తొలి పండుగ ఏకాదశి

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాదశిగా” గా పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని,హరి వాసరమని , పేలాల పండుగ అని పిలుచుకుంటారు.పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా నాలుగు నెలల పాటు ఆయన శయనించి, అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు […] The post తొలి పండుగ ఏకాదశి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాదశిగా” గా పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని,హరి వాసరమని , పేలాల పండుగ అని పిలుచుకుంటారు.పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా నాలుగు నెలల పాటు ఆయన శయనించి, అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి, కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి, ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు.

ఏకాదశి తిథి కథ: కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్ర హ్మవరంతో దేవతలను, రుషులను హింసించేవాడు. శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండ గా, శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట. అ ప్పటి నుంచి ఆమె ’ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి, విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదిత ర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఏకాదశి నాడు ఏం చేయాలంటే: నాడు ఉపవాసం ఉం డి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మ ర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.

పేలాల పిండి : తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మ నకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ, ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

తొలిఏకాదశి : ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

పురాణ నేపథ్యం: ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.

ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రా త్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధ ర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వి వరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కా లాన్నీ పవిత్రంగా పరిగణించి అంద రూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే ‘ఏకాదశి‘ అంటారు.

ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

చైతన్యానికి ప్రతీక: ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.

సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువల్ల కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలోను పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు ప్రారంభమయ్యే సమయం. అందువల్ల శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు.

రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.

పేలాల ప్రసాదం

కావాల్సిన పదార్థాలు: జొన్నలు : 150గ్రా॥, బెల్లం : 125 నుంచి 150గ్రా॥, వేయించిన పల్లీలు : 1/4 కప్పు
పలుకులు : 1/4 కప్పు, ఏలకులు పొడి : 2 టీస్పూన్లు
తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి జొన్నలు వేసి మంట పెద్దగా పెట్టుకోవాలి. ప్యాన్ మీద మూత పెట్టాలి. అవి చల్లారబెట్టాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తరాత బెల్లం కూడా మిక్సీకి వేసి మెత్తగా పట్టాలి. ఆ బెల్లం, నట్స్, పొడిలో, ఏలకుల పొడి కలుపుకోని పెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్‌లో రెండు చిన్న కప్పుల నెయ్యి వేసుకుని, పలుకులను వేసి వేయించుకోవాలి. ఆ వేయించిన పలుకులలో ముందుగా కలుపుకున్న పౌడర్‌ను వేసి కలిపి కాసేపు ఉంచి దించేయాలి.

Tholi Ekadashi 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తొలి పండుగ ఏకాదశి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: