బ్రాండ్ అంబాసిడర్లకు చిక్కులు

  దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలున్న కంపెనీలు ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఇంత అని ఒప్పందం చేసుకొని నటులు, క్రీడాకారులు ఆయా వస్తువుల వ్యాపార పెంపుకు తమ చరిష్మాను ఉపయోగిస్తున్నారు. వాహనాల కొత్త మోడల్స్ విడుదల, కొత్త షోరూంల ప్రారంభోత్సవాలకు ఈ బ్రాండ్ అంబాసిడర్ల సందడి కొనుగోళ్లను పెంచేస్తుంది. బ్రాండ్ ప్రచారానికి రావడమే కాకుండా ఆయా ప్రచార కర్తలకు వస్తువుకు సంబంధించిన పరిజ్ఞానం, సమాచారం తెలిసి ఉండాలి. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం […] The post బ్రాండ్ అంబాసిడర్లకు చిక్కులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలున్న కంపెనీలు ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఇంత అని ఒప్పందం చేసుకొని నటులు, క్రీడాకారులు ఆయా వస్తువుల వ్యాపార పెంపుకు తమ చరిష్మాను ఉపయోగిస్తున్నారు. వాహనాల కొత్త మోడల్స్ విడుదల, కొత్త షోరూంల ప్రారంభోత్సవాలకు ఈ బ్రాండ్ అంబాసిడర్ల సందడి కొనుగోళ్లను పెంచేస్తుంది. బ్రాండ్ ప్రచారానికి రావడమే కాకుండా ఆయా ప్రచార కర్తలకు వస్తువుకు సంబంధించిన పరిజ్ఞానం, సమాచారం తెలిసి ఉండాలి. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వగలగాలి.

ప్రపంచ వ్యాప్తంగా 195060 దశకాల మధ్య, మధ్య తరగతి జనాభా పెరిగిపోవడం వల్ల సబ్బులు, ఫేస్ పౌడర్, తల నూనెలు లాంటి వినిమయ వస్తువులకు ప్రచారం అవసరమైంది. అభిమాన సినీతారలను ఇందుకు వాడుకోవడం మొదలైంది. అయితే వినియోగదారుల చట్టాలు, వస్తు నాణ్యతపై ప్రభుత్వాల నిఘా, ప్రత్యేక న్యాయ స్థానాలు రావడంతో వస్తు ప్రచారం, అందులో నటులుగా పాల్గొనడం మునపటిలా ఆషామాషీ కాదు. నటనే కదా అని తేలిగ్గా తీసుకుంటే వస్తు నాణ్యత లోపిస్తే అమ్మకం దారుతో పాటు ప్రచార కర్తలు చట్టం దృష్టిలో దోషులు కాక తప్పదని చాలా దృష్టాంతాలున్నాయి.

ఈ మధ్యనే హిందీ నటుడు హృతిక్ రోషన్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. ఆయన చేసిన నేరమల్లా ఓ ఫిట్‌నెస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడమే. దేశ వ్యాప్తంగా శాఖలు ఉన్న కల్ట్ ఫిట్ అనే హెల్త్ కేర్ కంపెనీ బరువు తగ్గించే వ్యాయామానికి ఏడాదికి సుమా రు రూ. 30,000 వసూలు చేస్తోంది. బరువు గ్యారంటీగా తగ్గుతారు అని ఈ సంస్థకు హృతిక్ రోషన్ ప్రచారం చేస్తున్నాడు. ఆయన మాటలు నమ్మి చాలా మంది ఈ సంస్థలో సభ్యులుగా చేరారని అయితే ప్రయోజనం ఏమీ లేదని, అదంతా మోసమని బాధితుడొకరు కెపిహెచ్ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో సంస్థ యాజమాన్యంతో పాటు ప్రచార కర్తగా పాల్గొన్న హృతిక్ రోషన్‌ను కూడా ముద్దాయిగా చేర్చాడు. దాంతో హైదరాబాద్ పోలీసులు ఆయనపై చీటింగ్ కేసు పెట్టారు.

వినియోగదారుల చట్టాలు పదునెక్కుతున్నాయి. ప్రచార ప్రకటనల్లో పాల్గొనే వారు తమ మాటల ద్వారా వినియోగదారులను తప్పు తోవ పట్టిస్తే రూ. 10 లక్షల జరిమానాకు అర్హులవుతారు. ఆ ప్రచారాన్ని అలాగే కొనసాగిస్తే వినియోగదారు పరిరక్షణ చట్టం ప్రకారం జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్రచార చిత్రంలో నటించిన వారే కాకుండా దాని నిర్మాణం చేపట్టిన సంస్థలను కూడా కోర్టుకీడ్వవచ్చు. తాము నటించడానికి తొందరపడకుండా నటీనటులు, క్రీడా కారులు ముందుగానే ఆయా వస్తువుల నాణ్యత గురించి తెలుసుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా ఒప్పందానికి వచ్చే ముందు ఆయా వస్తు సేవల ప్రామాణికత గురించి కంపెనీల నుండి ధ్రువీకరణ పత్రాల్ని తీసుకోవాలి. ప్రయోగశాల నివేదికల్ని కూడా పరిశీలించాలని ప్రచార సంస్థల నిపుణులు అంటున్నారు. తమకు తెలిసి కూడా డబ్బు ఆశకు ప్రచారం చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. అంతేకాకుండా మంచి నటులుగా ప్రజాభిమానాన్ని చూరగొన్న వారికి దేశ పౌరులుగా సామాజిక బాధ్యత, నైతికత కూడా గుర్తు రావాలి.

జూన్ 2015లో మ్యాగి నూడిల్స్‌లో మోనో సోడియం గ్లుటమేట్ , సీసం ఎక్కువ మోతాదులో ఉందని ఓ వినియోగదారుడు ముజఫర్ నగర్ కోర్టులో కేసు వేశాడు. లాబ్ పరీక్షల ద్వారా ఆ విషయం తేలడంతో మ్యాగీ కంపెనీ 2 లక్షల పాకెట్లను వాపసు తెప్పించుకుంది. అయితే కేసులో మ్యాగీ కంపెనీతో పాటు దాని ప్రచారంలో పాల్గొన్న హిందీ నటీనటులు, అమితా బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపై అభియోగం మోపబడింది. ప్రచారం చేస్తే ఇంత బాధ్యత ఉంటుందా అని వాటిలో పాల్గొనే వారంతా ఖంగుతిన్నారు. ఐపిసి 270, 273, 276తో పాటు 420 సెక్షన్లు ఈ కేసుకు జోడించబడ్డాయి.

అడ్వర్‌టైజింగ్ స్టాండర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒప్పందాలకు ముందే మంచీ చెడూ ఆలోచించుకోవాలని సలహా ఇస్తోంది. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్‌కు ప్రచార కర్తగా పని చేయమని హిందీ నటి కంగనా రౌనత్‌ను కోరితే రంగు, జాతి పేరిట మనుషుల్ని కించపరచడం తప్పని ఆ వస్తు ప్రచారాన్ని తిరస్కరించింది. చట్టాలపై సరియైన అవగాహన లేకుండా ప్రచారం ద్వారా డబ్బు వస్తుందని తొందరపడితే నేరమే కాకుండా సమాజంలో అవమానమూ తప్పుదు. 2016లో పార్లమెంటరీ స్థాయీ కమిటీ సిఫారసుల ప్రకారం శిక్షలు పెరిగే అవకాశం కూడా ఉంది. పద్మశ్రీ స్థాయి గౌరవాలు పొందిన వారు భవిష్యత్తులో కోర్టు శిక్షకు గురయితే దేశానికే తలవంపుగా ఉంటుంది. కమిటీ ప్రకారం దుష్ప్రచారం చేసే వారికి తొలిసారిగా పది లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష, అదే తప్పు మళ్లీ చేస్తే రూ. 50 లక్షల జరిమానాతోపాటు 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఈ చిక్కుల్లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇరుక్కున్నాడు. ఢిల్లీలోని అమ్రపాలి గ్రూప్ నిర్మిస్తున్న ఓ గృహ సముదాయానికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాడు. అయితే ఆ సంస్థ మాట ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేయక కొనుగోలుదారుల్ని ఇక్కట్ల పాటు చేసింది. వందలాది మంది నీ ప్రచారం వల్లనే ఈ కంపెనీని నమ్మి డబ్బులు ఇచ్చామని, నమ్మి మోసపోయామని ఆయనను నిందించారు. ట్విట్టర్‌లో వాటి జోరు చూసి ధోనీ తల పట్టుకున్నాడు. రుద్ర బిల్ట్ వెల్ రియాల్టీ కంపెనీ కూడా కొనుగోలుదారుల్ని తిప్పలు పెట్టింది. దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోర్టు బెయిల్‌బుల్ వారెంటు జారీ చేసింది.

నీరవ్ మోడీ వజ్రాల నగల ప్రచారానికి ఆయనతో రాసుకు, పూసుకు తిరిగిన తారలు ఇప్పటికీ భయంగానే ఉన్నారు. సమాజంలో వస్తువుల పట్ల అవగాహన పెరగడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను, చిటికెలో ఎక్కించేస్తున్నారు. అవి విశ్వవ్యాప్తంగా చేయవలసిన నష్టాన్ని చేస్తున్నాయి. చిన్న తప్పుకు కూడా శిక్ష సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు కాపాడుతున్న పరువు ప్రతిష్ట జారిపోతోంది అన్న భయం, జాగ్రత్తలు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేయాలనుకునే వారు కొందరు తీసుకుంటున్నారు. ముందు చూపులేకపోతే ముప్పు తప్పుదు.

Case filed against actor Hrithik Roshan in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్రాండ్ అంబాసిడర్లకు చిక్కులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: