“ఈనామ్‌”కు.. మానుకోట మార్కెట్ “ఎగనామ్”…

  రైతు తన పంట ఉత్పత్తి ధరను తానే నిర్ణయించుకునే సౌలభ్యం కల్సిస్తోన్న ఈనామ్.. జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌లో అమలవుతున్న ఈనామ్ మానుకోటలో ఎందుకు అమలు కావట్లేదు..? మౌళిక వసతులు, యంత్రాల లేమిని సాకుగా చూపుతున్న అధికారులు.. ఖరీఫ్ పంట కాలం ముగిసేనాటికి కూడా ఈనామ్ సౌకర్యం డౌటే.. మధ్య దలారుల, అక్రమ వ్యాపారుల ఒత్తిడే కారణమా..? మహబూబాబాద్  : “ఈ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్)” రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకాల నేపథ్యంలో గత […] The post “ఈనామ్‌”కు.. మానుకోట మార్కెట్ “ఎగనామ్”… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతు తన పంట ఉత్పత్తి ధరను తానే నిర్ణయించుకునే సౌలభ్యం కల్సిస్తోన్న ఈనామ్..
జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌లో అమలవుతున్న ఈనామ్ మానుకోటలో ఎందుకు అమలు కావట్లేదు..?
మౌళిక వసతులు, యంత్రాల లేమిని సాకుగా చూపుతున్న అధికారులు..
ఖరీఫ్ పంట కాలం ముగిసేనాటికి కూడా ఈనామ్ సౌకర్యం డౌటే..
మధ్య దలారుల, అక్రమ వ్యాపారుల ఒత్తిడే కారణమా..?

మహబూబాబాద్  : “ఈ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్)” రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకాల నేపథ్యంలో గత దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా 2016 ఏప్రిల్ 14న దేశ ప్రధాని నరేంద్ర మోడీచే అధికారికంగా ప్రారంభించబడింది. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలలో, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 585కు పైగా వ్యవసాయ మార్కెట్లకు అనుసంధానం చేయబడి ఉంది. 15 రాష్ట్రాల నుండి 45 లక్షలకు పైగా రైతుల పంట ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి ధృవీకరణ పత్రాన్ని రైతులకు అందజేయడంలో వ్యవసాయ శాఖకు చెందిన అగ్మార్క్ నెట్ (అగ్రికల్చరల్ మార్కెటింగ్ నెట్వర్క్) తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందని సమాచారం. రైతు మేలును కాంక్షించి ఇంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ సౌకర్యాన్ని మానుకోట జిల్లాలోని కేసముద్రం, మానుకోట జిల్లా కేంద్రంలలో ప్రవేశపెట్టటం జరిగింది.

అయితే కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ ప్రక్రియ దిగ్విజయంగా అమలవుతూ ఈనామ్ ప్రక్రియను అమలు చేసే వ్యవసాయ మార్కెట్‌లలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇదే ప్రక్రియ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మాత్రం తూతూ మంత్రంగా అమలు చేసి చేయనట్లుగా విన్నర్ లిస్ట్ వరకే ప్రక్రియను పరిమితం చేస్తున్నారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. ఆరా తీయగా కారణాలను తడబడుతూ వివరిస్తున్నారు.. మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ ట్రయల్ రన్‌లోనే ఉందని, పూర్తి స్థాయి యంత్రాలు రాలేదని, వైఫై కనెక్షన్ లేదని, ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం లేదని, స్థలం సరిపోను లేదని, అవసరమైన సిబ్బంది కొరత ఉందని, మార్కెట్ స్థలం కేవలం 9 ఎకరాలే ఉందని తడబడుతూ ఈ నామ్ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి కుంటి సాకులు చెబుతున్నారు. మరి ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం ఈ మార్కెట్‌కు మంజూరు చేసినప్పుడు, ఈనామ్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కావాల్సిన యంత్ర సామాగ్రి, ఇతర అవసరాలను ప్రభుత్వానికి బడ్జెట్ ప్రపోజల్ పెట్టలేదా? అని ప్రశ్నిస్తే ప్రపోజల్ పంపలేదని ఒక సమాధానం..

పంపామని మరో సమాధానం తడబడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చెబుతున్నారు. ఇదే సౌకర్యాన్ని జిల్లాలోని మరో వ్యవసాయ మార్కెట్ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మధ్యదలారీ వ్యవస్థను, అక్రమ వ్యాపారులను అడ్డుకుంటూ రైతు తన పంట ఉత్పత్తిని తానే స్వేచ్చగా ఈనామ్ ద్వారా అమ్ముకునేలా రైతుకు సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఈనామ్ అమలు చేసే వ్యవసాయ మార్కెట్‌గా మన్ననలు అందుకుంటుంటే జిల్లా కేంద్రంలో ఉన్న మానుకోట వ్యవసాయ మార్కెట్ మాత్రం పథకం ప్రారంభించి దాదాపు ౩ సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ట్రయల్ రన్‌లోనే ఉందని సమాధానాలు ఇస్తూండటం, అమలు కాకపోవడానికి కుంటి సాకులు చెబుతూండటం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈనామ్ సౌకర్యాన్ని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు ఎందుకు పూర్తి స్థాయిలో నిర్వహించడంలేదని ప్రశ్నిస్తున్నవారికి సమాధానాలుగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం మధ్య దళారుల ద్వారా రైతు వద్ద అక్రమ కొనుగోళ్ళు, జీరో బిజినెస్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసే బడా వ్యాపారుల హస్తం ఉందని, వ్యవసాయ ఆధారిత గిరిజన ప్రాంతంగా మానుకోటకు ఎనలేని వ్యవసాయ పంట ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం సామర్థం ఉన్న ప్రాంతం కావడంతో ఇన్ని సంవత్సరాలు వ్యవసాయ మార్కెట్ అధికారులను నమ్ముకొని కోట్ల రూపాయలు గడించారు మధ్య దలారులు, అక్రమ జీరో బిజినెస్ వ్యాపారులు. కావున ఉన్నఫలంగా ఈనామ్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే అక్రమ కొనుగోళ్ళపై కోట్ల రూపాయలు గడించే అక్రమ వ్యాపారుల ఆధాయ మార్గానికి ఒక్క ఉదుటన కోలుకోలేని దెబ్బతినే అవకాశమున్నందున అక్రమ కొనుగోళ్ళ వ్యాపారస్తులు, మధ్య దలారీలు వ్యవసాయ మార్కెట్ అధికారులతో ఈనామ్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలుపరుచకుండా అధికారులపై సాధ్యమైనంత మేర ఒత్తిడి తెస్తున్నారనే వాదన రైతులలో వ్యక్తమవుతోంది.

మధ్య దలారీల, అక్రమ వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గే వ్యవసాయ మార్కెట్ అధికారులు ఈనామ్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బాహాటంగానే కొందరు రైతులు దృవీకరిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఈనామ్ సౌకర్యాన్ని రైతుల పంటల ఉత్పత్తుల అమ్మకంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పేరుగాంచిన జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను చూసైనా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ సౌకర్యాన్ని రైతులకు పూర్తి స్థాయిలో అందించి రైతులు ఏడాదంతా కష్టించి పండించిన పంట ఉత్పత్తులు మధ్య దలారీల, అక్రమ వ్యాపారుల బారిన పడకుండా కాపాడి అన్నదాతను రక్షించాలని అభ్యుదయ రైతులు కోరుతున్నారు.
మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ ప్రక్రియ తీరు ఇదీ..

ఈనామ్ విధానంలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే లాట్ నెంబరు కేటాయింపు జరుగుతుంది. ఆ లాట్ నెంబరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో పంట ఉత్పత్తి కొనుగోలుకు సంబందించి తమ తమ ధరలను కోట్ చేస్తే, ఏ కొనుగోలుదారు సంబందిత రైతు ఉత్పత్తికి అత్యధిక ధర కోట్ చేశారో అట్టి వివరాలను “విన్నర్ లిస్ట్‌” ద్వారా రైతులకు సమాచారం అందజేస్తారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. ఈనామ్ ప్రక్రియకు సంబంధించి మానుకోట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం విన్నర్ లిస్ట్ వరకే పరిమితమవుతోందని తదనంతర ప్రక్రియ అంతా షరామామూలుగానే జరుగుతోందని అభ్యుదయ రైతులు తెలుపుతున్నారు.

ఈనామ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఉపయోగాలు.. లాభాలేంటి?
రైతులు తమ పంట ఉత్పత్తిపై అమ్మకం కొరకు స్థానిక కొనుగోలుదారులపై మాత్రమే ఆధారపడకుండా దేశ వ్యాప్తంగా తన పంటకు ఎక్కువ ధర ఎవరు పెట్టగలరో వారికే తన పంటను అమ్ముకునే అవకాశాన్ని రైతుకు అందిస్తోంది ఈ-నామ్ వ్యవస్థ. రైతు పండించిన పంటను మార్కెట్‌కు తెచ్చాక రైతు పేరు, గ్రామం, పంట ఉత్పత్తి, కమిషన్ వ్యాపారి వివరాలను మొదట ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన రైతు పంటను అగ్మార్క్‌నెట్ పంట నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేసి రైతుకు లాట్ నెంబరును కేటాయిస్తారు. ఆ లాట్ నెంబరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో రైతు పంట ఉత్పత్తికి వారి వారి ధరల కోట్ చేస్తే, కోట్ చేసిన కొనుగోలుదారుల అందరిలోకెల్లా ఏ కొనుగోలుదారు ఆ రైతు పంటకు తగిన అత్యధిక రేటు కోట్ చేసాడో అట్టి ‘విన్నర్ లిస్’్టగా పిలిచే సమాచారాన్ని రైతు మొబైల్ కు సాధారణ టెక్స్ మెసేజ్ ద్వారా సందేశాన్ని పంపుతారు ఈనామ్ సిబ్బంది.

విన్నర్ లస్ట్ ఆధారంగా రైతు తన పంట ఉత్పత్తికి అత్యధిక ధర కోట్ చేసిన కొనుగోలుదారుకు తన పంట ఉత్పతిని అమ్ముకొనే అవకాశం ఉంది. తర్వాత డిజిటల్ కాంటాలతో అనుసంధానించి ఇంటిగ్రేటెడ్ వేయింగ్ మిషన్ ద్వారా లాట్ నెంబర్ ఆధారంగా దడువాయి కాంటాల నిర్వహణ జరిపి ఉత్పత్తి అమ్మకం చేయుట ద్వారా మార్కెట్ తూకం వేసిన ప్రతి బస్తా ఆన్‌లైన్ ద్వారా నమోదవుతుంది. తూకం వేసిన ప్రతీ ఉత్పత్తిపై ఒక శాతం వ్యవసాయ మార్కెట్ రుసుముగా వసూలు చేయబడుతుంది. ఈనామ్ ద్వారా రైతు తన ఉత్పత్తిని అమ్ముకోవడం ద్వారా మార్కెట్ తూకం వేసిన ప్రతి బస్తా ఆన్‌లైన్ ద్వారా నమోదవుతుంది, కాబట్టి అవకతవకలకు పాల్పడే అవకాశం లేదు. అంతే కాకుండా లోకల్ వ్యాపారుల మాయమాటలకు లొంగి తక్కువ దరకే తమ ఉత్పత్తులను అమ్ముకొని నష్టాల బాట పట్టాల్సిన గత్యంతరం రైతుకు ఎదురు కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు కోట్ చేసిన అత్యధిక దరకే రైతు తన సరుకును అమ్ముకునే వీలుండటం, మధ్య దలారీ వ్యవస్థ ప్రభావం రైతు పై అసలు ఉండదనే చెప్పాలి. గత దశాబ్ధాలుగా రైతు పండించిన తన పంటకు తానే ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని ఈనామ్ కల్పిస్తోంది.

మొబైల్ యాప్‌తో రైతు పంట ఉత్పత్తి అమ్మకం తన అరచేతిలోనే..!
ఈ నామ్ ద్వారా రైతులు ఆన్‌లైన్‌లో దేశ వ్యాప్తంగా తమ పంట ఉత్పత్తిని తామే నేరుగా అమ్ముకునేందుకు అత్యంత సౌకర్యవంతంగా మొబైల్ యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సాధారణ గూగుల్ ప్లే నుండి దిగుమతి చేసుకునే ఈ మొబైల్ యాప్‌లో మొదటగా రైతు వివరాలు ఏజెంట్ సహాయంతో నమోదు చేసుకొని, రైతు పంట వివరాలు తన ఖాతాలో పొందుపరచినట్లైతే దేశ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు వారి వారి ధరలను రైతు ఉత్పత్తికి కోటు చేస్థారు, రైతు తన పంట ఉత్పత్తికి అత్యధికంగా ఎవరైతే కోట్ చేస్తారో వారికే తన పంట ఉత్పిత్తిని అమ్ముకునేలా అన్ని ఆప్షన్స్ ఈ యాప్‌లో పొందుపరచడం జరిగింది. కొనుగోలు తతంగంలో కొనుగోలుదారు రైతుకు కొనుగోలుకు సంబందించి చెల్లించాల్సిన మొత్తాన్ని రైతు బ్యాంక్ ఖాతా అనుసందానించిన మనీ ట్రాన్స్‌ఫర్ భీమ్ లాంటి యాప్‌లు, క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రైతుకు కొనుగోలుదారు చెల్లించే విధంగా ఈనామ్ యాప్‌లో పొందుపరచడం జరిగింది. రైతు అరచేతిలోనే తన పంట ఉత్పత్తి అమ్మకం జరిపేలా అన్ని ఆప్షన్స్ పొందుపరచబడి ఉంది ఈనామ్ మొబైల్ యాప్.

ఈనామ్ పట్ల రైతులకు అవగాహన కల్పించాలి..
ఈనామ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాదాపు ౩ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కేసముద్రం, ఖమ్మం మార్కెట్లు మినహా ఈ సౌకర్యాన్ని రాష్ట్ర రైతాంగం చెప్పుకోదగిన రీతిలో ఉపయోగించుకున్నట్లుగా లేదనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం మెజారిటీ రైతులకు ఈ సౌకర్యం పట్ల కనీస అవగాహన లేకపోవడమేనని తెలుస్తోంది. ఈనామ్ సౌకర్యం పట్ల రైతులకు తగు అవగాహన, కంప్యూటర్ శిక్షణ, మొబైల్ యాప్ ఉపయోగించే విధానం, ఈనామ్ పోర్టల్ ఉపయోగించే విధానం, తదితర సంబంధిత అంశాలపై రైతులకు శిక్షణ అందించాల్సిన బాధ్యత సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులదే.

ఈనామ్ సౌకర్యంతో రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేలా ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలను వ్యవసాయ అధికారులు చేపట్టాలి. ఈనామ్ సౌకర్యాన్ని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో అమలు చేయనంత వరకు రైతుల పంట ఉత్పత్తులపై అటు రైతుకూ, ఇటు వినియోగదారుడైన ప్రజలకు లాభం జరగకపోగా మధ్య దలారీలు మాత్రమే బాగుపడుతుందనేది కాదనలేని సత్యం. మహబూబాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపి అమలు పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే కాలం నాటికైనా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ సౌకర్యం అందుబాటులోకి రావాలని కాంక్షిస్తున్నారు జిల్లా రైతాంగం.

Farmer decide Price of his Crop by e Nam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post “ఈనామ్‌”కు.. మానుకోట మార్కెట్ “ఎగనామ్”… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: