ఇవ్వకపోతే లావైపోతారు

  ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో చక్కని డైలాగ్ ఒకటి ఉంది. ‘సమాజం నీకు చాలా ఇచ్చింది. నువు తిరిగి ఇవ్వాలి కదా. లేకపోతే లావైపోతావ్’ అన్నది అందరి నోళ్లలోనూ నిలిచింది. తల్లిదండ్రులు జన్మని ఇచ్చినట్లే చుట్టూ ప్రకృతి కూడా ఎన్నో ఇచ్చింది. ఉదయాన్నే వెలుగు కిరణాలతో తట్టి లేపే సూర్యుడు, చక్కని వెన్నెల, అందమైన పూలు, పాడే పిట్టలు, ఎగిరే పక్షులు, దూకే జలపాతాలు ఇవ న్నీ మనిషికి ప్రకృతి ఇచ్చిన సంపదలు. ప్రకృతికి […] The post ఇవ్వకపోతే లావైపోతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో చక్కని డైలాగ్ ఒకటి ఉంది. ‘సమాజం నీకు చాలా ఇచ్చింది. నువు తిరిగి ఇవ్వాలి కదా. లేకపోతే లావైపోతావ్’ అన్నది అందరి నోళ్లలోనూ నిలిచింది. తల్లిదండ్రులు జన్మని ఇచ్చినట్లే చుట్టూ ప్రకృతి కూడా ఎన్నో ఇచ్చింది. ఉదయాన్నే వెలుగు కిరణాలతో తట్టి లేపే సూర్యుడు, చక్కని వెన్నెల, అందమైన పూలు, పాడే పిట్టలు, ఎగిరే పక్షులు, దూకే జలపాతాలు ఇవ న్నీ మనిషికి ప్రకృతి ఇచ్చిన సంపదలు. ప్రకృతికి మనిషి ఏమి తిరిగి ఇవ్వాలి అంటే, ఇంత అందమైన ప్రకృతిని ప్రాణాలు పెట్టి కాపాడుకోవాలి. చక్కని చెట్లు పెంచాలి. పెరిగిన చెట్లను రక్షించుకోవాలి. మనిషికి ఎంత ఇచ్చినా ప్రకృతిలో ఏదీ ఇప్పటికీ తరిగిపోలేదు.

ఈ కాన్సెప్ట్‌ని మనిషి అర్థం చేసుకోవాలి అంటారు నిపుణులు. మనిషి బుద్ధిగా పెరిగి చక్కగా చదువుకుని, మంచి క్రమశిక్షణతో చక్కని ఉద్యోగం తెచ్చుకుని, సంపాదనా పరుడైన తర్వాత, తన ఈ ప్రగతికి కారణమైన తల్లిదండ్రులను, కుటుంబాన్ని తనకు తోడుగా సంతోషాన్నిచ్చిన సమాజాన్ని మరచి పోకూడదు. తన వంతుగా వాళ్లందరికీ ఎంతో కొంత సాయ పడాలి. రుణం తీర్చుకోవాలి. కానీ ఇవ్వాల్టి మనుషులు మనుష్యులను వాడుకుంటున్నారు. వస్తువులను ప్రేమిస్తున్నారు. స్వార్థం, డబ్బు సంపాదనే ధ్యేయంగా తమ కుటుంబాలను కూడా పరిమితం చేసుకుంటున్నారు. కుటుంబం అంటే భార్యా,భర్త, పిల్లలు మాత్రమే.. ఇందులో మిగతా ఎవరికీ చోటులేకుండా పోతుంది.

అ సమాజం, సమాజధర్మాలు మనిషి ఎలా జీవించాలో ఆ సూత్రాలకు అనుగుణంగా నిర్మితమైంది. సమాజంలో మనుషుల నడతకు ఒక పద్ధతి ఉంది. ఎవరినీ దౌర్జన్యం చేయకూడదు. తప్పులు చేయకూడదు. సొమ్ము అపహరించకూడదు. నియమాలు తప్పి నడుచుకోకూడదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి అభివృద్ధిలో సంపదలో సమాజానికి కొంత భాగం ఉంది. ఆ అలవాటును న్యాయబద్ధంగా చెల్లిస్తేనే బాధ్యత నెరవేర్చుకున్నట్లు. ఆ నియమంతో టాటా బిర్లా, ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ సంస్థలు బిల్‌గేట్స్, మార్క్ జూకర్‌బర్ వంటి కుబేరులు సమాజం కోసం కోట్ల కొద్ద్దీ రూపాయలు వితరణగా ఇచ్చారు. సమాజం సహాయంతోనే తమ వ్యాపార అభివృద్ధి జరిగిందని వాళ్లు విస్మరించలేదు.

కాబట్టి మనస్ఫూర్తిగా తోటివాళ్ల కోసం, సమాజం బాగుకోసం అభివృద్ధికోసం సంపాదించిన దాన్లో కొంతభాగం ఇస్తూ వస్తున్నారు. నీరున్న బావిలో తోడిన కొద్దీ నీటి ఊట పెరుగుతుంది. నీటికి రుచి వస్తుందనే ప్రకృతి సూత్రం వాళ్లు అర్థం చేసుకున్నారు. కానీ ఏ కొందరి వల్లో మొత్తం సమాజం అద్భుతంగా మారి పోవటం అసంభవం… ప్రతి మనిషి సమాజం గురించి ఆలోచిస్తేనే ఆ మార్పు సాధ్యం అవుతుంది.ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలనే సంపదగా భావిస్తారు. వాళ్ల భవిష్యత్తు కోసం జీవితాంతం కృషి చేస్తారు శ్రమ పడతారు. కానీ పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత వాళ్ల జీవితం వాళ్లు నిర్మించుకునే క్రమంలో పెద్దవాళ్లలో వాళ్ల కుటుంబాల్లో చోటు ఇవ్వటం మరచిపోతున్నారు. మరి వయసులో ఉన్నప్పటి నుంచి భవిష్యత్తులో జీవితం కోసం డబ్బుదాచుకుంటూ పోతే మరి పిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారు.

కన్నవాళ్లు తమ వార్ధక్యపు రోజుల గురించి ఆలోచించరు. అది పిల్లల బాధ్యతగా భావిస్తారు. కానీ పిల్లలకు తమ తల్లిదండ్రులు భారంగా అనిపిస్తారు. ఇప్పటి లోక ధర్మం అలాగే ఉంది. నిజమే ఈ ప్రపంచంలో ప్రతి వాళ్లు తమ కోసం నచ్చిన పని చేస్తూ సుఖంగా ఉండటం సబబే. ఏమిటా నచ్చిన పని. తమ చదువు, సంపాదన, తమ సంసారం పిల్లలు ఇవే పరిధులు. సమాస్త్త సుఖాల కోసం ఉంటే చాలు అనుకోవటం లోనే చిక్కు వస్తుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అన్ని బాంధవ్యాలకు తిలోదకాలు ఇస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు సమాజం తమ కుటుంబంలో భాగమే అన్నా వీధికో వృద్ధాశ్రమం వెలుస్తుంది. కుటుంబంలో సంపాదనలేని వాళ్లకు స్థానం లేనట్లే. ఎందుకింత స్వార్థం ఎక్కడుంది లోపం?

పునాది కుటుంబం నుంచే: ఇవ్వాల్టి తల్లిదండ్రుల ఆలోచనలలోనే, పిల్లల పెంపకంలోనే ఒక లోపం… దిద్దుకోలేని తప్పిదం కనిపిస్తోంది. పిల్లలకు కఠోర శిక్షణ ఇస్తూ వాళ్లు పెద్దవాళ్లయి సంపాదన పరులు కావటం కోసం మాత్రమే ఇళ్లల్లో శిక్షణ ఇస్తున్నారు. పెళ్లితో ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోకి ఒకళ్లు ఇద్దరూ సంతానం ఉంటారు. ఆ ఇంట్లో భార్యాభర్త పిల్లలు మాత్రమే సభ్యులుగా ఉంటారు..

సుఖంగా సౌకర్యంగా జీవించటం తప్ప ఇతరుల కోసం ఏదో ఇవ్వటం అనే అలవాటే లేదు. పెంచే తల్లిదండ్రులు, పిల్లలకు మనుష్యులు నమ్మకస్తులే అన్న సందేశం ఇవ్వరు. పిల్లలకు ప్రేమించటం, బాధ్యతగా ఉండటం తెలియదు. మనది, మనకోసమే అన్న స్వార్థపూరితమైన ఆలోచనల మధ్య పెరిగిన పిల్లలకు ఇవ్వటం ఏం తెలుసు. అలా పెరిగివాళ్లు ప్రపంచానికి తోటివాళ్లకు ఏమీ ఇవ్వనట్లే తల్లిదండ్రులకు ఏమీ ఇవ్వరు ఇవ్వలేరు. ఇచ్చే అలవాటు పిల్లలకు లేదు.

ఇలాగే నష్టపోతుంది సమాజం. చుట్టూ ఉన్న సమాజంలో కనీసం 70శాతం ఆర్థికంగా దిగువనే ఉన్నారు. మిగతా సంపన్న వర్గానికి ఈ సమాజంలో ఉన్న 70 శాతం మందికి సంపాదనలో కొంతయినా సాయపడాలన్న ఆలోచనలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితి లోంచి కళ్లు తెరచి మనసుపెట్టి ఆలోచించవలసింది యువతరమే. సమాజానికి ఎంతో కొంత ఇవ్వవలసిన అవసరం గుర్తించాలి. క్రమశిక్షణ అలవర్చుకుని తోటివారికి స్ఫూర్తిగా నిలవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వటంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తేవాలి. ఎదుటి వాళ్ల అవసరాన్ని బట్టి ప్రేమ, తోడు, ఆసరా, ధైర్యం, సేవ ఏదైనా తీసుకోవటమే కాదు ఇవ్వటంలో ఉండే ఆనందాన్ని గుర్తించాలి. సమాజం నుంచి ఎంతో కొంత పొందకుండా పెద్దవాళ్లు, గొప్ప వాళ్లు కాలేదు. మరి తీసుకున్న ఏదో తిరిగి ఇవ్వకపోవగటం స్వార్థం కాదా? అందుకే రెండు చేతులా ప్రపంచపు ప్రేమను పొందాలి. అంతే ఇష్టంగా తిరిగి ఇవ్వాలి. ఇస్తే రెట్టింపై తిరిగి వస్తుంది.

Change in Society with possible only when human thinks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇవ్వకపోతే లావైపోతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: