కర్ణాటక క్లైమాక్స్!

    కర్ణాటకలో జెడి(ఎస్), కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వానికి చివరి రోజులు దాపురించాయని ధ్రువపడుతున్నది. ఈ రెండు పార్టీలకు చెందిన 11 మంది శాసన సభ్యులు శనివారం నాడు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాలు సమర్పించిన అసాధారణ పరిణామం ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం పుట్టి మునుగుతున్నదనే అభిప్రాయానికి తావిస్తున్నది. రాజీనామాలిచ్చిన ఎంఎల్‌ఎలు ప్రత్యేక విమానంలో గోవాకు వెళ్లడం సంక్షోభ తీవ్రతను చాటుతున్నది. మొన్న సోమవారం నాడు ఆనంద్ సింగ్, రమేశ్ జర్కిహోలి అనే ఇద్దరు […] The post కర్ణాటక క్లైమాక్స్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    కర్ణాటకలో జెడి(ఎస్), కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వానికి చివరి రోజులు దాపురించాయని ధ్రువపడుతున్నది. ఈ రెండు పార్టీలకు చెందిన 11 మంది శాసన సభ్యులు శనివారం నాడు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామాలు సమర్పించిన అసాధారణ పరిణామం ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం పుట్టి మునుగుతున్నదనే అభిప్రాయానికి తావిస్తున్నది. రాజీనామాలిచ్చిన ఎంఎల్‌ఎలు ప్రత్యేక విమానంలో గోవాకు వెళ్లడం సంక్షోభ తీవ్రతను చాటుతున్నది. మొన్న సోమవారం నాడు ఆనంద్ సింగ్, రమేశ్ జర్కిహోలి అనే ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామాలు సమర్పించారు. రెండు పార్టీలకు చెందిన మొత్తం 14 మంది నిష్క్రమించదలచినట్టు వార్తలు చెబుతున్నాయి. స్పీకర్ కెఆర్ రమేశ్ కుమార్ కాంగ్రెస్‌కు చెందిన వారు. ఈ సంక్షోభంలో ఆయన నిర్ణయం కీలకం కానున్నది.

ఇంత మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు తప్పుకోదలచడం వెనుక ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తమున్నదో లేక బిజెపి చొరవ చూపించడం వల్లనే ఈ పరిణామం సంభవించిందో స్పష్టంగా తెలీదు. ముఖ్యమంత్రి కుమార స్వామి ఇటీవల జరిపిన మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌కు ప్రాధాన్యమివ్వలేదనే అసంతృప్తి ఆ పార్టీ ఎంఎల్‌ఎలలో ఉన్నది. అలాగే జెడి(ఎస్)కు చెందిన ఎంఎల్‌ఎ విశ్వనాథ్ తమ పార్టీ నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. యడ్యూరప్ప అయితే మొదటి నుంచీ అధికారాన్ని చేజిక్కించుకునే సందు కోసం ఆవురావురు మంటున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ తమ పార్టీని పిలిస్తే ముఖ్యమంత్రి కాబోయేది యడ్యూరప్పేనని మరో బిజెపి సీనియర్ నేత సదానంద గౌడ తాజాగా ప్రకటించారు. అందుచేత కాంగ్రెస్, జెడి(ఎస్)ల విభేదాలు తార స్థాయికి చేరినందువల్లగాని బయటి నుంచి బిజెపి కదుపుతున్న బలమైన పావుల వల్ల గాని కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వానికి నూకలు చెల్లక తప్పని పరిస్థితి తలెత్తినట్టు స్పష్టపడుతున్నది.

శనివారం నాడు తిరుగుబాటు ఎంఎల్‌ఎలు రాజీనామాలు సమర్పించినప్పుడు స్పీకర్ రమేశ్ కుమార్ తన కార్యాలయంలో లేరు. ఆదివారం సెలవు కాబట్టి సోమ, మంగళవారాల్లోగాని రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోడం జరగదు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225 మంది సభ్యులున్నా రు. ఒక నామినేటెడ్ ఎంఎల్‌ఎను తీసేస్తే నికర బలం 224. సాధారణ మెజారిటీకి 113 మంది ఉండాలి. గత ఏడాది మే ఎన్నికల్లో కాంగ్రెస్ 78, జెడి(ఎస్) 37, బిజెపి 105, బిఎస్‌పి 1 స్థానాలు సాధించుకోగా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్పకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ ఇచ్చారు. కాని ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక అధికారం నుంచి వెంటనే తప్పుకున్నారు. బిజెపిని అధికారానికి దూరంగా ఉంచాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ జెడి(ఎస్) అధినేత కుమార స్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపడంతో ఆ రెండు పార్టీలు సంఘటితమై యడ్యూరప్ప ప్రభుత్వాన్ని పురిట్లోనే కూల్చివేశాయి.

ఆ విధంగా 118 మంది సభ్యుల బలంతో కుమార స్వామి నాయకత్వంలో 13 మాసాల క్రితం ఏర్పాటయిన జెడి(ఎస్) కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు దినదిన గండంగా బతుకుతున్నది. ఉమ్మడి ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్ మైనారిటీగా ఉన్న జెడి(ఎస్) ఆధిపత్యాన్ని సహించలేకపోయిందనే అభిప్రాయానికి తావు కలిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం కుమార స్వామికి తిరుగులేని మద్దతు ప్రకటించినా మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు ఆయనకు సరైన సఖ్యత కుదిరినట్టు లేదు. ఈ స్థితి ప్రభుత్వం నిత్యం బీటలువారుతుండడానికి దారి తీసింది. ఈ రెండు పార్టీల పేచీలు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వాటిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపాయి.

బిజెపి అనూహ్యంగా తిరిగి బాగా పుంజుకుంది. ఇది ప్రభుత్వంపై మూలిగే నక్కమీద తాడిపండు పడిన చందమైంది. తాజా రాజీనామాలను ఎంఎల్‌ఎలు వెనుకకు తీసుకోకపోతే ప్రభుత్వం దారుణమైన మైనారిటీలో పడిపోతుంది. గవర్నర్ రంగ ప్రవేశం చేసి బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమివ్వడమో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడమో తథ్యమవుతుంది. రాష్ట్ర ప్రజలు ఇంతలోనే మరో ఎన్నికకు సిద్ధంగా లేరు కాబట్టి రాష్ట్రపతి పాలనను విధించి డిసెంబర్‌లో ప్రజల వద్దకు వెళ్లనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లతోపాటు కర్ణాటకలోనూ ఎన్నికలు జరిపించడానికి మొగ్గు చూపవచ్చు. ప్రజలిచ్చిన తీర్పు మేరకు ఏర్పాటయ్యే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులను సృష్టించి అధికారం చేజిక్కించుకోడం కంటే తిరిగి జనాదేశాన్ని పొందడానికి ప్రాధాన్యమివ్వడమే ప్రజాస్వామికమవుతుంది.

Karnataka Alliance in Crisis after 11 MLAs Resign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కర్ణాటక క్లైమాక్స్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: