పనివాడి ఎంపిక

  హేలాపురిలోని తన ఇంటిలో ఎంతో కాలం నమ్మకంగా పని చేసిన దుర్గయ్య ముసలితనం కారణంగా పనిమానుకోవడంతో బంగారయ్యకు మరో పనివాడిని చూసుకోవలసిన అవసరం కలిగింది.! ఈ విషయం తెలిసిన సీతయ్య, రంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు బంగారయ్య దగ్గరకు పనికోసం వచ్చారు. “మీ ఇద్దరికీ నా దగ్గర ఓ పది రోజులు పని చేసే అవకాశం ఇస్తున్నాను. రోజుకు మూడు రాగి మాడలు కూలీగా ఇస్తాను. మీ పనితనాన్ని బట్టి పదకొండో రోజున మీ ఇద్దరిలో […] The post పనివాడి ఎంపిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హేలాపురిలోని తన ఇంటిలో ఎంతో కాలం నమ్మకంగా పని చేసిన దుర్గయ్య ముసలితనం కారణంగా పనిమానుకోవడంతో బంగారయ్యకు మరో పనివాడిని చూసుకోవలసిన అవసరం కలిగింది.!
ఈ విషయం తెలిసిన సీతయ్య, రంగయ్య అనే ఇద్దరు వ్యక్తులు బంగారయ్య దగ్గరకు పనికోసం వచ్చారు.
“మీ ఇద్దరికీ నా దగ్గర ఓ పది రోజులు పని చేసే అవకాశం ఇస్తున్నాను. రోజుకు మూడు రాగి మాడలు కూలీగా ఇస్తాను. మీ పనితనాన్ని బట్టి పదకొండో రోజున మీ ఇద్దరిలో ఒకరిని నెల జీతం మీద పనిలోకి తీసుకుంటాను. సరేనా?” అన్నాడు బంగారయ్య. ‘సరే’ నన్నారు ఇద్దరూ.
సీతయ్యకు తోటపని, రంగయ్యకు ఇంటి పని అప్పజెప్పేడు బంగారయ్య. సాయంత్రం వరకూ తమకు అప్పజెప్పిన పనులు పూర్తి జేశారు సీతయ్య, రంగయ్యలు.
ఇదిగో ఈ రోజు మీరు చేసిన పనికి గాను ఒక్కొక్కరికీ మూడేసి రాగి మాడలు ఇస్తు న్నాను” అని చెప్పి ఇద్దరికీ మూడేసి రాగి మాడలు ఇచ్చాడు బంగారయ్య.
మరునాడు కూడా ఇద్దరూ సాయంకాలం వరకూ తమ తమ పనులు సవ్యంగా నెరవేర్చారు.
“ఇలా రోజుకో మూడేసి రాగి మాడలు ఇచ్చే బదులు మొత్తం సొమ్మంతా మీకు పదో రోజున ఒకేసారి ఇస్తాను. సమ్మతమేనా?” అని అడిగాడు బంగారయ్య.
‘సరే’ నన్నారు సీతయ్య,రంగయ్య. పదిరోజులు గడిచిపోయాయి. ఈ పదిరోజులూ ఇద్దరూ ఒళ్లు దాచుకోకుండా కష్టపడి పని చేశారు. పదో రోజు సాయంత్రం బంగారయ్య “ మీరిద్దరూ కూడా ఈ పదిరోజులూ నా దగ్గర కష్టపడి పని చేశారు. ఇదిగో ఈ పది రోజులకు గాను మీకు రావలిసిన సొమ్ము” అంటూ రాగి మాడలు పోసి ఉన్న సంచుల్ని ఇద్దరికీ అందించాడు.
“ రేపు ఉదయం రండి! మీలో ఎవరిని పనిలోనికి తీసుకునేదీ చెబుతాను” అన్నాడు బంగారయ్య.
మరునాడు ఉదయం ఇద్దరూ బంగారయ్య వద్దకు వచ్చారు. ముందుగా బంగారయ్య సీతయ్యను లోపలికి పిలిచి నా దగ్గర నమ్మకంగా పని చేస్తావా?” అని అడిగాడు.
‘తప్పకుండా చేస్తాను స్వామీ’ అన్నాడు సీతయ్య వినయంగా. అతన్ని బయటకు పంపివేసి రంగయ్యను లోపలికి పిలిచి సీతయ్యను అడిగినట్లే అడిగాడు బంగారయ్య. ‘నమ్మకంగా పని చేస్తాను దొరా! కానీ దొరా నిన్న నాకు తమరు పది రోజుల పనికి గాను ముఫ్పై రాగి మాడలు ఇచ్చేరు సంచిలో పోసి. తమరు మరిచిపోయినట్లున్నారు. మొదటి రోజున తమరు ఆ రోజు పనికి గాను మూడు రాగిమాడలు నాకు ఇచ్చేశారు. ఇదిగో తీసుకోండి తమరు నాకు ఎక్కువ ఇచ్చేసిన సొమ్ము’ అంటూ మూడు రాగి మాడలు బంగారయ్యకు తిరిగి ఇచ్చేశాడు రంగయ్య. బంగారయ్య మందహాసం చేశాడు! “రంగయ్య! నాకు కష్టపడి పని చేయడంతో పాటు నిజాయితీగా కూడా పనిచేసే నీలాంటి వాడే కావాలి! నిజానికి నేను కావాలనే మీ నిజాయితీ పరీక్షించడానికే మీ ఇద్దరికీ ముఫ్ఫె రాగి మాడలు సంచిలో పోసి ఇచ్చాను. నువు మాత్రమే ఎక్కువగా ఇచ్చేసిన సొమ్ము నాకు తిరిగి ఇచ్చేశావు. నేను పెట్టిన పరీక్ష లో నెగ్గావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఈ రోజే నిన్ను నెల జీతం మీద పనిలోకి తీసుకుంటున్నాను” అన్నాడు బంగారయ్య సీతయ్యను వెనక్కు పంపి వేసి!

Valasa Kuli Information in Telugu

కోనే నాగ వెంకట ఆంజనేయులు
92906 60220

The post పనివాడి ఎంపిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.