కర్ణాటక పరిణామాలు…

కర్ణాటక రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూ ఉత్కంఠ కలిగిస్తున్నది. పాలక జెడి(ఎస్) కాంగ్రెస్ కూటిమికి చెందిన 13 మంది శాసన సభ్యుల రాజీనామాతో తక్షణమే కూలిపోనున్నదనిపించిన కుమార స్వామి పాలన అసెంబ్లీ స్పీకర్ అధికారాల అండతో ఆక్సిజన్ పొందుతున్నది. మరో వైపు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ తన వైపు తిప్పుకున్న తాజా పరిణామం దాని మనుగడను మరింత ప్రమాదంలో పడవేసింది. సంక్షోభ తరణోపాయంగా ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా ఆయన […] The post కర్ణాటక పరిణామాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కర్ణాటక రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతూ ఉత్కంఠ కలిగిస్తున్నది. పాలక జెడి(ఎస్) కాంగ్రెస్ కూటిమికి చెందిన 13 మంది శాసన సభ్యుల రాజీనామాతో తక్షణమే కూలిపోనున్నదనిపించిన కుమార స్వామి పాలన అసెంబ్లీ స్పీకర్ అధికారాల అండతో ఆక్సిజన్ పొందుతున్నది. మరో వైపు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ తన వైపు తిప్పుకున్న తాజా పరిణామం దాని మనుగడను మరింత ప్రమాదంలో పడవేసింది.

సంక్షోభ తరణోపాయంగా ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా ఆయన కేబినెట్‌లోని మంత్రులందరి చేత రాజీనామా చేయించారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణకు రంగం సిద్ధం చేశారు. మంత్రి పదవుల పట్ల తిరుగుబాటు ఎంఎల్‌ఎలలో ఆశలు రేకెత్తించారు. చిటెకెన వేలు పట్టుతో అధికారానికి వేలాడుతున్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి జెడి(ఎస్), కాంగ్రెస్‌లు ఆ విధంగా చిట్టచివరి పాచికను ప్రయోగించాయి. తిరుగుబాటు ఎంఎల్‌ఎలు రాజీనామాలు ఉపసంహరించుకొని మళ్లీ తమతో చేరకపోతే స్పీకర్ చేత వారి శాసన సభ్యత్వాలను రద్దు చేయించే వ్యూహాన్నీ సిద్ధం చేశారు. ఎనిమిది మంది శాసన సభ్యుల రాజీనామాలు సవ్యమైనవి కావని చెప్పి తిరస్కరించిన స్పీకర్ కెఆర్ సురేశ్ కుమార్ మిగతా ఐదు మంది తనను కలుసుకోవాలని ఆదేశించారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎగా ఎన్నికైన వారు. అందుచేత ప్రభుత్వాన్ని కాపాడడానికి తన అధికారాలన్నింటినీ ప్రయోగిస్తారని భావించవచ్చు. తనను కలవకుండా రాజీనామాలను తన ఆఫీసులో అప్పగించడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తున్న రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద శాసన సభ్యత్వాలు రద్దయిన వారు మళ్లీ ఎన్నికయ్యే వరకు మంత్రులు కాగల అవకాశం లేదు. అందుచేత ఈ తిరుగుబాటు ఎంఎల్‌ఎల సభ్యత్వాలను స్పీకర్ గనుక రద్దు చేస్తే తర్వాత ఏర్పడగల బిజెపి ప్రభుత్వంలో వెంటనే మంత్రులుగా చేరే అవకాశాన్ని వారు కోల్పోతారు. ఈ భయంతో వారు తిరిగి తమ సొంత గూళ్లకు చేరుకొని ప్రభుత్వాన్ని నిలబెడతారనే ఆశ జెడి(ఎస్), కాంగ్రెస్‌లలో చోటు చేసుకొన్నది. ఈ 13 మంది మీద స్పీకర్ వేటు వేస్తే ఆ మేరకు కర్ణాటక అసెంబ్లీ బలం 224 నుంచి 211కి పడిపోతుంది.

సాధారణ మెజారిటీ 106కి దిగి వస్తుంది. జెడి(ఎస్) కాంగ్రెస్‌ల ఉమ్మడి బలం 105 అవుతుంది. అయితే సభలో అతి పెద్ద పార్టీగా ఇప్పటికే 105 మంది సభ్యుల సంఖ్యాబలమున్న బిజెపి ఇండిపెండెంట్ల మద్దతుతో కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టగలిగే స్థితికి సునాయాసంగా చేరుకోగలుగుతుంది. అందుచేత కర్ణాటక సంక్షోభం మరి కొద్ది రోజుల పాటు ఇలా ఎన్ని మలుపులు తిరిగినా అంతిమంగా ప్రభుత్వం పడిపోక తప్పదనే అభిప్రాయానికే అవకాశం కలుగుతున్నది. సభలో బల నిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారాలు గవర్నర్‌కున్నా యి. కుమార స్వామి ప్రభుత్వం సభా వేదిక మీద తన బలాన్ని రుజువు చేసుకోలేకపోతే రాజీనామా చేసి దిగిపోక తప్పుదు.

అప్పుడు గవర్నర్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాన్ని బిజెపికి ఇచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మంత్రి పదవుల వాటాలు కుదరక, ఇతరత్రా చిక్కులతో ఆ పాలన కూడా ఎంతో కాలం కొనసాగకపోవచ్చు. గత ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించిందేగాని స్పష్టమైన మెజారిటీని సాధించుకోలేకపోయింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాన్ని యడ్యూరప్పకు గవర్నర్ వజూబాయివాలా ఇచ్చినప్పటికీ ఆయన బల నిరూపణ చేసుకోలేక తప్పుకోవలసి వచ్చింది.

ఆ నేపథ్యంలో ఉమ్మడి బలంతో ఏర్పాటయిన జెడి(ఎస్) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ధర్మానికి లోబడి ఊపిరి పోసుకున్నదే. కాని, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి తిరిగి బాగా పుంజుకోడం, ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో గతం కంటే ఎక్కువ బలంతో అధికారాన్ని చేపట్టడం కుమార స్వామి ప్రభుత్వానికి పీడ కలలు తప్పని సరి చేశాయి. ఇంతటి బలమైన స్థితి నుంచి బిజెపి కదుపుతున్న పావులు జెడి(ఎస్) కాంగ్రెస్ పుట్టిని ముంచబోవడం తథ్యమనిపించడం సహజం. ప్రస్తుత పరిణామాలు దానినే రుజువు చేస్తున్నాయి. అయితే ప్రజలిచ్చిన తీర్పుకి భిన్నంగా అధికారాన్ని బిజెపికి అప్పగించడానికి బదులు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడమే గవర్నర్ అనుసరించదగిన విజ్ఞతాయుతమైన విధానం కాగలదు.

Political Crisis in Karnataka

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కర్ణాటక పరిణామాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: