడామని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే అని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు షట్ అంటే షట్, సిట్ అంటే సిట్ అనేలా ఉంటారని చెప్పారు. వీళ్ల గొంతు వీళ్లది కాదని, ఏ విషయంలో వీరు మాట్లాడరు, కొట్లాడరని అన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి రిజర్వేషన్లకు ఎబిసిడిలు వర్గీకరణ చేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినా కేంద్రం చేయలేదని అన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర ఎందుకు అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు
బిజెపి ప్రభుత్వంలో హామీలే తప్ప నిధులు రావడం లేద ని సిఎం కెసిఆర్ అన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించారని అలాంటి మాటలు మానుకుంటే మంచిదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు డార్క్ డే అని అమిత్ షా అన్నారని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్లీ ఆంధ్రాలో కలుపుతామని కాంగ్రెస్ నేతలు బల్‌రాం నాయక్ అంటే, భవిష్యత్తులో ఆంధ్రాలో తెలంగాణ కలిసే అవకాశం ఉందని జైరాం రమేష్ అన్నారని మండిపడ్డారు. 60 ఏళ్లు పోరా టం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఎవరూ రాష్ట్రాన్ని దానంగా ఇవ్వలేదని, ప్రజలు తమపై నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారని, తెలంగాణ అభివృద్ధిపై తమకు స్పష్టమైన విజన్ ఉందని సిఎం వ్యాఖ్యానించారు.

CM Kcr Speech On New Revenue Act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: