ఉరిశిక్షతో మార్పు సాధ్యమా?

  గత జూన్ 18న తొమ్మిది నెలల పసిపాపపై జరిగిన అఘాయిత్యం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఎగిసిపడింది. అందుకనుగుణంగానే 50 రోజుల వ్యవధిలోనే నిందితునికి ‘ఉరిశిక్ష’ను ఖరారు చేస్తూ వరంగల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పును పలు వర్గాలు స్వాగతిస్తూ సంబురపడ్డారు. తీర్పును కీర్తించారు. హర్షం వ్యక్తం చేశారు. కేసు విషయంలో పోలీసులు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ఇదే క్రమంలో ఓ హత్య కేసులోనూ […] The post ఉరిశిక్షతో మార్పు సాధ్యమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గత జూన్ 18న తొమ్మిది నెలల పసిపాపపై జరిగిన అఘాయిత్యం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఎగిసిపడింది. అందుకనుగుణంగానే 50 రోజుల వ్యవధిలోనే నిందితునికి ‘ఉరిశిక్ష’ను ఖరారు చేస్తూ వరంగల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పును పలు వర్గాలు స్వాగతిస్తూ సంబురపడ్డారు. తీర్పును కీర్తించారు. హర్షం వ్యక్తం చేశారు. కేసు విషయంలో పోలీసులు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ఇదే క్రమంలో ఓ హత్య కేసులోనూ వరంగల్ కోర్టు 16 మందికి ‘జీవిత ఖైదు’ విధించటం, వెనువెంటనే ‘ఉరిశిక్ష’ తీర్పునివ్వటంతో వరంగల్ కోర్టు తీర్పులు చర్చనీయాంశంగా మారాయి. చిన్నపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు పునరావృతం కాకుండా ‘ఉరిశిక్ష’లు బ్రేకులు వేస్తాయని భావించిన వారి నమ్మకం మూడు రోజుల ముచ్చటగా మిగిలింది.

మూడు రోజులు గడువక ముందే ఇదే వరంగల్ అర్బన్‌లోని సమ్మయ్యనగర్ లో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటన వెలుగుచూసి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని, ఉరిశిక్షలు వేయాలని నినదించే వారందరి ఆలోచనలు సరైనవేనా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఉరిశిక్షలతో, ఎన్‌కౌంటర్లతో స్త్రీలపై, చిన్నారులపై అత్యాచారాలు ఆగుతాయా..? కఠినమైన శిక్షలతో ఆపగలమా..? అంటే ఆపలేమనే నిరూపించే విధంగా వరంగల్‌లో గతంలో జరిగిన ఘటనలతో పాటు, తాజాగా ‘ఉరిశిక్ష’ తీర్పు వెలువడిన మూడు రోజులకే మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ బాధిత బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిరూపిస్తోందనే చెప్పాలి.

స్త్రీలపై, చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడల్లా ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవటం చూస్తుంటాం. ఆ నిరసన నుంచి, ఆవేశం నుంచి నిందితులను ఉరి తీయాలి, ఎన్‌కౌంటర్ చేయాలి, కఠినంగా శిక్షించాలని నినదిస్తుంటారు. కఠినంగా శిక్షించటం, న్యాయం కోసం పోరాటం చేయటం సరైందే. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది సరైందే. కానీ ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలు వేయటం వల్ల అఘాయిత్యాలు ఆగుతాయా అనేది ఇక్కడి ప్రశ్న..?. ఢిల్లీలో నిర్భయ కేసులో దేశవ్యాప్త ఉద్యమాన్ని చూశాం. నిందితులకు ఉరిశిక్ష వేశారు. అదే ఢిల్లీలో అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయ్యాయనేది గమనించాలి. అదే సమయంలో హైదరాబాద్‌లో కారు డ్రైవర్ తన యజమాని కారును నెంబర్ టాక్సీప్లేట్‌గా మార్చి హైటెక్ సిటీలో అమ్మాయిని ఎక్కించుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక బ్యాచ్ పాములను చూపించి అఘాయిత్యం చేశారు.

వరంగల్‌లో యాసిడ్ దాడి జరిగిన ఘటనలో అమ్మాయి చనిపోయిందని ప్రజలు ఆందోళన చేస్తే ముగ్గురిని పోలీసులు కాల్చిచంపిన విషయాన్ని మరువరాదు. ఇదే వరంగల్‌లో యువతిని గొంతుకోసి చంపిన ఘటన కూడా ఉంది. ఆ నిందితుడు కూడా రైలు పట్టాల కిందపడి చనిపోయాడు. ( దీన్ని కూడా పోలీసులే చేశారేమోనని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి). ఇలాంటి ఎన్నో ఘటనలల్లో కఠినమైన శిక్షలు పడుతూనే ఉన్నాయి. అయినా కూడా మళ్లీ, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయనేది గమనార్హం. నేర ప్రవృత్తిని తగ్గించటానికి విపరీతమైన చట్టాల రూపకల్పన, కఠినమైన శిక్షలు అవసరమనే భావన ఉన్నప్పటికీ, కార్ల్‌మార్క్స్ ఓ సందర్భంలో చెప్పినట్లుగా “విపరీత చట్టాల రూపకల్పన జరుగుతుందంటే నేరగ్రస్త సమాజం ఉందని అర్థం చేసుకోవాలి” అనేది ఇక్కడ కూడా గమనించాల్సిన అవసరముంది.

గత మూడు, నాలుగు దశాబ్దాల కిందట సమాజ హితం కోరుకునే విధంగా కమ్యూనిస్టులు, వారి అనుబంధ సంఘాలు, అభ్యుదయ శక్తులు సమాజంలో విలువలు పెంచేందుకు కృషి చేసేవారు. విలువలతో కూడిన బోధనల ప్రచారం ఎక్కువగా జరిగేది. కానీ ప్రస్తుతం ఇలాంటి బోధనలు కూడా క్రమంగా తగ్గిపోవటం స్పష్టంగానే కనిపిస్తోంది. సమాజ పరివర్తన గురించి ఆలోచించే శక్తులు, వర్గాలు కనుమరుగైపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తద్వారా మనిషి సాంసృ్కతిక కోణం సృజించటం లేదు. తద్వారా సాంస్కృతిక పునః నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

అందుకోసమే కఠినమైన శిక్షలు పడుతున్నప్పటికీ నేర ఘటనలు మాత్రం తగ్గటం లేదు. వరంగల్‌లో జరిగిన 9 నెలల పసిపాలపై జరిగిన అత్యాచార హత్య జరిగినప్పుడు కూడా అవే ఆందోళనలు, అదే శిక్ష. కాకపోతే నిందితుడు పేదవాడనో లేక మరే కారణానో నిందితుని తరుపున కేసు వాదించటానికి న్యాయవాదులు ముందుకు రాకపోవటం వల్ల 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి ‘ఉరిశిక్ష’ ఖరారు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి కూడా బాగాలేదని, ఒకరకమైన మానసిక రోగులే ఇలా చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతారని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ప్రియాంక, భూమికలను ముక్కలు ముక్కలుగా నరికి కుప్పలు పోసిన ఘటనలో అనేక ఆధారాలు చూపుతూ నెల రోజులు నిరవధిక ఆందోళనలు చేసినా, కేసును చేధించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఘటనలో అత్యాచార, హత్యానేరాలు భావించలేరా? వీటిని ప్రభుత్వం ఎందుకు నిర్మూలించే చర్యలు చేపట్టలేదు. ప్రియాంక, భూమికల మిస్టరీని ఎందుకు ఛేదించలేదు..? ఛాలెంజ్‌లను ఛేదిస్తేనే కదా గొప్పతనం..? అల్పమైన విషయాలలో ఏముంటుంది గొప్పతనం..? 45 రోజుల్లోనే కేసును ఛేదించి ఉరిశిక్ష పడేలా కేసును పూర్తి చేశామని చెప్పుకోవటంలో అర్థం ఏపాటిదో పరిశీలించుకోవాల్సిన అవసరముందేమో ఆలోచించాలి. ప్రజల ఆందోళనలకు సమాధానంగా ఉరిశిక్ష వేసి మేము చాలా గొప్పపని చేశామంటే ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండటానికి చేయాల్సిన చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందనేది గుర్తించాలి.

కోర్టులు, పోలీసులు శిక్షలు వేసే ముందు ఎలాంటి స్థితిలో నేరం జరిగింది. అందుకు ప్రేరేపించిన అంశాలేమిటి..? అనేది పరిగణనలోకి ఏంతమేరకు తీసుకుంటున్నారు..? శిక్ష వేసి చేతులు దులుపుకోవటం కాకుండా సమాజం మార్పు కోసం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలకు తగు సూచనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారికి ఈ శిక్షల గురించి తెలియక చేస్తున్నారా..? అంటే తెలుసు అనే చెప్పాలి. అయినా కూడా ఎందుకు చేస్తున్నారనేదే పరిశీలించాల్సిన అవసరం ఉంది. చర్చించాల్సిన అవసరం ఉంది. సామాజిక వాదులు, ప్రజా సంఘాలు చర్చ చేయకుండా వదిలేస్తే ఇలాంటి సంఘటనలకు అంతం ఉందనేది గుర్తించాలి. ఎన్ని శిక్షలు వేసినా ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజల ఆందోళనలకు రాజ్యం శిక్షలతో సమాధానం చెప్పుతూ చేతులు దులుపుకుంటుందనేది కూడా అర్థం చేసుకోవాలి.

ఇలాంటి సంఘటనలు జరుగటానికి మూలాలను వెతకాలి. విచ్చలవిడి మద్యం అమ్మకాలు, బూతు సినిమాలు, బూతు వీడియోలు, చరిత్రలో, పురాణాల్లో స్త్రీని చిన్న చూపు చూపించిన విషయాలు తదితర అంశాలు ఇలాంటి ఘటనలకు ప్రేరేపితాలుగా కనిపిస్తుంటాయనేది కూడా ఒక కారణంగా అర్థం చేసుకోవాలి. సమాజంలో మానవ విలువలు, సమానత్వం కల్పించటం కోసం ఇంటా బయట బోధనలు ఎంతైనా అవసరం. ప్రాథమిక విద్య నుంచే విలువల బోధన, అసమానతల తొలగింపు గురించిన బోధనలు జరుగాల్సిన అవసరమున్నది. సమస్య, సంఘటన, దుర్మార్గం జరిగిన తరువాత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే ప్రజలు ఇలాంటి దుర్మార్గాలు జరుగకుండా ఉండటానికి కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మూకుమ్మడిగా సాంస్కృతిక పునర్నిర్మాణ సమాజం రూపుదిద్దుకోవటానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా…‘పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను..ప్రాణానికి ప్రాణం’ సరికాదని, ప్రాణం పోతే నేరం చేసిన వ్యక్తి శిక్ష అనుభవించే అవకాశమే ఉండదని గుర్తించాల్సిన అవసరముంది.

People can Changes with hanging

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉరిశిక్షతో మార్పు సాధ్యమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: