ముర్సీతోనే అరబ్ స్ప్రింగ్ అంతం

  ముర్సీ మరణించ లేదు. ఆయన్ను హత మార్చారు. కోర్టుహాల్లో కుప్పకూలిన ముర్సీని ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేశారు. వైద్య చికిత్స అందించ లేదు. ఇది ముమ్మాటికీ హత్యే అన్నారు టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్. ముర్సీ హత్య విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళతామని చెప్పారు. ఒక నియంత ఖైదులో మరణిస్తే, ఆ మరణం ఎలాంటిదైనా గాని అది హత్యే. అసలు ముర్సీపై ఆరోపణలే హాస్యాస్పదమైనవి. అలాంటి ఆరోపణలకు ఏళ్ళ తరబడి మాజీ దేశాధ్యక్షుడిని ఖైదులో ఉంచడం […] The post ముర్సీతోనే అరబ్ స్ప్రింగ్ అంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముర్సీ మరణించ లేదు. ఆయన్ను హత మార్చారు. కోర్టుహాల్లో కుప్పకూలిన ముర్సీని ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేశారు. వైద్య చికిత్స అందించ లేదు. ఇది ముమ్మాటికీ హత్యే అన్నారు టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్. ముర్సీ హత్య విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళతామని చెప్పారు. ఒక నియంత ఖైదులో మరణిస్తే, ఆ మరణం ఎలాంటిదైనా గాని అది హత్యే. అసలు ముర్సీపై ఆరోపణలే హాస్యాస్పదమైనవి. అలాంటి ఆరోపణలకు ఏళ్ళ తరబడి మాజీ దేశాధ్యక్షుడిని ఖైదులో ఉంచడం ఈజిప్టులో ఎలాంటి దారుణమైన నియంతృత్వం ఉందో తెలియజేస్తున్నది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముర్సీని మిలిటరీ కుట్రతో గద్దె దించి సిసి అధ్యక్షుడయ్యాడు. ముర్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 51 శాతం ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడున్న నియంత సిసి ఎన్నికల్లో 97 శాతం ఓట్లతో గెలుపొందారు. ఈ ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే చాలు ఎవరు ప్రజాస్వామికంగా గెలిచారో, ఎవరు నిరంకుశంగా గెలిచారో అర్థమవుతుంది. నిరంకుశంగా అణచివేతలకు పాల్పడినప్పుడే అత్యధిక శాతం ఓట్లు లభిస్తాయి. ఏది ఏమైనా చివరకు కైరో ఖైదులో ఈజిప్టు ప్రజాస్వామ్యం మరణించింది. విచిత్రమేమంటే, ముర్సీ మరణించిన తర్వాత చాలా హడావిడిగా, రహస్యంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇంత రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించవలసిన అవసరమేమొచ్చింది?

ముర్సీ ఎన్నికైన తర్వాత కేవలం ఏడాది మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఆయన్ను ఎలా దించాలన్న కుట్రలే నడిచాయి. ప్రజలను రెచ్చగొట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. అమెరికా ఒత్తిళ్ళకు లొంగిపోయి ఉంటే ముర్సీ తన పదవిలో కొనసాగి ఉండేవాడన్న మాటలు కూడా వినిపించాయి. ముస్లిం బ్రదర్ హుడ్‌కు చెందిన ముర్సీ చేసిన అతిపెద్ద తప్పు, ఆయనే స్వయంగా మిలిటరీతో చర్చలకు సిద్ధపడడం. ఆ మిలిటరీయే ఆయన్ను గద్దె దించింది. ఈ కుట్ర వెనుక అమెరికా హస్తం లేదంటే నమ్మలేం. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఈజిప్టు అధ్యక్షుడు విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు హాల్లో మరణించడం, ఆయన అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో నిర్వహించడానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్న సంఘటనలు. కాని మానవ హక్కులను భుజాన మోస్తున్నట్లు మాట్లాడే అమెరికా ఈ విషయంపై నోరు విప్పడం లేదు.

ముర్సీపై ఉన్న కేసు ఏమిటంటే, ఆయన పాలస్తీనా సంస్థ హమాస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు. హమాస్ తో మాట్లాడేవాడు కాబట్టి ఆయన గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో విచారిస్తున్నారు. కాని గాజాలో ఇజ్రాయెల్‌కు, పాలస్తీనా సంస్థ హమాస్ కు మధ్య కాల్పుల విరమణకు అవసరమైన చర్యలు తీసుకోవడం, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా చూడడం అనేది ఈజిప్టు అధ్యక్షుడిగా ఆయన బాధ్యతల్లో ఒకటి. ముర్సీ మాత్రమే కాదు, ఈ పని అంతకు ముందు హోస్నీ ముబారక్ కూడా చేశాడు. అంతేకాదు, ముర్సీ తర్వాత అధ్యక్షుడైన సిసి కూడా ఈ పని చేస్తున్నాడు. అంటే అధ్యక్షుడిగా ఆయన తన విధి బాధ్యతలు నిర్వర్తించిన నేరానికే ఆయనపై విచారణ జరుగుతుందన్నమాట. కాని, ఇదే పని చేస్తున్న సిసిపై ఎందుకు కేసు లేదంటే కారణాల కోసం వెదకనవసరం లేదు. ఎందుకంటే, అమెరికాకు తొత్తుగా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా ఇప్పటి ఈజిప్టు అధ్యక్షుడైన సిసి హమాస్‌తో చర్చలు చేస్తున్నాడు కాబట్టి ఆయనపై కేసు లేదు. కాని ముర్సీ అలా వ్యవహరించ లేదు. ఆయన స్వతంత్రుడిగా, ఇరుపక్షాల మధ్య న్యాయబద్ధ్దమైన పరిష్కారం సాధించే ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఆయనపై కేసు, విచారణలు. ఇదీ అమెరికా ప్రపంచంలో అమలు చేస్తున్న మానవ హక్కుల తతంగం.

ఈ కేసులో ముర్సీని విచారించి, ఆయనకు ఉరిశిక్ష విధించాలన్నదే అసలు ఉద్దేశం, కాని ముర్సీ ఈలోగా దేవుని సన్నిధికి హాజరై పోయారు. ముర్సీ మరణించే అవకాశాలున్నాయని ఈజిప్టు ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు తెలియదా? ముర్సీ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో ఆయన ఆరోగ్యం దిగజారిందని, వైద్య చికిత్స అవసరమని విజ్ఞప్తులు చేయడం లేదా? మానవ హక్కుల సంఘాలకు తెలియదా? అనారోగ్యంతో బాధపడుతున్న ముర్సీని రోజుకు 23 గంటల పాటు ఏకాంత కారాగారవాసంలో నిర్బంధించారన్నది తెలియదా?

ఆరేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే బంధువులు కలవడానికి అనుమతించారు. ఇవన్నీ ప్రపంచంలో మానవ హక్కుల గురించి మాట్లాడే దేశాలకు, సంస్థలకు తెలిసిన విషయాలే. కాని అందరూ మౌనంగా తమాషా చూశారు. నిజం చెప్పాలంటే అందరూ ఆయన మరణం కోసం ఎదురు చూశారు. ఈజిప్టులో నిరంకుశ మిలిటరీ నియంత పాలనలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన అధ్యక్షుడు కోర్టు హాల్లో మరణించిన తేదీల్లోనే డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ మెడలు ఎలా వంచాలా అనే పథకాల్లో తలమునకలై ఉన్నాడు. మిత్రదేశం ఈజిప్టు నియంత సిసికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రంప్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ముర్సీ రాజకీయాల్లో 2000 నుంచి ఉన్నారు. 2000 నుంచి 2005 వరకు పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థతో సన్నిహిత సంబంధాలుండేవి. 2011లో ముస్లిం బ్రదర్ హుడ్ చొరవతో ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ ఏర్పడింది. సెప్టెంబర్ 11 అమెరికాపై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించిన ముర్సీ, అమెరికాను కూడా ఆఫ్ఘనిస్తాన్ పై దాడులను తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల సాకుతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేశారన్నారు. పాలస్తీనా సమస్యకు సంబంధించి రెండు దేశాల పరిష్కారాన్ని కూడా ముర్సీ వ్యతిరేకించేవారు. పాలస్తీనా భూభాగాలను కబ్జా చేసే కుట్రగా పేర్కొనేవారు. 2012 ఎన్నికల్లో ముర్సీ ఈజిప్టు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

కాని ఆ తర్వాత ఆయన్ను పదవి నుంచి దించే ప్రయత్నాలు, కుట్రలు పెద్ద ఎత్తున జరిగాయి. నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ముర్సీ వ్యతిరేక ప్రదర్శనలుగా పేరు పొందాయి. ఈజిప్టు మిలిటరీ జోక్యం చేసుకుంది. మిలిటరీ జనరల్ సిసి సైనిక కుట్రతో ప్రభుత్వాన్ని పడగొట్టి ఈజిప్టు అధ్యక్షుడయ్యాడు. ముర్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిరసన ప్రదర్శనలకు దిగిన ప్రజలను హతమార్చారని, హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తదితర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని, గూఢచర్యం చేశారని ఆరోపణలు గుప్పించారు. 2015లో ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలు తీసుకున్నందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇతర నేరారోపణలపై విచారణలు కొనసాగించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ విచారణలను తీవ్రంగా విమర్శించింది. ముర్సీకి ఐదుగురు సంతానం. ఇందులో ఇద్దరు అమెరికా పౌరులు. ఎందుకంటే వారు అమెరికాలోనే పుట్టారు కాబట్టి.

Egypt ousted president Mohammed Morsi dies during trial

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముర్సీతోనే అరబ్ స్ప్రింగ్ అంతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: