సాగు చతికిల!

దాదాపు ప్రతి ఏటా ఎదురవుతున్న కష్ట కాలమే ఇది. వరుస కరవుల విషాద అధ్యాయానికి కొనసాగింపే. తొలకరి, రెండు చిలకరింపులతో ఆగిపోయి రెండో వేసవి వంటి దుస్థితి దాపురించింది. రుతు పవనాలు వచ్చినట్టే అనిపించి కనుమరుగయ్యాయి. జూన్ మొదటి వారంలోనే తాకుతాయనుకున్న పవనాలు ఆ మాసాంతానికి గాని దయచేయలేదు. తీరా వచ్చాయనిపించిన తర్వాత నిండా నేల తడిసి మురిసే స్థాయి వానలు కురియలేదు. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లలేదు. తొలి చినుకులకు పొలాలు దున్ని విత్తనాలు […] The post సాగు చతికిల! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దాదాపు ప్రతి ఏటా ఎదురవుతున్న కష్ట కాలమే ఇది. వరుస కరవుల విషాద అధ్యాయానికి కొనసాగింపే. తొలకరి, రెండు చిలకరింపులతో ఆగిపోయి రెండో వేసవి వంటి దుస్థితి దాపురించింది. రుతు పవనాలు వచ్చినట్టే అనిపించి కనుమరుగయ్యాయి. జూన్ మొదటి వారంలోనే తాకుతాయనుకున్న పవనాలు ఆ మాసాంతానికి గాని దయచేయలేదు. తీరా వచ్చాయనిపించిన తర్వాత నిండా నేల తడిసి మురిసే స్థాయి వానలు కురియలేదు. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లలేదు. తొలి చినుకులకు పొలాలు దున్ని విత్తనాలు చల్లుకున్న రైతులు మొలకలు మొలవక, మొలిచినా నిలవక శ్రమ, ధనం వృథా అయిపోయే దారుణావస్థ తలెత్తడంతో లబోదిబోమంటున్నారు.

తెలంగాణ రాష్ట్రమంతటా 33 శాతం లోటు వర్షపాతం నమోదయింది. ఈ సరికి నిరభ్యంతరంగా సాగి ఉండవలసిన ఖరీఫ్ ప్రమాదంలో పడింది. ఖరీఫ్‌లో సాధారణంగా కోటి ఎనిమిది లక్షల ఎకరాల్లో పంటలు వేయవలసి ఉండగా ఈ ఏడాది ఇంత వరకు 43 లక్షల 25 వేల ఎకరాల్లోనే వేశారని, పరిస్థితి సాగుకు బొత్తిగా అనుకూలంగా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖే ప్రభుత్వానికి నివేదించడం గమనించవ లసిన విషయం. కొమురం భీం, సిద్దిపేట, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయిందంటున్నారు. ఖమ్మం జిల్లాలో 65 శాతం, సూర్యాపేటలో 67 శాతం, నల్లగొండలో 66 శాతం, మహబూబ్‌నగర్ 56 శాతం, యాదాద్రి భువనగిరిలో 55 శాతం, జోగులాంబ గద్వాల్‌లో 49 శాతం, నిర్మల్‌లో 48 శాతం లోటు వర్షపాతం రికార్డయింది.

ఆ జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర లేదు. వరి సాగు దాదాపు పూర్తిగా దెబ్బ తిన్నది. మొక్క జొన్న కూడా పూర్తి స్థాయిలో సాగుకు నోచుకోలేదు. ఒక సమాచారం ప్రకారం 24 లక్షల ఎకరాల్లో వరి సాగు కావలసి ఉండగా, 1.46 లక్షల ఎకరాల్లోనే అయింది. వర్షాధార పంట అయిన మొక్కజొన్న 12.52 లక్షల ఎకరాల్లో వేయవలసి ఉండగా ఇప్పటి వరకు 33 శాతం విస్తీర్ణంలో అంటే 4.15 లక్షల ఎకరాల్లోనే సాగయింది. చినుకు పడిందనే సంతోషంతో దున్ని విత్తనాలు నాటితే ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేసి మొత్తం పంట ఎండిపోయే దుస్థితి తలెత్తవచ్చునని రైతులు ఆచితూచి అడుగేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో అధికంగా పండించే పత్తి పంట విస్తీర్ణం కూడా ఈసారి కుదించుకుపోయింది. ఈ వర్షాభావ పరిస్థితులు మరి వారం రోజులు కొనసాగు వచ్చునని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మన వాతావరణ జోస్యాలు, ముఖ్యంగా తొలకరి వానల విషయంలో తరచూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మారుమూల ప్రాంతాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సమీప భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని మరో జోస్యం చెబుతున్నది. అల్ప పీడనం, వాయు గుండాలేర్పడే పరిస్థితి ఇప్పట్లో లేదని అవి హిమాలయాల వైపు తరలిపోయాయని ఈ నెల 15వ తేదీ తర్వాతనే ఈ ప్రాంతంలో అటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నదంటున్నారు. ఈ అన్ని సూచనలను బట్టి కొద్ది రోజుల్లో బాగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం మొత్తంగా వృథా కాగలదని బోధపడుతున్నది. ఈ నేపథ్యంలో కరువు కమ్ముకోడం ఖాయం. రైతులు, రైతు కూలీలు పొట్ట చేతపట్టుకొని వలసలు బయల్దేరడం సహజం.

గత కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించు ఇదే పరిస్థితి ఏర్పడుతున్నది. వరుస కరువుల వల్ల భూగర్భ జల మట్టాలూ అడుగంటుతున్నాయి. కాళేశ్వరం వంటి నిత్య జల ప్రదాయినులు రాష్ట్రంలోని ప్రతి అంగుళానికి పుష్కలంగా నీరందించడం ప్రారంభమైతే తప్ప ఈ దురవస్థ అంతం కాదు. గోదావరిలోనూ ఈసారి ఇంత వరకు చెప్పుకోదగిన ప్రవాహం లేకపోడం ఆందోళనకరమైన పరిణామం. నదులు ఒడ్డు లొరుసుకొని ప్రవహించినప్పుడే ప్రాజెక్టులు కళకళలాడుతాయి. జలాశయాలు నిండుతాయి. రాష్ట్రంలో దాదాపు 400 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం.

వందకు పైగా మండలాల్లో కరువు ఆవహించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తొలకరి పంటల సాగు సమయం, విధానం రెండింటిలోనూ మార్పులు తీసుకు వచ్చి రైతులు అందుకు అలవాటయ్యేలా చేయవలసి ఉంది. జూన్‌లో బదులు జులై ఆగస్టు మాసాలలో ఖరీఫ్ సాగు మొదలు పెట్టుకుంటేగాని రైతు కష్టాలు కొంత వరకైనా తగ్గవనిపిస్తున్నది. ఈ విషయంలో వ్యవసాయ శాస్త్రజ్ఞులు తలలు ఒక్క చోట చేర్చి సమాలోచనలు సాగించవలసి ఉంది. ప్రకృతికి అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవలసి ఉంది.

Groundwater levels are threatened by a series of droughts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సాగు చతికిల! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: