మెట్టినిల్లు మెచ్చినిల్లైతే?

  అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా..కోడలు లేని అత్త గుణవంతురాలు…ఈ జానపద గీతం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పాటలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న బంధాన్ని గీత రచయిత ఎంతో నర్మగర్భంగా చెప్పారు. కొడుకు పెళ్లి ఎప్పుడవుతుందా అని తొందరపడే తల్లి పెళ్లయిన క్షణం నుంచీ కోడలు కొడుకును తనకు కాకుండా చేస్తుందనే అభద్రతా భావానికి గురవుతుంటుంది. తల్లి చెప్పినట్టు వింటే భర్త తనకు కాకుండా పోతాడేమోనని మరోవైపు భార్య భయపడుతుంటుంది. దీంతో అత్తగారింట్లో అడుగుపెట్టిన […] The post మెట్టినిల్లు మెచ్చినిల్లైతే? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా..కోడలు లేని అత్త గుణవంతురాలు…ఈ జానపద గీతం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పాటలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న బంధాన్ని గీత రచయిత ఎంతో నర్మగర్భంగా చెప్పారు. కొడుకు పెళ్లి ఎప్పుడవుతుందా అని తొందరపడే తల్లి పెళ్లయిన క్షణం నుంచీ కోడలు కొడుకును తనకు కాకుండా చేస్తుందనే అభద్రతా భావానికి గురవుతుంటుంది. తల్లి చెప్పినట్టు వింటే భర్త తనకు కాకుండా పోతాడేమోనని మరోవైపు భార్య భయపడుతుంటుంది. దీంతో అత్తగారింట్లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే అత్తాకోడళ్ల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలకు మల్లే ఉంటారు.

ఎన్ని తరాలు గడిచినా అత్తా కోడళ్ల బంధం సంక్లిష్టంగానే ఉండడానికి కారణం మనస్తత్వ సంబంధమైన(సైకలాజికల్) సమస్యలెన్నో దీని వెనుక దాగుండడమే. అత్తాకోడళ్లు మంచి స్నేహితులుగా ఉండలేరా అంటే అదేమీ అసాధ్యమైన విషయం కాదు. ఎంతో స్నేహంగా జీవిస్తున్న అత్తాకోడళ్లు మన మధ్యన లేకపోలేదు. కానీ వీరిరువురి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలంటే సఖ్యత, పరస్పర అవగాహన ఉండాలి. ఇందుకోసం ఇద్దరూ మానసికంగా సన్నద్ధతను కలిగి ఉండాలి. దాదాపు ఇరవై ఏళ్లు అమ్మానాన్న దగ్గర ఉండి పెళ్లయ్యాక ఒక కొత్త ఇంట్లోకి కోడలుగా వెళ్తుంది. అన్నీ కొత్త ముఖాలే. అన్నీ పాత ఆచారాలే. భర్త… స్నేహితుడు కాదు. భర్తే. అత్తమ్మ… అమ్మ కాదు. అత్తే. మామయ్య… నాన్న కాదు. మామగారే. బాధ్యత పెరగాలి. మర్యాదలు తగ్గకూడదు. నాన్న గారం, అమ్మ మమకారం కోసం మాటిమాటికీ పుట్టింటికి వెళ్లడం కరెక్టు కాదు. మాటిమాటికీ ఫోన్‌లో మాట్లాడ్డం కూడా సరికాదేమో. అంతా అయోమయం. ఇలాంటి మెట్టినిల్లు మెచ్చినిల్లుగా మారితే? అత్తమ్మ అమ్మంత అమ్మ అయితే? అప్పుడు… అత్త ఉన్న కోడలు ఉత్తమురాలవుతుంది. కోడలు ఉన్న అత్త గుణవంతురాలు అవుతుంది.

వివాహం అయిన అమ్మాయిలు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుంది. కొత్త ఆచారాలు, కొత్త బంధుత్వాలు, కొత్త నియమ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఆ అమ్మాయి తన పాత జ్ఞాపకాలను, పాత అలవాట్లను మర్చిపోయి మరో సరికొత్త మార్గాన్ని, తనదైన శైలిలో ఎంచుకోవాల్సి వుంటుంది. అత్తగారు వయసు రీత్యా పెద్దవారు వారికిచ్చే గౌరవం వారికివ్వాలి. వివాహం అయిన తర్వాత కొత్తగా అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు కొంతమంది అమ్మాయిలకు అత్తమామలతో ఏవిధంగా ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. మానవ సంబంధాలలో అర్ధాలు మారిపోతున్నాయి. తాతల తరాల నుంచి వస్తున్న వరసలు కనిపించడం లేదు. అక్కా.. చెల్లీ.. అన్నా.. తమ్ముడు.. అత్తా.. మామయ్యా అని పిలుచుకునే పిలుపుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

పిన్నికొడుకు తమ్ముడవుతాడని, అత్త కొడుకు బావ అవుతాడని వరుసలు అంతరించి పోతున్నాయి. ఇటువంటివారు ఎటువంటి వరుసలకు విలువ ఇవ్వకుండా… అంటే అత్తమామలు, ఇతర బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా, తమదైన జీవితంలో ఎవడి అడ్డూ లేకుండా స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలనుకుంటారు. అత్తామామలు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా, కేవలం తమ పనులను కానిచ్చుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల తమ జీవితానికే చాలా ప్రమాదకరం. దీంతో తరుచుగా ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు అవుతుంటాయి. కొందరైతే ఒకరికొకరు కొట్టుకుంటారు కూడా. మరికొందరు తమ భర్తను తీసుకుని ఇల్లు వదిలి వేరే కాపురం పెడతారు కూడా. దీంతో బంధుత్వాలు తెగిపోవడమే కాకుండా, గౌరవమర్యాదలు కూడా మంటలో కలిసిపోతాయి.

పెళ్లయిన తర్వాత బాధ్యతలెన్నో: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి భావి జీవితం ఎన్నో బాధ్యతలతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఇంట్లో కోడలుగా కాలుపెట్టిన అమ్మాయి అందరినీ కలుపుకు పోవాలి. అందులోనూ అత్తతో ఆమె మెలిగే తీరును ఎందరో ఆసక్తిగా గమనిస్తారు. కుటుంబ బాధ్యతలను అత్తామామలు మెచ్చేలా, భర్తతో స్నేహపూరిత మైన జీవితం కొనసాగేలా నిర్వహించడమంటే కోడళ్లకు కత్తిమీద సాములాంటిదే. మరో వైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సరిగా నిర్వహించాలి .భార్యకు, తల్లికి మధ్య సత్సంబంధాలు ఉండడానికి కొడుకు కూడా తన వంతు కృషిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి మధ్య ఎక్కువ తక్కువలు ప్రదర్శించకుండా ఇద్దరినీ సమానంగా చూడాలి. అత్త సహజంగా తానే ఇంటికి పెద్దనని, తాను చెప్పినట్టే కోడలు వినాలని అనుకుంటుంది. అత్త ప్రవర్తన కోడలికి నచ్చకపోవచ్చు.

కోడలికి కొంత సమయం ఇవ్వాలి: సాధారణంగా వివాహం చేసుకుని వచ్చిన ఒక కొత్త అమ్మాయికి కొత్త ఆచారాలను పాటించడానికి కొంత సమయం పడుతుంది. అటువంటి సమయాల్లో అత్తవారింటి నుంచి కూడా కొంతమేరకు ఆమెకు సహాయం చేయాలి. పెళ్లయిన తర్వాత కూడా కొడుకు పనులను తానే చేయాలని తల్లి అనుకుంటుంది. భర్త పనులు తానే చేయాలని కోడలు కోరుకుంటుంది. ఇందువల్ల కూడా వీరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. కోడలు గురించి కొడుక్కు తల్లి నేరాలు చెప్పడం, తల్లిపై భార్య భర్తకు నేరాలు చెప్పడం వల్ల కూడా అత్తాకోడళ్ల బంధం బలహీనపడుతుంది. అత్తా కోడళ్లు ఇద్దరూ ఆరోగ్యకరమైన రీతిలో తమ సంబంధాలను సాగించాలి. మారిన జీవన పరిస్థితులకు అనుగుణంగా కౌటుంబికంగా, సామాజికంగా అత్తాకోడళ్లు ఇరువురూ ఒకరికొకరు అండగా నిలబడాలి.

అందుకే అత్తాకోడళ్ల బంధం చాలా క్లిష్టమైంది. మరెంతో ప్రత్యేకమైనది కూడా. వీరిరువురు తమ పరిధిల్లోంచి ఈ అనుబంధాన్ని కొనసాగిస్తే తల్లికొడుకుల బంధం, భార్యాభర్తల బంధం రెండూ పచ్చగా నూరేళ్లు సాగుతాయి. తానే ఇంటికి పెద్దనని, తాను చెప్పినట్టే కోడలు వినాలని అత్త అనుకుంటుంది. ఆమె ప్రవర్తన, ఆధిక్య ధోరణులు కోడలికి నచ్చకపోవచ్చు. చాలా సందర్భాలలో వీరి మధ్య కొడుకు నలిగిపోతుంటాడు. సరైన సంధానకర్తగా కొడుకు వ్యవహరించకపోవడం వల్ల కూడా అత్తా కోడళ్ల మధ్యలో సమస్యలు తలెత్తుతాయి. మన కుటుంబవ్యవస్థలో అత్తాకోడళ్ల బంధం చాలా ప్రధానమైంది. కొడుకు కేంద్రంగా అత్తా, కోడళ్ల మధ్య సాగే ఈ బంధం సాఫీగా సాగిన సందర్భాలు అపురూపమనే చెప్పాలి. ఇన్ని తరాలైనా వీరిరువురి మధ్య ఉన్న బంధం సన్నిహిత అనుబంధంగా ఎదగకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.

పాజిటివ్ ఆలోచన అవసరం: అత్తా కోడల్లు ఒకరిపట్ల మరొకరు పాజిటివ్ ఆలోచనలతో మెలగాలి. ఒకరినొకరు సర్దుకుపోవాలి. తల్లి కొడుకుల మధ్య బంధాన్ని కోడలు అర్థంచేసుకోవాలి. అలాగే అత్త కూడా తానూ ఒకప్పుడు కోడలే కాబట్టి కోడలి మనసులోని ఆరాటం ఏమిటో గ్రహించి తదనుగుణంగా పెద్దరికంతో వ్యవహరించాలి. అత్త కూడా అమ్మలాంటిదేనని కోడళ్లూ అనుకోవాలి. ఇంటి విషయాల్లో అత్త అభిప్రాయం తీసుకోవడం, ఆమెకు తగిన స్థానం ఇవ్వడం, ఆమెపట్ల సున్నితంగా ప్రవర్తించడం కోడలు చేయాలి. ఇలా చేయడం వల్ల అత్త మనసులో గూడుకట్టుకున్న అభద్రతా భావం పోతుంది. తన కొడుకు తనకు దూరమవుతాడన్న భయం ఆమెకి ఉండదు.

ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ తీసుకుంటే: ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన లైంగిక విద్యపై అవగాహన ఉండక పోవచ్చు. వివాహానికి ముందుగానే కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా వివాహం చేసుకు న్న తర్వాత దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సెక్స్, కొత్తగా పెనవేసుకున్న బంధాలను మరింత బలపడటానికి దంపతులు ఎలాగో ఉండాలో తెలుస్తుంది.
డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

Story about Relation in Between Aunt and Daughter-in-Law

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెట్టినిల్లు మెచ్చినిల్లైతే? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: