పసిబిడ్డలపై పశువాంఛ…

  ఎన్ని సార్లు ఎంతగా ఆవేదన వ్యక్తం చేసి ఆందోళన చెందినా, బాధతో, సిగ్గుతో తల వంచుకున్నా, ఇదేమి ఘోరమని సమాజాన్ని నిలదీసి ప్రశ్నించినా, పోలీసులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందికి శిక్షలు పడేటట్టు చేసినా బాలలపై అత్యాచారాలు, హత్యలు, వారి హక్కుల కాలరాత నిరాఘాటంగా మరింతగా సాగిపోతుండడాన్ని ఏమనాలి? మనం ముందుకా, వెనక్కా, ఎటు పోతున్నాం? 9 నెలల ఆడ శిశువుపై ఒక యువకుడు పశు వాంఛ తీర్చుకోడానికి ప్రయత్నించగా ఆ బిడ్డ మృతి […] The post పసిబిడ్డలపై పశువాంఛ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్ని సార్లు ఎంతగా ఆవేదన వ్యక్తం చేసి ఆందోళన చెందినా, బాధతో, సిగ్గుతో తల వంచుకున్నా, ఇదేమి ఘోరమని సమాజాన్ని నిలదీసి ప్రశ్నించినా, పోలీసులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందికి శిక్షలు పడేటట్టు చేసినా బాలలపై అత్యాచారాలు, హత్యలు, వారి హక్కుల కాలరాత నిరాఘాటంగా మరింతగా సాగిపోతుండడాన్ని ఏమనాలి? మనం ముందుకా, వెనక్కా, ఎటు పోతున్నాం? 9 నెలల ఆడ శిశువుపై ఒక యువకుడు పశు వాంఛ తీర్చుకోడానికి ప్రయత్నించగా ఆ బిడ్డ మృతి చెందిన అంతింతనరాని అమానుషం హన్మకొండ లో జరిగి గట్టిగా వారం రోజులైనా తిరక్కముందే హైదరాబాద్ జవహర్ నగర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన ఘటన వార్తల కెక్కింది.

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం బాలలపై అమానుషాలకు సంబంధించి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 70 ఘటనలు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఇవి అధికారిక గణాంకాలే. బయటకు పొక్కని దురంతాలు మరెన్ని ఉన్నాయో చెప్పలేం. ఎందుకంటే బాలలు తమపై జరిగే అత్యాచారాలు అటువంటి ప్రయత్నాల గురించి బయటికి చెప్పలేరు. ఒకవేళ చెప్పినా పరువుకి భయపడి తల్లిదండ్రులు పోలీసుల వరకు వెళ్లరు. హైదరాబాద్‌లోని నేరేడుమెట్‌లో 5 ఏళ్ల బాలికపై కన్న తండ్రే దాదాపు రెండేళ్లుగా అత్యాచారం జరిపినట్టు ఇటీవల నమోదైన ఈ కేసు హద్దులు మీరిన అమానుషత్వానికి తార్కాణం.

35 ఏళ్ల ఒక ఆటోడ్రైవర్ తాగిన మత్తులో కన్న కూతురుపైనే పశువులా ప్రవర్తించిన ఘాతుకమూ జరిగిపోయింది. మరో ఘటనలో ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల పొరుగు వ్యక్తి అత్యాచారం జరిపాడు. బాలలపై అత్యాచారాల కేసుల్లో 70 శాతం వరకు 14, 17 ఏళ్ల వయసులోని వారిపైనే జరుగుతున్నట్టు అత్యంత దారుణమైన ఘటనల్లో బాధితులు ఏడేళ్ల లోపువారని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్మార్గానికి ఆడ పిల్లలతోపాటు చిన్న వయసులోని బాలురు కూడా బలైపోతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే హైదరాబాద్‌లో 34 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసు బాలుడిపై అత్యాచారానికి సంబంధించినది. బాల్యంలో అత్యాచారాలు జరిగే బాలికలను ఆ ఘటనలు జీవితాంతం వెంటాడి వారి బతుకులను నాశనం చేస్తున్న సందర్భాలనేకం ఉన్నాయి.

ఆరేళ్లప్పుడు తనపై జరిగిన దుర్మార్గం గురించి 16 ఏళ్ల వయసులో వైద్యులకు చెప్పుకున్న ఒక బాలిక ఉదంతం వెలుగులోకి వచ్చింది. పసి వయసులో జరిగిన లైంగిక దాడిని మరిచిపోలేక ఆమె పదేపదే శోక సాగరమైపోయి మానసికంగా కుంగిపోయిన సందర్భాలనేకం ఉన్నాయి. ఇంకో ఘటనలో తనపై బాల్యంలో జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చి తలిదండ్రులు పెళ్లి చేశారని తాను మాత్రం దానిని మరచిపోలేక భర్తతో కాపురం చేయలేక చివరికి విడాకులు తీసుకున్నానని ఒక మహిళ చెప్పడం గమనార్హం. జీవితాలను ఇలా నాశనం చేస్తూ బతికున్నంత కాలం పీడకలలా వెన్నాడే ఈ అత్యాచారాలను చట్టాలు నిరోధించలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే తమ బిడ్డల పట్ల మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. బాలలపై అత్యాచార ఘటనలలో అత్యధికం దగ్గరి వారు, తెలుసున్న వారు చేస్తున్నవేనని తరచూ వెల్లడవుతున్నది. ఇంటి దొంగలను పట్టుకోడం ఈశ్వరుడికైనా సాధ్యం కాదనే సామెత ఉన్నది. అందుచేత తల్లులు బిడ్డలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉన్నది. పాఠశాలల్లో, క్రీడల కోచింగ్ సెంటర్లలో, పని స్థలాలలో బాలలపై అత్యాచార ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అటువంటి చోట్ల కూడా సిసి కెమెరాలవంటివి పెట్టి నిఘా ఉన్నదనే భయాన్ని ఈ నేర మనస్తత్వం ఉన్నవారిలో కలిగించాలి.

దేశంలో పోక్సో చట్టం వర్తించిన బాలలపై అత్యాచారాలు, అపహరణలు తదితర ఘటనలు 2014లో 8904 జరగ్గా, అవి 2015 నాటికి 14913కి చేరాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో సంభవిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఉన్నాయి. వ్యక్తులు, కుటుంబాలు మరింత అప్రమత్తత వహించడమే కాకుండా ప్రభుత్వాలు, ఆయా సమాజాలు కూడా ఇతోధికమైన బాధ్యత వహించి ఈ దారుణ దురాగతాల నుంచి బాల్యాన్ని కాపాడవలసి ఉంది.

చట్టం చెబుతున్న మేరకు కేసులు దాఖలు చేయడం తగిన శిక్షలు వీలైనంత త్వరగా పడేటట్టు చూడడం ఎంతైనా అవసరం. అలాగే కేసుల తీవ్రతను బట్టి బాధితులు గౌరవంగా బతకడానికి అవసరమైనంత పరిహారాన్నిచ్చి సురక్షితమైన వాతావరణాన్ని కలిగించవలసి ఉంది. ఇటువంటి ఘటనలు ఎటువంటి పరిసరాల్లో ఏ జీవన స్థితుగతుల్లో గల వారి మీద జరుగుతున్నాయో సామాజిక కోణంలో ఆరా తీసి వాటి పరంగానూ దిద్దుబాటు చర్యలు తీసుకోడం అవసరం.

Sexual assaults should be curbed

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పసిబిడ్డలపై పశువాంఛ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.