జట్కాబండి జాఫర్

జూలై నెలలో వారం రోజులుగా వదలని ముసురుతో జనాలు అతలాకుతలం అయ్యారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పట్టాలపై పరుగులు తీస్తున్న ట్రయిన్ విండోస్ తెరవడానికి లోపల కూర్చున్న ప్యాసింజర్లు భయపడుతున్నారు. లోపల అంతా ముడుచుకుని కూర్చున్నారు. ముగ్గురు కుర్రాళ్లు పెప్సీ బాటిల్సులో మద్యం కలుపుకుని గ్రోలుతూ తమ సెల్‌లో ట్రయిన్ హాల్టు చూసుకుంటున్నారు. “నెక్ట్ హాల్టు మనం దిగాల్సిన పయనూర్ రైల్వేస్టేషన్.” చెప్పి పెప్సీ బాటిల్‌లో మిగిలిన మద్యం గొంతులో పోసుకుని అబ్దుల్లా […] The post జట్కాబండి జాఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జూలై నెలలో వారం రోజులుగా వదలని ముసురుతో జనాలు అతలాకుతలం అయ్యారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తునే ఉన్నాయి.
పట్టాలపై పరుగులు తీస్తున్న ట్రయిన్ విండోస్ తెరవడానికి లోపల కూర్చున్న ప్యాసింజర్లు భయపడుతున్నారు. లోపల అంతా ముడుచుకుని కూర్చున్నారు. ముగ్గురు కుర్రాళ్లు పెప్సీ బాటిల్సులో మద్యం కలుపుకుని గ్రోలుతూ తమ సెల్‌లో ట్రయిన్ హాల్టు చూసుకుంటున్నారు.
“నెక్ట్ హాల్టు మనం దిగాల్సిన పయనూర్ రైల్వేస్టేషన్.” చెప్పి పెప్సీ బాటిల్‌లో మిగిలిన మద్యం గొంతులో పోసుకుని అబ్దుల్లా లేచి నిలబడ్డాడు.
“ముసుర్లు టైమ్‌లో ప్రయాణాలు పెట్టుకోరాదు.” ఇంద్రగౌడ తన బ్యాగ్ సర్దుకుని విసుగునంతా దులిపేసినట్లు నిట్టూర్చాడు.
“ఎన్నో ట్రయిన్లు కాన్సిల్ అయ్యాయి. చివరికి ఈ ట్రయిన్ మనల్ని మోసుకొచ్చింది.” రాజ్‌గురు సెల్ క్లోజ్ చేసి బ్యాగ్‌లో పెట్టేసాడు.
ట్రయిన్ అగింది. అప్పుడు రాత్రి ఒంటిగంట అయ్యింది. వర్షం ఈదురు గాలులతో మళ్లీ ఆరంభం అయ్యింది. దిగేవారు తక్కువ మంది కావడం. పైగా, వారు లోకల్ కనుక వారి బంధువులు వచ్చి వారిని తీసుకుని స్టేషన్ బయటికి వెళ్లిపోయారు.
పయనూర్ రైల్వేస్టేషన్‌లో దిగేవరకు ఆ పేరు గల స్టేషన్ గురించి తెలియదు. పయనూర్ టవున్ గురించి అంతకంటే తెలియని ముగ్గురు కురాళ్లు. లోపల మద్యం ఉన్నందున చలిగాలులను ఈజీగా జయించగలమనుకున్నారు. కానీ, మద్యం మరింత చలవ చేసినట్లు శరీరాలు చల్లగా మంచు ముద్దల్లా అయిపోయాయి.
ఉన్నట్టుండి ఈదురు గాలులు తగ్గాయి. వర్షం సన్నపాటి తుంపరగా మిగిలింది. “బయటికి వెడితే ఏ ఆటో, టాక్సీయో ఎక్కి గమ్యం చేరొచ్చు.” అని అబ్దుల్లా స్టేషన్ అవతలకు దారి తీసాడు.
స్టేషన్ బయట నిర్మానుష్యంగా ఉంది. ఒక డొక్కు కుక్క చలిలో తడిసి ముద్దయి ముగ్గురి వద్దకు వచ్చి పుల్లలాంటి తోకను ఊపసాగింది.
“ఇదేంట్రా కుక్కలా లేదు. బొమికలు తేరిపోయి, ఆ బొమికలకు అంటుకుని చర్మమే ఉంది. పావు కేజీ కండలేదు. ఇదేదో వందేళ్ల క్రితం కుక్కలా ఉంది.” రాజ్‌గురు దాన్ని అదలిస్తూ వ్యంగ్యంగా చెప్పాడు.
వణికిస్తున్న గాలుల్లో కుక్కని చూసి నవ్వారు.
అదలిస్తున్నా ఆ కుక్క తోక ఊపుతూ వారికి దారిచూపుతున్నట్లు కదలసాగింది. ఓ కార్నర్‌లో నల్లగుర్రం, జట్కాబండి కన్పించాయి. అక్కడికి వెళ్లి ఆగింది డొకు కుక్క.
బండిలో ముసుగుతన్ని నిద్రపోతున్నాడు. నల్లగుర్రం వర్షంకు తడిసి ముద్దయ్యింది. దాని కళ్లకు కప్పబడిన గంతల్లాంటి తోలు ముక్క లు కూడా తడిసి ఒకింత ఉబ్బాయి.
“రేయ్ ఇదేదో చిత్రంగా ఉంది. ఎప్పటివిరా జట్కాబళ్లు. ఈ దిక్కుమాలిన ఊళ్లో జట్కాబండి, ముసలి డొక్కు గుర్రం, డొక్కు కుక్క. ఇదేదో డ్రాక్కులా చిత్రంలో సీన్‌లా ఉందిరా” భయంగానే చెప్పాడు ఇంద్రగౌడ.
వారి మాటలకు జట్కాలో పడుకున్న వ్యక్తి “ఎక్కడికి పోతారు? బీచికా, టవున్‌కా? ఎక్కడికైనా నా పంచకల్యాణీ తీసుకుపోతుంది.” చెప్పి ఆవులి ంచాడు. అక్కడ స్ట్రీట్‌లాంప్ వెలగనందున జట్కావాడి ముఖం వారికి మసకలోనే కన్పించింది. ముగ్గురు జట్కా ఎక్కారు. వెనక్కి వాలిపోతుంటే జట్కావాడు కిందకి దిగి కట్టబడ్డ గుర్రం మీదకు లేచిపోతుంటే గట్టిగా వేలాడి సరిచేసాడు. గుర్రానికి తోలుబెల్టు మెడకు, పొట్టకు బలంగా రాచుకుపోయినట్టుంది. కీచుగా అరిచి విలవిలలాడిపోయింది. దాన్ని నిమురుతూ “ఎక్కడికి తీసుకుపోవాలో చెప్పండి” అడిగి గుర్రాన్ని అదలించాడు.
అడ్రసు చెప్పారు. “ఓహ్ అక్కడికా? నిన్న మీలాంటి కుర్రాడినే తీసుకుపోయాను.”
డొక్కు గుర్రం పరుగులు తీసింది. “అబ్బో ఇది పంచకళ్యాణీ యేరా!” అంటూ బయటికి తొంగిచూసాడు. నిర్మానుష్యమైన రోడ్లమీద కారు విపరీతమైన స్పీడుగా వెళ్లున్నట్లు
వెళ్లడంతో అనుమానంగా గుర్రాన్ని, దాన్ని తోలుతున్న బండివాడి తల వెనుక నుంచి చూసాడు.
గుర్రం ముందుకు చూడడంలేదు. మెడ వెనక నుంచి బండిలోకి చూస్తూ పరుగులు తీస్తోంది. దాని ముఖంలో ప్రేత కళలున్నాయనిపించింది. పైగా గుర్రం మెడ అంతగా వంగదు. ఈ జట్కా తేడాగా ఉంది. మరికొంచెం వంగి జట్కావాడిని చూసాడు అబ్దుల్లా.
నిలువెల్లా కంపరం పుట్టింది. చలికి తనను గట్టిగా వాటేసుకున్న మరి ఇద్దరికి లోగొంతుతో “మనం దయ్యాల జట్కా ఎక్కాం. ఆ గుర్రం ఓ దయ్యం. అందుకే దయ్యం పరుగులు తీస్తోం ది. ఈ జట్కావాడు దయ్యమే. అదిగో జట్కావెనుక పరుగులు తీస్తున్న డొక్కు కుక్క కూడా దయ్యమే”. చెప్పాడు. అది విన్న ఇద్దరు ఠారెత్తిపోయారు.
“ఏమిటి గుసగుసలు?” వెనక్కి తిరిగి అడిగాడు జట్కావాడు. ముగ్గురు గుచ్చిగుచ్చి ఆ ముఖం చూసి కంపరమెత్తి పోయారు. మానవ కంకాళంలా ఉందా ముఖం. బాబోయ్ దయ్యం” అని కీచుగా అరిచాడు రాజ్‌గురు. “ముగ్గురం గెంతేద్దాం. మనల్ని పీల్చిపిప్పి చేసేందుకు తీసుకుపోతున్నాడు ఈ జట్కావాడు” చెప్పి వెనుక నుంచి గెంతేసాడు.
అతడితో బాటు ఇద్దరు కిందకు గెంతారు. వాయువేగంతో పోతున్న జట్కాబండి లోంచి ముగ్గురు రోడ్డుమీద అడ్డదిడ్డంగా పడిపోయారు. కళ్లుబైర్లు కమ్ముతుండగా పరుగులు తీస్తున్న జట్కా వెనక్కి వచ్చింది. ఆ వెంటనే జట్కావాడు కిందకు దిగి “ఏరా నోటిదగ్గర నెత్తురు దక్కనీయరా!” అని అరుస్తూ ముగ్గురిని ఎత్తి జట్కాలో పడేసాడు. ముగ్గురు నెత్తుటి గాయాలతో జట్కాలో చేరగిలపడి బిక్కుబిక్కుమనిపోసాగారు. తిరిగి గుర్రం పరుగులు తీసింది.
“మన చావు కొచ్చింది ఈ క్యాంప్. దయ్యాల పాలయ్యాం.” అని కుళ్లికుళ్లి ఏడవసాగాడు ఇంద్రగౌడ.
జట్కావాడు వెనక్కి తిరిగి “ఏడిస్తే భలేగా ఉన్నావురా నా కొండే” అని చటుక్కున అందుకుని గాయాల నుంచి వస్తున్న రక్తం పీల్చేసాడు. దాంతో తోటకూర కాడలా వేలాడిపోయాడు. ఆ మిగిలిన ఇద్దరు తీవ్రగాయాలతో జట్కావాడి వైపు భయంతో చూస్తూ కళ్లు తేలేసారు.
***
భళ్లున తెల్లారిపోయింది. పయన్నూరు టవున్ శివార్లలో నల్ల అంబాసిడర్ కారులో చెట్టుకు ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది. అందులోంచి ముగ్గురు డోర్సు తెరవబడి సగం కారులో సగం రోడ్డుమీదకు జారిపడి ఉన్నారు. ఆ కారును వెంబడిస్తున్న పోలీస్ వాన్ కారుపక్కనే ఆగింది. అందులోంచి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇన్‌స్పెక్టర్ మరి ఇద్దరు పోలీసులు దిగారు.
కారు నంబర్‌ప్లేట్ చూసారు. “అదే సార్. ఆ నెంబరే. ఈ ముగ్గురు హంతకులా? మనల్నించి తప్పించుకో చూసి యాక్సిడెంట్‌కు గురయ్యారు.” పోలీసులు చెప్పారు.
అంబులెన్స్‌లో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. లోకల్ చానల్ జయన్(51) హత్యకేసులో తప్పించుకు తిరుగుతున్న హంతకుడు ఒక్కడుకాదు, ముగ్గురు ఈ రోజు పోలీస్‌లు వెంబడిస్తే కారు యాక్సిడెంట్‌కు గురయి ఆసుపత్రి పాలయ్యారని స్క్రోలింగ్ తిరిగేయసాగింది.
కొద్దిసేపటిలో ఆ స్క్రోలింగులను పోలీసులే ఆపించేసారు. అందుకు కారణాలు ఏమై ఉంటుందా అని మీడియాలో ఆసక్తి పెరిగిపోయింది.
ముగ్గురిలో ఇద్దరికి తెలివొచ్చింది. వాళ్లు కారులో ఉన్నట్లు ఆ కారు యాక్సిడెంట్ అయినట్లు తమకు తెలియదన్నారు. తాము బెంగళూరు నుంచి ఓ మిత్రుడి ఇంట శుభకార్యానికి ఈ ముసురులో అర్థరాత్రి దిగాం. స్టేషన్ బయట జట్కాబండి తప్పితే ఏమీ లేదు. ఆ జట్కావాడు ఓ దయ్యం. వాడు మా రక్తం జుర్రేసాడు. ఊరవతల పడేసి ఆ దయ్యం వెళ్లిపోయింది. తప్పితే మాకేం తెలియదు.” అని గాయపడ్డ అబ్దుల్లా చెప్పాడు.
పోలీసులు దయ్యం కతలుపై అడ్డంగా తలూపేసి రాత్రి సిసి కెమెరాల్లో నల్లకారులో ఎంతమంది ఉన్నది గమినించారు. ఒకేఒక్కడు డ్రయివ్ చేస్తూ కన్పించాడు. సిటీ దాటాక ఆ కారు వివరాలు లేకుండా పోయాయి. ఆ ముగ్గురు రోడ్డుమీద పడుంటే యాక్సిడెంట్ అయిన కారులోంచి హంతకుడు ఏ మేరకు గాయపడ్డాడో గాని తెలివిగా ముగ్గురిని కారులోకి నెట్టి తను పారిపోయాడు. ఇప్పుడా స్పాట్‌లో వెతకాలి. రోడ్డుమీద వెహికల్ ఏదైనా ఆపి పొరుగూళ్లలో ఎక్కడో ఒకచోట చికిత్స పొందుతూ ఉండాలి. అందుకే సమీప పోలీస్‌స్టేషన్లకు వివరాలు పంపించారు.
పోలీసుల వల బిగుసుకుంది. హంతకుడుకై వేట ఉధృతమయ్యింది. సాయంత్రానికి రోడ్డుమీద నడుస్తుంటే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కేసు ఒకటి రూరల్ స్టేషన్‌లో నమోదు అయ్యింది. అక్కడికి చేరుకున్నారు. హంతకుడిని వేటాడే పోలీసులు. సర్కారు దవాఖానాలో చికిత్స పొందుతున్న హంతకుడు జోసఫ్‌హిల్స్(38)ను చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఢిల్లీలో దరియాగంజ్ ఏరియా యూసఫ్ దాదా వద్ద ఉన్న కరడు గట్టిన హంతకుడు. అతడిని యాక్సిడెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు.
“జోసఫ్ స్టమక్‌లో స్టీరింగ్ బలంగా తాకింది. అందువల్ల ఒకింత లోపల రక్తం క్లాట్ అయ్యింది. కోలుకోవడానికి కొంత కాలం పడుతుంది. ఇక్కడ ఎక్విప్‌మెంట్ లేనందున జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసాం” అని డాక్టర్లు తెలిపారు. పోలీసులు అంబులెన్సులో తరలించారు.
వారం అయ్యేసరికి హంతకుడు జోసఫ్ కోలుకున్నాడు. అతడి చుట్టూ పటిష్టమైన పోలీస్ కాపలా ఉంది. పోలీసులు ప్రశ్నించి చాలా విషయాలు రాబట్టారు.
జయన్ హత్యకేసులో కిరాయికి ఢిల్లీ నుంచి జోసఫ్‌ను జయన్ బంధువు తిరువక్కన్ పెద్ద ధరకు రావించాడు. ఎలాగైన జయన్‌ను చంపాలి. ఎందుకంటే జయన్ ఒకప్పుడు దాదాగిరి వెలగబెట్టినవాడే. ఇప్పుడు నేరాల్లో లేడు. స్వజనం ఆస్తులు ఏదోలా కొట్టేయడంలో తన నేరప్రవృత్తిని కనబరుస్తున్నాడు. అందుకే అతడిని లేపేయడానికి ఢిల్లీ కిరాయిగూండా అవసరమైనాడు.
జయన్‌కు పేకాట పిచ్చి. ఎప్పుడూ గెలుపేతప్ప ఓటమి అనేది లేనేలేదు. అర్థరాత్రి వరకు పేకాటలో మునిగిపోతాడు. అక్కడ రెకీ నిర్వహించి మరీ హత్యకు పథకం వేసాడు కిరాయి హంతకుడు జోసఫ్. అనుకున్నట్లే ముసురు పట్టిన రాత్రి జయన్ అర్థరాత్రి వరకు పేకాట ఆడి బయటికి వస్తుంటే కాల్పులు జరిగాయి. జయన్ నేలకొరిగిపోయాడు. అతడి ఫ్రెండ్స్ నల్ల అంబాసిడర్ కారులో హంతకుడు తప్పించుకుపోయాడని పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ కారును పెట్రోలింగ్ వాన్ తరిమింది.” వివరించాడు జోసఫ్.
“కారు యాక్సిడెంట్ అయ్యాక రోడ్డుమీద పడున్న యువకులను ఎందుకు కారులో నెట్టి పారిపోయావు?”
“పోలీసులను తప్పుతోవ పట్టిద్దామని తీవ్రంగా గాయపడి కూడా, రోడ్డు మీద పడున్న ఆ ముగ్గురిని చాలా కష్టపడి కారులోంచి పడ్డట్టు కారు లోపలకి సగం, బయటికి సగం నెట్టాను. ఆ పైన రోడ్డుమీద కుంటి నడకలతో అలా సాగాను. ఏదో వాన్ వస్తుంటే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని అబద్దం చెప్పి రూరల్ ఆస్పత్రిలో చేరాను. ఇందంతా మగత మీద చేసాను. నేరగాళ్లకు ఇలాంటి కష్టాలు తప్పవు.”
పోలీసుల కళ్లు కప్పడం ఏమార్చడం ఈ రోజుల్లో కుదరవు. నేరాలు ఎంత తెలివిగా పెరిగాయో అంతకంటే నేర పరిశోధన కూడా క్షణాల్లో నేరాల్ని పసిగట్టేలా వేగవంతమయ్యాయి.” జోసఫ్ విని నిజమేనన్నట్లు తలపంకించాడు.
ఇక ముగ్గురు యువకులకు జట్కాబండి ఎక్కడం. అదో దయ్యం నడిపే జట్కా అని వారు చెప్పడం, పోలీసులు దయ్యం కథలని తేలిగ్గా కొట్టిపారేసారు. అందులో విషయం ఏమిటంటే జట్కా బండి జాఫర్ అనే అతడు నలబైఏళ్ల క్రితం నడిపేవాడు. అప్పట్లోనే చనిపోయాడు. అతని ఆత్మ ముసురుపట్టిన రాత్రి కన్పిస్తుందని స్థానికులు చెప్పే దయ్యంకథ.

latest crime story in Telugu

                                                                            యర్నాగుల సుధాకరరావు, 99852 65313

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జట్కాబండి జాఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.