‘స్వదేశీ’ నేపథ్యమే ‘చేనేత దినం’

  చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఎగుమతి, ఉపాధిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ చేనేత దినం’గా 2015లో ప్రకటించింది. ఈరోజు చేనేత కళాకారులకు ప్రయోజనకరంగా ఉండాలని సూచించింది. చేనేత వృత్తి కొనసాగుతున్న ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది. చేనేత పరిశ్రమ, కళాకారులు, ముడిసరుకులు, డిజైనింగ్ పద్దతులు, మార్కెటింగ్, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలంది. అంతేకాకుండా చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను, కేంద్ర, రాష్ర్ట స్థాయిలో అవార్డులు అందుకున్నవారిని […] The post ‘స్వదేశీ’ నేపథ్యమే ‘చేనేత దినం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఎగుమతి, ఉపాధిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ చేనేత దినం’గా 2015లో ప్రకటించింది. ఈరోజు చేనేత కళాకారులకు ప్రయోజనకరంగా ఉండాలని సూచించింది. చేనేత వృత్తి కొనసాగుతున్న ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది. చేనేత పరిశ్రమ, కళాకారులు, ముడిసరుకులు, డిజైనింగ్ పద్దతులు, మార్కెటింగ్, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలంది. అంతేకాకుండా చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను, కేంద్ర, రాష్ర్ట స్థాయిలో అవార్డులు అందుకున్నవారిని సన్మానించాలని పేర్కొంది. వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుని చేనేతకు విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దేశ స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ చేతితో రాట్నం తిప్పి దారం వడికి ఖాదీ వస్త్రాలను ధరించాలని ఇచ్చిన పిలుపు నేపథ్యం లోంచి ఈ చేనేత దినోత్సవం ఆవిర్భవించింది.

బ్రిటిష్ పాలనలో విదేశీ వస్త్ర దిగుమతితో చేనేత రంగం కుదేలయింది. లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. స్వాతంత్య్ర సమరయోధులందరూ ఏకమై మహారాజ మహిందర్ చంద్ర నందీ నేతృత్వంలో ఆగస్టు 7, 1905 రోజున కోల్‌కత్తాలోని ప్రముఖ టౌన్‌హాల్‌లో స్వదేశీ ఉద్యమం పురుడుపోసుకుంది. విదేశీ వస్త్ర ఉత్పత్తులను బహిష్కరిస్తూ 1930 వరకు సాగిన ఈ ఉద్యమంలో చేనేత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంచెలంచెలుగా జోరందున్న ఈ ఉద్యమం 1920 నుంచి 1930 వరకు మహాత్మాగాంధీ సారధిగా జోరందుకుంది. ఆగస్టు 7వ తేదీకి ఉన్న ప్రాముఖ్యతతో దేశవ్యాప్తంగా పలు సహకార సంఘాలు ఈరోజున ‘చేనేత కళాకారుల దినం’గా భావించి వేడుకలు నిర్వహించేవి. చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్ధిక పరిస్థితులు భారత ప్రభుత్వానికి తెలిసేలా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సమూహలు (క్లస్టర్స్) కూడా కార్యక్రమాలను నిర్వహిస్తుండేవి.

ఇవి మొక్కుబడిగా సాగుతున్న క్రమంలో తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తొలిసారిగా (3 మార్చి 2015) ‘చేనేత దినం’ ఆవశ్యకతను రాజ్యసభలో డిమాండ్ చేశాడు. ఆతర్వాత తరచుగా చేసిన విజ్ఞాపనలతో కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖతో కమిటీని ఏర్పాటు చేసింది. పలు సంప్రదింపుల అనంతరం ఆగస్టు 7ను ‘జాతీయ చేనేత దినోత్సవం’గా 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని నరేంద్రమోడి చెన్నైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులకు శాంత్‌కబీర్, జాతీయ అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. చేనేత కళాకారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, వారి ఆదాయాన్ని, ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. నేత పని, దీని అనుబంధ కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా సుమారు 43 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. అత్యధికంగా గ్రామీణ ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు, దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి చేనేత ప్రధాన జీవన వనరుగా ఉంది.

ప్రపంచ వాణిజ్యరంగంలో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందాలు చేనేతపై తీవ్రమైన దెబ్బపడింది. దీనికితోడుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేతను కుదేలు చేసింది. దీంతో ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం రూ.107 కోట్లు ఉండగా, 201213 వచ్చేసరికి రూ.2,960 కోట్లకు చేరినప్పటికీ, రూ.793.28 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ పథకంకు కేటాయింపులు ఉన్నప్పటికీ, ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఆతర్వాత 201718లో కూడా రూ.604 కోట్లు కేటాయించినప్పటికీ, రూ.468.98 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 201819లో రూ. రూ.396.09 కోట్లు, 201920లో రూ.456.80 కోట్ల కేటాయింపులు చేసింది. ఈక్రమంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చేనేత రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీంతో చేనేత కుటుంబాలపై అప్పులు పెరిగి ఆదాయం తగ్గి ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

మన రాష్ర్టం విషయానికొస్తే, చేనేత మగ్గాల కంటే మరమగ్గాల సంఖ్య రెట్టింపు అయ్యాయి. చేనేత కళాకారులు ఆధునిక సాంకేతికతవైపు మొగ్గు చూపుతుండటం వల్లనే మరమగ్గాల సంఖ్య పెరుగుతున్నట్లు రాష్ర్ట ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడయింది. ఈమేరకు నిర్వహించిన సర్వేలో చేనేత మగ్గాలు 17,573 ఉండగా, మరమగ్గాలు 35,588 ఉన్నట్లు తేలింది. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికంగా 25,494 ఉన్నాయి. 17 జిల్లాలకు విస్తరించిన మరమగ్గాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వీటికి అనుసంధానం చేస్తూనే బతుకమ్మ చీరల వంటి ఉపాధి కార్యక్రమాలను రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్నది.

మగ్గాల నవీకరణలో భాగంగా బృంద పథకం, నూలు బ్యాంకు, ఉమ్మడి సౌకర్యాల కేంద్రం, ప్రధానమంత్రి పరపతి, సౌరశక్తి వినియోగం, టెక్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, సార్వత్రిక బీమా, సాంకేతిక పురోగతి పథకాల కింద సాయం అందిస్తున్నది. మరమగ్గాలకు విద్యుత్ రుసుముల రాయితీతో పాటు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. చేనేతలక్ష్మీ, త్రిఫ్ట్ తదితర పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ చేనేత ఆత్మహత్యలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. సిరిసిల్ల తరహాలో చేనేత కళాకారుల సంఖ్య అధికంగా ఉన్న పోచంపల్లి, పుట్టపాక, గద్వాల తదితర ప్రాంతాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరముంది. ప్రభుత్వం ప్రతిపాదించిన వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్ పార్కును త్వరితగతిన పూర్తిచేయగలిగితే ఎంతోమంది చేనేతకారులకు ఉపాధి లభిస్తుంది.

కావాలి ప్రభుత్వాల చేయూత

పెద్దబాడిసె మొద్దుబారినది – సాలెల మొగ్గం సడుగు లిరిగినది చేతి వృత్తులా చేతులిరిగె గదరో మన పల్లెల్లోనా అని ఓ సినీ కవి అన్నట్లు కార్పొరేట్ తరహా ఆర్థిక వ్యవస్థలో చేతి వృత్తులన్నీ అడుగంటిపోవడం సాధారణంగా జరుగుతున్నప్పటికీ చేనేత వృత్తి ధ్వంసం అవ్వడం మాత్రం ఒక ప్రత్యేక అంశంగానే సాగిపోతోంది. మనిషి మనుగడకు కూడు, గుడ్డ అతి ప్రధానమైనవి గనక, వస్త్రాల ఉత్పత్తి ఒక పెద్ద ఉపాధి రంగంగా కూడా చరిత్రలో సహజంగా నిలబడిపోయింది. ప్రజలకు అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ ఈ రంగం రెండోస్థానం ఆక్రమించింది. ఎంత చెట్టుకు అంతేగాలి కదా! చేనేత చెట్టుకు కార్పొరేట్ పెట్టుబడిదారీ అనే గాలి దుమారం బలంగానే తాకింది. మిల్లుల దాడి నూలు యంత్రం నుండి మొదలై చేనేత వస్త్రాల మార్కెటింగ్ వరకు విస్తరించింది.

తాజాగా కేంద్ర ఫ్రభుత్వం చేనేతకు మూలమైన చిలపనూలు పైన 5 శాతం జిఎస్‌టి పన్ను విధించడం చేనేత యెడల అది అనుసరిస్తున్న వైఖరికి అద్దం పడుతోంది. మాంచెస్టర్ నుండి దిగుమతి అయ్యే బ్రిటీష్ వస్త్రాలతో చేనేత ఉత్పత్తులు దీటుగానే కాకుండా, అంతకు మించికూడా పోటీ పడగలిగాయి. నాణ్యత, మన్నికలోనే కాకుండా అందచందాల్లో కూడా నేతన్నల కళా కౌశలం ముందు విదేశీ వస్త్రాలు వెలవెల బోయాయి. పన్ను వడ్డింపు మొదలు ఎన్ని రకాల వీలైతే అన్ని విధాలుగా చేనేత వృత్తిని దెబ్బకొట్టే విధానాలను విదేశీ ప్రభుత్వం కసిగానే చేపట్టింది. అందుకే “ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి? అందాల భరిణ అద్దిన వన్నెలున్న చీరలేవి? సంద్రాల ఆవలున్న యంత్రాలు మింగెనమ్మ- తెగినట్టి బొటన వేళ్ళ చేనేతవాళ్లనడుగు” అంటూ మన తెలుగు కవి వాపోయాడు.

స్వదేశీ ప్రభువులు కూడా విదేశీ రాజులు వదిలి వెళ్ళిన విధానాలనే కొనసాగించారు. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ నూలు ఉత్పత్తి విధానం. పత్తి, పట్టు, జూట్, జరీ వంటి ముడి పదార్థాల నుంచి నూలు ఉత్పత్తి చేస్తారు. ఇది సహజ మైన నూలు. ఈ తరహా ఉత్పత్తిని క్రమంగా తగ్గించేస్తూ ‘పాలియెస్టర్’ వంటి కృత్రిమ నూలు ఉత్పత్తికి స్వతంత్ర భారత పాలకులు ప్రాముఖ్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే సహజమైన నూలును చేనేతకు ఉపయోగిస్తారు. కృత్తిమ నూలు పారిశ్రామిక మిల్లులకు అవసరం. చేనేతను లోతుగా గొయ్యితీసి పాతిపెట్టే విధానాలను అనుసరించే పాలక వర్గాలు అత్యంత కీలకమైన నూలు ఉత్పత్తి దగ్గరే ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులకు రక్షణ కల్పించాలనే లక్షంతో చేసిన 1985 నాటి 22 రకాల వస్త్రాల రిజర్వేషన్ సంగతీ అంతే.

ఈ చట్టం రద్దు కోరుతూ మిల్లుల యాజమాన్యాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాని అత్యున్నత న్యాయస్థానం ఈ రిజర్వేషన్ న్యాయ బద్ధమే, రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఈ చట్టం అత్యంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతోంది. ఒక దశలో చేనేతకు రిజర్వు చేసిన వస్త్రాల సంఖ్యను 22 నుంచి 11 వరకు ప్రభుత్వమే కుదించింది. అది కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఉల్లంఘిస్తున్న యాజమాన్య శక్తులపైన చర్యలు లేకపోగా పవర్‌లూం వస్త్రాలనే చేనేత వస్త్రాలుగా బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. మరోవైపు చేనేత వృత్తికి అండదండల పేరుతో ఏర్పరచిన సహకార రంగం కూడా నిర్వీర్యమైపోతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ. 20 లక్షల కోట్లకు పైగా ఉన్న ఆర్థిక బడ్జెట్‌లో చేనేతకు కేవలం రూ. 604 కోట్లు మాత్రమే కేటాయించి గత సంవత్సర కేటాయింపుల కన్నా రూ. 106 కోట్లు తక్కువ కేటాయించింది. అసలు వార్షిక బడ్జెట్‌లో చేనేతలు కోరుకున్నది రూ.10 వేల కోట్లు. డిమాండ్‌కు కేటాయింపుకు పొంతనే లేదు. చేనేత వృత్తి క్షీణిస్తున్న నేపధ్యంలో ఒబిసిలుగా ఉన్న చేనేత సామాజిక వర్గాల ఉపాధి, సంక్షేమం నిమిత్తం రూ.10 వేల కోట్ల నిధితో కేంద్రప్రభుత్వం చేనేత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన సుమారు రూ.1లక్షా 82వేల కోట్ల వార్షిక బడ్జెట్‌లో కనీసం రెండువేల కోట్లైనా చేనేతకు కేటాయించి చేనేతకు పూర్వవైభవం తేవాల్సి ఉంది. అదే విధంగా చేనేత సామాజిక వర్గాల ఉపాధి, విద్య సంక్షేమాల నిమిత్తమై రాష్ట్ర సర్కార్ కొంత నిధిని ప్రత్యేకంగా కేటాయించి వారసత్వ సంపదైన చేనేత పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

August 7th is National Handloom Day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘స్వదేశీ’ నేపథ్యమే ‘చేనేత దినం’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: