బాదుడు బడ్జెట్

         ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ( 5 లక్షల కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమనే ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్షాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టపడుతున్నది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ప్రైవేటుకు పెద్ద పీట వేయడం, విద్యుత్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నిర్మల పద్దు కేంద్ర బడ్జెట్ అంటే […] The post బాదుడు బడ్జెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         ఐదేళ్లలో 5 ట్రిలియన్ల ( 5 లక్షల కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమనే ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్షాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టపడుతున్నది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ప్రైవేటుకు పెద్ద పీట వేయడం, విద్యుత్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నిర్మల పద్దు కేంద్ర బడ్జెట్ అంటే తరచూ ప్రస్తావనకు వచ్చే వ్యక్తిగత ఆదాయపు పన్ను వర్తించే రాబడి పెంపు దాని శ్లాబుల్లో ఉపశమనం, రైతుకు ఊరట, అదనపు ఉద్యోగాల కల్పన వంటి అంశాల పట్ల ఆశించినంతగా దృష్టి కేంద్రీకరించలేదనే అభిప్రాయానికి తావిచ్చింది. పైపెచ్చు డీజెల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని సెస్సును లీటరు వద్ద రెండు రూపాయలు పెంచడం ద్వారా సాధారణ ప్రజానీకం జేబులకు అతిపెద్ద చిల్లు వేసింది.

ఈ చర్య ఆ రెండు ముఖ్య ఇంధనాల ధరలను మరింత పెంచడంతోపాటు రవాణా చార్జీలను హోరెత్తించి అన్ని వస్తువులను, ప్రయాణాన్ని ఇంకా ప్రియం చేస్తుంది. బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12 శాతానికి పెంచడం ద్వారా సాధారణ, మధ్య తరగతి ప్రజలకు దానిని ఈ బడ్జెట్ ఇంకా దూరం చేసింది. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి వీలైనన్ని మార్గాల్లో గుంజుకోడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బోధపడుతున్నది. ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి అపరిమితంగా పెరిగిందని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకున్నారు. పరోక్ష మార్గంలోనూ ప్రజలపై బాదుడు మోతెత్తిందని వివిధ పన్నుల ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. పాన్ కార్డు లేని వారు ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు ఆధార్‌ను కూడా ఉపయోగించుకోడానికి కల్పించిన వెసులుబాటు ఉద్దేశమూ రాబడి పెంచుకోడమే.

ప్రభుత్వ ఖజానా నిండుతోంది కాబట్టి ద్రవ్యలోటు అంచనాను 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించగలిగారు. ప్రధాని మోడీ దీనిని అభివృద్ధి హితమైన బడ్జెట్ అంటున్నారు. ఆ అభివృద్ధి జన హితమైనదా కాదా అనేది ముఖ్యం. ఈ దృష్టితో చూసినప్పుడు కాదనే అనుకోవలసి ఉంటుంది. ఎకైజ్, కస్టమ్స్ సుంకాలు పెంచడం ద్వారా రూ. 25 వేల కోట్ల రూపాయలు, అధికాదాయపరులపై అదనపు సర్‌చార్జీ నుంచి రూ. 12,000 కోట్లు ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇంత వరకు రూ. 250 కోట్ల టర్నోవర్ వర్తింప చేస్తూ వచ్చిన 25 శాతం కార్పొరేట్ పన్నును ఇక ముందు రూ. 400 కోట్ల కిమ్మత్తు టర్నోవర్ గల కంపెనీలకు కూడా వర్తింపచేయాలని తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా బడా పారిశ్రామికవేత్తల ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడేదే. ఈ వెసులుబాటు ఇక దేశంలోని 99.3 శాతం కంపెనీలకు వర్తిస్తుంది. ఇంకా మిగిలేది కేవలం 0.7 శాతం కంపెనీలే. రైల్వేలలో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని అందుకోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పుకున్నారు. రైల్వే ఆస్తులలోకి త్వరలో ప్రైవేటుకు గేట్లు బార్లా తెరుస్తారని అర్థమవుతున్నది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులు ఈ సారి కూడా మారలేదు. ఇది నికరాదాయ మధ్య తరగతి వర్గాలకు అత్యంత నిరాశను కలిగించింది. ఇలా కాకులను కొట్టి గద్దలకే వేసే నిర్వాకాన్ని నిర్మలా సీతారామన్ అత్యంత చాకచక్యంతో రక్తి కట్టించారు. దేశ ప్రజలలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు గణనీయంగా ఆనందం కలిగించే మేలు ఒక్కటీ లేకపోడమే ఈ బడ్జెట్ ప్రత్యేకత. ఏడాది మొత్తమ్మీద బ్యాంకు ఖాతా నుంచి కోటి రూపాయలకు మించి ఉపసంహరించుకునేవారి మీద 2.5 శాతం పన్ను ముక్కు పిండి వసూలు చేయబోడం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసమేనని చెబుతున్నారు. ఇది భూముల క్రయవిక్రయాలు, వేడుకలు తదితరాల కోసం అత్యవసరమై పెద్ద ఎత్తున డబ్బు డ్రా చేసుకునే వారికి పిడుగుపాటు వంటిది. మహిళలకు కొద్దో గొప్పో మేలు చేసినట్టు కనిపించిన ఈ బడ్జెట్ వాస్తవంలో వారి జీవన ముఖ చిత్రాన్ని మెరుగు పరచజాలదని చెప్పవచ్చు.

అలాగే పెట్టుబడి రహిత వ్యవసాయం అనే మాట వినిపించినంత తియ్యగా ఆచరణలో రుజువు కాదనేది సుస్పష్టం. దేశంలో అత్యధిక భాగం యువత సరైన నైపుణ్యాలు, ఉద్యోగాలు, ఉపాధులు కరవై తల్లడిల్లుతున్న దుస్థితికి బడ్జెట్ ఎటువంటి చెప్పుకోదగిన పరిష్కారాన్ని చూపించలేదు. కొత్తగా అవతరించి అన్ని రంగాలలోనూ అభివృద్ధి వికాసాల కోసం ఆరాటపడుతూ ముందడుగు వేస్తున్న తెలంగాణకు ఈ బడ్జెట్ అత్యంత నిరాశ కలిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి ప్రస్తావనలు లేకపోడం అత్యంత అన్యాయం. ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ద్వారా ప్రజలకిచ్చింది తక్కువ వారి దగ్గరి నుంచి తీసుకుంటున్నది ఎక్కువ. ఇది ఏ రకమైన వృద్ధి బడ్జెట్టో అవగతం కాదు.

Budget Speech by Finance Minister Nirmala Sitharaman

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బాదుడు బడ్జెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: