మన్యంలో రగిలిన స్వరాజ్య సమరం

  భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి, తెల్లదొరల పెత్తనంపై విప్లవ శంఖం పూరించి, ఉద్యమ పోరులోనే అసువులు బాసిన అమర వీరుల్లో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడు. ప్రత్యేకించి విశాఖ మన్య ప్రాంతంలోని ఆదివాసీల మనుగడ కోసం, వారి స్వయం పాలన కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి. ఆయన 19221924 మధ్యకాలంలో సాగించిన సమరమే ‘మన్య పోరాటం’గా స్థిరపడింది. స్వరాజ్య సమరంలో గిరిజనోద్యమాలకు చరిత్రలో కీలకస్థానం ఉంది. అవి ఆసేతు […] The post మన్యంలో రగిలిన స్వరాజ్య సమరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి, తెల్లదొరల పెత్తనంపై విప్లవ శంఖం పూరించి, ఉద్యమ పోరులోనే అసువులు బాసిన అమర వీరుల్లో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడు. ప్రత్యేకించి విశాఖ మన్య ప్రాంతంలోని ఆదివాసీల మనుగడ కోసం, వారి స్వయం పాలన కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి. ఆయన 19221924 మధ్యకాలంలో సాగించిన సమరమే ‘మన్య పోరాటం’గా స్థిరపడింది. స్వరాజ్య సమరంలో గిరిజనోద్యమాలకు చరిత్రలో కీలకస్థానం ఉంది. అవి ఆసేతు హిమాచల పర్యంతం జరిగాయి. గోండ్వానా ప్రాంతంలో రాంజీ గోండు పోరాటం (185060), మహారాష్ట్రలో బిర్యాముండా ఉద్యమం (189499), ఆంధ్రప్రదేశ్‌లో దారబంధాల చంద్రయ్య పితూరీ (191015) మచ్చుకు కొన్ని అల్లూరి కంటే ముందే జరిగాయి.

మన రాష్ట్రంలో అల్లూరి మన్యసీమ ఉద్యమం తొలి చరిత్రాత్మకమైనదిగా నిలిచింది. సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు ఆయన 1897, జులై 4న విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట వెంకట రామరాజు, సూర్య నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. శ్రీ రామరాజు బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో గడిచింది. 1902లో వెంకట రామరాజు కుటుంబం రాజమహేంద్రవరం, తండ్రి మరణానంతరం నరసాపురానికి మారింది. అల్లూరి విద్యాభాస్యం కాకినాడ, తుని, రాజమండ్రి, విశాఖ పట్నంలో సాగినా విప్లవ భావాలకు లోనైన సీతారామ రాజు ఆంగ్ల విద్యపై ఆసక్తి చూపక విలు విద్య, గుర్రపు స్వారీ, హస్త సాముద్రికం, యోగా వంటి విద్యల్లో నైపుణ్యం సాధించారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల ప్రభావితుడైన అల్లూరి 17 ఏళ్ల వయసులోనే పశ్చిమ బెంగాల్ సందర్శించాడు. ఆ రోజుల్లో బెంగాల్, పంజాబ్ ప్రాంతాలు జాతీయ విప్లవకారులకు నిలయాలుగా విలసిల్లాయి. శ్రీ రామరాజులో స్వాతంత్య్రేచ్ఛతో పాటు ఆధ్యాత్మిక భావాలు వికసించాయి. కృష్ణదేవి పేటలోని నీలకంఠేశ్వర మందిరంలో ఉంటూ ఆ పరిసరాల్లో ఉంటున్న భగత, కోయ గిరిజనులతో చెలిమి చేశాడు. అల్లూరి సేవా గుణం, ప్రవర్తనకు ముగ్ధులైన ఆదివాసులు ఆయన మాటను శిలాశాసనంగా భావించారు. ఆ అభిమతంతోనే ఆదివాసులకున్న మూఢయారాలను, దుర్గుణాలను పోగొట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. అల్లూరి పేరు విషయంలో ఒక వాదన ఉంది.

ఉద్యమ బాటలో ప్రేమ అడ్డురాకూడదని అల్లూరి, తనను ప్రేమించిన సీతను వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూనే, పేరులో ‘శ్రీ’ బదులుగా ‘సీతా’ రామరాజుగా మార్చుకున్న దాఖలాలున్నాయి. బ్రిటీష్ పాలక ప్రతినిధులు, తాబేదార్లు ఆదివాసుల శ్రమ శక్తిని దోచుకుంటున్న తరుణంలో అల్లూరి ఆదివాసీల్లో నవచైతన్యం నింపి, తెల్లదొరలపై తిరుగుబాటు పంథాను నూరిపోశాడు. మన్యం పోరాటం ద్వారా స్వాతంత్య్ర సమరానికి కొత్త బాటలేయాలన్న తలంపుతో సంప్రదాయ ఆయుధాలకు పదును పెట్టాడు. (రంప చోడవరం, కృష్ణదేవి పేట, తుని అన్నవరం ప్రాంతాల్లోని కొండ జాతి గిరిజనులు) దగాపడ్డ ఆదివాసులంతా రామరాజు నాయకత్వాన్ని బలపరిచారు.

అల్లూరి పోరాటానికి దన్నుగా ఆదివాసీ ప్రజల నుంచి గంటందొర, మల్లుదొర, అగ్గిరాజు, సింగన్న, పడాలు వంటి వీరులు నాయకులుగా ఎదిగారు. తెల్లదొరల చెర నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి గాంధీ చేపట్టిన అహింసా విధానాన్ని అల్లూరి మొదట సమర్థించినా, తరువాతి కాలంలో విప్లవం వైపు మొగ్గు చూపారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని తిలక్ నినదిస్తే ‘విప్లవమే నా జన్మ హక్కు’ అంటూ అల్లూరి గర్జిస్తూ వలస పాలకుల గుండెల్లో విప్లవాగ్ని రగిలించాడు. మన్యం ప్రాంతంలోని ఆదివాసులపై వలస పాలకులు సాగిస్తున్న దురాగతాలు అల్లూరిని తీవ్రంగా కలచి వేశాయి. ఆదివాసుల్లో చైతన్యాన్ని నింపి, ఆదివాసీ ప్రజల సహకారంతో మన్యం పోరాటం అల్లూరి విశాఖ మన్యం నుండి ఆరంభించాడు.

బ్రిటీష్ ముష్కరులు అల్లూరి బందిపోటుగా చిత్రించి ప్రచారం చేయడంతో, 1922 ఆగస్టు 22 నుండి ప్రత్యక్ష పోరుకు సిద్ధపడక తప్పలేదు బహిరంగంగా ప్రకటించి మరీ పోలీసు ఠాణాలపై దాడులు సాగించి ఆయుధాలు పట్టుకెళ్లడం బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. మన్యం పోరాటంలో తొలి రోజున 300 మంది గిరిజనులతో కలిసి చింతపల్లి పోలీస్ ఠాణాపై దాడి చేసి ఆయుధాలు పట్టుకెళ్లారు. ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి (తూ.గో), అక్టోబర్ 15న అడ్డతీగల, అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ ఠాణాలపై వరుసగా దాడులు జరపడం ప్రకంపనలు సృష్టించింది.

1923, ఏప్రిల్ 17న అన్నవరం, మే 31న కొయ్యూరు ఠాణాలపై దాడుల అనంతరం, మన్యం పోరాటాన్ని తీవ్రమైనదిగా పరిగణించిన బ్రిటీష్ పాలకులు మలబర్ పోలీసులతో పాటు అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దించారు. పోలీసు బలగాల సంఖ్య పెరగడంతో మన్యం పోరాట బలం కాస్త సన్నగిల్లింది. కొయ్యూరు సమీపంలోని నడింపల్లె వద్ద అల్లూరికి కుడిభుజంగా భావించే మల్లుదొరను బంధించిన పోలీసులు, అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతినిస్తామని ప్రకటించారు.

1924లో గుంటూరు కలెక్టర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్‌ను ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అల్లూరిని పట్టివ్వాలంటూ రూథర్‌ఫర్డ్ కొండమీద, కొండ కిందున్న మన్యం ప్రజలపై దమన కాండ సాగించాడు. అల్లూరి ఓసారి ఈ ఉద్యమం వల్ల మన్యం గిరిజనులకు ఇబ్బంది కలగడం వల్ల ఇబ్బంది పడ్డాడు. 1924, మే 7న సూర్యోదయ వేళ అల్లూరిని అరెస్టు చేసి, మంప సమీపంలోని రాజేంద్ర పాలెం పుంత దారిలో చెట్టుకు కట్టేసి, మేజర్ గూడాల్ కాల్చి చంపాడు. రామరాజు 26 ఏళ్ల వయసులోనే వీర మరణం పొందాడు.

రామరాజు తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా మిగిలాడు. అగ్గిరాజుగా పేరొందిన వేగిరాజు సత్యనారాయణ రాజు అండమాన్ జైలులో మరణించాడు. స్వాతంత్య్రానంతరం జైలు నుండి విడుదలైన మల్లుదొర 1952లో జరిగిన తొలి భారత ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు. మన్యం పోరాటం సాగింది ఇరవై నెలలే అయినా అల్లూరి ఉద్యమ స్ఫూర్తి మన్నెంగుండెల్లో చెరగని ముద్ర వేసింది. కేవలం 26 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అల్లూరి త్యాగాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఇప్పటికైనా అల్లూరి త్యాగాన్ని , దేశభక్తిని గుర్తించి ఆయన పోరాట చరిత్రను దేశ భాషలలోకి అనువదించి, భారతీయులందరికీ పరిచయం చేయాల్సిన అవసరముంది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మన్యంలో రగిలిన స్వరాజ్య సమరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.