రోదసిలో రావణ వన్

  జూన్ 19వ తేదీన శ్రీలంక మొదటి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అంతర్యుద్ధంతో నాలుగు దశాబ్దాలు నాశనమైన అతిచిన్న దేశం శ్రీలంక రోదసి రంగంలో సాధించిన ఈ విజయం చిన్నది కాదు. శాస్త్రసాంకేతిక రంగాల్లో శ్రీలంక లక్ష్యాలు, ఉద్దేశాలు ఈ ఉపగ్రహ ప్రయోగంతో స్పష్టమయ్యాయి. దాంతో పాటు ఉపగ్రహానికి రావణ వన్ అని పేరు పెట్టడం ద్వారా సాంస్కృతికంగా తమ ప్రత్యేకతను చాటి చెప్పుకునే ప్రయత్నాలు శ్రీలంక చేసింది. రామాయణంలో సీతనెత్తుకుపోయిన రావణుడి పేరు తమ మొదటి […] The post రోదసిలో రావణ వన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జూన్ 19వ తేదీన శ్రీలంక మొదటి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అంతర్యుద్ధంతో నాలుగు దశాబ్దాలు నాశనమైన అతిచిన్న దేశం శ్రీలంక రోదసి రంగంలో సాధించిన ఈ విజయం చిన్నది కాదు. శాస్త్రసాంకేతిక రంగాల్లో శ్రీలంక లక్ష్యాలు, ఉద్దేశాలు ఈ ఉపగ్రహ ప్రయోగంతో స్పష్టమయ్యాయి. దాంతో పాటు ఉపగ్రహానికి రావణ వన్ అని పేరు పెట్టడం ద్వారా సాంస్కృతికంగా తమ ప్రత్యేకతను చాటి చెప్పుకునే ప్రయత్నాలు శ్రీలంక చేసింది. రామాయణంలో సీతనెత్తుకుపోయిన రావణుడి పేరు తమ మొదటి ఉపగ్రహానికి శ్రీలంక పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా భారతీయులంతా సంస్కృతం నుంచి వచ్చిన రామాయణాన్ని చదువుతారు. అందులో రావణాసురుడు విలన్. శ్రీరామచంద్రుడితో యుద్ధంలో రావణాసురుడు హతమయ్యాడు. కాని ఎ.కె.రామానుజం వంటి పండితుల అభిప్రాయం ప్రకారం రామాయణ కథలు అనేకమున్నాయి. భారతదేశంలోనే అనేక రామాయణ కథలున్నాయి. వాల్మీకి రాసినట్లు చెప్పే రామాయణానికి విరుద్ధమైన రామాయణ కథలు కూడా చాలా ఉన్నాయి.

గత 2500 సంవత్సరాలుగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో అనేక రామాయణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయని రామానుజం రాశారు. దాదాపు 22 భాషల్లో ఉన్నాయి. అందులో సింహళ భాషలో కూడా రామాయణం ఉంది. శ్రీలంకలోని సింహళ బౌద్ధులకు సంస్కృత రామాయణం నుంచి వచ్చిన రామాయణ కథ విషయంలో చాలా అభ్యంతరాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంకలోను గత చరిత్ర వైభవాలను ప్రచారం చేసుకునే ధోరణి పెరిగింది. రావణాసురుడు గొప్ప శ్రీలంక రాజుగా, అత్యున్నత గుణగణాలున్న వీరుడిగా చెప్పే ప్రయత్నాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. భారతరాజు శ్రీరాముడికి, రావణాసురుడి తమ్ముడు కుట్రతో సహాయం చేయడం వల్లనే రావణాసురుడు ఓడిపోయాడని భావిస్తారు.

1980లో భారత శాంతి దళం శ్రీలంకలో అడుగుపెట్టిన తర్వాతి నుంచి రామాయణ కథను పునర్వ్యాఖ్యానించడం, రావణాసురుడి పాత్రను తిరిగి పరిచయం చేయడం మరింత ఎక్కువయ్యింది. భారత శాంతి దళాలు శ్రీలంకలో అడుగుపెట్టడం శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చాలా మంది సింహళీయులు భావించారు. ఇప్పుడు తమ మొట్టమొదటి ఉపగ్రహానికి రావణ వన్ అని పేరుపెట్టడం ద్వారా శ్రీలంకలో రావణాసురుడి పౌరాణిక పాత్ర ఇప్పుడు కొత్త రాజకీయాలకు కేంద్రం కాబోతోంది. పదిహేనవ శతాబ్దంలో అనురాధపురంలో బౌద్ధ బిక్షువులు రాసిన మహావంశ గ్రంథం పాళీ భాషలో ఉంది. శ్రీలంక సాంస్కృతిక పునాదులు ఈ గ్రంథంలోనే ఉన్నాయి.

భారతదేశంలోని కళింగ నుంచి యువరాజు విజయ శ్రీలంక రావడం, శ్రీలంకలో తన పరిపాలనను ప్రారంభించడం, తర్వాత అనేక తరాలుగా ఈ రాజవంశం పరిపాలన సాగడం ఇదంతా ఆ పుస్తకంలో ఉంది. 20వ శతాబ్దం వరకు ఈ పురాణగ్రంథమే సింహళ సంస్కృతికి పునాదిగా ఉండేది. కాని ఆ తర్వాత చీలిక వచ్చింది. ఈ కథలో భారత సంతతికి చెందిన పాలకుడి పట్ల కొందరిలో వ్యతిరేకత తలెత్తి శ్రీలంక స్థానిక రాజుల నుంచి మాత్రమే చరిత్ర ప్రారంభమైందనే పునర్వ్యాఖ్యానాలకు కారణమైంది. 1940 తర్వాతి నుంచి సింహళ, తమిళ ప్రజల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలు ఈ చరిత్రను మరింత సంక్లిష్టం చేశాయి. సింహళ ప్రజలు శ్రీలంకలో తామే అసలు సిసలు స్థానిక జాతులుగా గట్టిగా ప్రకటించడం ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామాయణంలోని రావణాసురుడికి శ్రీలంకలో ప్రాముఖ్యం పెరిగింది.

ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రయత్నాలకు నాయకత్వం వహించిన వారిలో కుమార తుంగ మునిదాస ఒకరు. 1941లో ఆయన హేలహావుల పేరుతో సాహిత్య సంస్థ స్థాపించారు. సింహళ భాషను పరాయి ప్రభావాల నుంచి శుద్ధి చేయడం ఈ సంస్థ లక్ష్యాల్లో ఒకటి. ఈ సంస్థకు చెందిన అరిసేన అహుబుడు 1980లో రావణాసురుడిని హీరోగా చేసి రావణవలియ పుస్తకం రాశాడు. సింహళ బౌద్ధుల్లో ఎల్లప్పుడూ భారత వ్యతిరేక భావాలు అంతర్లీనంగా ఉండేవని కొలంబో యూనివర్శిటీ ప్రొఫెసర్ నిర్మల రంజిత్ దేవసిరి వంటి వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే రామాయణ కథలో రావణుడు గొప్ప రాజుగా చెప్పడం.

తమిళుల సమస్య పరిష్కారానికి భారతదేశం చేసిన ప్రయత్నాలు, భారత శాంతిదళం శ్రీలంక వెళ్ళడం వంటి పరిణామాలు కూడా సింహళ బౌద్ధుల్లో భారత వ్యతిరేకతను పెంచాయి. దక్షిణ భారతదేశానికి చెందిన రాజు ఎల్లాలన్‌తో శ్రీలంక రాజు దుత్తగామిని యుద్ధం గురించిన కథ మహావంశలో ఉంది. ఈ యుద్ధంలో శ్రీలంక రాజు ఘన విజయం సాధించాడు. ఈ వీర గాథలు శ్రీలంకలో ప్రచారం పొందడం ప్రారంభించాయి. భారత శాంతి దళానికి సింహళ బౌద్ధులు అప్పట్లో మంకీ ఆర్మీ, వానర సేన అని పేర్లు పెట్టారు. ఈ వానర సేన అనే పేరు కూడా రామాయణం నుంచి గ్రహించిందే. రావణుడిని గొప్ప రాజుగా కీర్తించే ఈ ధోరణిని 2015లో నందక మదురంగ కలుగంపితియా అనే అధ్యాపకుడు తీవ్రంగా విమర్శించాడు. బౌద్ధం రాక ముందు, శ్రీలంక చరిత్ర ప్రారంభానికి ముందు కాలం నాటి వాడు రావణుడు. సింహళ జాతి భారత దేశం నుంచి వలస వచ్చిన రాజు విజయన్ తోనే ప్రారంభమైందన్నది మహావంశ గ్రంథం చెప్పే కథ. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో ఈ రాజు శ్రీలంక వెళ్ళాడు. మహావంశ గ్రంథం పట్ల సింహళ ప్రజల్లో వ్యతిరేకత లేదు. సింహళ సంస్కృతి చరిత్రలకు సంబంధించి ఈ గ్రంథాన్ని అతి ముఖ్యమైన గ్రంథంగా భావిస్తున్నారు. కాబట్టి రావణాసురుడిని హీరోగా చేయడం బహుశా సాధ్యం కాదని ఆయన అన్నాడు.

2009లో తమిళ టైగర్లను ఓడించిన తర్వాత ఆ విజయోత్సాహంలో రావణాసురుడిని మరింత ఆకాశానికెత్తే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. శ్రీలంక సంస్కృతి రావణీకరించబడుతోందని కొందరు వ్యాఖ్యానించారు. రావణాసురుడుని ప్రాచీన కాలంలో అత్యంత ప్రసిద్ధుడైన స్ధానిక నాగరికతకు ప్రతినిధిగా చిత్రికరించడం ప్రారంభమైంది. పుస్తకాలు, వ్యాసాలు, టివి ప్రోగ్రాంలు, పాటలు, రావణ విగ్రహాలు, వాటితో పాటు శ్రీలంక మార్షల్ ఆర్ట్ అంగంపోరను ప్రోత్సహించడం ఇవన్నీ ప్రారంభమయ్యాయి. భారత దేశానికి శ్రీలంకకు మధ్య బలమైన సాంస్కృతిక, ఆర్ధిక, భౌగోళిక సంబంధాలున్నాయి. రెండు దేశాల్లోని ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు రాజకీయ విభేదాలను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. దౌత్య సంబంధాలపై వాటి ప్రభావం పడకుండా చూస్తున్నాయి. బహుశా రావణుడి ప్రభావం దౌత్య సంబంధాలపై, రెండు దేశాల మధ్య మైత్రిపై ఉండకపోవచ్చు.

Sri Lanka successfully launches first satellite on June 19

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోదసిలో రావణ వన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: