విముక్తి బాట మాదిగ దండోరా

  మాదిగ దండోరా ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనే. ఆ లక్ష్య సాధన కోసం చారిత్రక మూలాలను విస్మరించి సామాజిక స్పృహకు దూరమైన మాదిగల చేతులలో ఒక జెండాను, ఎజెండాను పెట్టి మాదిగ దండోరా జాతిని చైతన్యవంతం చేసింది. దోపిడీ, పీడన, కుల వివక్షకు గురవుతున్న కాలంలో ఒకవైపు విప్లవోద్యమాలు, మరొక వైపు దళిత అస్తిత్వ ఉద్యమాలు, ఐక్యపోరాటాల నడుమ, కారంచేడు, పదిరెకుప్పం, నీరుకొండ, చీమకుర్తి లాంటి దారుణ మారణకాండల అనంతరం ఎవరూ […] The post విముక్తి బాట మాదిగ దండోరా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాదిగ దండోరా ఉద్యమ ప్రధాన లక్ష్యం ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధనే. ఆ లక్ష్య సాధన కోసం చారిత్రక మూలాలను విస్మరించి సామాజిక స్పృహకు దూరమైన మాదిగల చేతులలో ఒక జెండాను, ఎజెండాను పెట్టి మాదిగ దండోరా జాతిని చైతన్యవంతం చేసింది. దోపిడీ, పీడన, కుల వివక్షకు గురవుతున్న కాలంలో ఒకవైపు విప్లవోద్యమాలు, మరొక వైపు దళిత అస్తిత్వ ఉద్యమాలు, ఐక్యపోరాటాల నడుమ, కారంచేడు, పదిరెకుప్పం, నీరుకొండ, చీమకుర్తి లాంటి దారుణ మారణకాండల అనంతరం ఎవరూ ధైర్యంగా నిలబడి గళమెత్తలేని పరిస్థితుల్లో దళితుల మధ్యలో పెరిగిపోతున్న అసమానతలను, అంతరాలను గుర్తించి సామాజిక న్యాయం కోసం “ఈదుమూడి” గడ్డ ముందుకు వచ్చింది.

ఇలాంటి ఘన చరిత్ర కలిగిన ఉద్యమానికి ఓనమాలు నేర్పుతూ బలమైన పునాదులను వేసి చరిత్ర కెక్కింది. నేడు ఒక సామాజిక సంస్కరణోద్యమ కేంద్రంగా మారింది. దండోరా ఉద్యమ పుట్టుక, నడవడికే సమస్త అణగారిన కులాల్లో సామాజిక స్పృహను రగిలించింది. తుడుం దెబ్బ, నంగార భేరి, మోకు దెబ్బ, డోలు బెబ్బ, చాకిరేవు, పూసల కేక, కుర్రు, మాల మహానాడు, ముదిరాజ్ మహాసభ లాంటి కుల హక్కుల సంఘాలు దండోరా ఉద్యమ ప్రభావ స్ఫూర్తిలో నుండే పుట్టుకొచ్చాయి. అలాగే మాదిగ ఉపకులాలైన చిందు, డక్కలి, మాస్టిన్, మోచీ, పైడి, పాకీ, రెల్లి, బుడిగజంగం, హోలియదాసరి, దోంబారి వంటి మరెన్నో ఉపకులాల సంఘాలను బలోపేతం చేసి వారిలో నాయకత్వ నిర్మాణానికి తోడ్పాటునందించింది.

అట్టడుగు వర్గాలకు ప్రశ్నించే తత్వాన్ని, ప్రతిఘటించే పౌరుషాన్ని నేర్పింది. ఉపకులాల ప్రజలకి ఆర్.డి.ఒ. ద్వారా కాకుండా నేరుగా యం.ఆర్.ఒ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా పోరాడి సాధించి పెట్టింది. అంబేడ్కర్ స్ఫూర్తికి అనుగుణంగానే తాను సాధించే ఎస్‌సి, ఎ.బి.సి.డి. వర్గీకరణ ఫలాల్లో ఎస్‌సి (ఎ) ప్రథమ ఫలాన్ని మాదిగలు తీసుకోకుండా మాదిగలకన్న వెనుకబడిన్న ‘రెల్లి’ ఉప కులాలకు అందించి క్రింది కులాల పట్ల తమకున్న బాధ్యతను ఆచరణాత్మకంగా నిర్వర్తించింది. అంబేడ్కర్ స్ఫూర్తిని నిలబెట్టింది.

మాదిగ దండోరా ఉద్యమ ప్రస్థానాన్ని 25 యేండ్ల సుదీర్ఘమైన పోరాటంగానే కాకుండా మూడు దశలుగా ఉద్యమాన్ని విభజించుకొని పరిశీలించాలి. మొదటి దశ 1994 నుండి 1999 మొదటి ఐదేండ్లు ఉద్యమ ప్రయాణ పోరాటం, లక్ష్యాన్ని సాధించడం, 1999 నుండి 2004 వరకు రెండవ దశ ఐదేండ్లు సాధించిన ఎస్‌సి రిజర్వేషన్ల ఫలాలను జాతికి అందించి, అభివృద్ధి పథంలో నడిపించడం, మూడో దశ 2004 నుండి నేటి వరకు ఈ పదిహేనేండ్లు మలి దశ ఉద్యమ వీరోచితమైన పోరాటాలతో కాలం విధించే విషమ పరీక్షల్ని, నిర్బంధాలను తట్టుకుంటూ లక్ష్య సాధనలో రాజీ పడకుండా, పాలక పక్షాలకు లొంగకుండా స్వార్థపర అవకాశాలకు కొట్టుకుపోకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, ఉద్య మ స్ఫూర్తితో కలిసి వచ్చిన ప్రతి పార్టీని, ఎదురు వచ్చిన ప్రతి అవకాశాన్ని, ఉత్పన్నమైన ప్రతి సందర్భాన్ని ఉద్యమానికి అనుకూలంగా మార్చుకొని పోరును ఉధృతంచేస్తున్నది. యుద్ధం చేస్తూనే, ప్రతి పక్షాలను, పార్టీలను, ప్రజలను, ప్రజాస్వామిక వాదులను, సామాజిక శక్తులను ఏకం చేసి వర్గీకరణ పోరాటానికి మద్దతుగా నిలబెట్టింది. మొదటి సారిగా సైకిల్ యాత్రలు, పాద యాత్రలు, అసెంబ్లీ ముట్టడులు, ఆమరణ దీక్షలు, అమరుల బలి దానాలు, అసెంబ్లీ తీర్మానాలు ఆత్మగౌరవ ప్రదర్శనలతో ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అతిస్వల్ప కాలంలోనే రాష్ట్ర రాజధాని హైద రాబాద్ నగరాన్ని ప్రవాహంలా ముంచెత్తింది. ఆ ఉద్యమ ఉధృతికి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది.

1997 జూన్ 07వ తేదీన గవర్నర్ ఆమోదంతో జి.ఒలు 68, 69 ద్వారా మొదటి సారిగా, 1999 నవంబర్ 30న రాష్ట్రపతి ఆమోదంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రెండవసారి వర్గీకరణ లక్ష్యాన్ని సాధించడం జరిగింది. దాని ఫలితంగా నాలుగేండ్లలోనే స్వాతంత్య్ర భారతావనిలో మాదిగ జాతి, ఉప కులాలు ఎన్నడూ పొందని అవకాశాలు పొందాయి. అలా నాలుగేండ్లు నడుస్తూ జాతి అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశిస్తున్న తరుణంలోనే కొంత మంది స్వార్థపరులైన సోదర మాల సామాజిక వర్గీయులు సుప్రీంకోర్టు కెక్కి తమకున్న సామాజిక ఆర్థిక, రాజకీయ పలుకుబడితో సాంకేతిక కారణాలను అడ్డుగా చూపి 2004 నవంబర్ 05వ తేదిన ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణను రద్దు పర్చారు.

అలా రద్దు కాబడిన వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ ద్వారా చట్టబద్ధ్దత సాధించుకునేందుకు నాడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై దండోరా యుద్ధాన్ని తీవ్ర తరం చేసింది. దాని ఫలితంగా జాతీయ స్థాయిలో ‘జస్టిస్ ఉషా మోహ్రా’ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ ఎస్‌సి వర్గీకరణను సమర్థిస్తూ రాజ్యాంగంలోని 341వ ఆర్టికల్‌ను సవరించి ఎస్‌సి రిజర్వేషన్లను ఎ.బి.సి.డిలుగా వర్గీకరించాలని నివేదించింది. ఆ నివేదిక అమలు కోసం అందివచ్చిన అన్ని దశల్లో ప్రయత్నాలను మొదలుపెడుతూ పోరాడుతున్నది.

ఉద్యమాన్ని దక్షణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్ లాంటి రాష్ట్రాలకు విస్తరించింది. పలు పోరాటాల ద్వారా ఆ ఉద్యమ డిమాండ్‌కు మరింత ప్రాధాన్యాలు సంతరించుకొని ఉత్తరాదిలో కూడా ఇది వరకు అమలై రద్దయిన పంజాబ్, హర్యానా, ఉత్తరాప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరఖండ్, లాంటి రాష్ట్రాల్లో కూడా ఉద్యమ ఆకాంక్షను మరల రగిలించింది. జాతీయ స్థాయి ఉద్యమంగా అవతరించింది. వర్గీకరణపై వేసిన కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందుకే పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లును పెట్టలేకపోయింది. స్వార్థపరుల లాబీయింగులకు తలొగ్గి నమ్ముకునొళ్లను నట్టేట ముంచింది. దాని అనంతరం ఎదురైన పలు ప్రత్యేక రాష్ట్ర సాధన అనుకూల, వ్యతిరేక ఉద్యమాల ప్రభావం తదితర అంశాల వలన వర్గీకరణ డిమాండ్ పాలక పక్షాలపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. దానితో ఉద్యమానికి నూతన లక్ష్యసాధన మార్గాలను కాలానుగుణంగా నిర్దేశించుకొని రాజకీయ బలాన్ని పెంచుకంటూ వ్యూహాత్మకంగా ముందుకు నడిచింది.

