యెమెన్ల దాడితో సౌదీ బిత్తర

  శనివారం నాడు సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్ధ ఆరాaravవ్‌ుకో నిర్వహిస్తున్న రెండు కేంద్రాలపై యెమెన్ తిరుగుబాటు సంస్ధ హౌతీ సాయుధులు ప్రయోగించిన డ్రోన్, క్షిపణుల దాడితో సౌదీ అరేబియా ఒక్కసారిగా బిత్తరపోయింది. దాని చమురు శుద్ధి సామర్ధ్యంలో సగాన్ని దెబ్బ తీసే విధంగా ఈ దాడి తీవ్రత వున్నట్లు చెబుతున్నారు. ఇదే గనుక వాస్తవమైతే దాని పర్యవసానాలు ప్రపంచం మీద ప్రతికూలంగా వుంటాయని, పెరిగే చమురు ధరలను ప్రపంచం ఆర్ధిక వ్యవస్ధ భరించలేదని […] The post యెమెన్ల దాడితో సౌదీ బిత్తర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శనివారం నాడు సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్ధ ఆరాaravవ్‌ుకో నిర్వహిస్తున్న రెండు కేంద్రాలపై యెమెన్ తిరుగుబాటు సంస్ధ హౌతీ సాయుధులు ప్రయోగించిన డ్రోన్, క్షిపణుల దాడితో సౌదీ అరేబియా ఒక్కసారిగా బిత్తరపోయింది. దాని చమురు శుద్ధి సామర్ధ్యంలో సగాన్ని దెబ్బ తీసే విధంగా ఈ దాడి తీవ్రత వున్నట్లు చెబుతున్నారు. ఇదే గనుక వాస్తవమైతే దాని పర్యవసానాలు ప్రపంచం మీద ప్రతికూలంగా వుంటాయని, పెరిగే చమురు ధరలను ప్రపంచం ఆర్ధిక వ్యవస్ధ భరించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరోసారి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా ఉద్రిక్తతల అంశం ప్రపంచ చర్చలోకి వచ్చింది. ఇప్పటికే ఇరాన్ అమెరికా మధ్య వున్న వైరం మరింత పెరిగి ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర సోమ, మంగళవారాల్లో పీపాకు ఎనిమిది డాలర్ల వరకు పెరిగింది. ఇంకా పెరగవచ్చనే వూహాగానాలు వెలువడ్డాయి.

ఈ దాడుల వెనుక ఇరాన్ వుందని, అందువలన అసలు బాధ్యురాలు అదే అని అమెరికా ఆరోపించింది. అయితే దీనికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. మరోవైపు దాడులు చేసింది తామేనని హౌతీ సంస్ధ ప్రకటించింది. యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో పశ్చిమ దేశాలు అక్కడి సౌదీ అనుకూల వర్గానికి మద్దతు ఇస్తుండగా ఇరాన్ హౌతీ సంస్ధకు బాసటగా నిలిచింది. అమెరికా ఆరోపణకు ఇదే ఆధారం. ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. బాధ్యులైన వారి మీద దాడి చేసేందుకు తుండూ తుపాకితో సిద్ధంగా వున్నామని , సౌదీ అరేబియా ఏం చెబుతుందో చూద్దామని ఆగామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడిలో డ్రోన్స్‌తో పాటు క్షిపణులు కూడా వున్నాయని ఇరాన్ మద్దతు లేకుండా తిరుగుబాటుదార్లు అలాంటి అధునాతన ఆయుధాలను ప్రయోగించలేరని ట్రంప్ వ్యాఖ్యానించాడు.

దాడులు ఇరాన్ వైపు నుంచి జరిగాయి తప్ప యెమెన్ వైపు నుంచి కాదని అమెరికా అంటోంది. అయితే ఈ నిర్ధారణకు ఎలా వచ్చారంటే సమాధానం లేదు. దాడులలో ఇరాన్ ఆయుధాలున్నాయని, యెమెన్ వైపు నుంచి దాడి జరగలేదని అమెరికా చెప్పిన కధనాన్నే సౌదీ కూడా పేర్కొన్నది, అయితే ఆధారాలను వెల్లడించలేదు. దాడిని జర్మనీ, బ్రిటన్ తదితర అమెరికా మిత్రదేశాలు కూడా ఖండించాయి గాని కారకులను పేర్కొనలేదు. జూన్ మాసంలో అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా దాడులకు అనుమతిచ్చిన ట్రంప్ చివరి క్షణంలో వెనక్కు తగ్గారని మీడియా వెల్లడించింది. మానవ రహిత డ్రోన్ అనుమతి లేకుండా తమ గగనతలంలోకి వచ్చిన కారణంగా తాము కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ చమురు కేంద్రాలపై దాడుల కారణంగా తమ ఉత్పత్తిలో సగం అంటే రోజుకు 57 లక్షల పీపాల ముడి చమురుకు అంతరాయం కలిగిందని సౌదీ ప్రకటించింది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో ఐదు శాతానికి సమానం. అవసరమైతే తమ వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును వినియోగిస్తామని ట్రంప్ ప్రకటించాడు.

ఉత్తరాన సౌదీ అరేబియా, పశ్చిమాన ఎర్ర సముద్రం, దక్షిణాన ఏడెన్ గల్ఫ్, తూర్పున అరేబియా సముద్రం, ఓమన్ సరిహద్దులుగా వున్న యెమెన్‌లో గత కొద్ది సంవత్సరాలుగా అధికార పోరులో భాగంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఇరాన్ మద్దతు వున్న హౌతీ తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు, తమ అనుకూల శక్తులను గద్దెపై కూర్చోపెట్టేందుకు పశ్చిమ దేశాలతో పాటు మధ్య ప్రాచ్యంలోవున్న ఇరాన్ వ్యతిరేక రాజ్యాలన్నీ సౌదీ అరేబియాకు అన్ని రకాల మద్దతు, ఆయుధ సాయం చేసి ఎమెన్‌పై గత ఐదు సంవత్సరాలుగా యుద్ధం చేయిస్తున్నాయి. దానికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదార్లు సౌదీ చమురు గొట్టపు లైన్లతో పాటు ఇతర చమురు కేంద్రాలపై దాడులు జరపటం నిరంతరం సాగిస్తూనే వున్నారు.

అయితే శనివారం నాడు జరిగిన దాడి తీవ్రమైనది కావటంతో దానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏ చిన్న అవకాశం దొరికినా ఇరాన్ పీకపిసికి అంతం చేయాలనే వ్యక్తి జాన్ బోల్టన్ కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా వున్నాడు. ఆకస్మికంగా అతగాడిని ట్రంప్ ఇంటికి పంపారు. ఆ తరువాత సౌదీ చమురు కేంద్రాలపై దాడి జరిగింది. బోల్టన్ మాదిరే ట్రంప్ కూడా తిరిగి ఇరాన్ మీదనే నింద మోపేందుకు పూనుకున్నాడు. యెమెన్‌పై సౌదీ చేస్తున్న దాడులకు అమెరికా మద్దతును వుపసంహరించాలని ఏప్రిల్ నెలలో అమెరికా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని ట్రంప్(వీటో) తిరస్కరించాడు.

సౌదీ అరేబియా ఆర్ధిక వ్యవస్ధ మీద తాత్కాలికంగా కొంత కాలం పాటైనా ప్రభావం చూపే ఈ దాడికి ఆదేశం ప్రతీకారం తీర్చుకుంటుందా? అన్నది ప్రశ్న. అనేక దేశాల మద్దతుతో యెమెన్ తిరుగుబాటుదార్లనే అణచలేకపోయిన సౌదీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఇరాన్‌తో వైరం పెట్టుకొని తట్టుకోగలదా? యెమెన్‌లో జోక్యం మానుకోవాలని అమెరికాలో అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు కోరుతున్నారు, ఎన్నికలు జరగనున్న తరుణంలో అమెరికా సైనిక జోక్యానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుందా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ప్రస్తుతం మిలిటరీతో సహా ఆరు ముఠాల ఆధిపత్యంలో యెమెన్ భూభాగాలు వున్నాయి. వాటిలో హౌతీ సంస్థ పెద్దదిగా వుంది.

సౌదీ చమురు కేంద్రాలపై దాడులను ఒకందుకు వుపయోగించుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే రష్యా మరోవైపు నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. దాడులకు ఇరాన్ బాధ్యురాలని నిందించవద్దని రష్యా వ్యాఖ్యానించింది. ఇరాన్ మీద దాడులకు దిగటం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. చమురు కేంద్రాలపై దాడులను ఎదుర్కొనేందుకు కావాలంటే తమ వద్ద వున్న ఎస్400 రకం క్షిపణి నిరోధక వ్యవస్ధలను సౌదీకి అందచేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుకు వచ్చాడు. అంకారాలో టర్కీ, ఇరాన్ నేతలతో సంప్రదించిన తరువాత పుతిన్ ఈ ప్రకటన చేయటం గమనించాల్సిన అంశం. మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా ఒకే రోజు సోమవారం నాడు బ్రెంట్ ముడి చమురు ధర పదిహేను శాతం వరకు పెరిగింది.

పీపాకు 8.8 డాలర్లు పెరిగి 69.02 డాలర్ల వద్ద స్ధిరపడింది. తమ దేశం మీద చేస్తున్న దాడులకు ప్రతిగా యెమెనీలు సౌదీ చమురు కేంద్రాలపై దాడులు చేశారని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ అంకారాలో రష్యా, టర్కీ అధ్యక్షులతో కలసి ఒక సంయుక్త పత్రికా గోష్టిలో వ్యాఖ్యానించాడు. దాడుల పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది, అయితే ఆధారాలు లేకుండా ఇతరులను నిందించటం బాధ్యతా రాహిత్యమని చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యానించారు. సంఘర్షణలు పెరగటాన్ని, తీవ్రతరం కావటాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఉగ్రవాద చర్య తప్ప మరొకటి కాదని మన దేశ విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ వ్యాఖ్యానించారు. పర్యవసానాలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా వున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.

ఈ దాడి వెనుక ఎవరు వున్నారో స్పష్టం కాలేదని, హౌతీ గ్రూప్ తమదే బాధ్యత అని ప్రకటించిందంటూ, అయితే ఈ చర్య ప్రాంతీయ ఘర్షణకు దారి తీసే అవకాశం వుందని ఎమెన్‌లో ఐరాస ప్రత్యేక రాయబారి భద్రతా మండలికి నివేదించారు. తాము ఇంతటితో ఆగబోమని, తాము తలచుకొంటే సౌదీలో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలం కనుక విదేశీయులు దూరంగా వుండాలని హౌతీ సాయుధ దళాల ప్రతినిధి యాహ్యాశారీ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. శనివారం నాటి దాడితో తమ చమురు సంస్ధ ఆరావ్‌ుకో వాటాల విక్రయాన్ని ఆలస్యం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సౌదీ అధికారి చెప్పారు.

సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన దాడి పర్యవసానాల గురించి విశ్లేషకులు కుస్తీ పడుతున్నారు. తొలుత తుండూ తుపాకితో దాడులకు సిద్ధంగా వున్నట్లు చెప్పిన ట్రంప్ తరువాత తాను ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోవటం లేదని ప్రకటించాడు. ఎలా స్పందించాలో నిర్ణయించుకొనే ముందు దాడి మీద దర్యాప్తు జరపాలని ఐరాస నిపుణులను కోరనున్నట్లు సౌదీ ప్రకటించింది. సౌదీ వద్ద అమెరికా అందించిన పేట్రియాట్, హాక్ క్షిపణి వ్యవస్ధలు వున్నాయి. వాటితో గతంలో అనేక డ్రోన్లను సౌదీ కూల్చివేసింది.ఈ ఏడాది మే నెల నుంచి ముఖ్యంగా తాజాగా దాడులను నివారించటంలో ఎందుకు విఫలమైందన్నది పరిశీలకులకు అంతు చిక్కటం లేదు.

సాధారణంగా ఆరావ్‌ుకో కంపెనీ వద్ద కాంట్రాక్టుల మేరకు చమురు సరఫరా చేసేందుకు 35 నుంచి 45 రోజులకు సరిపడా చమురు మిగులు నిల్వ వుంటుంది. ఇప్పుడు సగం వుత్పత్తి నిలిచిపోయే అవకాశం వుంది, దాన్ని ఎంతకాలంలో పునరుద్ధ్దరిస్తారన్నది సమస్య. రోజుకు కనీసం ఐదు మిలియన్ పీపాల చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందని అంచనా. ఇది మిగులు సామర్ధ్యాన్ని హరించి ప్రపంచ సరఫరాపై వత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. దాడికి ముందు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం చూపనుందని భయపడగా ఇప్పుడు దాన్ని చమురు ఆక్రమించింది. 2020 నాటికి చమురు మిగులు ఏర్పడనుందని గత వారంలోనే ఒపెక్, అంతర్జాతీయ ఇంధన సంస్ధ అంచనాలు వేశాయి. ఇప్పుడు తలెత్తిన అనూహ్య పరిస్థితి దేనికి దారి తీస్తుందన్నది ప్రశ్న.

సౌదీ చమురు సరఫరా పునరుద్ధరణకు ఎక్కువ వ్యవధి పట్టేట్లయితే పీపా 80 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. రోజుకు 70 లక్షల పీపాల చమురును శుద్ధి చేయగల అక్వైక్ కేంద్రం దాడికి గురైంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక స్ధితి 70డాలర్ల వరకు ధరను భరించగలదని చెబుతున్నారు.

రాజకీయంగా 2020 ఎన్నికల్లో గెలిచేందుకే ట్రంప్ దారులు వెతుకుతారని, ఇరాన్ మీద ఎన్ని రంకెలు వేసినా మిలిటరీ చర్యకు దిగే అవకాశాలు లేవన్నది ఒక అభిప్రాయం. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లో తగిలిన ఎదురుదెబ్బలు, సిరియాలో వైఫల్యం, యెమెన్‌లో సౌదీకి భంగపాటును చూసిన తరువాత అమెరికా నేరుగా యుద్ధాలకు దిగేందుకు సిద్ధం కావటం లేదు, దానిలో భాగంగానే యెమెన్‌పై దాడికి సౌదీని వుసిగొల్పింది.

భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ తొలగింపులో కూడా ఈ నేపధ్యం వుందని చెబుతున్నారు. సౌదీ చమురు కేంద్రాలపై దాడుల ప్రభావం మన దేశం మీద కూడా పడనుంది. మాంద్యంలోకి దిగజారుతున్న స్ధితిలో చమురు భారం ఏమాత్రం పెరిగినా అర్ధిక వ్యవస్ధ మరింత దిగజారటానికి దారి తీస్తుంది. మరోవైపు రూపాయి విలువ 72 వైపు పతనం చెందేందుకు ఎదురు చూస్తున్నట్లుగా వుంది. ఒకవైపు రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల సామాన్యులకు గోడదెబ్బ చెంప దెబ్బగా మారుతుందా ?.

Saudi Arabia is hit by Drone Attack

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యెమెన్ల దాడితో సౌదీ బిత్తర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: