కుర్రాళ్లకు భలే ఛాన్స్

ధర్మశాల: వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా సిరీస్‌లో యువ క్రికెటర్లకు పెద్ద పీట వేసింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు సిరీస్‌లో అవకాశం కల్పించింది. బుమ్రా, షమీ, […] The post కుర్రాళ్లకు భలే ఛాన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ధర్మశాల: వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా సిరీస్‌లో యువ క్రికెటర్లకు పెద్ద పీట వేసింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు సిరీస్‌లో అవకాశం కల్పించింది. బుమ్రా, షమీ, భువనేశ్వర్, ధోని వంటి సీనియర్లకు సిరీస్‌లో విశ్రాంతి కల్పించింది. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు స్థానం అవకాశం ఇచ్చింది. ఇక, దక్షిణాఫ్రికా కూడా యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ కోసం వికెట్ కీపర్ డికాక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. డుప్లెసిస్‌ను తప్పించి పొట్టి ఫార్మాట్‌లో డికాక్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. భారత గడ్డపై జరిగిన ఏకైక టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా టి20 గెలవలేదు. ఈసారి ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికా జట్టులో కూడా మెరికల్లాంటి క్రికెటర్లు ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులకు కొదవలేదనే చెప్పాలి. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు కీలకంగా మారారు. సీనియర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. కొంతకాలంగా భారత్ సాధిస్తున్న విజయాల్లో ధావన్, రోహిత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రోహిత్ నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాపై కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. ధావన్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారత్‌కు భారీ స్కోరు కష్టం కాదు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా జట్టు బ్యాటింగ్ భారాన్ని తనపై వేసుకున్నాడు. కోహ్లి చెలరేగితే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరి పోతాయి.
ఇదే మంచి ఛాన్స్..
యువ క్రికెటర్లు రిషబ్ పంత్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ తదితరులకు సౌతాఫ్రికా సిరీస్ కీలకంగా మారింది. ఇటీవల కాలంలో ఫామ్‌లేమి బాధపడుతున్న మనీష్ పాండేకు మరోసారి అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని సదినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. మనీష్‌కు వరుస అవకాశాలు లభిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈసారి విఫలమైతే మాత్రం జట్టులో మళ్లీ చోటు సంపాదించడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా సత్తా చాటేందుకు మరో ఛాన్స్ దొరికింది. ధోని వారుసుడగా పరిగణిస్తున్న పంత్‌లో నిలకడ లోపించింది. కీలక సమయంలో చెత్త షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను పారేసు కోవడం అలవాటుగా మార్చుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లో పంత్ ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నాడు. కాగా, సిరీస్‌లోనైనా తన లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పంత్‌పై ఉంది. ఇక, విండీస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన రాహుల్‌కు కూడా ఇదే మంచి ఛాన్స్‌గా చెప్పాలి.

తుది జట్టులో చోటు లభిస్తే విజృంభించాల్సిన అవసరం అతనికి ఉంది. ఇందులో రాణిస్తే రానున్న సిరీస్‌లలో జట్టులో ఛాన్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక, విండీస్ సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న యువ సంచలనం శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. అయ్యర్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఆల్‌రౌండర్లు సుందర్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా కొత్త ఆటగాళ్లకే చోటు దక్కింది. సీనియర్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఖలీల్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీలు ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. విండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో చాహర్, సైనీలు అద్భుతంగా రాణించారు. ఖలీల్ కూడా పర్వాలేదనిపించాడు. ఈసారి కూడా జట్టు యువ ఆటగాళ్లపై భారీ నమ్మకంతో ఉంది. ఇక, కృనాల్, సుందర్, జడేజాల రూపంలో మెరుగైన స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియ తొలి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు దక్షిణాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. సఫారీ జట్టు కూడా యువ ఆటగాళ్లతో కిటకిటలాడుతోంది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికా కూడా యువ క్రికెటర్లకే చోటు కల్పించింది. కెప్టెన్ డికాక్, ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తప్ప మిగతా వారికి పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్‌లో అద్భుత ప్రతిభను చాటుతున్న యువ ఆటగాళ్లకు సిరీస్‌లో చోటు దక్కింది. దీంతో దక్షిణాఫ్రికా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. యువ సంచలనం జూనియర్ డలా రూపంలో భారత బౌలర్లకు ప్రమాదం పొంచి ఉంది. కెప్టెన్ డికాక్‌ను తక్కువ అంచనా వేయలేం. ఇక, మిల్లర్ రూపంలో విధ్వంసక ఆటగాడు జట్టుకు అందుబాబులో ఉన్నాడు. బ్యాట్‌తో బంతితో చెలరేగే సత్తా మిల్లర్‌కు ఉంది. మరోవైపు డసెన్, బవుమా, హెండ్రిక్స్‌ల వంటి ధాటిగా ఆడే క్రికెటర్లు కూడా జట్టులో ఉన్నారు. రబడా రూపంలో ప్రపంచ స్థాయి బౌలర్ కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడు. దీంతో భారత్ ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీ్రం జడేజా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఖలీల్, సైనీ, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్.
దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బవుమా, రెజా హెండ్రిక్స్, రబడా, జూనియర్ డలా, డసెన్, బ్యూరాన్ హెండ్రిక్స్, బోర్న్ ఫార్టిన్, జార్జ్ లిండె, షమ్సి, ప్రిటోరియస్, హెన్రిచ్ నోర్జె.

South African cricket team in India in 2019 20

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుర్రాళ్లకు భలే ఛాన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.