చిందు బతుకుల జీవన చిత్రణ కొంగవాలు కత్తి

  అనాదిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట సాహిత్యంగా చెప్పబడుతున్న సాహిత్యంతో పాటు ఆశ్రిత కులాల ప్రజా సాహిత్యం కూడా సమాంతరంగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నది. కానీ కొద్దిమంది పండితులు వ్రాసిన కవిత్వమే గొప్పదిగా ప్రచారంలోకి రావడం వల్ల మెజారిటీ ప్రజలు ఆదరించిన సాహిత్యం కనుమరుగవుతున్నది. ఈ నేపథ్యంలో ఒక జాతి తనయొక్క సాంస్కృతిక మూలాలను అన్వేషించు కోవాలంటే ఈ ప్రజా సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఉత్పత్తి కులాల మూలాలను కళారూపాలుగా మలచి ప్రదర్శిస్తున్న సంచార జాతులుగా నివసిస్తూ […] The post చిందు బతుకుల జీవన చిత్రణ కొంగవాలు కత్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అనాదిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట సాహిత్యంగా చెప్పబడుతున్న సాహిత్యంతో పాటు ఆశ్రిత కులాల ప్రజా సాహిత్యం కూడా సమాంతరంగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నది. కానీ కొద్దిమంది పండితులు వ్రాసిన కవిత్వమే గొప్పదిగా ప్రచారంలోకి రావడం వల్ల మెజారిటీ ప్రజలు ఆదరించిన సాహిత్యం కనుమరుగవుతున్నది. ఈ నేపథ్యంలో ఒక జాతి తనయొక్క సాంస్కృతిక మూలాలను అన్వేషించు కోవాలంటే ఈ ప్రజా సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఉత్పత్తి కులాల మూలాలను కళారూపాలుగా మలచి ప్రదర్శిస్తున్న సంచార జాతులుగా నివసిస్తూ కళా చైతన్యాన్ని నింపిన జ్ఞానులు, సంగీత సాహిత్య సర్వసామ్రాట్టులైన సంచార జాతుల కళావైభవం విస్మృతిలోకి జారుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటిని ముందు తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత నేటి రచయితల మీద ఉన్నది.

ఏ రచయిత అయితే తన మూలాలను మర్చిపోకుండా సాహిత్యంలో నిబద్ధతతో రాస్తాడో ఆ రచయిత రాసిన సాహిత్యం పదికాలాలపాటు నిలబడుతుంది. ఈ నేపథ్యం నుంచి వచ్చినదే కొంగవాలు కత్తి. మాదిగ కులానికి ఆశ్రిత కులమైన చిందు కళాకారుల కుటుంబం నుంచి ఎన్నో కష్టాలకు ఎదురీది తన జాతి అనుభవిస్తున్న వేదనలను అక్షరబద్ధం చేసిన ప్రయత్నమే డాక్టర్ గడ్డం మోహన్ రావు గారు రాసిన కొంగవాలు కత్తి. ఇది ఆత్మకథాత్మక నవల. తెలుగు సాహిత్యంలోనే తొలిచిందు నవల. తన జీవితంలో ఎదురైన ఘటనలను చక్కని కథనంతో పాఠకులను ఆద్యంతం చదివించే నవల ఇది. చిందు కళ సమాహార కళ. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం మేళవించి నవరసాలు ప్రదర్శిస్తూ సాగే చక్కని కళారూపం. రామాయణ భారత భాగవతాది పురాణేతిహాసాలను చదువుకోలేని సామాన్య జనులకు ఆ విజ్ఞానాన్ని అందించినది ఈ కళనే.

ఇంతటి అపురూపమైన కళకు మన సమాజంలో గౌరవం దక్కడం లేదు సరి కదా అంటరానితనం జాడ్యం వలన అవమానాల పాలవుతున్నది. ఈ తరతరాల వేదనను కన్నీటి గాథలను హృద్యంగా అక్షరీకరించారు మోహన్ రావు గారు. తాను చదువుకునే పాఠశాలలో తన క్లాస్ మేట్ అయిన విద్యార్థిని తనకు నీళ్లు అంటరానివారికి పోసినట్లుగా దోసిలిలో పైకెత్తి పోయడం, బావిలోకి నీరు తాగడానికి దిగితే అగ్రకుల అహంకారం తిట్టిన తిట్లు తన నాయనమ్మ పండగపూట కూడా ఇల్లిల్లు తిరిగి అడుక్కొచ్చిన అన్నం తినడం తదితర సంఘటనలు హృదయం ఉన్న వారిని కదిలించక మానవు.

అంతెందుకు సమాజంలో తాము అంటరానివారుగా పరిగణింపబడుతున్నామని వేదన చెందే మాల మాదిగలు కూడా చిందు వారి పట్ల అంటరానితనాన్ని పాటించటం రచయితకు స్వానుభవం.ఆది జాంబవుని రెండవ కుమారుడైన డక్కలి ఎముకల నుండి విశ్వకర్మకు పనిముట్లు చేయించినందుకు ప్రతిఫలంగా ఆది జాంబవుని కి విశ్వకర్మ ఇచ్చిన ఆయుధం కొంగవాలు కత్తి. ఇది ఇంద్రుడి వజ్రాయుధం ని పోలి ఉన్న కత్తి. ఇంద్రుడి వజ్రాయుధం శత్రుసంహారానికి అయితే కొంగవాలు కత్తి ఉత్పత్తి సాధనం. ఈ నవలలో మాదిగ కులస్తులకు ఇతర ఉత్పత్తి కులాలకు గల సంబంధాన్ని రచయిత చక్కగా చిత్రించారు. చిందు కళాకారులు మాదిగల వద్ద యాచించే విధానం, పెండ్లి, పురుడు, చావు తదితర సంప్రదాయాలను కొంగవాలుకత్తి చదివితే తెలుసుకోవచ్చు. యాచక కుటుంబంలో పుట్టిన ఓ పిల్లవాడు అష్ట కష్టాలకోర్చి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన విధానం నేటి యువతరానికి స్ఫూర్తి నిచ్చేదిగా ఉన్నది.

కథానాయకుడు నరసింహారావు తన తండ్రి అనారోగ్యం పాలు కావడం వల్ల తన చెల్లెలు తమ్ముల బాధ్యతను చూడడానికి కెమికల్ కంపెనీలో పని చేయడం బోర్ బండి పైపులు ఎత్తడం ట్రాక్టర్ పనికి వెళ్లడం తదితర కూలీ పనులు ఎన్నో చేసి కుటుంబ పోషణకు సహాయపడుతూ తాను చదువుకోవడం విశేషం. తాను చదివిన పాఠశాల లోనే విద్యా వాలంటీర్ గా చేరి పనిచేస్తున్నప్పుడు అగ్రవర్ణాల వారు అంటరాని వాడైనా చిందు కులస్తుడు తమ పిల్లలకు అన్నం పెట్టడం సహించలేకపోతారు. పల్లె తల్లి వంటిది పట్నం ప్రియురాలి వంటిదని మాటలు రచయితకు సమంజసంగా తోచలేదు పట్నంలో పల్లెల్లో కంటే అంటరానితనం తక్కువ. హోటల్ లో అందరూ తాగిన గ్లాసులనే అందరూ తిన్న ప్లేట్ లనే అందరూ ఉపయోగిస్తుండడాన్ని చూసి అక్కడ లేని అంటరానితనం పల్లెల్లో ఎందుకు అని ఆవేదన చెందుతాడు. ఇంటర్లో చదువు మానేసినా తిరిగి డిస్టెన్స్ లో చదువుకొని తదనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్య చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ఉన్నత విద్యావంతుడు గా ఎదగడం కొసమెరుపు.

చదువే సమాజంలోని అపసవ్యాలకు అసమానతలకు విరుగుడు అని ఈ నవల నిరూపిస్తున్నది. ఇది రచయిత రాసిన తొలి నవల అయినా ఎంతో చేయితిరిగిన రచయిత రాసిన నవల లాగా అనిపిస్తుంది. చక్కని శిల్పం పాత్రోచిత భాష అవసరమైన చోట వర్ణనలు అందమైన గ్రామీణ జీవన చిత్రణ ఈ నవలకు అదనపు ఆకర్షణలు. నల్లగొండ జీవద్భాష ను రికార్డు చేసిన నవల ఇది. నవలలో కథానాయకుడి తల్లి తండ్రి అమ్మమ్మ తాత హాజీపూర్ నుండి నెమరుగొముల వెళ్లే సందర్భంలో తెల్లవారుజామున మసక చీకటిలో పిల్ల బాటను వర్ణిస్తూ ‘చేను చెలకల మధ్య భూ తల్లి నుదిటి పాపట లాగ పిల్లబాట కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తున్నది‘ అంటూ దృశ్యమానం చేస్తాడు. జాంబవంతుని వేషాన్ని వర్ణించే క్రమంలో కనుబొమ్మలు సింగిడీల తలపిస్తున్నాయి అంటాడు. కనురెప్పలు తుమ్మెద లను పోలి ఉన్నాయి అంటాడు.

గ్రామీణ సంభాషణల్లో సహజమైన జీవద్భాష ను ఉపయోగించారు. యథార్థ భాష యథార్థ సంఘటనలే ఈ నవలకు మరింత గుర్తింపు తెచ్చాయి. ప్రముఖ రచయిత కోయి కోటేశ్వరరావు గారు అభిప్రాయపడినట్లు ఇది ఒక సామాజిక ఇతిహాసం. నేటి తరానికి చిందు వారసత్వాన్ని అందించే వారధి. తరతరాలుగా అణచి వేయబడిన ఒక జాతి వేదన. మోహన్ రావు గారి ఈ తొలి నవలకే నవతెలంగాణ పురస్కారం విశాల సాహిత్య అకాడమీ పురస్కారం అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించడం కొంగవాలు కత్తి ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. కొంగవాలు కత్తి కి కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది.

Story about Kongavalu Kathi Novel Book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిందు బతుకుల జీవన చిత్రణ కొంగవాలు కత్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: