స్వేచ్ఛకు పట్టం కట్టిన తీర్పు

మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ చూడడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, వ్యక్తిగత గోప్యత, విద్య హక్కుల పరిధిలోకి కూడా ఇది వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి ఆశ మొన్న గురువారం నాడు ఇచ్చిన తీర్పు విశిష్టమైనది. మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించడం ద్వారా రాజ్యాంగం 19(1) అధికరణ హామీ ఇస్తున్న వాక్ స్వాతంత్య్రమనే ప్రాథమిక హక్కును తన విషయంలో కాలరాశారంటూ బిఎ చదువుతున్న షెరిన్ అనే విద్యార్థిని తన పిటిషన్‌లో చేసిన […] The post స్వేచ్ఛకు పట్టం కట్టిన తీర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ చూడడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, వ్యక్తిగత గోప్యత, విద్య హక్కుల పరిధిలోకి కూడా ఇది వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి ఆశ మొన్న గురువారం నాడు ఇచ్చిన తీర్పు విశిష్టమైనది. మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించడం ద్వారా రాజ్యాంగం 19(1) అధికరణ హామీ ఇస్తున్న వాక్ స్వాతంత్య్రమనే ప్రాథమిక హక్కును తన విషయంలో కాలరాశారంటూ బిఎ చదువుతున్న షెరిన్ అనే విద్యార్థిని తన పిటిషన్‌లో చేసిన వాదనతో ధర్మాసనం పూర్తిగా ఏకీభవించింది, దానిని నిర్దంద్వంగా ధ్రువపరిచింది. కోజికోడ్‌లోని శ్రీ నారాయణ కళాశాలలో బిఎ (ఇంగ్లీష్) 3వ సెమిస్టర్ చదువుతున్న ఫహీమ్‌ను నిషిద్ధ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించినందుకు హాస్టల్ నుంచి పంపించి వేశారు. దానిని సవాలు చేస్తూ ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ద్వారా ఇంటర్నెట్ వీక్షించడం విద్యార్థులకు జ్ఞానార్జనామార్గమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు ఇంటర్నెట్ చూసే హక్కును మానవ హక్కుగా 2016లోనే ఐక్యరాజ్య సమితి గుర్తించిందని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన నివేదనను కూడా ఏకసభ్య ధర్మాసనం అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రకటించిన హక్కులు ఆయా భారతీయ చట్టాలకు వర్తింపచేసి పాటించాలని సుప్రీంకోర్టు విశాఖ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఇక్కడ ప్రస్తావించింది. ఇంటర్నెట్‌ను ఎవరు ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎంత మంది దానిని సద్వినియోగపరుస్తున్నారు, మరెందరు దుర్వినియోగపరుస్తున్నారు అనే చర్చకిది సంద్భరం కాదు. మొబైల్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల మొత్తం విజ్ఞాన కాంతి గోళం ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చింది. సమాచారం తక్షణాల చేరువయింది. ఇది బుద్ధి వికాసానికి ఎంతైనా దోహదపడుతుంది. పాఠ్య పుస్తకాల్లోనూ, తరగతి గదుల్లోనూ లభించని అరుదైన విజ్ఞానం కూడా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోడానికి అవకాశమేర్పడింది. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌లతో ఇంటర్నెట్‌ను మరింత చేరువ చేసుకోగలిగే అవకాశం కలిగింది. విద్యార్థుల వికాసానికి, వారు పరీక్షల్లో మెరుగ్గా నెగ్గడానికి మొబైల్, ఇంటర్నెట్‌లు ఉపయోగపడతాయి. దురదృష్టవశాత్తు మన సంప్రదాయ భావజాలం ఆధునిక సాంకేతిక శోధనను దాని వల్ల కలుగుతున్న అదనపు నైపుణ్యాలను అంగీకరించదు. ప్రపంచం తెలుసుకోడం, పిల్లలు కొత్త సమాచారావకాశాలతో వర్ధిల్లుతున్న జ్ఞాన ప్రవాహంలో బిందువులు కావడమంటే పాత బుర్రలకెందుకో భయం, గంగవెర్రులు. అందుకే పిల్లల మీద, ముఖ్యంగా చదువుకొనే వయసులోని వారి మీద అనేకమైన అర్థంలేని ఆంక్షలు. ఈ కేసులో పిటిషనర్ చదువుకుంటున్న హాస్టల్‌లో రాత్రి 8 నుంచి 10 గం. వరకు మొబైల్ ఫోన్ వాడరాదనే కఠినమైన ఆంక్ష అమల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం కంటే శిక్షలతో, తిట్టు కొట్టులతో కట్టడి చేయడాన్నే తలిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎంచుకుంటున్నాయి. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలను బంద్ చేసి నిర్బంధంలో ఉంచి క్లాసు పుస్తకాల పురుగులుగా మార్చి కంఠస్థపు అధ్యయనానికి కట్టి పడేయడం ద్వారానే అధిక మార్కులు, ర్యాంకులు తెచ్చుకునేలా చేయవచ్చుననే పద్ధతే ఇప్పటికీ రాజ్యమేలుతున్నది. దీని వల్ల వారి భవిష్యత్తుకు మేలు కంటే కీడే కలుగుతున్నది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి పివి ఆశ ఇచ్చిన ఈ ఆలోచనాత్మక తీర్పును మన సంప్రదాయ సమాజం మంచి దృష్టితో స్వీకరించవలసి ఉంది. అది జరిగితే మన పిల్లల మర చదువులలో మార్పు వచ్చి శాస్త్రీయ విజ్ఞాన, చైతన్యాలతో పునాది పటిష్టమైన విద్యను నేర్చుకునే అవకాశాలు కలుగుతాయి. ప్రస్తుతం జైళ్లలాంటి తరగతి గదుల్లో, హాస్టళ్లల్లో, ఇళ్లల్లో మార్కుల చదువును బుర్రలకెక్కిస్తున్న తీరులో మార్పు రావలసి ఉందని ఈ తీర్పు స్పష్టం చేస్తున్నది. రాజకీయంగా చూస్తే నేడు కశ్మీర్ ప్రజలకు పాలకులు ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం నిరాకరిస్తున్నారన్న నిర్బంధ పరిస్థితి మీద ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిని పాటించక తప్పని పరిస్థితి కేంద్ర పాలకులకు ఎదురైతే కశ్మీర్‌లో సమాచార వ్యాప్తికి ఆటంకం కలిగించే నిర్బంధ వాతావరణాన్ని తక్షణమే అంతమొందించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్వేచ్ఛాయుతమైన సమాజం ప్రజాస్వామ్య మౌలిక విలువలకు ప్రాణప్రదమైనది. కేరళ తీర్పు మన రాజ్యాంగం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కుల స్ఫూర్తితోనే వెలువడింది కాబట్టి ప్రభుత్వాలు దాని మీద సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నా వాటికి అవి ఆశించే ప్రయోజనం లభించకపోవచ్చు.

Access to Internet is basic right: Kerala High Court

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్వేచ్ఛకు పట్టం కట్టిన తీర్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.