అమిత జన భారం!

      ఎనిమిదేళ్లు గడిచే సరికి జనాభాలో భారత దేశం చైనాను మించిపోతుందన్న ఐక్యరాజ్య సమితి తాజా అంచనా మన పాలకులకు, అభివృద్ధి వ్యూహ కర్తలకు పెను సవాలు విసురుతున్నది. భూ పరిమాణం పరంగా అమెరికాలో మూడోవంతు మాత్రమే అయిన భారత్ జనాభా పరంగా దాని కంటే పది రెట్లు కాగలదని కూడా సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఏడాదికి రెండుసార్లు జరిపే ఈ అధ్యయన నివేదిక ఇటీవలే విడుదలైంది. దేశాల జన సంఖ్యను బట్టి […] The post అమిత జన భారం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

      ఎనిమిదేళ్లు గడిచే సరికి జనాభాలో భారత దేశం చైనాను మించిపోతుందన్న ఐక్యరాజ్య సమితి తాజా అంచనా మన పాలకులకు, అభివృద్ధి వ్యూహ కర్తలకు పెను సవాలు విసురుతున్నది. భూ పరిమాణం పరంగా అమెరికాలో మూడోవంతు మాత్రమే అయిన భారత్ జనాభా పరంగా దాని కంటే పది రెట్లు కాగలదని కూడా సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఏడాదికి రెండుసార్లు జరిపే ఈ అధ్యయన నివేదిక ఇటీవలే విడుదలైంది. దేశాల జన సంఖ్యను బట్టి ప్రపంచ వనరుల పంపిణీ జరిగితే వేరుగాని పరిమిత వనరులున్న చోట జనాభా పెరుగుదల అదుపు లేకుండా సాగిపోతే మంది పెరిగి మజ్జిగ పలచనైన సామెత చందంగా ఉంటుంది. మరణాలను బట్టి జననాలు చోటు చేసుకొని జన సంఖ్య స్థిరంగా ఉండాలంటే ఒక్కొక్క మహిళ 2.1 మంది పిల్లలను మాత్రమే కనాలి.

మన దేశంలో ఇప్పుడు ఒక్కో మహిళకు 2.3 జననాలు రికార్డవుతున్నాయి అంటే జనాభా పెరుగుదల పరిమితికి మించి జరుగుతున్నది. ప్రపంచ భూ భాగంలో భారత్ వాటా కేవలం 2.4 శాతం కాగా, జనాభాలో మాత్రం 17.75 శాతంగా ఉన్నది. భారత దేశం ప్రస్తుత జనాభా దాదాపు 137 కోట్లు. అయితే అధిక జనాభాతో పాటు పని వయసు జనం కూడా మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం దేశ జనాభాలో మూడోవంతు మంది ఉంటారు. ఇది ఒక రకంగా దేశానికి మేలు చేసే అంశమే. ఈ పిల్లలు పని వయసుకు వచ్చే సరికి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితేనే అది దేశ సంపదగా రూపాంతరం చెందుతుంది. ఇదే వయసులోని బాలలు చైనా జనాభాలో ఐదింట ఒక వంతుగా ఉన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో దేశంలోని పని వయసు జన సంఖ్య 20 కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా.

ప్రస్తుతం దేశంలోని 15 నుంచి 30 ఏళ్ల వయసులోని వారిలో 30 శాతం మంది ఏ ఉద్యోగమూ, శిక్షణ లేకుండా ఉన్నారన్న చేదు సత్యాన్ని గమనించవలసి ఉన్నది. ఇప్పటికే ఉన్న చేతులకు పని కల్పించలేని దుస్థితిలోని దేశం భవిష్యత్తులో అసాధారణంగా పెరగనున్న జనాభాకు ఉపాధి, ఉద్యోగాలను ఎలా కల్పిస్తుందన్నది కీలక ప్రశ్న. పాశ్చాత్య దేశాలను అనుకరించి యాంత్రీకరణను హద్దుల్లేకుండా ప్రోత్సహిస్తున్న చోట మానవ శ్రమకు అవకాశాలెలా పెరుగుతాయి? వృద్ధి రేటు విశేషంగా పెరుగుతున్నదని జబ్బలు చరుచుకోడమే తప్ప దాని వల్ల అదనపు ఉద్యోగాలు ఆశించినంతగా కలగడం లేదనే చేదు వాస్తవాన్ని పాలకులు గమనించడం లేదు. అంకెల్లో కనిపిస్తున్న అధిక వృద్ధి రేటు ఫలాలు సామాన్యులకందడంలేదని సందేహాతీతంగా స్పష్టపడుతున్నది.

జనాభాలో 25 శాతం మంది రోజుకు 100 130 రూపాయల ఆదాయంతో బతుకులు వెళ్లదీస్తున్నారంటే దారిద్య్రం ఎంత దట్టంగా ఉన్నదో గమనించవచ్చు. ప్రపంచం మొత్తమ్మీద గల ప్రతి ముగ్గురు పేదల్లో ఒకరు భారత దేశంలోనే ఉన్నారు. ఆధునిక నైపుణ్యాలు లేకపోడం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మరో అతి పెద్ద సమస్య. విద్య మీద, ఆధునిక వృత్తిగత శిక్షణ మీద ప్రభుత్వాలు విశేషంగా నిజాయితీగా ఖర్చు పెడితేగాని ఈ దుస్థితి తొలగదు. యువత నేటి సమాజావసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పొందలేరు. దేశంలోని సగం మంది బాలలు పోషకాహార కొరతతో బాధపడుతున్నారు. చైనాలో మొత్తం బాలలందరికీ రోగ నిరోధక టీకాలు వేయగలుగుతుంటే మన దేశంలో కేవలం మూడింట రెండువంతుల మందే ఈ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ లేమి దేశాన్ని ఇంకా పట్టిపీడిస్తున్నది.

చైనాలో పుట్టిన ప్రతి వెయ్యి మంది బాలల్లో 11 మంది చనిపోతుంటే మన దేశంలో ఆ సంఖ్య 38 కావడానికి పారిశుద్ధ లేమి, శిశు వైద్యం అందుబాటులో లేకపోడం కారణాలని చెప్పక తప్పదు. వీటన్నింటికీ తోడు ఆడ శిశువు పట్ల ద్వేషం, అయిష్టత మన దేశంలో అసాధారణం. పుట్టబోయే బిడ్డ ఆడో మగో ముందుగానే తెలుసుకొని స్త్రీ శిశువైతే గర్భంలోనే మట్టుబెట్టే అమానుషం, నిషేధ చట్టమున్నా నిరవరోధంగా కొనసాగుతూనే ఉంది. దీని వల్ల పెళ్లీడు మగ వారికి ఆడ పిల్లలు దొరకని దుస్థితి ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకున్నది. వనరులు చాలకపోడం ఒక సమస్య అయితే, మూఢనమ్మకాలు, స్త్రీ వ్యతిరేకత వంటి సామాజిక దుర్లక్షణాల బెడద మరొకటి. ఇందువల్ల వాస్తవ దేశాభివృద్ధి నత్తనడకే నడుస్తున్నది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే జనాభా చైనాను మించి పోయినప్పుడు ఇంకెంత కష్టంగా మారుతుందో! ముందు చూపుతో తగిన వ్యూహ రచన చేసి అమల్లోకి తేవాలి.

India’s population grew twice as fast as China

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమిత జన భారం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: