తెలంగాణ జన జీవన అక్షరీకరణ

  తెలుగు కవిత్వాన్ని, కథా సాహిత్యాన్ని నవలా సాహిత్యంతో పోల్చి చూసుకుంటే నవలా సాహిత్యం గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. అతికొద్ది మంది మాత్రమే నవలలను రాస్తున్నారు. మలయాళ నవలా సాహిత్యం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తోంది. నవలా పుస్తకాల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. మలయాళ యువత నవలలు రాయడానికి ఇష్టపడుతున్నారు కూడా. మరి తెలుగు సాహిత్యంలో నవలా సాహిత్యం ఎందుకు తగ్గిపోతూ వస్తోంది. ఎందుకంటే నవల రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాత్రల చిత్రణ, […] The post తెలంగాణ జన జీవన అక్షరీకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగు కవిత్వాన్ని, కథా సాహిత్యాన్ని నవలా సాహిత్యంతో పోల్చి చూసుకుంటే నవలా సాహిత్యం గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. అతికొద్ది మంది మాత్రమే నవలలను రాస్తున్నారు. మలయాళ నవలా సాహిత్యం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తోంది. నవలా పుస్తకాల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. మలయాళ యువత నవలలు రాయడానికి ఇష్టపడుతున్నారు కూడా. మరి తెలుగు సాహిత్యంలో నవలా సాహిత్యం ఎందుకు తగ్గిపోతూ వస్తోంది. ఎందుకంటే నవల రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాత్రల చిత్రణ, నవలను నడపడం, తీసుకున్న అంశాన్ని పక్కకి పోకుండా రాయడం ఇలాంటివి చక్కగా హ్యాండిల్ చేయాలి. తెలుగులో విస్తృతంగా కవిత్వ పుస్తకాలు వస్తున్నాయి కానీ నిలబడుతున్నది మాత్రం ఏడాదికి పది పుస్తకాలు లేదా అంతకి తక్కువే. కథా సాహిత్యం వస్తున్నప్పటికీ కవిత్వం లాగానే కొన్ని పుస్తకాలు లేదా కథలు మాత్రమే నిలబడగలుగుతున్నాయి. కవిత్వం రాసి పెరుగుతూ వాసి పతనం అవుతోంది. కథా సాహిత్యం పడుతూ లేస్తూ కొనసాగుతోంది. నవలా సాహిత్యం వస్తున్నదే తక్కువ అందులో మంచి సాహిత్యం మరీ తక్కువ.

నవలల్లో అనేక అంశాలు చర్చించడానికి అవకాశం ఉంటుంది. చెప్పదల్చుకున్నది విస్తృతంగా చెప్పవచ్చు. ఎందుకంటే నవల యొక్క నిడివి పెద్దగా ఉంటుంది కనుక. నిడివి పెద్దగా ఉంది కదా అని ఆసక్తికరమైన సంభాషణలు లేకుండా, వస్తువుకు సంబంధం లేకుండా ఏదేదో చెప్పకూడదు. తీసుకున్న వస్తువునే వివరంగా, ఆసక్తికరంగా, సహజంగా, వాస్తవికంగా చెప్పినప్పుడే నవల విజయం సాధిస్తుంది. నవలల్లో వాస్తవికత లేకపోతే చదవడానికి పాఠకులు ఇష్టపడరు. తెలియని అంశాలు, చరిత్రలో జరిగిన దోపిడీలు, పాత్రల ద్వారా మంచి చెడుల విశ్లేషణ, సామాజిక స్థితిగతులు, దోపిడీ వ్యవస్థ, మూఢనమ్మకాలు, వివక్ష, ప్రాంత అస్తిత్వం, పోరాటాలు లాంటి నవలలకు ఎప్పటికీ ఆదరణ ఉండనే ఉంటుంది. సరైన విషయ సేకరణ, పరిశోధన చేసి నవల రాస్తే తప్పకుండా పాఠకలోకం ఆహ్వానిస్తుంది. సాహిత్య ప్రపంచంలో ఆ నవల నిలుస్తుంది. దానికి ఉదాహరణే ఇటీవల డా. గడ్డం రామ్మోహన్ రావు గారు కొంగ వాలు కత్తి పేరుతో రాసిన నవల. ఇది తొలి తెలుగు చిందు నవల. ఇదే నవలకు కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారం 2019కి లభించింది. అంతర్జాతీయ భాషా సాహిత్యం నుండి తెలుగు సాహిత్యం వరకు నవలా సాహిత్యం పెను మార్పులు సృష్టించింది. అమ్మ నవల కార్మిక పక్షాన నిలబడి ప్రపంచ గమనాన్ని మారిస్తే, పాకుడురాళ్ళు సినీ జీవితాల చీకటి కోణాన్ని ఆవిష్కరణ చేసింది.

దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ గ్రామంలో జన్మించారు. దాశరథి రంగాచార్యులు గారి అన్న గారు దాశరథి కృష్ణమాచార్యులు కూడా కవి, సాయుధ పొరాట యోధులు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథ పాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాక సికింద్రాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. దాశరథి రంగాచార్యులు సనాతన సాంప్రదాయ ఛాందస కుటుంబంలో పెరిగినప్పటికీ మార్క్సిజ దృక్పథంతో, మానవతా లక్ష్యంతో ముందుకు సాగారు. నిజాలను నిక్కచ్చిగా తన రచనల్లో రాయగల ధైర్యశాలి. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస బతుకులను వివరంగా చిల్లర దేవుళ్లు నవలలో రాశారు.

వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. చిల్లర దేవుళ్లు నవల యొక్క కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. కథాస్థలం తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరు.

నవలను 13.10.1964న రాయడం ప్రారంభించి10.11.1964న ముగించినట్టు రచయిత తన ముందుమాటలో చెప్పుకున్నారు. అయితే దానికి ముందు 1963 లో రచన గురించి అధ్యయనం చేసినట్టు చెప్పారు. ఏ రచన రాయాలన్నా అధ్యయనం చేయకపోతే విషయాలు తెలియవు, విషయాలు తెలియకపోతే రచనలో వాస్తవికత ఉండదు. సరైన సమాచారం లేకపోతే తీసుకున్న వస్తువుకు రచయిత న్యాయం చేయలేడు మరియు తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పి పాఠకులని తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుంది. రచయితలు రచనలు చేయడం ముఖ్యం కాదు ఆ రచనలలో ఎంత శాతం వాస్తవికత ఉన్నది? ఆ వాస్తవికత ప్రజల్లోకి విస్తృతంగా ఎంత వెళ్ళిందనేదే ముఖ్యం. వాస్తవికత పరిశోధనతోనే సాధ్యం అవుతుంది. నేను హిజ్రాలపై రాసిన దీర్ఘ కావ్యానికి 9నెలల పాటు విషయ సేకరణ చేశాను. అనేకమంది హిజ్రాలను నేరుగా కలిసి వారి బాధలను, కష్టాలను, కోరికలను తెలుసుకున్న తర్వాతే రచన రాసాను. పూర్తిగా తెలుసుకొని రాయడం రచయిత బాధ్యత.

సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఒక ఊరికి వస్తాడు. ఊరి నడుమ దేశ్‌ముఖ్ రామారెడ్డి గడీ ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మాత్రమే ఇళ్ళు ఉంటాయి. మిగతా ఊరంతా గుడిసలే. నిజాం పాలనలో లభించిన విపరీతమైన అధికారాలతో దొర, కరణం ఊరిని పరిపాలిస్తూ ఉంటారు. పాలించడం అంటే దోచుకోవడమేనని వేరే చెప్పనవసరం లేదు అనుకుంటాను. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర సారంగపాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ సారంగపాణి పాట వింటూ, అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటుగా రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాడు. సారంగపాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది.

చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. ఉదాహరణకి చాకలి పీరిగాడు అనే పాత్ర చింతకాయలను దొంగలించాడని తెలిసి దొర చంపేస్తాడు. దొరకీ, కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. అంటే దొరలకు ఎన్ని గొడవలు ఉన్నా జనాన్ని దోచుకోవడంలో ఏకం అవుతారు. దోపిడీకి గురౌతున్న పేద ప్రజలు మాత్రం ఒక్కటిగా నిలబడరు. ఇప్పటికీ ఈ ఐక్యమత్యం లేకపోవడంతోనే దేశంలో మూడు శాతం మంది 97శాతం మంది ప్రజలను శాసిస్తున్నారు. అమ్మ నవలలో చూసుకుంటే అందరూ ఏకం అవ్వడం చూస్తాము. ఈ నవలలో అలా కనపడదు కానీ చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అనేలా నవల నడిచింది. ముగింపు కూడా అలానే ఉంటుంది.

గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. వనజ ఎవరో కాదు దొర అక్రమ సంతానం. ఐతే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసు పడతారు. సారంగపాణి వనజ అందాన్ని ఆరాధిస్తాడు, ఇద్దరు వారి వారి మనస్సులో ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఒక సందర్భంలో సారంగపాణి పట్నానికి వెళ్ళడంతో వనజ సారంగపాణిని వదిలి ఉండలేకపోతుంది. సారంగపాణి పరిస్థితి కూడా అంతే. తాను వేశ్య కనుక సారంగపాణికి సరితూగనని అనుకొని సారంగపాణిని అన్నగా స్వీకరించాలని భావిస్తుంది వనజ. తన జీవితాన్ని సారంగపాణికి చెప్పి నాలాంటిది నీకు భార్యగా ఉండకూడదు కావున నేను నీలో అన్నను చూసుకుంటాను అంటుంది. దానికి సారంగపాణి కూడా అంగీకరిస్తాడు. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న వారు కేవలం వనజ వేశ్య కావడంతో ప్రేమ చెదిరిపోయి అన్నా చెల్లెళ్ల బంధం ఉద్భవిస్తుంది.

ప్రేమకు శరీరానికి సంబంధం ఏమిటి? ఒక దశలో సారంగపాణిని దేవుడు, అత్యంత మంచివాడని చూపించిన రచయిత వనజ వేశ్య అని తెలియడంతో చెల్లిగా స్వీకరించడం ఏమిటి? నిజానికి వనజ వేశ్య కాదు వివిధ కారణాల చేత దొర ఆమెను అలా చేసాడు. అత్యధికులు తన శరీరాన్ని వాడుకున్నారు అంతే. అలా చేయడం వనజకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ అందరూ భయపడినట్టే వనజ కూడా దొరకు భయపడింది. ఇది సారంగపాణి పాత్ర ఎందుకు గ్రహించ లేకపోయింది. రచయిత కూడా అప్పటివరకు ప్రేమికులుగా చూపించి ఆ ఒక్క కారణంతో ప్రేమికులను అన్న చెల్లెలుగా ఎలా చూపగలిగారు? అంటే చెల్లి వేశ్య అయినా పర్వాలేదు కానీ భార్య వేశ్య కాకూడదని రచయిత అభిప్రాయమా లేదంటే మనుషుల ఆలోచన ధోరణి అలా ఉంటుందని చెప్పడమో తెలియదు కానీ కారణం ఏదైనా రెండూ తప్పే. వనజను పెళ్లి చేసుకొని ఉంటే రచయిత చూపినట్టు సారంగపాణి దేవుడు, మంచివాడు అయ్యుండేవాడు. ఇతరులకు మంచి చెప్పడమే కాదు చెప్పేవారు అనుసరించి చూపాలి.

మరోవైపు భూ తగాదాల్లో లంబాడీలను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడీ స్త్రీపై అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో ఆ ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. ఆ వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ లంబాడి మహిళ యొక్క భర్తను కూడా పోలీసు అధికారులు చంపుతారు. నవలలో నాటి పోలీసు అధికారులు ప్రజలను ఎలా హింసించే వారో రెండు చోట్ల కనపడుతుంది. ఒకటి లంబాడి మహిళలపై దౌర్జన్యం చేసి దొరలకు తొత్తులుగా కనపడతారు. మరో చోట ఒక పోలీసు అధికారి నడిరోడ్డులో సాధారణ పేద వ్యక్తిని బెదిరించి తన సైకిల్ ని తీసుకుంటాడు. పోలీసులు తన అధికారాలతో పేద ప్రజలను బెదిరించడం, దోచుకోవడం అప్పుడూ ఉండేది ఇప్పుడూ ఉన్నది. కానీ అప్పుడు ప్రజలకు ప్రశ్నించే తత్త్వం, ధైర్యం లేవు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం ఉన్నది. అధికారులు ప్రభుత్వ, ప్రజల సేవకులనే విషయం అందరికీ తెలుసు. అధికారులు తప్పు చేసినా వారిపై ఎదురు తిరుగుతారు. ఇది నేటి పరిస్థితి. ఇలాంటి చైతన్యం ఇంకా పెరగాల్సి ఉన్నది.

నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు ముస్లిములుగానూ మనలేక పడే బాధలూ చిత్రీకరించింది ఈ నవల. ఇక్కడ మత మార్పిడి జరగడానికి పేదరికమే కారణం. కానీ ఏ మతంలోకి మారినా బీదరికం మాత్రం పోదు. బీదరికం పోవాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. దోపిడీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. మతం మారినంత మాత్రాన కష్టాలు పోవు. నేడు కొన్ని మతాలు డబ్బు ఎరగా వేసి మతాన్ని మారుస్తున్నారు. ఇది ఒక వ్యాపారమే. దోపిడీ వ్యవస్థలో భాగమే.

దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు ఒక మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం చూపించారు. ఆ పనిచేసే మనిషి వెట్టిచాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతాడో కూడా చిత్రించారు. దొర బండిలో ప్రయాణిస్తుంటే బండి ముందు ఒక వ్యక్తి పరుగు పెట్టడం, బండి వెనుక దొర సామాన్లు మోస్తూ ఇంకో వ్యక్తి పరుగు పెట్టడం లాంటివి బానిసత్వానికి పరాకాష్ట. ఇది కేవలం అమాయకత్వం, బీదరికం, చైతన్యం లేకపోవడం, నిస్సహాయతలే. నిజాం పాలనలో దెబ్బ తింటున్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టిన మాడపాటి హనుమంతరావు కృషిని సారంగపాణి తెలుసుకోవడమూ నవలలో ఉన్నది. ఆ సందర్భంలో ఉర్దూ భాష పెత్తనం గురించి, ఉర్దూ భాష వల్ల తెలుగు పతనం గురించి వివరించారు. నాడు ఉర్దూ భాష తెలుగు భాష పతనానికి కారణం అయితే ఇప్పుడు ఆంగ్ల భాష తెలుగు భాషను మింగేస్తోంది. ప్రభుత్వాలే దీనికి కారణమని చెప్పలేము. పరభాషా మోజులో పడ్డ ప్రజలు కూడా కారణమే. ఇతర భాషలను గౌరవించాలి, నేర్చుకోవాలి కానీ మాతృభాషను విస్మరిస్తే ఎలా?

నవలలో పాత్రల పేర్లు పెట్టడంలో రచయిత అత్యంత జాగ్రత్త వహించారు. నవల ఏ వస్తువు మీద అయితే రాస్తున్నారో పేర్లు కూడా ఆ వస్తువుకు, ప్రాంతానికి దగ్గరగా ఉండాలి. తెలంగాణ ప్రాంతం గురించి రచన చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతపు పేర్లు, యాస వాడటం మంచిది కాదు. ఈ నవలలో పేర్లు అన్నీ సహజంగా ఉండటం, పాత్రల స్వభావం మనకు తెలిసినవే, సమాజంలో ఉన్నవే కావడంతో పాఠకులకి త్వరగా నవల కనెక్ట్ అవుతుంది. తెలంగాణలో ఉర్దూ బాషా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రచనలో చాలా ఉర్దూ పదాలు ఉన్నాయి. పుస్తకం చివర ఆ పదాలకు అర్థాలు కూడా ఉండటంతో పాఠకులు శ్రమ పడాల్సిన అవసరం లేదు.

దొరకి గొంతు కాన్సర్ వచ్చి మరణిస్తాడు. కరణాన్ని గ్రామ ప్రజలు చంపుతారు. తాయారు దొంగ బాబాకి తన శరీరం ఇచ్చేస్తుంది. ఇలా చెడు పాత్రలకు శిక్షలు వేసిన రచయిత చివర్లో సారంగపాణి మంజరికి బావ అని చెప్పడానికి ఒక కథను చెప్పారు. అదేంటంటే చిన్నప్పుడు మంజరి అత్తా, మామలు కృష్ణ స్నానాలకు వెళ్ళినప్పుడు సారంగపాణి అక్కడ తప్పిపోయాడని. సారంగపాణి మంజరి బావ అని చూపాల్సిన అవసరం ఏముంది? సినిమా కథల్లో లాగా ఇలాంటి ముగింపులు లేకుంటే బాగుండేది. ఎందుకంటే నవల మొత్తం ఎక్కువగా వాస్తవికతతో ఉండి చివర ఇలా ఉండేసరికి బాగాలేదు. పాత్రల స్వభావం, పాత్రల సంభాషణ, మాటలు, యాస అన్నీ వాస్తవాలకు దగ్గరగా ఉండి చివర్లో అలా చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. చివరికి వనజ, మంజరి తండ్రి దొర అని అందరికి తెలుస్తుంది. వనజ పాత్రకు ఎలాంటి ముగింపు లేదు.

    – ప్రతిలిపి (తెలుగు విభాగం,రచయితల అనుసంధాన కర్త )

Dasarathi Rangacharya Novel Books

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ జన జీవన అక్షరీకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: