ఏక కాల ఎన్నికలు!

         ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రాగానే అగ్రతర ప్రాధాన్యమిచ్చి చేపట్టిన ఏక కాల ఎన్నికల ప్రతిపాదనకు పలు రాజకీయ పక్షాల నుంచి సూత్రప్రాయంగా సుముఖత వ్యక్తమైనట్టు వార్తలు చెబుతున్నాయి. మోడీ చొరవతో బుధవారం నాడు ఢిల్లీలో ఈ అంశంపై జరిగిన పార్టీల అధినేతల సదస్సులో స్థూలంగా అనుకూల స్వరం వినిపించడం విశేషమే. అయితే కాంగ్రెస్ సహా ఎనిమిది పార్టీలు ఈ సభను బహిష్కరించడం ఏకాభిప్రాయం కొరవడిందనడానికి నిదర్శనం. మొత్తం 40 […] The post ఏక కాల ఎన్నికలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రాగానే అగ్రతర ప్రాధాన్యమిచ్చి చేపట్టిన ఏక కాల ఎన్నికల ప్రతిపాదనకు పలు రాజకీయ పక్షాల నుంచి సూత్రప్రాయంగా సుముఖత వ్యక్తమైనట్టు వార్తలు చెబుతున్నాయి. మోడీ చొరవతో బుధవారం నాడు ఢిల్లీలో ఈ అంశంపై జరిగిన పార్టీల అధినేతల సదస్సులో స్థూలంగా అనుకూల స్వరం వినిపించడం విశేషమే. అయితే కాంగ్రెస్ సహా ఎనిమిది పార్టీలు ఈ సభను బహిష్కరించడం ఏకాభిప్రాయం కొరవడిందనడానికి నిదర్శనం. మొత్తం 40 రాజకీయ పక్షాలను ఆహ్వానించగా 21 పార్టీల తరపున నేతలు హాజరయ్యారు. మూడు పార్టీలు తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా పంపించాయి. సభకు వెళ్లని అధినేతలలో మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), మాయావతి (బిఎస్‌పి), అఖిలేశ్ యాదవ్ (ఎస్‌పి), ఎంకె స్టాలిన్ (డిఎంకె) వంటి ప్రముఖ లున్నారు. ఈ ప్రతిపాదన మీద ఈ స్థాయిలో చర్చించడం బహుశా ఇదే మొదటిసారి. భవిష్యత్తులో ఎంతో మథనం విస్తృత చర్చ జరుగుతుందని భావించాలి.

లోక్‌సభకు, అసెంబ్లీలకు, స్థానిక సంస్థల (పంచాయితీ రాజ్, మున్సిపాలిటీలు) కు ఐదేళ్ల కొకసారి ఒకే సమయంలో ఎన్నికలు జరిపేసి మిగతా కాలమంతా అభివృద్ధి కృషి మీద పాలకులు దృష్టి కేంద్రీకరించడమనే ఆలోచన ఎంతో వినసొంపుగా ఉంది. చీటికీ మాటికీ ఎన్నికల వల్ల అభివృద్ధి కృషికి తరచూ ఆటంకం కలగడం, ప్రభుత్వానికి, పార్టీలకు, అభ్యర్థులకు అపరిమిత ఆర్థిక భారం ఎదురు కావడం కోరదగినది కాదు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్టు ఒక ఎన్నిక ముగిసిపోగానే మరొకటి ముంచుకు రావడం ఇబ్బందికరమే. ఎన్నికలు ప్రభుత్వాలపై తరచూ ప్రవర్తనా నియమావళి ఖడ్గాన్ని వేలాడ దీస్తాయని, దీని వల్ల పలు కీలక నిర్ణయాలు వాయిదా పడుతూ ఉంటాయన్న మాట వాస్తవమే. అందుచేత ఎన్నికల విధానాన్ని మొక్కుబడి స్థాయికి కుదించడం సబబా అనేదే అసలు ప్రశ్న. భారతీయ జనతా పార్టీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలోనూ, మొన్న ముగిసిన సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఏక కాల ఎన్నికల ప్రస్తావన చేసింది.

ఇతర పార్టీలతో సంప్రదింపుల ద్వారా ఏక కాల ఎన్నికలకు ఒక పద్ధతిని కొనుగొంటామని, అందువల్ల ఎన్నికల ఖర్చు తగ్గి రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సుస్థిరత కలుగుతుందని, ప్రభుత్వ వనరుల, భద్రతా దళాల సమర్థవంతమైన వినియోగం సాధ్యపడుతుందని చెప్పుకున్నది. ఇందులో విభేదించవలసిందేమీ లేదు. అయితే ఇందులో ఎన్నికలనేవి అభివృద్ధి కృషికి గుది బండగా మారాయనే భావన పరోక్షంగా వినిపిస్తున్నది. నిరంతరాయ ప్రజా ప్రాతినిధ్యం ప్రజాస్వామ్యానికి మూలమనే అభిప్రాయాన్ని అంగీకరిస్తే ఏక కాల ఎన్నికలు అందుకు చెప్పనలవికాని ప్రతిబంధకంగా మారే ప్రమాదమున్నది. అన్ని ప్రాతినిధ్య సభలకు ఐదేళ్లకు ఒకే సారి ఎన్నికలు జరిపిన తర్వాత ఏ రాష్ట్ర అసెంబ్లీలోనైనా బలాబలాలలో తేడా సంభవించి అక్కడి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోతే తక్షణమే మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పుకొనే అవకాశం లేకుండా పోతుంది. అటువంటప్పుడు మళ్లీ ఏక కాల ఎన్నికలు జరిగే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తుతుంది.

ఆ విధంగా రాష్ట్రాలు ఎక్కువ కాలం పాటు కేంద్రం ప్రత్యక్ష పాలన గుప్పెట్లో బందీలుగా ఉండక తప్పని స్థితి నెలకొంటుంది. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య మౌలిక సూత్రానికి గొడ్డలి పెట్టువంటిదనడానికి సందేహించనవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పరిధిలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటంగా జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర స్థాయి సమస్యల మీద సమరంగా సాగుతాయి. పార్లమెంటు ఎన్నికలు జాతీయ సమస్యలపై కేంద్రీకృతమవుతాయి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఈ వైవిధ్యం దెబ్బ తింటుంది. ప్రజలు గందరగోళానికి గురవుతారు. పార్టీలలో ధన బలం, అంగ బలం దండిగా ఉండేవి, లేనివి ఉంటాయి. ఒకే సారి ఎన్నికలను తట్టుకునే స్థోమత, సామర్థం కొద్ది పార్టీలకే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఐదేళ్ల వరకు ఎన్నికలుండకపోడం అంతవరకు నాయకులు ప్రజల ముఖం చూడనవసరం లేని పరిస్థితిని సృష్టించి వారి సమస్యలను పట్టించుకునే నాథులు కరువయ్యేలా చేస్తుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎన్నికలలో ధన వ్యయాన్ని పరిమితం చేయడానికి మార్గాలను అన్వేషించి తగిన కట్టుదిట్టాలు చేయాలి గాని ఇలా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మూలమట్టంగా పెకలించి వేసే ప్రమాదమున్న ఏక కాల ఎన్నికల వ్యూహాన్ని ప్రయోగించడం తగదని జనతంత్ర ప్రియులు భావించడాన్ని తప్పు పట్టలేము.

Simultaneous elections for Lok Sabha and Assembly

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఏక కాల ఎన్నికలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: