మళ్లీ ముంచిన వరదలు

    నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు మళ్లీ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ రెండు మూడు రోజుల్లోనే 86 మంది మృతిచెందారు. లక్షలాది మంది నిర్వాసితులయ్యారు. గత ఏడాదే కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుపోయి అల్లాడిపోయిన కేరళ ఇంతలోనే మళ్లీ జలదాడికి దొరికిపోయింది. ఒక్క శుక్రవారం నాడే అక్కడ 27 మంది మరణించారు. దీంతో కేరళలో వరదల మృతుల సంఖ్య 35కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇంతవరకు 65వేల మందిని […] The post మళ్లీ ముంచిన వరదలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు మళ్లీ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ రెండు మూడు రోజుల్లోనే 86 మంది మృతిచెందారు. లక్షలాది మంది నిర్వాసితులయ్యారు. గత ఏడాదే కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుపోయి అల్లాడిపోయిన కేరళ ఇంతలోనే మళ్లీ జలదాడికి దొరికిపోయింది. ఒక్క శుక్రవారం నాడే అక్కడ 27 మంది మరణించారు. దీంతో కేరళలో వరదల మృతుల సంఖ్య 35కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇంతవరకు 65వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మహారాష్ట్రలో జలాగ్రహాన్ని అధికంగా చవిచూసిన కొల్హాపూర్, సంగ్లి సహా ఐదు జిల్లాల్లో 2లక్షల 85వేల మందిని ఖాళీ చేయించారని సమాచారం. సంగ్లి జిల్లాలో 28, కొల్హాపూర్‌లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. గత సంవత్సరం కేరళను కకావికాలు చేసిన వరదలు ప్రపంచాన్నే దిగ్భ్రాంతపరచాయి. అంతకుముందెన్నడూ ఎదురుకానంత విషాదం ఆ రాష్ట్రాన్ని కబళించింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలో గల మొత్తం 42 డ్యాములలో 35 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. ఇది చరిత్రలో అంతకు ముందెప్పుడూ జరగలేదు. అంత పెద్ద జలరాశి రాష్ట్రాన్ని ముంచివేసింది. సగం గ్రామాలు (774) మునిగిపోయాయి. 379 మంది మరణించారు. కొన్ని పదుల మంది ఆచూకీ దొరక్కుండా పోయారు. 19,500 కోట్ల విలువైన ఆస్తులు గంగపాలయ్యాయి. 600కిపైగా పడవలు, వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు, అసంఖ్యాక సైనికులు రంగంలోకి దిగి పన్నెండున్నర లక్షల మందిని 3,741 అత్యవసర శిబిరాలకు తరలించారు. ఒడిశాలో గత మే నెలలో సంభవించిన అతి భారీ ఫొని తుపానును ఆ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు అందరి ప్రశంసలు పొందింది. గంటకు 175 నుంచి 188 అప్పుడప్పుడు 205 కి.మీ. వేగంతో వీచిన గాలులు భయోత్పాతాన్ని కలిగించాయి. పూరీ నగరం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ తుపాను నుంచి జననష్టాన్ని అతి పరిమిత సంఖ్యకు అదుపుచేయగలగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల గత 20 ఏళ్లలో 2.3 బిలియన్ల మంది నష్టపోయారు. గత నెలలో తొలకరి వర్షాల వల్ల సంభవించిన వరదల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు. లక్షలాది మంది ఇతరత్రా నష్టపోయారు. అస్సాం, బీహార్‌లలో 142 మంది చనిపోయారు. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల బీహార్‌లోని 12 జిల్లాల్లో 60లక్షల మందికి ముప్పు కలిగింది. వరద నీటిలో చిక్కుకున్న చాలా గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు అడుగంటిపోయి ఉచిత ఆహార కేంద్రాలు దగ్గరలో లేక నానాయాతన పడ్డారు. బ్రహ్మపుత్ర నది పొంగడంతో అస్సాంలో వరదలు ముంచుకొచ్చి తీవ్ర హాని కలిగించాయి. భారీ వర్షాలకు, వరదలకు ముందుగా అమితంగా దొరికిపోయి నష్టాలపాలయ్యేవారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే నిరుపేదలే.

ప్రతి ఏటా ఏదో ఒక స్థాయిలో వరదలు సంభవిస్తున్నా మన దేశంలో వాటి వల్ల కలిగే నష్టాలను తగ్గించుకునేందుకు శాశ్వత చర్యలను పాలకులు తీసుకోలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని వరద నీటిమట్టాలకు అతీతంగా ఎత్తైన ప్రాంతాల్లో చేపట్టవలసి ఉంది. కానీ ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. తూతూమంత్రంగా ఆదరబాదరగా వరద నీటి నుంచి ప్రజలను ఖాళీ చేయించి తాత్కాలిక కేంద్రాల్లో వుంచి పదో పరకో నష్టపరిహారం చెల్లించి చేతులు ముడుచుకోవడమే జరుగుతుంది. ఏటా వస్తున్న వరదలు ఏయే ప్రదేశాల్లో, ఏ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయో కొలతలు సహా సకల సమాచారం తీసుకొని మ్యాపులను సిద్ధం చేయటం ఆ ప్రదేశాలలో మళ్లీ ఇళ్లు లేవకుండా చూడడం జరగడం లేదు. నదీ తీర ప్రాంతాల్లోనైతే ఆ నది ఎండిపోయి వున్నప్పుడు దాని గర్భంలోనే ఇళ్లు వెలుస్తున్నాయి. ప్రవాహానికి ఇటువంటి ఆటంకాలు కలగడం వల్ల వరద మరింతగా పెరుగుతున్నది.

వరదల్లో అత్యంత తక్కువ సమయాల్లో భారీ సంఖ్యలో జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి తగినంత బలమైన వ్యవస్థలు నెలకొనాలి. ముందుగానే వాతావరణ హెచ్చరికలు విడుదలయ్యేలా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అడవులను భారీగా పెంచితే అవి వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వరదలను నివారించడంలో తోడ్పడతాయి. ప్రస్తుతం కృష్ణ నది ఉగ్రరూపం దాల్చడం వల్లనే మహారాష్ట్రలో భారీ వరదలు సంభవించాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి కిందికి అదనంగా నీరు వదలడం వల్ల కొంత ఉపశమనం కలిగింది. నదుల పొడవునా రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి వరద తీవ్రత తగ్గుతుంది. పైనున్న డ్యాంల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవలి వరకు ఎడారిగా వున్న కృష్ణ నది ఇప్పుడు ఉరకలెత్తడం గమనార్హం. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అందుకు అనువైన రీతిలో నివారణోపాయలను పాటిస్తే వరదల ముప్పు చాలా వరకు అదుపులోకి వస్తుంది.

Flood situation in south India continued

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మళ్లీ ముంచిన వరదలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: