కళ్యాణలక్ష్మితో గిరిజనులకు భరోసా

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలు, గిరిజనులు సమాజంలో గౌరవంగా, సమానంగా జీవించాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత ప్రభుత్వాలు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి గిరిజనులను కూలీలుగా పనిచేయించిన విధానాన్ని తాను కూడా ప్రశ్నించానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం దాదాపు […] The post కళ్యాణలక్ష్మితో గిరిజనులకు భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలు, గిరిజనులు సమాజంలో గౌరవంగా, సమానంగా జీవించాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత ప్రభుత్వాలు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి గిరిజనులను కూలీలుగా పనిచేయించిన విధానాన్ని తాను కూడా ప్రశ్నించానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం దాదాపు 140 నుంచి -145 పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తండాలో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే నివాసముంటున్నానని, తనకు గిరిజనులు, ఆదివాసీలు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. సోమవారం అసెంబ్లీ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదంతో ఈ శాఖకు మంత్రిగా ఆయన ఆలోచన మేరకు, సభ్యుల సహకారంతో ఈ శాఖను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఐటిడిఎలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు సీతక్క చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. గిరిజన తండాలకు, ఆదివాసి గూడాలకు కనీసం మంచినీటి సదుపాయం లేకుండా ఉండేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పుడు ఇంటింటికి మంచి నీరు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వరంగల్‌లోని ఒక గిరిజన కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి తండ్రి పడిన బాధను చూసిన సిఎం కెసిఆర్ మది నుంచి వచ్చిన పథకమే కళ్యాణలక్ష్మీఅని… ఈ పథకం కింద గిరిజన కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్న ఆర్ధిక సాయం ఆ కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పుడు గిరిజన కుటుంబంలో ఆడపిల్ల పుడితే చింతించాల్సిన పనిలేకుండా సిఎం కేసిఆర్ కళ్యాణలక్ష్మీ ద్వారా భరోసా కల్పించారని తెలిపారు.
అవకాశమిస్తే ఎవరికీ తీసిపోమని గిరిజన విద్యార్థులు నిరూపిస్తున్నారు..
గిరిజనులకు అవకాశాలిచ్చి, వసతులు కల్పిస్తే సమాజంలో ఎవరికీ తాము తీసిపోమని గిరిజన విద్యార్థులు నిరూపిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అందరితో సమానంగా అత్యధిక శాతం ఉత్తీర్ణత సాదిస్తున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్ అందించిన చేయుతతో మాలోతు పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొత్తగా 83 గిరిజన గురుకులాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా 94 గిరిజన గురుకులాలుంటే, గత ఐదేళ్లలో 83 కొత్త గురుకులాలు వచ్చాయని, గిరిజనులకు మొత్తం 177 గురుకులాలు అందుబాటులోకి వచ్చాయని దాంతో ఎక్కువ మంది గిరిజనులకు రెసిడెన్షియల్ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గతంలో ఒక్కో శాఖకు చెందిన గురుకులాల్లో ఒక్కో రకమైన మెను ఉండేదని, కానీ ఇప్పుడు అన్ని గురుకులాల్లో ఒకేరకమైన, పోషకాహరంతో కూడిన మెనును అందిస్తున్నామన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరం, రెండెకరాలు భూమి ఉన్న గిరిజన రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో కరెంటు మోటార్లతో వ్యవసాయం చేసిన గిరిజన రైతు సోదరులు ఇప్పుడు కాలువల నీటితో వ్యవసాయం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో అందరికీ నీళ్లు రాబోతున్నాయని పేర్కొన్నారు.
గతంలో ఓటు బ్యాంకుగా వాడుకున్నారు..
గతంలోని ప్రభుత్వాలు తండాలను గ్రామపంచాయతీలు గా చేస్తామని హామీలు ఇచ్చి గిరిజనులను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని, కానీ సిఎం కెసిఆర్ మాత్రం చెప్పిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలు చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దీనివల్ల అనేక మంది గిరిజనులు పాలకులుగా మారారని చెప్పారు. తాను సర్పంచ్‌గా పనిచేసిన గ్రామం ఇప్పుడు ఆరు గ్రామాలుగా ఏర్పడితే ఆరుగురు గిరిజనులు సర్పంచ్‌లు కావడం సిఎం కెసిఆర్ కృషి వల్ల నే స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు గిరిజనులను నిర్లక్ష్యం చేశారని, కానీ సిఎం గిరిజన బిడ్డలను అభివృద్ధి చేయడానికి, అన్నిరంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనను అభినందించాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రం అడిగినట్లు భూమి కేటాయిస్తే, దానికి అవసరమైన అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని వివరించారు. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఉండాలన్న లక్ష్యంతోనే ములుగులో భూమి కేటాయించామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.15 కోట్ల కేటాయించిందని తెలిపారు. గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా 2017- 18 సంవత్సరంలో రూ.170 కోట్ల వస్తే… ఈ ఏడాది రూ. 230 కోట్లకు ఈ ఆదాయం పెరిగిందని తెలిపారు. వచ్చే ఏడాదికి రూ.400 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలు చేయడం కోసం వి – -హబ్ ఏర్పాటు చేసి వారి ఉన్నతికి ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

Minister Satyavathi Rathod Said Cm Kcr Introduced Welfare Schemes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కళ్యాణలక్ష్మితో గిరిజనులకు భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.