చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని

బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోడం) అమలు వివాదం ఊబిలో నుంచి బ్రిటన్ ఎంతకీ బయటపడలేక పోతోంది. దరి, దాపు అందక గిలగిలా కొట్టుకుంటోంది. యూరపు కుటుంబం నుంచి విడిపోయినా మౌలికమైన తన ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసుకోవాలనే ఆకాంక్షను నెరవేర్చుకోలేక అదే పనిగా ఇబ్బందికి గురవుతోంది. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఈ కత్తి పదునుకు వరుసగా ప్రధానులను బలి ఇచ్చుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాను సిద్ధం చేసిన ఇయుతో బ్రెగ్జిట్ ఒప్పందానికి తన […] The post చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోడం) అమలు వివాదం ఊబిలో నుంచి బ్రిటన్ ఎంతకీ బయటపడలేక పోతోంది. దరి, దాపు అందక గిలగిలా కొట్టుకుంటోంది. యూరపు కుటుంబం నుంచి విడిపోయినా మౌలికమైన తన ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసుకోవాలనే ఆకాంక్షను నెరవేర్చుకోలేక అదే పనిగా ఇబ్బందికి గురవుతోంది. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఈ కత్తి పదునుకు వరుసగా ప్రధానులను బలి ఇచ్చుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాను సిద్ధం చేసిన ఇయుతో బ్రెగ్జిట్ ఒప్పందానికి తన పార్టీలో, పార్లమెంటులో మెజారిటీ మద్దతును సమీకరించుకోలేక గత జులైలో థెరిసా మే ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.

ఆమె స్థానంలో దేశాధికార పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్ సీటు సైతం కంపిస్తున్న సూచనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్ర కెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకల్లా బ్రెగ్జిట్ గడువు ముగియనుండడంతో ఏదో రకంగా వ్యవహారాన్ని కడతేర్చాలనే ఆరాటంలో జాన్సన్ తీసుకున్న తొందర పాటు చర్యలు ఆయన పదవిని బలి తీసుకునే ముప్పు ముదురుతున్నది. ఇయుతో ఏ ఒప్పందమూ లేకుండానే బ్రెగ్జిట్‌ను సాకారం చేయడానికి, తక్షణమే ఎన్నికలు జరిపించడానికి ఆయన కదిపిన పావులు పాములై కాటేస్తున్నాయి. తన నిర్ణయాలపై, ధోరణి పట్ల ప్రతికూలత పెరుగుతున్న పార్లమెంటును సస్పెండ్ చేసిన ఆయన చర్య తీవ్ర విమర్శలను చవిచూస్తున్నది. పార్లమెంటును సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమంటూ స్కాట్లండ్ లోని ఒక కోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం జాన్సన్‌కు తగిలిన గట్టి ఎదురు దెబ్బగా భావించాలి.

కోర్టు నిర్ణయం అసాధారణమైనదని నిపుణులు వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలను కుదించడానికి ఉద్దేశించిన ఈ చర్య ఎంతమాత్రం సమర్థించదగినది కాదని కోర్టు స్పష్టంగా అభిప్రాయపడింది. అయితే ప్రధాని నిర్ణయాన్ని ఈ న్యాయ స్థానం తనంత తానుగా రద్దు చేయకుండా పరిష్కార బాధ్యతను బ్రిటన్ సుప్రీంకోర్టుకు వదిలివేసింది. వారం రోజుల్లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను చేపట్టనున్నది. జాన్సన్ తన నిర్ణయాలపై ప్రజాస్వామిక పరిశీలనను, చర్చను అడ్డుకోడానికే పార్లమెంటును సస్పెన్సన్‌లో ఉంచారని అది ప్రజాస్వామిక పునాది సూత్రాలకు విరుద్ధమైనదని ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. అక్టోబర్ 14 వరకు పార్లమెంటు సమావేశాలను సస్పెండ్ చేస్తూ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. అంటే బ్రెగ్జిట్ గడువుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉందనగా పార్లమెంటు తిరిగి సమావేశమయ్యేలా చేసి ఈ వ్యవహారంపై మరింత చర్చకు వీల్లేకుండా చూసుకోడమే జాన్సన్ వ్యూహమని బోధపడుతున్నది.

జాన్సన్ కోరినట్టు ఎటువంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమిస్తే అది బ్రిటన్‌ను ఆర్థికంగా అసాధారణమైన నష్టానికి గురి చేస్తుందని ప్రతిపక్షం, పాలక కన్సర్వేటివ్స్‌లోని పలువురు భావిస్తున్నారు. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటు వేసిన తన సోదరుడు జో సహా సొంత పార్టీకి చెందిన 21 మందిని బహిష్కరించడం కూడా జాన్సన్ కష్టాలను పెంచింది. ఇయులో కొనసాగాలా, వద్దా అనే అంశంపై రెండేళ్ల క్రితం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52% మంది బ్రిటన్ పౌరులు వైదొలగాలని స్పష్టం చేశారు. రెండు వైఖరుల పట్ల వ్యక్తమయిన జనాభిప్రాయంలో స్వల్ప తేడా మాత్రమే ఉన్నందువల్ల ఎంతో ఆచితూచి బ్రెగ్జిట్‌ను అమల్లోకి తేవలసిన సున్నితమైన బాధ్యత పాలకుల మీద, పార్లమెంటు పైన పడింది. మధ్యేమార్గంగా ఇయు నుంచి విడిపోయినందువల్ల ఆర్థికంగా హాని కలుగకుండా దానితో తగిన ఒప్పందం కుదుర్చుకోడం అవసరమనే అభిప్రాయానికి మొగ్గు లభించింది.

అందుకే గత ప్రధాని థెరిసా మే అటువంటి ఒక ఒప్పందం ముసాయిదాను సిద్ధం చేశారు. అయితే అది బ్రిటన్‌కు మేలు చేయడానికి బదులు ఇయుకి తోడ్పడే రీతిలో ఉందనే విమర్శ వెల్లువెత్తింది. ఆ వెల్లువ నుంచి ఆత్మరక్షణ చేసుకోలేక, బ్రెగ్జిట్‌ను మెజారిటీ దేశ ప్రజల సంతృప్తి మేరకు జరిపించలేక థెరిసా మే అధికారాన్ని వదిలిపెట్టుకోవలసి వచ్చింది. ఆ బాధ్యతను తెలివిగా, సమర్థవంతంగా నిర్వహించి ఉండవలసిన జాన్సన్ అందులో ఘోరంగా విఫలమయ్యాడు. పార్లమెంటు సస్పెన్సన్ చర్యపై బ్రిటన్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంత రగడ జరిగిన తర్వాత ఎన్నికలు జరిపించి మరోసారి జనాభిప్రాయ సేకరణ చేపట్టడమే మార్గాంతరమనే అభిప్రాయం గట్టి పడుతున్నది. బ్రెగ్జిట్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Britain Prime Minister in Implications

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: