చెన్నై దాహం

  కొద్ది సంవత్సరాల క్రితం భారీ వరదల్లో వీధులు, భవనాలు మునిగిపోయి విలవిలలాడిపోయిన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం ఇప్పుడు చుక్క నీటి కోసం కటకటలాడుతున్నది. తీరని దాహార్తితో తల్లడిల్లతోంది. నగరం దప్పిక తీర్చే రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. స్కూలు పిల్లలు ఇంటి నుంచే అదనపు వాటర్ బాటిల్స్ మోసుకు వెళుతున్నారు. మురికి వాడల్లోని నిరుపేదలు కూడా బక్కెట్‌కు రూ. 20 చెల్లించి నీరు కొనుక్కుంటున్నారు. ఐటి కంపెనీలు సిబ్బందికి మంచి నీటిని సరఫరా చేయలేక ఇంటి […] The post చెన్నై దాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

  కొద్ది సంవత్సరాల క్రితం భారీ వరదల్లో వీధులు, భవనాలు మునిగిపోయి విలవిలలాడిపోయిన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం ఇప్పుడు చుక్క నీటి కోసం కటకటలాడుతున్నది. తీరని దాహార్తితో తల్లడిల్లతోంది. నగరం దప్పిక తీర్చే రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. స్కూలు పిల్లలు ఇంటి నుంచే అదనపు వాటర్ బాటిల్స్ మోసుకు వెళుతున్నారు. మురికి వాడల్లోని నిరుపేదలు కూడా బక్కెట్‌కు రూ. 20 చెల్లించి నీరు కొనుక్కుంటున్నారు. ఐటి కంపెనీలు సిబ్బందికి మంచి నీటిని సరఫరా చేయలేక ఇంటి నుండే పనిచేసుకోమని చెబుతన్నాయి. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు ముందుగానే వెళ్లిపోయి అక్కడే స్నానాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా, మరెంత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. చెన్నై నగరంలో వర్షాలు అధికంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే పడతాయి.

అప్పుడు కురిసే వాన నీటిని నిల్వ చేసుకొనే మార్గాలు దాదాపు మూతబడ్డాయి. ఒకప్పుడు నగరంలో అసంఖ్యాకంగా చెరువులుండేవి. వాటిలో 150 వరకు ఇప్పుడు కనుమరుగయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధన దాహానికి బలయిపోయి మట్టి దిబ్బలుగా మారిపోయాయి. బకింగ్ హామ్ కెనాల్ వంటి జల వనరులు ఎండిపోయాయి. రోజుకి 1300 ఎంఎల్‌డి మంచి నీరు అవసరమయ్యే చెన్నైకి మామూలు రోజుల్లోనే 830 ఎంఎల్‌డి సరఫరా అవుతుండేది. ఇప్పుడు అది 500 ఎంఎల్‌డికి పడిపోయిందని అధికారులు చెబుతున్న మాటను పురవాసులు నమ్మడం లేదు. నీటి సరఫరాలో 80% కొరత ఏర్పడినట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఎత్తి చూపుతున్నారు. ఇప్పటికి వరుసగా దాదాపు ఆరున్నర మాసాలుగా వర్షాల్లేవంటే కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కరలేదు. ఇటీవలే ఒకటి రెండు వర్షాలు కురిశాయని వాటి వల్ల కలిగే ఉపశమనం అంతంత మాత్రమేనని అంటున్నారు.

ఎప్పుడు కురుస్తుందోనని వాన చినుకు కోసం ఆకాశం వంక ఆశగా చూసి నిరాశ చెందడం నగర వాసులకు అలవాటైపోయింది. చెరువులు, దొరువులు కబ్జాకు గురి కావడమే గత 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని ఈ నీటి కొరతకు ప్రధాన కారణమని స్పష్టపడుతున్నది. ఇది ఒక్క చెన్నై నగరం సమస్యే కాదు. దేశంలోని ఇతర నగరాలకు కూడా ఇదే దుస్థితి ఎదురైతే ఆశ్చర్యపోనవసరం లేదు. వాణిజ్య సంస్కృతి హద్దులు మీరి లాభార్జనే ధ్యేయమైన తర్వాత పెద్ద పెద్ద మాల్స్, హైటెక్ సిటీలు, అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన భవన నిరాణాలు జోరందుకొని నీటి చుక్క చొరబడడానికి సందిచ్చే నేల కరవైపోయింది. భూ గర్భ జల మట్టాలు అడుగంటిపోయాయి. 1991 జనాభా లెక్కల ప్రకారం చెన్నై జన సంఖ్య 39 లక్షలు కాగా, ఇప్పుడు 50 లక్షలు దాటిపోయి 70 లక్షలకు చేరిందని అంచనా. ఈ స్థాయిలో నగరం విస్తరించుకుంటున్నప్పుడు అందుకు తగిన పౌర సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల పని.

అది జరుగుతున్న జాడలు లేవు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకుడు గుంతల వంటి వాన నీటి సంరక్షణ సదుపాయాల్లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వరాదనే నిబంధన పాక్షికంగానైనా అమలైంది. అదే ఈ రోజున ఎంతో కొంత తరణోపాయంగా ఉపయోగపడుతున్నదని నగర వాసులు చెప్పుకుంటున్నారు. ఈ జల సంక్షోభం వల్ల అధికంగా బాధపడుతున్నది నిరుపేదలేనన్నది సుస్పష్టం. ఆ విధంగా కనీసం నాలుగో వంతు మంది జనాభా ముఖం కడుక్కోడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కాల కృత్యాలకూ మాల్స్‌ను, హోటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కొరత కొట్లాటలకు దారి తీస్తుంది. చెన్నైలో నీటి కోసం జనం ఎగబడడం వల్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు వచ్చే ఫిర్యాదులు పెరుగుతున్నాయని సమాచారం. నీటి అవసరం ఎటువంటిదో కరువులోనే తెలుస్తుంది. పుష్కలంగా లభించినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వృథా చేస్తాం.

నగరీకరణ ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా సాగిపోయే చోట అనేక సమస్యలతోపాటు మంచి నీటి కొరత ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. ప్రభుత్వ, మునిసిపల్ వ్యవస్థలు చేసే సరఫరా చాలక ప్రైవేటు నీటి వ్యాపారం కోరలు చాస్తుంది. ఇందుకు పేదలు, నికరాదాయ వర్గాల జేబులు బలైపోతుంటాయి. దాని ప్రభావం ఇతర జీవనావసరాల మీద పడుతుంది. పాలకులు, ప్రణాళికాకర్తలు ముందు చూపుతో వ్యవహరించని ఫలితమే నేటి చెన్నై జల సంక్షోభం రేపటి పలు నగరాల దాహార్తి. పొరుగునున్న కేరళ రాష్ట్రం రోజుకి 20 లక్షల లీటర్ల నీటిని రైళ్లలో పంపించగలనని ఆపన్న హస్తం చాచడం సంతోషించవలసిన పరిణామం. దీనిని రాజకీ య దృష్టితో చూసి తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించిందని తెలుస్తున్నది. మనిషి మౌలికా వసరాలక్కూడా రాజకీయం అడ్డుపడడం బాధాకరం.

Water crisis in Chennai

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెన్నై దాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: