నేడు లష్కర్ బోనాలు

రేపు రంగం, బోనంతో దర్శించుకోనున్న మాజీ ఎంపి కవిత పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని మనతెలంగాణ, సిటీబ్యూరో : సికింద్రాబాద్ లష్కర్ బోనాలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయం బోనాల జాతరకు ముస్తాబయింది. 204 సంవత్సరాల చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఆది, సోమవారం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ‘బోనాలు, రంగం’ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో లక్షలాది మంది భక్తులు తమతమ బోనాలు సమర్పించి, […] The post నేడు లష్కర్ బోనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రేపు రంగం, బోనంతో దర్శించుకోనున్న మాజీ ఎంపి కవిత
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని

మనతెలంగాణ, సిటీబ్యూరో : సికింద్రాబాద్ లష్కర్ బోనాలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయం బోనాల జాతరకు ముస్తాబయింది. 204 సంవత్సరాల చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ఆది, సోమవారం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ‘బోనాలు, రంగం’ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో లక్షలాది మంది భక్తులు తమతమ బోనాలు సమర్పించి, ఫలహారం బండ్లను ఊరేగించి భక్తి శ్రద్దలను చాటుకోనున్నారు. అత్యంత ప్రాశస్తమున్న ఈ బోనాల ఉత్సవాలకు పోలీసు, జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్, సాంస్కృతిక విభాగాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను పూర్తిచేశారు. అమ్మవారి దర్శనానికి, బోనాలు సమర్పించడానికి, ఊరేగింపులకు సౌలభ్యమైన ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు.
భక్తులకు 6 క్యూ లైన్లు
మహాంకాళి అమ్మవారిని దర్శనానికి విచ్చేసే భక్తులు సౌలభ్యంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు, అందులో బోనాలతో వచ్చే భక్తులకు రెండు క్యూలైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్, బాటా వైపు నుంచి బోనాలతో వచ్చే మహిళలకు, పాతరాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్, అంజలీ థియేటర్ వైపుల నుంచి వచ్చే వారి కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుకవైపు నుంచి టొబాకో బజార్ మీదుగా దాతల కోసం ప్రత్యేకంగా ఓ క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గం.ల తర్వాత పాత రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్ వైపు ఉండే బోనాల క్యూలైన్ నుంచి విఐపి పాస్‌లతో వచ్చే వారిని అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు.
మంచినీటి పాకెట్లు 5 లక్షలు
అమ్మవారిని దర్శించుకునేందుకు అశేషంగా వచ్చే భక్తులకు మంచినీటి వసతిని కల్పించేందుకు ప్రత్యేకంగా 5 లక్షల నీటి ప్యాకెట్లు స్వచ్చంద సంస్థలు, సేవకుల ద్వారా పంపిణీ చేసేందుకు జలమండలి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంజి రోడ్, రోచాబజార్, మహంకాళీ పోలీసు స్టేషన్, అంజలీ థియేటర్, బాబా సంతోష్ స్వీట్ హౌజ్ తదితర ప్రాంతాల్లో మంచినీటి పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరును భక్తులను అడిగి మరీ అందించాలని సేవకులను, సంస్థలను నియామకం చేసినట్టు అధికారులు వెల్లడించారు.
త్రీడి మ్యాపింగ్
ప్రస్తుత జాతరకు వచ్చే భక్తులకు త్రీడీ మ్యాపింగ్ కనువిందు చేయనున్నది. బోనాల ఉత్సవాల విశిష్టతను వెల్లడించేలా త్రీడీ మ్యాపింగ్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. గాంధీ విగ్రహం వెనుకవైపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఈ త్రీడీ మ్యాపింగ్ చేశారు. దేవాదాయం శాఖ అధికారులు దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా తోరణాలు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం, పురవీధులను ముస్తాబు చేశారు. భక్తులకు ఆహ్వానం పలుకుతూ సుభాష్‌రోడ్, పాతరాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్, రాణిగంజ్, సిటీలైట్ హోటల్, మంజుథియేటర్, ఎస్‌డి రోడ్, ఆర్‌పిరోడ్ తదితర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్నారు.
ప్రత్యేక వైద్య శిబిరాలు
లక్షలాది మంది భక్తులు తమతమ బోనాలు సమర్పించి భక్తి శ్రద్దలను చాటుకునే ఈ జాతరలో వైద్య సేవల కోసం ప్రత్యేకంగా మూడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య విభాగం, ప్రైవేట్ ఆసుపత్రుల సహాకారంతో మహంకాళీ పోలీసు స్టేషన్, అంజలీ థియేటర్, బాబా సంతోష్ స్వీట్ హౌజ్ వద్ద ఈ మూడు వైద్య శిబిరాలు అందుబాటులో ఉండి వైద్య సేవలను ఉచితంగా, మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు అధికారులు వివరించారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా రెండు 108 ప్రత్యేక అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వారు తెలిపారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని
మహంకాళీ జాతరలో ఆదివారం ఉదయం 4 గం.లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సాధారణ భక్తులకు దేవాలయంలో అమ్మవారిని దర్శనంకు అనుమతిస్తారని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
బోనం సమర్పించనున్న కవిత
మాజీ ఎంపి కవిత మట్టికుండతో చేసిన బోనంను తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయానికి చేరుకుని మహాంకాళీ అమ్మవారికి సమర్పిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గం.లకు ఓల్డ్ గ్యాస్‌మండి నుంచి లలిత పారాయణ సత్సంగ్ సభ్యుల ఆధ్వర్యంలో 1008 బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు.
వాహనాలకు ప్రత్యేక పార్కింగ్
బోనాల జాతరకు విచ్చేసే భక్తుల వాహనాలకు పార్కింగ్ సదుపాయాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఎస్‌డి రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, అంజలి థియేటర్ జనరల్ బజార్, రాణిగంజ్ అడవయ్య చౌరస్తా, ఓల్డ్ జైల్‌ఖానా, పార్క్‌లేన్ గాంధీ విగ్రహం వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వివరించారు.

secunderabad lashkar bonalu 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు లష్కర్ బోనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: