నీటి సమస్యకు జలశక్తి అభియాన్

చెన్నై నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. బావులన్నీ ఎండిపోయాయి. కనీస అవసరాలకు పక్కనపెడితే తాగేందుకు కూడా కొందరికి నీరు దొరకడం లేదు. దీంతో స్కూళ్లు, ప్రముఖ హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. అలాగే ఐటి కార్యాలయాలు సైతం తమ సంస్థలలో క్యాంటీన్లను రద్దు చేశాయి. కొందరైతే ఎంప్లాయిస్‌కు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫ్షన్‌ను ఇచ్చారు. బెంగళూరు నగరం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తరహాలో నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని ఇటీవల ఒక […] The post నీటి సమస్యకు జలశక్తి అభియాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. బావులన్నీ ఎండిపోయాయి. కనీస అవసరాలకు పక్కనపెడితే తాగేందుకు కూడా కొందరికి నీరు దొరకడం లేదు. దీంతో స్కూళ్లు, ప్రముఖ హోటళ్లు కొన్ని మూతపడ్డాయి. అలాగే ఐటి కార్యాలయాలు సైతం తమ సంస్థలలో క్యాంటీన్లను రద్దు చేశాయి. కొందరైతే ఎంప్లాయిస్‌కు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫ్షన్‌ను ఇచ్చారు. బెంగళూరు నగరం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తరహాలో నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని ఇటీవల ఒక నివేదిక పేర్కొంది.
భారతీయ సిలికాన్ వ్యాలీ అని పిలిచే బెంగళూరు నగరం ఇప్పటికే చుట్టు పక్కల ఉన్న 100కు పైగా గ్రామాలను విలీనం చేసుకుని విస్తరించింది. అందువల్ల నగరంలోని నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు 2014లో విడుదల చేసిన ఒక నివేదికలోనే – జల హెచ్చరిక చేసింది. బెంగళూరులో సగటున ప్రతి వ్యక్తికీ 100 లీటర్ల నీరు అందుతోందని భవిష్యత్ అవసరాల కోసం నగరంలో 50 కన్నా ఎక్కువ అపార్ట్‌మెంట్ల ప్రజలు కలిసి చిన్నచిన్న నీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. రోజూ ప్రతి నగరవాసి ఉపయోగించే 100 లీటర్ల నీటిలో 20 లీటర్లు తాగడానికి, వంటకు, స్నానానికి ఖర్చవుతాయి. మిగిలిన 80 లీటర్లు టాయిలెట్ ఫ్లషింగ్, ఇళ్లు కడగడం, కార్లు తుడవడం, బట్టలు ఉతకడం లాంటి వాటికి ఖర్చవుతోంది. ఈ పరిస్థితులలో వచ్చే ఐదు ఏళ్ళలో కొత్తగా కట్టే అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇవ్వబోవడం లేదని, ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలని బెంగళూరు నగరాధికార్లు పేర్కొనడం గమనార్హం. చెన్నై నగరానికి మంచి నీటిని సరఫరా చేసే నాలుగు ప్రధాన రిజర్వాయర్లతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై పలు డాక్యుమెంటరీలలో సైతం నటించిన టైటానిక్ సినిమా హీరో లియోనార్డో ఐక్యరాజ్య సమితిలోనూ చెన్నై నగరం నీటి ఎద్దడి గురించి ప్రస్తావించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ పరిస్థితులలో దేశంలో నీటి సమస్యను గురించి ప్రధాని నోరు విప్పారు. జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజలంతా వర్షపు నీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా 1 నుంచి జల్‌శక్తి అభియాన్ పేరిట చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.

కేవలం 8 శాతం వర్షపు నీరు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేసారు.దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమించింది. అదనపు, సంయుక్త కార్యదర్శులు సహా పలువురు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న జల్‌శక్తి అభియాన్ (జెఎస్‌ఎ)లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటి పారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. మొత్తం 255 మంది ఉన్నతాధికారులు డైరెక్టర్ లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ స్థాయిల రాష్ట్ర, స్థానిక అధికారులు, భూగర్భ జల నిపుణులు, ఇంజినీర్లతో కూడిన బృందాలతో సమన్వయంగా పని చేస్తారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. గుర్తించిన బ్లాక్‌లు, జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి జల సంరక్షణ తదితర కార్యక్రమాలు సమర్ధంగా అమలయ్యేలా చర్యలు చేపడతాయి.
జల సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శ్రద్ధ కనబరుస్తున్న ఈ సందర్భంలో దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు జల్‌శక్తి అభియాన్‌ను అమలు చేయనున్నారు. జల సంపద సృష్టి, వివిధ రకాల చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజా ఉద్యమంగా దీన్ని చేపట్టనున్నారు. గ్రామీణ భారతంలో జల సంరక్షణ, సమర్ధ నీటి పారుదల కార్యక్రమాలు చేపడతారు. నిర్ణయించిన రోజుల్లో సంబంధిత అధికారులు, భూగర్భ జల నిపుణులు, ఇంజినీర్లు తదితరులంతా జల సంరక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. నిర్దేశిత ప్రాంతా ల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేస్తారు. ఇందుకు గాను 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆయా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్న313 ప్రాంతాలు సహా 1,593 నీటి ఎద్దడి బ్లాక్‌లను గుర్తించారు. ప్రత్యేకించి వేసవిలోను, వర్షాభావంతోను ఎండిపోయిన వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే నీటి పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోడీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతి నీటి చుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. అయితే జల సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడానికి అవకాశాలు లేకపోలేదు. ఇందుకు నీరు- మీరు, జల సంరక్షణ పథకాలు ఉపకరిస్తాయి. కావాల్సిందల్లా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి మాత్రమే.
2000లో ప్రపంచ జనాభా 6.2 బిలియన్లు. 2018 కి వచ్చే సరికి దాదాపు 7.5 బిలియన్లు. ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో విపరీతమైన పెరుగుదల కారణంగా 2050 కల్లా అదనంగా మరో 3.5 బిలియన్ జనాభా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అందువల్ల ప్రాణాధారమైన జల వనరులను జల సంరక్షణ, పునరావర్తనం ద్వారా పెంచకపోతే నీటి ఆవశ్యకత మరింత పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా కారణంగా నీటికి పోటీ పెరిగి ప్రపంచంలోని అతిపెద్ద జలశయాలు క్షీణిస్తున్నాయి. అంటే మానవ అవసరాలకు, వ్యవసాయ సేద్యానికి రెండింటికీ భూగర్భ జలాలనే ఉపయోగించడాన్ని కారణంగా చెప్పవచ్చు. బోరుబావుల ద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భూగర్భ జలాన్ని తోడేస్తున్నాం.
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నీటి కాలుష్యం ఒకటి. ఈ సమస్యను నియంత్రించడం కోసం పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పలు వ్యర్ధాలు నీటి సరఫరాకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన దేశాల్లో ముడి వ్యర్ధ పదార్ధాలు సాధారణ నీటిలోకి విడుదలవుతున్నాయి. ఇలాంటివి అక్కడ సర్వ సాధారణం. దానికి తోడూ విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల నీటి కాలుష్యం దానితో పాటు నీటి వనరుల నిర్లక్షానికి గురవుతున్నాము. మురికి నీరు, బురద, చెత్తాచెదారం, విషపూరితమైన వ్యర్ధాలను కూడా నీటిలోకి విడుదల చేస్తున్నాము. మురికి నీటిని శుద్ధిచేసినప్పటికీ, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మురికి నీటికి అదనంగా పట్టణ ప్రాంత వరద నీటి ప్రవాహం, పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయన వ్యర్ధాలతో పాటు వ్యవసాయ సంబంధిత వరద నీరు వంటి కలుషిత ప్రవాహం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్యానికి ప్రధాన కారకమవుతోంది.
పట్టణీకరణ ఒరవడి శరవేగమవుతోంది. అభివృద్ధి పేరిట జలాశయాలను ఆక్రమించుకుంటూ కాంక్రీటు నగరాలుగా మార్చి నీటిని నిలువ చేసే సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తున్నాము. పెద్ద వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు మునిగి ఇబ్బందులు పడుతూ, వర్షం పడకపోతే తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. చెన్నై కానీ బెంగుళూరు కానీ మరేదైనా కానీ ఇదే పరిస్థితి. ఇలాంటి ఎన్నో కారణాలతో మనం తీవ్ర నీటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము. కనీసం ఇప్పటికైనా ముందు జాగ్రత్త పడక పోతే ఈ రోజు చెన్నై అయినది రేపు హైదరాబాద్ కావచ్చు లేకపోతే విజయవాడ కావచ్చు. ఇది కేవలం ప్రభుత్వ సమస్య కాదు, ప్రతి వ్యక్తి సమస్య. కావున సమస్య మూలాలను గుర్తించి రేపటి గురించి ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భావి తరాల గురించి ఆలోచించక పోతే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది.

Chennai Facing Water Crisis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నీటి సమస్యకు జలశక్తి అభియాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.