బెంగాల్‌లో రాజకీయ హింస

  దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాకుండా సామాజిక, ధార్మిక ఉద్యమాలకు సహితం ఆయువు పట్టుగా ఉంటూ వచ్చిన పశ్చిమ బెంగాల్‌లో నేడు మతిలేని రాజకీయ హింస చోటు చేసుకొంటున్నది. గతంలో హింస చోటుచేసుకున్నా దానికి రాజకీయ, సైద్ధాంతిక భూమిక ఒకటి ఏర్పర్చుకొనే వారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవం అనో, భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలబరీ పోరాటం అనో, భూమికోసం నందిగ్రామం వద్ద గ్రామీణ ప్రజల జీవన్మరణ పోరాటం అనో… వివిధ రూపాలలో దేశ […] The post బెంగాల్‌లో రాజకీయ హింస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాకుండా సామాజిక, ధార్మిక ఉద్యమాలకు సహితం ఆయువు పట్టుగా ఉంటూ వచ్చిన పశ్చిమ బెంగాల్‌లో నేడు మతిలేని రాజకీయ హింస చోటు చేసుకొంటున్నది. గతంలో హింస చోటుచేసుకున్నా దానికి రాజకీయ, సైద్ధాంతిక భూమిక ఒకటి ఏర్పర్చుకొనే వారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవం అనో, భూస్వాములకు వ్యతిరేకంగా నక్సలబరీ పోరాటం అనో, భూమికోసం నందిగ్రామం వద్ద గ్రామీణ ప్రజల జీవన్మరణ పోరాటం అనో… వివిధ రూపాలలో దేశ చరిత్రనే మలుపు తిప్పిన సంఘటనలు జరిగాయి.

మహాత్మా గాంధీ ఆధిపత్యాన్ని కాంగ్రెస్‌లో సవాల్ చేసిన నేతాజీ సుభోష్ చంద్రబోస్ విదేశాలకు వెళ్లి జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై యుద్ధం ప్రకటించి, అజ్ఞాతంలో స్వతంత్ర భారత తొలి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేతాజీ స్ఫూర్తితో మొత్తం ఆసియా, పసిఫిక్ ఖండాలలో సుమారు 60 దేశాలు స్వాతంత్య్రం పొందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన తర్వాత, క్విట్ ఇండియా ఉద్యమాన్ని సునాయానంగా అణచివేసిన పిమ్మట, స్థానికంగా ప్రజల నుండి పెద్దగా తిరుగుబాటు కనిపించక పోయినా అర్ధాంతరంగా బ్రిటిష్‌వారు దేశం వదిలి వెళ్లిపోవడానికి సహితం నేతాజీ భయమే కారణం.

బ్రిటిష్ వారు రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కడ గెలుపొందినా అక్కడ ప్రధానంగా పోరాటం చేసింది వారి నాయకత్వంలోని భారత సైనికులే. మరోవంక నేతాజీ సృష్టించిన జాతీయ సైన్యం చెల్లాచెదురైనా రెండు, మూడు లక్షల మంది వరకు అక్కడక్కడా ఉన్నారు. వారి పట్ల బ్రిటిష్ వారు వ్యవహరించిన తీరు భారతీయ సైనికులలో అగ్గి రాజేసింది. దానితో పలు చోట్ల తిరుగుబాటు ధోరణులు ప్రదర్శిస్తున్నారు. రెండు, మూడు లక్షల మంది వరకున్న భారత సైనికులు, నేతాజీ సేనతో చేతులు కలిపితే భారత్‌లో బ్రిటిష్ వారు ఒక క్షణం కూడా ఉండలేరు. అందుకనే తెలివిగా దేశాన్ని రెండు ముక్కలు చేసి పారిపోయారు.

సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ రంగాలలో సహి తం బెంగాల్ భారత్‌కు గర్వకారణమే. అటువంటి భూమి లో నేడు ఏమి జరుగుతున్నది? మూడున్నర దశాబ్దాల వామపక్షాల పాలనలో తీవ్రమైన అణచివేతకు గురైన ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్న మమతా బెనర్జీ నేడు ఏమి చేస్తున్నారు? తమకు వంతపాడని ప్రతిపక్షాలను, నేతలను తుదముట్టించడం కోసం కంకణం కట్టుకున్న బిజెపి అక్కడ ఏమి చేస్తున్నది? భారతీయులు గర్వించే విధంగా మాత్రం జరగడం లేదు. రెండు పార్టీలు ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడి, తమ రాజకీయ మనుగడ కోసం రాష్ట్రంలో హింసాకాండను రెచ్చగొడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా హింసాయు త వాతావరణం నెలకొనడం సాధారణం. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయి మూడు వారాలు దాటినా ఇంకా హింసాకాండ ఆగక పోవడం దారుణమైన పరిస్థితులను వెల్లడి చేస్తున్నది. మీడియా కథనాల ప్రకారం ఇప్పటికి 15 మంది హత్యలకు గురయితే వారిలో 8 మంది బిజెపి వారు కాగా, మిగిలిన ఆరుగురు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినవారు. ఎక్కువగా కొన్ని ప్రాంతాలకే ఈ హింసాకాండ పరిమితం అవుతున్నది. ఈ సందర్భం గా టిఎంసి, బిజెపి పరస్పరం ఆరోపణలు చేసుకొం టున్నాయి.

ఈ హింసాకాండ ఏకపక్షంగా జరగడం లేదన్నది వాస్తవం. అయితే హింసాకాండను నిర్దాక్షిణ్యంగా అణచివేసి, ప్రజలకు ప్రశాంతతను ఏర్పర్చవలసిన సాధారణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని మరువలేము. ఈ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన బాధ్యతనను తప్పించుకోలేరు. బిజెపిపై నిందారోపణలు చేయడం ద్వారా తన పాలనా అసమర్ధతను కప్పిపుచ్చుకోలేరు. మమతా బెనర్జీ వీధి పోరాటాలకు పేరొందారు. ఆ విధం గా చేసే ఆమె రాష్ట్రంలో సుదీర్ఘకాలం కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని సాగనంపి, ఇప్పుడు ఆ పార్టీ పునాదులని కూల్చి వేయగలిగారు. వామపక్షాలతో అవకాశవాద అవగాహనకు కాంగ్రెస్ పాల్పడుతూ ఉంటున్నదనే ఆగ్రహంతోనే ఆమె కాంగ్రెస్‌కు దూరమై సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన పోరాట పటిమ అందరి ప్రశంసలను పొందింది. అయితే అధికారంలోకి వచ్చాక కూడా పోరాటాలకు పరిమితం అవుతూ, గతంలో వామపక్షాల పాలనను గుర్తు తెస్తూ నిరంకుశంగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాబోదు.

ప్రతిపక్ష నేతల హెలికాఫ్టర్లు దిగడానికి కూడా అనుమతి ఇవ్వక పోవడం, వారి బహిరంగ సభలకు అడ్డంకులు కల్పించడం గమనిస్తే అసలు స్వేచ్ఛ, స్వాతంత్య్ర భావాలకు ప్రాణం పోసిన పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు అటువంటి అవకాశం లేదా అనే అనుమానం కలుగుతున్నది. ఎన్నికల తర్వాత కూడా టిఎంసి గెలుపొందిన నియోజక వర్గాలలో అభ్యర్థులు విజయ యాత్రలను జరుపుకొంటూ ఉంటే, బిజెపి గెలువపండిన చోట మాత్రం అటువంటి యాత్రలకు అనుమతి ఇవ్వక పోవడాన్ని ఏమనుకోవాలి? పాలనలో ఇటువంటి వివక్ష ఆమెలోని భయాన్ని వెల్లడి చేస్తుంది. 2014 ఎన్నికలలో కేవలం 2 లోక్‌సభ సీట్లు మాత్రమే గెలుచుకున్న బిజెపి 2019లో 18 సీట్లు గెల్చుకోవడమే కాకుండా 40 శాతం ఓట్లు తెచ్చుకోవడం మమతకు ఆందోళనను కలిగిస్తున్నది. రెండు పార్టీల మధ్య తేడా 4 శాతం మించి లేదు. 2021 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తుందో అనే ఆందోళన ఆమెను ఆవహించినట్లు కనిపిస్తున్నది. అందుకనే వివేకం కోల్పోయి వ్యవహరిస్తున్నారు. లేని పక్షంలో ఏ పార్టీవారు హత్యకు గురైనా తీవ్రమైన అంశగా పరిగణిస్తూ, తమ పాలనలో హింసకు ఆస్కారం లేదని బలమైన సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించేవారు. కానీ అటువంటి ప్రయత్నం చేయడం లేదు.

ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలలో కూడా తనకు మంచి మిత్రులు ఉన్నారని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన రాజకీయేతర ఇంటర్వ్యూలో ప్రస్తావించిన ఇద్దరు నేతల పేర్లలో మొదటివారు మమతా బెనర్జీ కావడం గమనార్హం. గతంలో వాజపేయి ప్రభుత్వంలో పని చేసిన ఆమెకు పలువురు బిజెపి నేతలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. పలువురు కేంద్ర మంత్రులతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలలో చీలిక తీసుకురావడం కోసం ఆమెను కీలక నేతగా బిజెపి వారు భావించారు కూడా.

అయితే ఎప్పుడైతే కాంగ్రెస్, సిపిఎం నేతలు చేతులు ఎత్తేశారో, అప్పుడు రాష్ట్రంలో బిజెపి విస్తరణకు మంచి అవకాశం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కన్నా మమతకు వచ్చిన ఓట్లు ఏమాత్రం తగ్గలేదు. కానీ కాంగ్రెస్, సిపిఎం ఓట్లు పెద్ద ఎత్తున బిజెపికి మారడంతో బిజెపి బలం గణనీయంగా పెరిగింది. త్రిపురలో కూడా అదే జరిగింది. రాజకీయ అంశాలను రాజకీయ వ్యూహాల ద్వారానే ఎదుర్కోవాలిగాని అసహనంగా హింసకు, నిరంకుశ విధానాలకు పాల్పడితే ఎదురు తిరుగుతుందని గతంలోని వామపక్షాల అనుభవాలను చూసైనా ఆమె గ్రహించాలి.

పశ్చిమ బెంగాల్‌లో ఆధిపత్యం కోసం బిజెపి అనుసరిస్తున్న ఎత్తుగడలు సహితం ఆమెకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా స్థానిక, స్థానికేతరుల మధ్య అగాధం పెరిగే విధంగా వ్యవహరించడం, అధికార పార్టీ హింసను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధపడటం వంటి చర్యల ద్వారా సాధారణ ప్రజలకు శాంతి లేకుండా చేటున్నారు. పంచాయతీ ఎన్నికలలో 33 శాతం ఏకగ్రీవంగా జరగడాన్ని ఆమె నిరంకుశ పాలనకు ఉదాహరణగా అందరూ చూపుతున్నారు. అయితే త్రిపురలో 95 శాతం పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగలేదా? ఎన్నికల ఫలితాల అనంతరం త్రిపురలో సహి తం రాజకీయ హత్యలు తలెత్తి ముగ్గురు మృతి చెందారు.

దాదాపు అన్ని రాజకీయ పక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకొని బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు బిజెపి నాయకులు భావిస్తున్నారు. కానీ ఆ విధంగా చేయడం ద్వారా వీధి పోరాటాలకు పేరొందిన మమతా బెనర్జీని మరింత బలోపేతం చేయడానికి దోహదపడగలదనే భయం బిజెపి నేతలలో ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ పాదయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం జరుపుతున్నది దేశం మొత్తంలో ఆమె ఒక్కరే. జనసామాన్యమే ఆమెకు బలం.

ఆమెకు ప్రజాకర్షణలో పోటీ పడగల నేత ఇప్పుడు అక్కడ మరే పార్టీకీ లేరు. ఈనాడు బిజెపిలో అక్కడ పెత్తనం చేస్తున్న పలువురు నేతలు ఒకప్పుడు మమతకు సన్నిహితంగా రాజకీయాలు నడిపిన వారే. పలు అవినీతి ఆరోపణలు చిక్కుకున్నవారే. అవినీతికి సంబంధించిన కేసుల నుండి రక్షణ కోసం బిజెపిలో చేరినవారే. అటువంటి నేతలతో బిజెపి ప్రజలలో ఏ మాత్రం చొచ్చుకు పోగలదో చూడవలసి ఉంది. నేడు దేశంలో పలు చోట్ల పరిస్థితులు అదుపు తప్పడానికి ప్రధాన కారణం ప్రభుత్వ యంత్రాంగానికి, అధికార పార్టీకి మధ్య చెప్పుకోదగిన తేడా లేకపోవడమే. ఈ విషయంలో బెంగాల్‌లో సాగిన వామపక్షాల పాలననే ఆమె ఆదర్శంగా తీసుకొంటున్నట్లు కనిపిస్తున్నది. బిజెపి సహితం అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలలో అదే విధంగా చేస్తున్నది.

గతంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో మంత్రులు పలు సందర్భాలలో నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కాగడా పట్టుకొని వెతికినా ఒక్కరు కూడా కనబడటం లేదు. కోర్టులలో తీవ్రమైన ఆరోపణలతో కేసులు ఉన్నవారే కాకుండా, శిక్షలు పడినవారు సహితం సిగ్గు లేకుండా పదవులను పట్టుకొని వదలడం లేదు. రాజకీయ, నైతిక విలువలు అంటూ రాజకీయ పార్టీలలో మచ్చుకైనా కనబడటం లేదు. ఏదో విధంగా అధికారంలోకి రావడం, వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మాత్రమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేడు దేశం అంతటా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ప్రజా జీవనం రాను రాను దుర్భరంగా తయారవుతున్నది. శారద చిట్స్ కుంభకోణంపై జరుగుతున్న విచారణ ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ కేసును ఉపయోగించుకొని రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతున్నది. ఆ కేసులో అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కీలక పదవులలో ఉన్నవారిని సిబిఐ కనీసం విచారించే సాహసం కూడా చేయడం లేదు. ఈ దేశంలో చట్టబద్ధ సంస్థలు అధికార పార్టీలకు అనుబంధ సంస్థలుగా మారుతున్నాయని ఆందోళన ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నది.

నేడు పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న హింసాయుత వాతావరణాన్ని అదుపులోకి తేవాలంటే టిఎంసి, బిజెపి నేతలు కలసి విశాల సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించవలసిందే. తనకు మంచి స్నేహం ఉందని చెప్పుకున్న ప్రధాని మోడీ జోక్యం చేసుకొని, మమతను ఢిల్లీకి పిలిపించి ఈ విషయమై చర్చించి, పరిస్థితులను అదుపు చేయడం గురించి ఆలోచనలు చేస్తే మొత్తం దేశం ముందు ఒక పెద్ద ఆదర్శాన్ని ఉంచిన వారు అవుతారు. బెంగాల్‌లో రాజకీయ హింస పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి సాధారణ పరిస్థితి ఏ విధంగా తీసుకు రాగలమో అని మాట్లాడితే ఎంతో హుందాగా ఉండెడిది. హోమ్ మంత్రిత్వ శాఖ లేఖపై రాజకీయ విమర్శలు ఎక్కు పెట్టకుండా మమతా కూడా తనకు స్వయంగా ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రులతో మాట్లాడతాను అంటే రాజకీయ ఉద్రిక్తలను తొలగించే అవకాశం ఇచ్చిన్నట్లు అయ్యెడిది. కానీ ఒక వంక టిఎంసి, మరో వంక బిజెపి ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కనబడటం దురదృష్టకరం.

Changing Faces of Political Violence in West Bengal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బెంగాల్‌లో రాజకీయ హింస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: