శ్రీశ్రీ కడుపులోని శిథిల కవిత్వాస్థికలు

  ఎండిన తాటాకులకి మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వి జలావర్తాలు సృష్టించడం సమయం వస్తే తెర చాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు దిగంబర కవులు చేయవలసింది. సాయుధ పోరాటాన్ని నేను నొప్పుకన్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో […] The post శ్రీశ్రీ కడుపులోని శిథిల కవిత్వాస్థికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎండిన తాటాకులకి మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వి జలావర్తాలు సృష్టించడం సమయం వస్తే తెర చాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు దిగంబర కవులు చేయవలసింది. సాయుధ పోరాటాన్ని నేను నొప్పుకన్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో తుఫాను రాదు. తుఫాను వచ్చే ముందు సముద్రం ఎర్రబారుతుంది. సమాజం కూడా అంతే. వ్యక్తిగతంగా నక్సలైట్ల పట్ల అపారమైన సానుభూతి నాకుంది. అయితే నక్సలైట్ ఉద్యమం అలజడినీ, భయోత్పాతాన్నీ కలిగించగలదే కాని, దేశ సమస్యలకు పరిష్కార మార్గాన్ని మాత్రం చూపలేదు. నా దృష్టిలో సాయుధ విప్లవానికీ, నక్సలైట్ తత్వానికీ, వీరుడి చేతి కత్తికీ, హంతకుడి చేతి కత్తికీ వున్నంత తేడా వుంది. చివరకు నక్సలైట్ ఉద్యమం బాహ్యంతరాల్లో దుష్పరిణామాలకీ, దుష్ఫలితాలకీ దారితీస్తుంది. తీసింది కూడా. రాజకీయాలకు, మతతత్వాలకు, సంకుచిత తత్వాలకు అతీతంగా గిరుల్ని గీతల్ని, అవధుల్ని దాటి సర్వోన్నత స్థాయిలో స్వచ్ఛందంగా పలక వలసిన కవిత, సంకుచిత వలయాల్లోకి, రాజకీయాల బురద గుంటల్లోకి ఎందుకు ప్రవేశించవలసిన వచ్చింది? సముద్రాన్ని నదిలోకి మళ్లించాలనుకుంటున్న మీరు సముద్రాన్ని ఎప్పుడూ చూసిన పాపానపోలేదు.

రాజకీయాలు కవిత్వంలోకి ప్రవహిస్తాయి. కాని కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు. ఈ దేశంలో అన్యాయం, అక్రమం పేరుకుపోయిందని మీరే గుర్తించారు. కారణాల్ని మీరే పసిగట్టారు. శాస్త్రీయంగా చారిత్రక భౌతికవాదం, గతి తార్కిక భౌతికవాదం దృష్ట్యా వ్యవస్థని మీరే సమీక్షించి, దాన్ని దోపిడీ వ్యవస్థగా మీరే గుర్తించారు. కావచ్చు కాని కుష్టు వ్యవస్థగా మూడో సంపుటిలో పేర్కొనబడింది. దోపిడీ వ్యవస్థ మాత్రం కాదు. కుష్టు వ్యవస్థకి, దోపిడీ వ్యవస్థకీ ఎక్కడా పొత్తు లేదు. కుష్టు వ్యవస్థకి అసలు అర్థమేమిటో నగ్నమునికి తెలుసు.

ఎదగడం మానేసిన కవి శ్రీశ్రీ
శ్రీశ్రీ గొప్పవాడే. ఆయన గొప్పతనాన్ని భూతద్దంలో పెట్టి చూసి ప్రజలకు చూపించి ఆయన చుట్టూ చేరి, ఆయన్ని కీర్తీంచడం కూడా తమ కవిత్వంలో ఒక భాగమనుకున్న అభ్యుదయ కవులంతా చివరకు తమ తమ అస్తిత్వాల్ని, కవిత్వాల్నీ కోల్పోయి, శ్రీశ్రీ కడుపులోని శిథిల కవిత్వాస్థికలుగా మిగిలిపోయారు. ఇవాళ ఆ శ్రీశ్రీ అనే ఆకొన్న వృద్ధ సింహం చుట్టూ చేరి చెక్కభజన చేస్తున్న మీకు, ఆ దుర్గతి పట్టకుండా చూసుకోండి. ప్రజల తృప్తికోసం ఎదగడం మానేసిన కవి శ్రీశ్రీ.

“దిగంబర’ ముసుగెందుకు?
గౌతమబుద్దుడు సత్యాన్ని హఠాత్తుగా దర్శించి ప్రవచించినట్లు మార్క్సిజం, లెనినిజం గురించి కొత్తగా వ్యాఖ్యానిస్తున్న మిమ్మల్ని చూపి జాలిపడవలసి వస్తుంది. ఇన్నాళ్లూ అభ్యుదయ కవులూ, కమ్యూనిష్టు పార్టీ చేసిందేమిటి? ఇన్నాళ్లూ ప్రచారం చేసి రంగాన్ని సంసిద్ధం చేసిన వాళ్లంతా పనికిమాలిన వాళ్లయిపోయి నూతనంగా పీడిత సంచిత ప్రజా సంరక్షణార్థం తాము అవతరించవలసి వచ్చిందా? దిగంబర కవితోద్యమ ప్రారంభ దశలో మీలో ఒకడైనా మార్క్స్, మావోల పేరెత్తలేదు! వారిని చదివాక ఇప్పుడే జ్ఞానోదయమైందా! మార్స్జిజం పుట్టిన ఒక శతాబ్దం తరువాత, ఆ సిద్దాంతాల్ని అత్యధునాతనమైనవిగా ప్రచారం చేయడానికి కవులుగా మీకు సిగ్గెందుకు లేకుండా పోయింది? పోనీ మార్క్సిజాన్ని దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సిద్దాంతాన్ని ప్రచారం చేయడమే మీ ధ్యేయమైనప్పుడు, స్పష్టంగా ‘మేము మార్క్సిస్టు కవులమనో, మావోయిస్టు కవులమనో, సోషలిస్టు కవులమనో” చెప్పుకోడానికి సంకోచమెందుకు? ‘దిగంబర కవులు’ అనే ముసుగెందుకు? మీరు చెప్పేదే దిగంబర కవిత్వమైతే సి. విజయలక్ష్మి అది దిగంబర కవి.

నాలాంటి బుక్కాఫకీర్లు కొందరు పిచ్చి పిచ్చి అనుమానాలతో, అన్వేషణలతో ఏవేవో పలకరిస్తుంటారు. వాటిని మీరు లెక్కపెట్టకూడదు. సుఖపడ దలచుకున్న మీరు హిందూ నేషన్ నీ, గోరానీ, కాఫీ హౌస్ మిత్రుల్ని గట్టిగా నమ్మండి. (మార్క్స్ ఈ దేశంలో పుట్టి వుంటే చరిత్ర నిర్వచనం తీరు మరో విధంగా వుండేదేమో) మార్క్స్ సృష్టించిన భూతల స్వర్గం నుంచి పారిపోయి వచ్చిన బుద్దిజీవుల్ని నమ్మకండి. స్వెత్లానాను నమ్మకండి. కుబ్నెత్సోవ్‌ను నమ్మకండి. “1980 కల్లా రష్యా చిన్నాభిన్నమై కుళ్లి కంపుకొడుతుంద’ని రాసి, ఇటీవలనే అరెస్టయిన ప్రసిద్ధ యువరచయిత అమాల్‌రిక్‌ను నమ్మకండి. గుడ్లగూబల్ని గురువులుగా భావించి ముందు కు సాగిపోవడమే మన ధ్యేయం శుద్ధ నాస్తికవాదులం అంటూనే పెళ్లాం సాకుతో తిరుపతి తీర్థయాత్రలు సేవించడం, శాస్త్ర సమ్మతంగా పెళ్లాడటం, ఆధునిక వివాహాలకు అత్యాధునిక పౌరోహిత్యాలు నెరవడం, పెళ్లిళ్లకు దిక్ పఠనాలు చెయ్యడం, రాజకీయో పన్యాసాలకు తయారు కావడం ఇవన్నీ దిగంబర కవితా లక్షణాలని నేను ముందనుకోలేదు. నా దృష్టిలో దిగంబర కవిత్వ నిర్వచనమేదో కొత్తగా ఇవాళ చెప్పవలసిందేమీ లేదు. ఉద్యమాలు ఎంత బలవత్తరమైనవో అంత హానికరమైనవన్న నిర్ణయానికి నేను రావలసివస్తున్నది. ఏ ఇజానికో తాకట్టు పడివుంటే నేను దిగంబర కవిని కానక్కరలేదు. ఏ చెప్పులూ నా కాళ్లకి పట్టలేదు. ఏ దుస్తులూ నా ఒంటికి అతకలేదు. ఏ ఫ్రేములోనూ నా ఫోటో ఇమడలేదు. అందుకే నేను దిగంబర కవినయ్యాను.

ఒక ఇజానికి, ఒక విశ్వాసానికి కట్టుబడిపోయి, దిగంబర కవులుగా మిమ్మల్ని మీరు నరుక్కున్నారు. మీరు నమ్మినదాన్నే ప్రపంచమంతా విశ్వసించాలని దౌర్జన్యంగా శాసిస్తూ మీ అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారు. కట్టుబడిపోయిన మీకూ, దేనికీ కట్టుబడని నాకూ సంధి కుదరదు. పరిణామాల్ని ఊహించి మొహం చాటు చేసుకోవలసిన గతి మీకు పడుతుంది. నాకు కాదు. తాటాకు చప్పుళ్లతో, కాగితప్పులి గర్జనలతో భయపెట్టలేరు. నేను ఇస్తున్నది మీ Charge sheet కు explanations అనుకోకండి. మీ సందేహాలకు సమాధానం మాత్రమే. నా జేబుల్లో కొటేషన్లు ఎక్కడా లేవు బీడీలు తప్ప. మీ కొటేషన్లని మీరే తిరగదిప్పి తొడుక్కోవడం మంచిది.

(తనపై వచ్చిన విమర్శకు తెలుగు వె లుగు వార పత్రిక 1970, జులై 17, 24 తేదీల సంచికల్లో మహాస్వప్న ఇచ్చిన సమాధానంలోని కొంత భాగం)

                                                                               – సేకరణ: శ్యాం మోహన్

Naxal problem not an armed conflict, India tells UN

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీశ్రీ కడుపులోని శిథిల కవిత్వాస్థికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: