గురి తప్పిన గుప్తధన గణాంకాలు…

  విదేశాల్లో పోగుపడిన భారతీయుల అక్రమ ధనాన్ని లెక్క కట్టడమనే కీకారణ్యంలో దిక్కు తోచక దాని కిమ్మత్తు ఇంత అని ఇదమిత్థంగా చెప్పలేక పార్లమెంటరీ స్థాయీ సంఘం చేతులెత్తేసిన వైనం హాస్యాస్పదంగా ఉంది. దేశంలో పన్ను చెల్లించకుండా విదేశాలకు దొడ్డి దారిన తరలించిన గుప్త ధనం 1980 2010 మధ్య వివిధ కాలాల్లో 216.48 బిలియన్ల నుంచి 490 బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అనిర్ధారిత సమాచారాన్ని కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ అధ్యక్షతన గల ఆర్థిక […] The post గురి తప్పిన గుప్తధన గణాంకాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విదేశాల్లో పోగుపడిన భారతీయుల అక్రమ ధనాన్ని లెక్క కట్టడమనే కీకారణ్యంలో దిక్కు తోచక దాని కిమ్మత్తు ఇంత అని ఇదమిత్థంగా చెప్పలేక పార్లమెంటరీ స్థాయీ సంఘం చేతులెత్తేసిన వైనం హాస్యాస్పదంగా ఉంది. దేశంలో పన్ను చెల్లించకుండా విదేశాలకు దొడ్డి దారిన తరలించిన గుప్త ధనం 1980 2010 మధ్య వివిధ కాలాల్లో 216.48 బిలియన్ల నుంచి 490 బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అనిర్ధారిత సమాచారాన్ని కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం వెల్లడించిన తీరు ఆకుకు అందని పోకకు పొందని విధంగా ఉంది.

భారతీయుల గుప్త ధనం దేశం లోపల, బయట అసాధారణ స్థాయిలో పేరుకుపోయిందనే సంగతి అందరికీ తెలిసిందే. విదేశీ బ్యాంకుల్లోని రహస్య ఖాతాల్లో పోగుపడిన ఈ నల్లధనాన్ని తిరిగి రప్పించి పేదల ఖాతాల్లో వేస్తాననే వాగ్దానంతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్నది. 2016లో తీసుకున్న పెద్దనోట్ల రద్దు చర్య కూడా ఈ ధన రాశులను బయటపెట్టడానికే అని చెప్పారు. ఆచరణలో అది ఘోరంగా విఫలమైంది. ఎంత కిమ్మత్తు నోట్లను రద్దు చేశారో అంత డబ్బూ తిరిగి బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. పన్ను చెల్లించకుండా లెక్కలకందకుండా పోగేసుకున్న భారతీయ శ్రీమంతుల అక్రమ ధనాన్ని బయటికి రప్పించడం ఎలాగూ అసాధ్యమని పదేపదే రూఢి అవుతున్నది.

కనీసం దాని కిమత్తునైనా లెక్కగట్టలేని నిస్సహాయ స్థితిలో మన అధికార వ్యవస్థ పడిపోడమే ఆందోళనకరం. గుప్త ధనం కిమ్మత్తు నిర్దారించడానికి మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం 2011 మార్చిలో నియమించిన 3 కమిటీలలో ఒకటి 2013 డిసెంబర్‌లో, ఇంకొకటి 2014 జూలైలో, మరొకటి అదే ఏడాది ఆగస్టులో సమర్పించిన నివేదికలను వీరప్ప మొయిలీ కమిటీ ప్రాతిపదికగా తీసుకున్నది. ఇప్పటికీ వెలుగు చూడని ఈ నివేదికలలో ఆ కమిటీలు వేర్వేరు పద్ధతుల ద్వారా వివిధ కాలాలకు చెందిన గుప్త ధన అంచనాలను రూపొందించాయి. అందుచేత వీరప్ప మొయిలీ కమిటీ కూడా అదే అస్పష్టతను తన నివేదిక ద్వారా దేశ ప్రజలపై రుద్దింది. రూపాయిల్లో ఈ గుప్త ధనం 15 లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పడమంటే ఊట బావి నుంచి సముద్రమంత కిమ్మత్తు అనడమే.

దీని వల్ల ప్రయోజనం శూన్యం. స్థూల దేశీయోత్పత్తిలో 7 నుంచి 120 శాతం వరకు ఉండగలదనడమంటే గురికి ఆమడ దూరంలో చూపినట్టే. రియల్ ఎస్టేట్, గనుల తవ్వకం, ఔషధ పరిశ్రమ, పాన్ మసాలా, గుట్కా, బంగారం, విద్యా రంగాల నుంచి ప్రధానంగా గుప్త ధనం ఉత్పన్నమవుతున్నదని అందరికీ తెలిసిన విషయాన్నే మొయిలీ కమిటీ తవ్వి తీసింది. పబ్లిక్ రంగం పాలకుల, ఉద్యోగుల అవినీతి, అక్రమాల వల్ల భ్రష్ఠు పట్టిపోయి ప్రజా ప్రయోజనాన్ని బలి తీసుకుంటుంది. ప్రైవేటు రంగం దాని యజమానుల అమిత లాభార్జన దృష్టితో విశేష సంపదలను పోగేసుకోవాలనే పేరాశ దురాశలతో ప్రజలకు చెప్పనలవికాని హాని తలపెడుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్న ప్రైవేటు వ్యాపార, పారిశ్రామిక వర్గాలు చట్టబద్ధంగా దానిపై చెల్లించాల్సిన పన్నును ప్రభుత్వానికి కట్టేస్తే అది ప్రజా ధనంగా మారి దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంక్షేమాది జనహిత రంగాలకు కావాల్సినంత ధనం ప్రభుత్వాల వద్ద ఉంటుంది. గుప్త ధనాన్ని తమంత తాముగా బయట పెట్టేవారికి ప్రోత్సాహకాలను, రాయితీలను కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన సందర్భాలున్నాయి. కాని అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. పన్ను భారాన్ని బాగా తగ్గిస్తే చెల్లింపులు కూడా పెరిగి గుప్త ధనం పేరుకుపోడం తగ్గుతుందనే అభిప్రాయం కూడా ఉన్నది. కాని అందుకు తగిన పద్ధతులను రూపొందించి నిబద్ధతతో పన్నులు వసూలు చేసే నిజాయితీతో కూడిన యంత్రాంగమే అవతరించడం లేదు.

చివరికి ఎంతో ఆదర్శమనుకొన్న వస్తు, సేవల (జిఎస్‌టి) పన్ను కూడా అమిత భారం మోపడంతో అక్రమాలకు దారి తీసింది. ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సహేతుకం చేయాలని వీరప్ప మొయిలీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే గుప్త ధనం వెలికితీత కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలనీ చెప్పింది. పై నుంచి కింది వరకు ప్రజా ధనాన్ని పవిత్రంగా చూసి ఖజానాకు చేర్చే నిజాయితీ అణువంత కూడా లేని వర్తమాన అవినీతిమయ నేపథ్యం గుప్త ధనం మరింతగా పోగులు పడడానికే దోహదం చేస్తుంది కాని దానిని బయటికి రానీయదు.

Black money Accumulated Abroad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గురి తప్పిన గుప్తధన గణాంకాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.