పోరాటాల్నీ తీవ్రతరం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా పలుమార్లు పలు దశల్లో వరుస ఆందోళన కార్యక్రమాలతో ఢిల్లీ నగరం దద్దరిల్లేలా దండోరా మోగించింది. కేంద్రప్రభుత్వ పెద్దల్ని, ప్రతిపక్షపు నేతల్ని, పలు పార్టీల నాయకుల్ని, సభలకు పిలిచి మాదిగల ఆవేదనను ఆవిష్క ృతం అయ్యేలా చేసింది. కష్టకాలంలో హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో లక్షాలాది మందితో “ధర్మయుద్ధం” అంటూ యుద్ధాన్ని మోగించింది. ఆ జన ప్రవాహంతో వర్గీకరణ సాధించబోతుందనే సంకేతాలు, ఆశలు, జాతిలో రేకెత్తాయి. కాని దురదుష్టవశాత్తు ఆ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. అయినా లక్ష్యసాధనలో పట్టువిడువని విక్రమార్కుడిలా వెనుకకు తగ్గకుండా పాలక ప్రభుత్వాలపై వత్తిడి పెంచుతూనే ముందుకు నడుస్తున్నది.

వర్గీకరణపై అడ్డంకులన్ని తొలగిపోయి అందరు అనుకూలంగా ఉన్న ఈ కీలక సమయంలో ఎస్‌సి వర్గీకరణను రాజకీయ కోణంలో చూడకుండా, ‘ఓటు బ్యాంక్’ సమస్యగా ఆలోచించకుండ, అరవై ఐదేండ్లుగా జరిగిన అన్యాయాన్ని గుర్తించి, న్యాయమైన ముగింపును ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకుండా పార్లమెంట్‌లో బిల్లుపెట్టి ఆమోదింప చేస్తూ ఆకాంక్షను నేరవేర్చాలని, మాదిగ ప్రజలు కోరుతున్నారు. సోదర మాల సామాజిక వర్గం కూడా పట్టింపులకు పోకుండా చివరి దశలో ఉన్న వర్గీకరణ పట్ల తమ మద్దతును ప్రకటించి సోదరత్వాన్ని చాటుతూ భవిష్యత్తు ఐక్య ఆశయ సాధన పోరాటలకు బాటలు వేయాలని కోరుకుంటున్నది. ఇన్నేండ్ల కాలంలో సందర్భం వచ్చినప్పుడల్లా మాలల పక్షపాతిగా మాదిగ దండోరా నిలబడ్డది. అంబేడ్కర్ స్ఫూర్తితో సోదరత్వాన్ని ప్రదర్శిస్తూ మేము ‘పాలోళ్లమే కానీ పగోళ్లం కాదని’ చాటి చెప్పింది. వర్గీకరణ పోరాటం మాల, మాదిగల శాశ్వత ఐక్యతకే తప్ప విభజనకు కాదని నిరూపించుకున్నది.

ప్రజా గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు, సుద్దాల దేవయ్యను చంద్రబాబు నాయుడు ఆకారణంగా మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసినప్పుడు, అర్జున్ రావు అనే ఐ.ఎ.ఎస్. అధికారికి చీఫ్ సెక్రెటరీ పదవిని దక్కనీయకుండా ప్రభుత్వం కుట్రలు చేసినప్పుడు వారికి అండగా దండోరా రోడెక్కి ఉద్యమించింది. గీతారెడ్డిపై కోదండరావ్‌ు అనుచిత వాఖ్యాలు చేసి అవమానపరిస్తే, హైదరాబాద్ నగరం నడిబొడ్డున మాజీ మంత్రి శంకర్రావుపై అగ్రవర్ణాలు దాడి చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లా లక్ష్మీంపేటలో భూస్వామ్య పెత్తందారీ వర్గాలు, ఏడుగురు మాలలపై అతి కిరాతకంగా నరమేధం సృష్టిస్తే, మాలలకు అండగా దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని పతాక స్థాయిలో నడిపింది. అదే విధంగా ఉమ్మడి అభివృద్ధి, పురోగతికి ఎస్‌సి, ఎస్‌సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను సాధించి పెట్టింది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి చట్టానికి తూట్లు పొడిసేందుకు కుట్రలు చేస్తే, సంఘాలన్నింటిని ఏకం చేసి చట్టాన్ని పాలక పక్షాలు కాపాడుకునేలా ‘సింహాగర్జనై’ గర్జించింది. జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ చట్టాన్ని రక్షించింది.

SC Reservations are target of Madiga Dandora Movement

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విముక్తి బాట మాదిగ దండోరా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: