ఎండమావిగా మంజీరా…

  వాటర్ బోర్డుకు రూ.5 కోట్ల బకాయిలు చేతులెత్తేసిన మున్సిపాలిటీ యేడాది నుంచి నీటి సరఫరా బంద్ మిషన్ భగీరథ, కాసాని ట్యాంకర్లే దిక్కు రూ.100 కోట్ల పథకాలు నిరుపయోగం వికారాబాద్‌లో తప్పని పానీపట్టు యుద్ధాలు వికారాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరానికి కేవలం 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీలో మంచినీటి ఘోష నెలకొన్నది. యేడాది కాలంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలవనరులు అడుగంటాయి. ఫలితంగా మిషన్ భగీరథ మంచినీరు, కాసాని జ్ఞానేశ్వర్ ట్యాంకర్లే […] The post ఎండమావిగా మంజీరా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాటర్ బోర్డుకు రూ.5 కోట్ల బకాయిలు
చేతులెత్తేసిన మున్సిపాలిటీ
యేడాది నుంచి నీటి సరఫరా బంద్
మిషన్ భగీరథ, కాసాని ట్యాంకర్లే దిక్కు
రూ.100 కోట్ల పథకాలు నిరుపయోగం
వికారాబాద్‌లో తప్పని పానీపట్టు యుద్ధాలు

వికారాబాద్ : రాజధాని హైదరాబాద్ నగరానికి కేవలం 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీలో మంచినీటి ఘోష నెలకొన్నది. యేడాది కాలంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలవనరులు అడుగంటాయి. ఫలితంగా మిషన్ భగీరథ మంచినీరు, కాసాని జ్ఞానేశ్వర్ ట్యాంకర్లే దిక్కుగా మారాయి. రూ.100 కోట్ల వ్యయంతో మంజీరా పథకాలు ఏర్పాటు చేసినా అవి ఎండమావిగా మారాయి. యేడాదిన్నర నుంచి మంజీరా జలాలను వికారాబాద్ పట్టణానికి సరఫరా నిలిపివేశారు. కేవలం హైదరాబాద్ నగరానికే మంజీరా నీటిని పరిమితం చేశారు. వాటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు నీటి ఎద్దడి తప్పడం లేదు.

60 వేల జనాభా నివసిస్తున్న వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తున్నాయి. ఐదు దశాబ్ధాల క్రితం నిర్మించిన శివసాగర్ జలాశయం ద్వారా పట్టణానికి మంచినీటి సరఫరా చేస్తున్నారు. గతేడాది వర్షాలు సరిగ్గా కురియనందున జలాశయం ఎండిపోయింది. శివసాగర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడుసార్లు మాత్రమే జలాలు అడుగంటడం విశేషం. ప్రత్యామ్నాయంగా మిషన్‌భగీరథ ఊరటనిస్తోంది. అయినా ఇప్పటికీ చాలా కాలనీలకు నీరు సరిగ్గా అందడం లేదు. 2005 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్‌కు మంజీరా జలాలు ఇస్తామని అప్పటి మంత్రి సబితారెడ్డి హామీ ఇచ్చారు.

రూ.32.50 కోట్ల వ్యయంతో మెదక్, రంగారెడ్డి జిల్లా సరిహద్దున గల సింగాపురం నుంచి మంజీరా జలాలను వికారాబాద్‌కు సరఫరా చేశారు. సుమారు 33 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు, ఆలంపల్లి.. మాదిరెడ్డిపల్లి ప్రాంతాలలో రిజర్వాయర్లను నిర్మించారు. 2012 నుంచి మంజీరా నీటి సరఫరా ప్రారంభించారు. అయితే, కొన్ని నెలల సక్రమంగా నీటి సరఫరా చేశారు. వాటర్‌బోర్డుకు బకాయిలు పెరిగిపోవడంతో నీటి సరఫరా నిలిపివేశారు. కొంత బకాయిలను చెల్లించడంతో మళ్లీ సరఫరా పునరుద్ధరించినా మూన్నాళ్ల ముచ్చటగా నిలిచిపోయింది. ప్రస్తుతం వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి రూ.4.50 కోట్ల బకాయిలు వాటర్‌బోర్డుకు చెల్లించాల్సి ఉంది.

ఈ పన్ను చెల్లించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మారినా, మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు మారినా బకాయిలు మాత్రం అలాగే ఉన్నాయి. దాంతో యేడాదిన్నర నుంచి మంజీరా నీటి సరఫరా నిలిపివేశారు. ఇలా ఉండగా రూ.200 కోట్లతో వికారాబాద్ పట్టణంలో శాటిలైట్ పనులు ప్రారంభించడంతో అదనంగా మరో మంజీరా పథకాన్ని అమలు చేశారు. శంకర్‌పల్లి పరిసరాల నుంచే మరో పైపులైన్ ద్వారా వికారాబాద్‌కు మంజీరా పథకం రూపొందించినా అలంకారప్రాయంగా మారింది. ఈ రెండు పథకాలు కలిపి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలో ప్రస్తుతం 5 వేల వరకు నల్లాలు ఉన్నాయి. వాటిలో సగానికి సగం పనిచేయడం లేదని సమాచారం.

ఫలితంగా నల్లా బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు వెనకంజ వేస్తున్నారు. నల్లా వినియోగదారుల నుంచి రూ.2 కోట్ల వరకు రావాల్సి ఉందని తెలిసింది. వాటిని వసూలు చేయలేక మున్సిపల్ సిబ్బంది డీలా పడిపోయారు. జిల్లాలో ఏ మున్సిపాలిటీకి లేనంతగా వికారాబాద్‌కు ఐదేళ్లలో ఏడుగురు కమిషనర్లు మారారు. ఒక్కరు కూడా ఏడాది పాటు పనిచేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులను రోడ్లు భవనాల శాఖకు మళ్లించడంతో అనేక విమర్శలు వచ్చాయి.

స్థానిక సంస్థల అధికారాలను హరించడం హేయనీయమైన చర్య అంటూ తాజా మాజీ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నేనావత్ కిషన్‌నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకించి మంచినీటి కోసం ఏర్పాటు చేసిన మంజీరా పథకాలను పునరుద్ధరించి ప్రజల దాహార్తి తీర్చాలని అంటున్నారు.

Supply of Manjeera water to Vikarabad has been stopped

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎండమావిగా మంజీరా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.