అక్షర శిఖరం

  మనసులోని సంఘర్షణలన్నీ అక్షరాలై కురుస్తుంటే ఆ అక్షర రాసులన్నీ ఓ శిఖరమై తన ఎదుటన నిలిచిన నాడు కవి మనసు వినీలాకాశంలో విహరించే విహంగమవుతుంది. తన అక్షర శిఖరాన్ని పరిభ్రమిస్తూ మురిసి పోతుంది. యువకవి తిరునగరి శరత్ చంద్ర కలం నుండి జాలువారిన గేయ సంపుటి ఈ ‘అక్షర శిఖరం‘. ఇందులో గేయాలన్నీ పరిమళించే పుష్పాలే….ఎంతో జాగ్రత్తగా ఒక్కో పుష్పాన్ని గుచ్చి మాల అల్లినట్లు అనిపిస్తుంది. ఇందులోని కవిత్వమంతా శబ్ద సౌందర్యం, భావ సౌందర్య సమ్మిళితంతో […] The post అక్షర శిఖరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనసులోని సంఘర్షణలన్నీ అక్షరాలై కురుస్తుంటే ఆ అక్షర రాసులన్నీ ఓ శిఖరమై తన ఎదుటన నిలిచిన నాడు కవి మనసు వినీలాకాశంలో విహరించే విహంగమవుతుంది. తన అక్షర శిఖరాన్ని పరిభ్రమిస్తూ మురిసి పోతుంది.
యువకవి తిరునగరి శరత్ చంద్ర కలం నుండి జాలువారిన గేయ సంపుటి ఈ ‘అక్షర శిఖరం‘. ఇందులో గేయాలన్నీ పరిమళించే పుష్పాలే….ఎంతో జాగ్రత్తగా ఒక్కో పుష్పాన్ని గుచ్చి మాల అల్లినట్లు అనిపిస్తుంది. ఇందులోని కవిత్వమంతా శబ్ద సౌందర్యం, భావ సౌందర్య సమ్మిళితంతో చదువరులకు ఓ పరవశాన్ని తెప్పిస్తాయి. ఇందులో 30 గేయాలున్నాయి. కవి సామాజికం, ప్రేమ , ప్రకృతి మొదలైన అంశాలను కవితా వస్తువులుగా తీసుకున్నాడు. ప్రతి గేయం ఒద్దికగా చెక్కిన శిల్పంలా ఉంది.
//ఉదయరాగ తొలకరిలో / వసంతాలు పలికినవి
మృదుల హృదయ గీతికలో / మరందాలు చిలికినవి
పవనాలై కదిలి పోతు / ప్రపంచాలు కులికినవి/ ‘ఉదయరేఖలు‘ అనే గేయంలో…. అద్భుతమైన పద ప్రయోగాలు వసంతాలు పలికినవి , మరందాలు చిలికినవి, ప్రపంచాలు కులికినవి అంటూ….ఉదయరేఖలు ఎప్పుడూ మనిషికి ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి. కొత్త ఆశలకు ఆయువు పోస్తూ , విజయాలకు దారులు చూపుతూ…..రేపటి ఉదయం కోసం మనిషెప్పుడూ ఆశగానే ఎదురు చూడాలి. ఎంత నిరాశలో కూరుకుని పోయి ఉన్నా కూడా….
ఇదే గేయంలోని చివరి పంక్తులు….
//కనిపించని లోకాలకు / దారులనే వేసి చూడు
పాడరాని గీతానికి / శ్రుతిని కలిపి నీవు పాడు//….మంచి ఉత్తేజ పూరిత వాక్యాలు.
//తమస్సులో ఉషస్సుకై / తపస్సునే చేసినాను / మనస్సనే హోమంలో / హవిస్సునై నిలిచినాను / చిరుగాలుల వీణియపై / సరిగమలే పలికిస్తా
సిరివెన్నెల వన్నెలపై / రంగులనే చిలికిస్తా//….‘సరిగమలు‘ గేయంలో….
చీకట్లో ఉషోదయంకోసం తపస్సు చేయడం…. మనసనే హోమంలో హవిస్సునై నిలబడడం , చిరుగాలులనే వీణ చేసుకుని సరిగమలు పలికించడం గొప్ప తాత్వికత, భావుకత సమ్మిళితం….
//తరతరాల నరనరాల / వెలుగుతున్న దీప్తి నీవు / యుగయుగాల జగజగాల / పొంగుతున్న నదివి నీవు / నీ పాటల విరితోటల / పరిమళించు కుసుమమైతి
నీ అడుగుల అడుగునైతి / నీ నుడుగుల మధువునైతి// ‘తరతరాల దీప్తి నీవు‘ గేయంలో ప్రతి పదంలో ఉవ్వెత్తున ఎగసిపడే ప్రేమ భావాలు….చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది….
//ఉదయించే రవి కిరణం / మన భారతదేశం / వికసించే దివ్యవనం / మన భారతదేశం /పచ్చనైన పంటలతో
పరిమళించు తోటలతో / పొంగుతున్న వాగులతో
చెంగుమనే దూడలతో// ‘మన భారత దేశం‘ గేయంలో…..
గేయం మొత్తం భారతదేశం ఔన్నత్యాన్ని అద్భుతంగా వర్ణించారు.
//నడిచే సాహిత్యం నీవే / విరిసే సిరిమల్లెవు నీవే
మాట్లాడే వెన్నెల నీవే /ఆటాడే ఆమని నీవే// ‘నడిచే జలపాతం‘ గేయంలో….
ఇందులో ఒక స్త్రీని వర్ణించిన తీరు అమోఘం….మాట్లాడుతుంటే వెన్నెలలా ఉందనడం , కన్నుల పిలుపులలో ముత్యాల వాన అనడం తీసుకున్న ఉపమానాలన్నీ ఉదాత్తంగా మధురంగా ఉన్నాయి….
//అడుగడుగో పేదవాడు / కన్నీటికి చెలికాడు / కలతలోను మమతలోను / రెండింటికి సరిజోడు / ఆకలియను వేటలోన / ప్రణమునే బాణముగా
విసిరి వేయు విలుకాడు//….‘కన్నీటి చెలికాడు‘ గేయంలో…
పేదవాడితో చెలిమి చేసేవి ఎప్పుడూ కన్నీళ్ళే కదా….అతని దగ్గర ధనం లేక పోవచ్చు కానీ విరివిగా ప్రేమానురాగాలు ఉంటాయి. ఈ దేశ దీనస్థితికి చిరునామాలాంటి వాడు. అపవాదులెన్ని వచ్చినా, బ్రతుకు చీకటిగా మారినా వేకువ తెచ్చే వెలుగు కోసం ముందుకు సాగిపోతూనే ఉంటాడు.
//ఖురాను పలికిన పెదవులపై / భగవద్గీతను వింటున్నాను
వేదం పలికిన గొంతుకలోన / నమాజు పిలుపులు వింటున్నాను// ‘వేదం పలికిన గొంతుక‘ గేయంలో….
ఒక ముస్లిం స్వరం నుండి భగవద్గీతను , ఒక హిందువు స్వరం నుండి ఖురాను వింటున్నాను అని కవి అనడంలో అలాంటి సమాజాన్ని తాను కోరుకుంటున్నట్లు మనకు అనిపిస్తుంది. దేశంలో ఎక్కడా, కుల మతాలకు సంబంధించిన ఘర్షణలు ఉండకుండా అందరూ సోదరభావంతో జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ చివరి గేయ కవితలో అందించడం అభినందనీయం. తిరునగరి శరత్ చంద్ర కలం నుండి మరెన్నో గొప్ప కవితలు జాలువారాలని కోరుకుంటూ….హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

Article about Akshara Shikaram Book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అక్షర శిఖరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: