ఆర్టికల్ 370 తాత్కాలికమా, శాశ్వతమా?

  రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలిక స్వభావం కలిగినది తప్ప శాశ్వతమైంది కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దాన్ని తుండూ తుపాకీతో సహా మొత్తంగా లేపివేయాలని బిజెపి ప్రధాన కార్యదర్శి రావ్ మాధవ్ చెప్పారు. అది సాధ్యమయ్యేది కాదని సిపిఎం నేత మహమ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలూ స్పష్టం చేశారు. అమిత్ షా బిజెపి అధ్యక్షుడు కాగా రావ్‌ు మాధవ్ జమ్ము కశ్మీర్ రాష్ర్ట బిజెపి మార్గదర్శకుడు. వారిద్దరి ప్రకటనతో […] The post ఆర్టికల్ 370 తాత్కాలికమా, శాశ్వతమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలిక స్వభావం కలిగినది తప్ప శాశ్వతమైంది కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దాన్ని తుండూ తుపాకీతో సహా మొత్తంగా లేపివేయాలని బిజెపి ప్రధాన కార్యదర్శి రావ్ మాధవ్ చెప్పారు. అది సాధ్యమయ్యేది కాదని సిపిఎం నేత మహమ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలూ స్పష్టం చేశారు. అమిత్ షా బిజెపి అధ్యక్షుడు కాగా రావ్‌ు మాధవ్ జమ్ము కశ్మీర్ రాష్ర్ట బిజెపి మార్గదర్శకుడు. వారిద్దరి ప్రకటనతో ఈ అంశం మరోసారి దేశంలో చర్చనీయాంశం అయింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన అంశాల నుంచి జన దృష్టిని పక్కదారి పట్టించటంలో ఇద్దరూ అసమాన ప్రతిభావంతులే. అనేక సందర్బాలలో బిజెపి లేవనెత్తిన 370 ఆర్టికల్ గురించి గతంలో కూడా ఎంతో చర్చ జరిగింది. తమకు పార్లమెంట్‌లో పూర్తి అధికారం వస్తే అంటే రెండు సభల్లో మెజారిటీ సీట్లు వుంటే ఈ ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం వంటివి చేస్తామని బిజెపి చెబుతోంది. లోక్‌సభలో మెజారిటీ తెచ్చుకుంది.

రాజ్యసభలో మెజారిటీ కోసం తెలుగుదేశం వంటి పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించటం, గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఒకేసారి గాకుండా రెండు సార్లు జరిపి రెండింటినీ దక్కించుకొనేందుకు చూడటం వంటి కక్కుర్తి పనులకు పాల్పడుతున్నది. నేడున్న పరిస్థితుల్లో బిజెపి లేదా దాని కత్తి ఝళిపింపులకు భయపడి కొన్ని పార్టీలు బిజెపి చర్యలకు మద్దతు ఇవ్వటం లేదా దాని తీర్మానాలు నెగే ్గవిధంగా ఓటింగ్‌కు రాకుండా సాయం చేయటం వంటి పనులు చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా అన్నదే సమస్య.

గత ఐదు సంవత్సరాలలో ప్రతి చర్యకూ ఉగ్రవాదాన్ని ముడిపెట్టటం ఒక పథకం ప్రకారం జరుగుతోంది. మీడియా చర్చలు, రాతల్లో అనేక అంశాలను ఉగ్రవాదానికి ముడిపెడుతున్నారు. ఇరవై దేశాల బృందం (జి20) ఏర్పాటు ప్రపంచంలోని ముఖ్యమైన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒక పద్ధతి ప్రకారం ఒక దగ్గర చేర్చి ప్రపంచ ఆర్ధిక విషయాలను చర్చించే వేదిక అది. అక్కడ ఇతర అంశాలు చర్చకు రావా అంటే ద్వితీయ, తృతీయ ప్రాధాన్యతాంశాలుగా వస్తాయి. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ ఒసాకాలో జరిగిన ఆర్ధిక బృందమైన జి20 సమావేశాల్లో కూడా ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని సెలవిచ్చిన అంశం తెలిసినదే. జమ్ము కశ్మీర్‌కు 370, 35ఎ ఆర్టికల్స్ వంటి వాటిని వర్తింప చేసినందునే ఉగ్రవాదం తలెత్తిందనే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్వేషాలు, ఉద్రేకాలను తగ్గించుకొని భిన్న కోణాలను పరిశీలించటం అవసరం. ఆర్టికల్ 370 రాజ్యాంగ మౌలిక స్వభావానికి చెందినదని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేయచూడటం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చటమే అవుతుంది.

బిజెపి పార్టీ మాతృ సంస్ధ అయిన జన సంఘం మొదటి నుంచీ దీన్ని వ్యతిరేకిస్తోంది. అత్యవసర పరిస్ధితి అనంతరం జన సంఘాన్ని రద్దు చేసి జనతా పార్టీలో విలీనం చేసిన సమయంలో మినహా తిరిగి బిజెపి పేరుతో కొత్త దుకాణాన్ని తెరిచినప్పటి నుంచి పాత వ్యతిరేకతను కొనసాగిస్తోంది. ఈ శక్తుల పూర్వీకులతో పాటు అంబేడ్కర్, మరి కొందరు కూడా 370 ఆర్టికల్‌ను వ్యతిరేకించారు. ఇది దాస్తే దాగేది కాదు. అలాగే సదరు ఆర్టికల్‌ను కొనసాగించాలని కోరే పార్టీలు అంతకంటే ఎక్కువగా వున్నాయి.

ఆర్టికల్ 370 రాజ్యాంగబద్ధమైనది కనుక దాన్ని సవాలు చేసే అవకాశం లేదు. అందువలన దాని సంబంధితమైన ఆర్టికల్ 35ఎ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీకి చెందిన వుయ్ ద సిటిజన్స్ అనే ఒక సంస్ధ మరి కొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నది. ఇలాంటి ప్రజా సంబంధమైన అంశాలలో ఎవరైనా తమను కూడా ప్రతివాదులుగా చేర్చమని కోర్టును అభ్యర్థ్దించి చేరేందుకు అవకాశం వుంది. ఆ మేరకు భారత కమ్యూనిస్టు పారీ ్ట(మార్క్సిస్టు) చేరింది. ఇలాగే మరికొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ కేసులో ప్రతివాదులుగా చేరి జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటాన్ని కూడా సవాలు చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.
ఒక వేళ 35ఎ ఆర్టికల్‌ను కోర్టు గనుక కొట్టివేస్తే అది దాని ఒక్కదానికే పరిమితం కాదు, ఆర్టికల్ 370తో పాటు 1950 నుంచి ఇప్పటి వరకు చేసిన అనేక అంశాల చెల్లుబాటు సమస్య తలెత్తుతుంది.

అందువలన దాన్ని సవాలు చేయటం వెనుక ఉన్న ఎత్తుగడను అర్థం చేసుకోవటం కష్టం కాదు. అనేక మంది నిపుణులు రెండు ఆర్టికల్స్‌ను విడదీసి చూడలేమని చెప్పారు. సమస్య సుప్రీంకోర్టు ముందు వుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని శక్తులు అంగీకరిస్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి పిల్లల్ని కనే వయస్సు ఉన్న మహిళలు ప్రవేశించటాన్ని నిషేధించే ఆంక్షలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వాటి అనుబంధ సంస్ధలు వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన విషయం తెలిసిందే.

ఆర్టికల్ 35ఎ రద్దు లక్ష్యం ఏమిటి?
ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు ఎక్కువగా వున్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ తనకు కేటాయించిన భాగానికి పరిమితం కాకుండా పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి యూదులను రప్పించి పాలస్తీనా ప్రాంతాలలో అరబ్బులను మైనారిటీలుగా మార్చి వాటి స్వభావాన్నే మార్చేందుకు పూనుకున్న విషయాన్ని మనం చూశాము. కశ్మీరులో కూడా అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి హిందువులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తి, సంస్కృతి, సంప్రదాయాలను మార్చి వేయాలని అనేక మంది బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే.

అసలు ఆర్టికల్ 35ఎ ప్రధాన అంశాలు ఏమిటి ?
1956 నవంబరు 17న ఆమోదించిన ‘జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం’ లో శాశ్వత నివాసి (పర్మనెంటు రెసిడెంట్ -పిఆర్)కి చెప్పిన వివరణ ప్రకారం 1954 మే 14 వరకు ఉన్న రాష్ర్ట అంశాల ప్రకారం లేదా పది సంవత్సరాల పాటు రాష్ర్టంలో నివాసిగా వున్న వారు లేదా చట్టబద్ధంగా స్ధిర ఆస్తులను సంపాదించుకున్నవారు గానీ జమ్ము కశ్మీరులో శాశ్వత నివాసులుగా పరిగణించబడతారు. శాశ్వత నివాసి నిర్వచనాన్ని మార్చే హక్కు ఆ రాష్ర్ట శాసనసభకు మాత్రమే వుంది, దాన్ని కూడా మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించి వుండాలి. ఆ రాష్ర్ట రాజ్యాంగం అంగీకరించిన విచక్షణాధికారాల ప్రకారం అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే చట్ట సభలకు పోటీ చేసేందుకు, ఓటు హక్కుకు అర్హులు. శాశ్వత నివాసులు కాని వారు స్వంత ఆస్తులు కలిగి వుండటానికి, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగం పొందటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, లేదా ప్రభుత్వ నిధులు పొందిన వృత్తి విద్యా కాలేజీలలో చేరటానికి లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే జమ్ము కశ్మీర్ ప్రభుత్వం -భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పంద అవగాహన ప్రకారం ఈ రక్షణలు కల్పించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేసేందుకు బిజెపికి తగిన సంఖ్యా బలం లేదు, నేషనల్ కాన్ఫరెన్సు, పిడిపి రాజకీయంగా దెబ్బ లాడుకున్నా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో వుంటాయి. అందువలన జమ్ము ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం ప్రస్తుతం లేదని అందువలన అక్కడి అసెంబ్లీ సీట్లను పెంచాలన్నది బిజెపి ఆలోచన. దీనితో రెండు లక్ష్యాలను సాధించవచ్చు. ఒకటి పిఆర్ విధానాన్ని ఎత్తివేయవచ్చు, ఒకవేళ అది సాధ్యం గాకపోయినా జమ్ములో హిందూ మతస్ధుల ఓట్లతో కశ్మీర్‌లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నది దురాలోచన.

ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్ధితికి కాంగ్రెస్ నెహ్రూ నాయకత్వమే కారణమని ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘం, బిజెపి పాడిందే పాడుతున్నాయి. అది వారి రాజకీయం. కేంద్రంలో కాంగ్రెస్, ఎన్‌డిఎ ఎవరు అధికారంలో ఉన్నా, కశ్మీర్ వ్యవహారాలలో పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీటవేసి కశ్మీర్ సమస్యను సంక్లిష్టంగా మార్చారు. కశ్మీర్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ఇటు భారత్, అటు చైనా, సోవియట్ యూనియన్, పశ్చిమ, మధ్య ఆసియా మీద తమ పెత్తనాన్ని రుద్దాలని, మిలిటరీ వ్యూహాన్ని అమలు జరపాలని చూసిన బ్రిటీష్, అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రను నాటి కేంద్ర ప్రభుత్వ నాయకత్వం వమ్ము చేసిందని మరచిపోరాదు. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల ‘గూండా’ గా ఎలాంటి పాత్ర నిర్వహిస్తోందో మనం చూస్తూనే వున్నాం. మన ఈశాన్య రాష్ట్రాలను విడదీసి ప్రత్యేక రాజ్యాలను ఏర్పాటు చేయాలన్నది కూడా సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే.

ఈ రోజు కశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోవటానికి ఆర్టికల్ 370, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు ఇవ్వటం అని సంఘ పరివార్ ప్రచారం చేస్తున్నది. అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు. కశ్మీర్ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలలో, పంజాబ్‌లో వేర్పాటు, తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి, ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల పరిస్ధితి చక్కబడలేదు. వాటికేమీ ప్రత్యేక ఆర్టికల్, ప్రత్యేక ఏర్పాట్లు లేవు, అయినా ఉగ్రవాదులు ఎందుకు తయారైనట్లు? వీటన్నింటి వెనుక మన దేశాన్ని దెబ్బతీసే అమెరికా, ఐరోపా ధనిక దేశాల సామ్రాజ్యవాదుల హస్తం వుంది. ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకు ఆఫ్ఘన్ సర్కార్ ఆహ్వానం మేరకు గతంలో సోవియట్ యూనియన్ సైన్యాన్ని పంపింది. దానికి ప్రతిగా తాలిబాన్ ఉగ్రవాదులను తయారు చేసిన అమెరికా సోవియట్ సేనల ఉపసంహరణ వరకు మద్దతు ఇచ్చింది.

తరువాత ఆ తాలిబాన్లు అమెరికానే సవాలు చేయటంతో అంతకు ముందు వారిని దేశ భక్తులుగా చిత్రించిన అమెరికా ఉగ్రవాదులంటూ వారిని అణచేందుకు దశాబ్దాల తరబడి అక్కడ తన సైన్యంతో దాడులు చేసింది. చివరకు వారిని అణచలేక వారితో రాజీ చేసుకొని తన సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు ఇప్పుడు చర్చలు జరుపుతున్నది. మన దేశంలో విద్య, ఉద్యోగాలకు స్థానికతను ప్రాతిపదికగా తీసుకోవటం అన్ని రాష్ట్రాలలో వుంది. కాకపోతే కశ్మీర్‌లో అది పిఆర్ పేరుతో వుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇతరులకు పిఆర్ కాని వారికి హక్కు లేదన్నది ఒక వాదన, అలాంటి ఏర్పాట్లు మిగతా చోట్ల కూడా వున్నాయి. ముగింపులో ఒక చిన్న ప్రశ్న. రిజర్వేషన్లు తాత్కాలికం కనుక ప్రతి పది సంవత్సరాలకు వాటిని పార్లమెంట్ పొడిగిస్తున్నది. ఆర్టికల్ 370 తాత్కాలికం అయితే అలాంటి పొడిగింపు ప్రక్రియ పార్లమెంట్‌లో ఎప్పుడు జరిగిందో, దాని వ్యవధి ఎంతో ఎవరైనా చెబుతారా?

BJP early abrogation of Articles 370 of Constitution

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్టికల్ 370 తాత్కాలికమా, శాశ్వతమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: