పెరిగే జనాభా…తరిగే వనరులు

  పెరిగిపోతున్న జనాభా ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోంది. ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్న జనాభాకు చోటు కల్పించాలంటే మున్ముందు మరో భూ గ్రహాన్ని వెదుక్కోక తప్పదని ఇటీవల సర్వేలు హెచ్చరిస్తున్నాయి. మరో 50 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న జనాభాకు మరి 300 కోట్ల మంది జత పడతారన్నది తాజా అంచనా. ఇప్పటికే భూమ్మీదున్న 705 కోట్ల మందిలో అత్యధికులు అతి కొద్ది సౌకర్యాలతోనే బతుకులు నెట్టుకొస్తున్నారు. నివాస స్థలాల కొరతతో పాటు అతి ముఖ్య అవసరాలైన ఇల్లు, ఆహారం, బట్టలు […] The post పెరిగే జనాభా… తరిగే వనరులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెరిగిపోతున్న జనాభా ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోంది. ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్న జనాభాకు చోటు కల్పించాలంటే మున్ముందు మరో భూ గ్రహాన్ని వెదుక్కోక తప్పదని ఇటీవల సర్వేలు హెచ్చరిస్తున్నాయి. మరో 50 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న జనాభాకు మరి 300 కోట్ల మంది జత పడతారన్నది తాజా అంచనా. ఇప్పటికే భూమ్మీదున్న 705 కోట్ల మందిలో అత్యధికులు అతి కొద్ది సౌకర్యాలతోనే బతుకులు నెట్టుకొస్తున్నారు. నివాస స్థలాల కొరతతో పాటు అతి ముఖ్య అవసరాలైన ఇల్లు, ఆహారం, బట్టలు తదితర మౌలిక సదుపాయాల కల్పన చాలా దేశాలకు ఇప్పటికే తలకు మించిన భారమవుతోంది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కోట్ల సంఖ్యలో జనం ఆకలి బాధతో అలమటిస్తున్నారు. సహజ వనరులు కరిగిపోతున్నాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఆర్థిక మాంద్యం బూచి భయపెడుతోంది. భారత్‌లో జనాభా వృద్ధి రేటుకు మౌలిక సౌకర్యాల అభివృద్ధికి అసలు పొంతనే ఉండటం లేదు. మన రాష్ట్రంలోనూ సగానికి పైగా జనాభాకు కనీస సదుపాయాలు లేవు. కొత్త జనాభా లెక్కలు ఈ కఠోర సత్యాన్నే వెల్లడిస్తున్నాయి.

రోజు రోజుకీ చీమల పుట్టలా పెరుగుతున్న జనాభా.. అందువల్ల తలెత్తే విపరీత పరిణామాలను జనాలకు తెలియజేసేందుకు వారికి ఆయా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది. 1987 జులై 11 న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన నాటి నుండి జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశాలైన ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ రోజు ప్రపంచ జనాభా 771 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా సమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర తొమ్మిది దేశాలు వచ్చే 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని సమితి తెలిపింది.

ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు, సామాజిక పథకాలు, బడ్జెట్ రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరం. అటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ పథకాల రూపకల్పన, వెనకబడిన ప్రాంతాలు, వర్గాలు గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్ల జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. మనకు తెలుసు చైనా 133 కోట్లతో అత్యధిక జనాభా గల దేశంగా రికార్డుల కెక్కితే , భారతదేశం 122 కోట్లతో రెండో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా ఘనత కెక్కింది. అలాగే అతి తక్కువ జనాభా గల దేశాలు పిటికైర్న్ ద్వీపము. కేవలం 50 మంది, వాటికన్ నగరం కేవలం 500 మందితో ఘనత కెక్కాయి.

జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బందులే ఎక్కువ. అలాగే… జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి, వాళ్లే స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికి వారు జనాభా నియంత్రణకు పూనుకున్నట్లయితే భూమాత భారాన్ని కాస్తయినా తగ్గించిన వారవుతాము.

ఈ భూమ్మీద… నూట యాభై కోట్ల మందికి… సరైన ఆహారం దొరకడం లేదు… 50 కోట్ల మందికి… పౌష్టికాహారం లేదు… ఏటా కోటి మందికి పైగా పిల్లలు… ఆకలితో చనిపోతున్నారు… దీనంతటికీ కారణం జనాభా విపరీతంగా పెరగడం. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమైపోతోంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. పెరిగిన శాస్త్ర సాంకేతికాల వల్ల, వైద్య రంగంలో వచ్చిన వినూత్న మార్పుల వల్ల ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోందన్న మాట.

ప్రతి 40 ఏళ్లకీ జనాభా రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందిప్పుడు. క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే. 1850లలో మొదటిసారి జనాభా వంద కోట్లను దాటింది. అక్కణ్నించి కేవలం 150 ఏళ్ల కాలంలోనే 650 కోట్లను దాటేసింది. వచ్చే యాభై ఏళ్లలో 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజు 4,00,000 మంది పుడుతుంటే, 1,40,000 మంది చనిపోతున్నారు. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం అంటే మూడు వందల కోట్ల ఎనభై లక్షల మంది నివసిస్తున్నారు. మన దేశం విషయానికి వస్తే 1750లో జనాభా పన్నెండున్నర కోట్లు మాత్రమే ఉండేది. 1941 కల్లా 38.9 కోట్లు అయ్యింది. అదే ఇప్పుడు 112 కోట్లు అయ్యింది. ప్రపంచంలో తొలుత జనాభా సంఖ్య వంద కోట్లు దాటేందుకు సుమారు 20 లక్షల సంవత్సరాలు పట్టిందని అంచనా. ఇప్పుడు అంతమేర జనాభా పదేళ్ల కాలంలోనే పెరుగుతున్న పరిస్థితి మన ముందుంది.

జీవన ప్రమాణాలు అంతకంతకూ పెరుగుతుండటమే ఇందుకు ముఖ్యకారణం. భారత్‌లో 1976 లో ‘జనాభా నియంత్రణ విధానం’ అమల్లోకి తీసుకువచ్చారు. కానీ ఈ విధానాల అమల్లో అక్రమాలు, నిర్లక్ష్యం, అవిద్య, మూఢనమ్మకాలు వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడలేదు. అడ్డూఆపూ లేకుండా పెరుగుతున్న జనాభాతో దేశం నెత్తిన సమస్యల బరువు అధికమవుతోంది. 2010- 11 లో జనాభా గణాంకాలు ప్రజానీకం కడగండ్లనే వెలుగులోకి తీసుకువచ్చాయి. సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొత్తిగా చేతులు ముడుచుకు కూర్చున్నాయన్న విషయాన్నీ ఈ గణాంకాలు వెల్లడించాయి. నిలువ నీడలేని స్థితిలో, తాగేందుకు కనీసం రక్షిత మంచి నీరు లభించని దురవస్థలో గ్రామాల నుంచి ఎంతో మంది పట్టణాలకు వలసపోతున్నారు. భారత్‌లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, కార్యాచరణ ప్రణాళికల లేమి, అవినీతి పురోభివృద్ధికి పెను అవరోధంగా మారాయి.

పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చాలంటే ఉత్పాదకతపై దృష్టిపెట్టి- ప్రణాళికలు, పారదర్శక పథకాలను రూపొందించాలి. ఓటు రాజకీయాల చట్రంలో వండి వారుస్తున్న ప్రజాకర్షక పథకాల వల్ల వనరులు ఆవిరవుతున్నాయి. పోటీలు పడి మరీ ఓట్ల కొరకు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికి వేల కోట్లు కేటాయించడం వల్ల ప్రజల్లో సోమరితనాన్ని పెంచి పోషిస్తున్నారు పాలకులు. దీనివలన దేశప్రజల ఆహార, ఆర్థిక భద్రతకు దీర్ఘకాలంలో ముప్పుతెచ్చే ప్రమాదముంది. ఆహార ధాన్యాల ఉత్పాదకతను పెంచడంలోగానీ, శాశ్వత ఆదాయ వనరులను ప్రజలకు చూపడంలో పాలకులు తరచూ విఫలమవుతున్నారు. స్వయం ఉపాధి పథకాలు విఫలమవుతుండటం వల్ల పేదల జీవన ప్రమాణాలు పెరగడం లేదు.

జనాభా నియంత్రణ పథకాలు సైతం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల్లోనే సక్రమంగా అమలవుతున్నాయి. ఈ విషయంపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. కుటుంబ నియంత్రణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన తరుణమిది. చైనాతో పోలిస్తే భారత జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువ. 2030 నాటికి జనాభాకు సంబంధించి చైనాను మనదేశం దాటేయనుందని అంచనా. ఈ నేపథ్యంలో- పకడ్బందీ కుటుంబ నియంత్రణ పథకాలతోపాటు, జీవన ప్రమాణాలు పెంచే రీతిలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా పంపిణీ చేయగల విధానాలపైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒకవైపు అతి తక్కువ మంది చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతుంటే మరోవైపు అత్యధిక శాతం జనాభా ఉపాధిలేమి, ఆకలితో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సత్వరం కృషి చేయకపోతే- మున్ముందు జనాభా పెరుగుదల సమస్యలు పాలకులకు తలకు మించిన భారం కావడం ఖాయం.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెరిగే జనాభా… తరిగే వనరులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: