కిరాక్ గార్డెన్

  డా. కందేపి రాణీప్రసాద్ ఇండిగో ఫ్లైట్‌లో 2014వ సంవత్సరం మార్చి 15వ తేదీ ఉదయం బయలుదేరి వయా ముంబాయి మీదుగా చండీఘర్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరాం. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన పీజీఐ హాస్పిటల్‌లో మా వారికి కాన్ఫరెన్స్ ఉన్నది. ‘Evidence based management of Resperaltory disorders in children’ అన్న అంశంపై కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ‘చండీఘర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగగానే అంతటా తలపాగాలు చుట్టుకున్న సిక్కులు కనిపించారు. మేము ఇదే మొదటిసారిగా పంజాబ్ […] The post కిరాక్ గార్డెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డా. కందేపి రాణీప్రసాద్

ఇండిగో ఫ్లైట్‌లో 2014వ సంవత్సరం మార్చి 15వ తేదీ ఉదయం బయలుదేరి వయా ముంబాయి మీదుగా చండీఘర్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరాం. ఇక్కడ ప్రఖ్యాతి చెందిన పీజీఐ హాస్పిటల్‌లో మా వారికి కాన్ఫరెన్స్ ఉన్నది. ‘Evidence based management of Resperaltory disorders in children’ అన్న అంశంపై కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ‘చండీఘర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగగానే అంతటా తలపాగాలు చుట్టుకున్న సిక్కులు కనిపించారు. మేము ఇదే మొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టడం. అందులోనూ చండీఘర్‌లాంటి ప్లాన్‌డ్ సిటీని చూడాలని ఎప్పటినించో అనుకున్నాం. ఇది ఇన్నాళ్ళకు తీరింది. సరోవర్ గ్రూపు వాళ్ళు ‘Homotel’ అనే హోటల్‌లో 509 అనే రూములో దిగాం.

హోటల్ చాలా పెద్దదిగా ఉంది కానీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ పెట్టారు. చండీ ఘర్ నుంచి అమృత్‌సర్ 250 కి.మీ దూరంలో ఉంది. అమృత్‌సర్‌కు వెళితే వాఘాబార్డర్ కూడా చూడవచ్చు. అది అమృత్‌సర్‌కు కేవలం 50 కి.మి దూరమేనట. కాన్ఫరెన్స్‌లో టైం దొరికితే అమృత్‌సర్ చూడాలని అనుకున్నాం. హోటల్‌లో లగేజి పెట్టేసి పీజీఐకు వెళ్ళాం. ఇది దగ్గర అవుతుంటే నా మనసు ఆనందంతో పులకరించింది. భారతదేశంలోనే ప్రసిద్ధమైన PGIMER (Post Graduate Institute of medical Education & Research)లో నేను అడుగు పెట్టానని సంతోషంగా ఉంది. దీనిలోని హాస్పిటల్‌ను ‘నెహ్రూ హాస్పిటల్’ అంటారు.

చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడి ప్రజలు పంజాబీ, ఇంగీషు భాషలు మాట్లాడతారు. 10లక్షల జనాభా కలిగిన ప్రాంతం. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల రాజధాని చండీఘర్. భారత్ పాకిస్తాన్‌ల విభజన సమయంలో తూర్పుపంజాబ్ భారతదేశానికి వచ్చింది. పశ్చిమ పంజాబేమో పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయింది. విభజనకు పూర్వం పంజాబుకు రాజధానిగా ఉన్న ‘లాహోర్’ కూడా పాకిస్తాన్‌కు వెళ్ళిపోయింది. అందువలన మన దేశంలో ఉన్న పంజాబుకు కొత్త రాజధాని అవసరం పడింది. అలా పక్కా ప్రణాళికతో చండీఘర్ నగరం నిర్మించబడింది. హిమాలయాలలోని శివాలిక్ కిండల వరస పాదాల చెంతనే ఈ నగరమున్నది.

ఇక్కడ ఎక్కడ చూసినా మర్రిచెట్లు, యూకలిప్టస్ చెట్లు కనిపిస్తున్నాయి. దారిలో వెళ్తుంటే సర్కిల్స్ దగ్గర చక్కని లాన్లు, మంచి పువ్వులు కనిపించాయి. ఇంకా ఇక్కడి అడవుల్లో అశోక, మల్బరీ, కాషియా చెట్లు ఉంటాయట. ప్రఖ్యాత క్రికెటర్లు అయిన యువరాజ్‌సింగ్, కపిల్‌దేవ్ చండీఘర్‌కు చెందినవారే. కామన్‌వెల్త్ కీడల్లో బంగారు పతకాన్ని సాధించిన మిల్కాసింగ్ కూడా ఇక్కడివాడే. ప్రఖ్యాత షాపింగ్ వెబ్‌సైట్ అయినటువంటి ప్లిప్‌కార్టును స్థాపించిన వారైన బిన్ని బనల్, సచిన్ బనల్ ఇరువురూ చండీఘర్‌కు చెందినవారే.

చండీఘర్‌లో అతిపెద్ద ‘రోజ్‌గార్డెన్’ ఉన్నది. ఇది ఆసియా ఖండంలోనే పెద్ద గార్డెన్. ఈ గార్డెన్ మొత్తం 27 ఎకరాల స్థలంలో వ్యాపించి ఉంది. ఈ గార్డెన్‌లో దాదాపు 17000 గులాబీలకు పైగానే ఉన్నాయి. అవి 1600 వెరైటీల గులాబీలట. ఈ వివరాలన్నీ బయట టికెట్లిచ్చే గది దగ్గర ఉన్నాయి. అమ్మో! మనం ఇదంతా తిరగగలుగుతామా! అనుకున్నాం. సరే కొన్నైనా చూడవచ్చు కదా అని లోపలికి వెళ్ళాం.

మేం వెళ్ళింది ఎండాకాలం కాబట్టి పూలమొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. వర్షాకాలం చూస్తే దీని సొగసు బాగుండేదేమో. అయినా తక్కువేమీ లేదు నేను చాలా గులాబీల మధ్య నిలబడి ఫొటోలు తీసుకున్నాను. నేను సైన్స్ స్టూడెంట్ నేమో అక్కడున్న గులాబీల వెరైటీల శాస్త్రీయ నామాలను ఓ యాభై రకాల వరకు నా నోట్‌బుక్‌లో రాసుకున్నాను. ‘ఏం చెప్తావు ఆ పేర్లంటినీ టైం వేస్ట్ తప్ప, ఆ టైం కూడా ఎంజాయి చెయ్యి’ అని మావారు అంటున్నా నేను రాసుకున్నాను. అదో ఆనందం అంతే. పోనీ మీకు కొన్ని పేర్లు చెప్పనా? january linen, february skarlet, march lavender, april yellow, may erram pink, june peach, july bright pink, august orange, september red yellow, october apricot, november russet, december crimson అని పన్నెండు నెలల పేర్లతో పన్నెండు ఉన్నాయి. అవి చూస్తుంటే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. గులాబీ మొక్కల మధ్య అనేక నీటి ఫౌంటెన్లు ఉన్నాయి.

‘ఓపెన్ హ్యండ్ మాన్యుమెంట్’ అని ఒక చెయ్యి పైకి ఎత్తినట్లుగా ఉంటుంది. అక్కడికెళి ఫొటోలు తీసుకున్నాం. దీనిని చెక్కి డిజైన్ చేసింది ‘లీ కార్బుసియర్’. సెక్రటేరియట్ బిల్డింగ్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలన్నీ ఇతనే డిజైన్ చేశాడు. చండీఘర్ మ్యూజియమ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ, మ్యూజికల్ ఫౌంటెన్ వాలీ ఆఫ్ యూనిమిల్స్, కార్టస్ గార్డెన్, ఇంటర్నేషనల్ డాల్ మ్యూజియమ్ వంటివి ఎన్నో ఉన్నాయి. క్రికెట్ స్టేడియం, చండీఘర్ గోల్ఫ్‌క్లబ్, వాలీబాల్ కోర్టులు వంటివి చండీఘర్‌లో చాలా ఉన్నాయి. హై కోర్టు లోపలిదాకా వెళ్ళి చూశాం గానీ ఫొటోలు తియ్యనివ్వలేదు.

ప్రఖ్యాతమైన పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, DAW కాలేజీ, గోస్వామి గణేష్ దత్తా సనాతన ధర్మా కాలేజీ, మెడికల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. నేను ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ ప్రసిద్ధ యూనివర్సిటీలు, చూసి ఫొటోలు దిగడం అలవాటుగా చేసుకున్నాను. అంతే కాదు ఆ రాష్ట్ర ప్రముఖ పత్రికలు కూడా సేకరిస్తున్నాను. ఇక్కడ వీధుల పేర్లుండవు. సెక్టార్లు అని ఉంటాయి. సెక్టార్ 17లో పెద్ద షాపింగ్ మాల్ సిటీ సెంటర్ ఉంది. రోడ్లు చాలా నీట్‌గా ఉన్నాయి. రేపు రాక్ ఫెస్టివల్ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇది జాకీర్ హుస్సేన్ గార్డెన్‌లో జరుగుతుంది.

ఈ రాక్ గార్డెన్‌కు వెళ్ళాం. నేను ఈ రాక్ గార్డెన్‌ను చూడాలని ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నాను. మా పిల్లలు ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడు ఈ రాక్ గార్డెన్ గురించిన పాఠం ఉంది. దాని గురించి పిల్లలకు చెబుతున్నప్పుడు అనుకున్నాను, ‘ఎప్పటికైనా ఈ గార్డెన్ చూడాలని. ఎందుకు ఇంత గట్టిగా అనుకున్నానంటే ఈ రాక్ గార్డెన్ మొత్తం వ్యర్థమైన పదార్థాలతోనే నిర్మితమైనది. 1924లో నేక్ చంద్ ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశాడు. తన జీవితకాలమంతా శ్రమించి మనం పారేసే ప్రతి వస్తువునూ ఉపయోగించి కళా ఖండాలు రూపొందించాడు. దానిని ప్రభుత్వం గుర్తించి నేక్ చంద్ తయారుచేసిన కళాఖండాలన్నింటినీ ఒక చోటుకు చేర్చి రాక్ గార్డెన్ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నేను కూడా మా ఆసుపత్రిలోని వ్యర్థపదార్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నాను. కాబట్టి నాకీ ఆనందం. నేను కూడా ఎప్పటికైనా నేక్ చంద్‌లాల్ లాగా పెద్ద గార్డెన్‌ను నా బొమ్మలతో ఏర్పాటు చేయాలని కలలు కంటున్నాను.

రాక్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో నీటి సెలయేరులు, కొండలు, చిన్న చిన్న ఇరుకుదారులు అంతా ప్రకృతిలో ఏర్ప డినట్లుగా తయారు చేశారు. మధ్య మధ్య గోడలు కూడా ఈ రాళ్ళ వరసలే. రాళ్ళలో ఇంత ఆందం ఉందా అని ఆశ్చర్యపోక మానరు ఎవరైనా. సంద ర్శకులలో చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒక చోట గుర్రాలను వరుసగా నిలబెట్టినట్లుగా రాళ్ళు పేర్చబడి ఉన్నాయి. అక్కడ ఊగటానికి ఉయ్యాలలు ఉన్నాయి. అలాగే కోడి పుంజులు, నెమళ్ళు, చిలుకలు, పక్షులు, కుక్కపిల్లలు, పులు లు, సింహాలు ఒకటేమిటి అడవి ప్రపంచమంతా అక్కడే కొలువు దీరింది. ఇంకా మనుషులు బొమ్మ లు రకారకాల వాయిద్యాలతో ఉన్నాయి. చూస్తు న్నంతసేపూ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూడటమే. ఇదంతా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో పడిన శ్రమ అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చండీఘర్‌కు ఇదొక పెద్ద ఎట్రాక్షన్.

సభానా లేక్‌కు వెళ్ళినప్పుడు మన ‘లుంబినీ పార్క్’లా అనిపించింది. సాయంత్రం పూట సరదాగా పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వ స్తున్నారు. మేం వాళ్ల ఆటపాటల్ని చూస్తూ తిరు గుతున్నాం. ఇంతలో ఒక చోట ఇద్దరు ఆర్టిస్టులు కూర్చుని మన ఫొటోలు గీయించుకున్నాను. బాగా వచ్చింది. తొమ్మిదింటిదాకా ఉండి తర్వాత రూముకు వెళ్ళిపోయాం. ఆ తెల్లవారి చండీఘర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాం.

Story about Chandigarh Rose Garden

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కిరాక్ గార్డెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.