పాక్‌కు భారత్ షాక్

                        మాజీ సోవియెట్ రిపబ్లిక్ కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ 19వ శిఖరాగ్ర సభకు ప్రధాని మోడీ పాకిస్థాన్ గగన తలం మీదుగా కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి నిర్ణయించడం ద్వారా ఇస్లామాబాద్‌కు న్యూఢిల్లీ షాక్ ఇచ్చింది. ఇందుకు పాకిస్థాన్‌నే తప్పు పట్టవలసి ఉంది. మీ గగన తలంలోంచి మా ప్రధాని విమానం వెళ్లనివ్వండి అని ఎంతో మర్యాద […] The post పాక్‌కు భారత్ షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

                        మాజీ సోవియెట్ రిపబ్లిక్ కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ 19వ శిఖరాగ్ర సభకు ప్రధాని మోడీ పాకిస్థాన్ గగన తలం మీదుగా కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి నిర్ణయించడం ద్వారా ఇస్లామాబాద్‌కు న్యూఢిల్లీ షాక్ ఇచ్చింది. ఇందుకు పాకిస్థాన్‌నే తప్పు పట్టవలసి ఉంది. మీ గగన తలంలోంచి మా ప్రధాని విమానం వెళ్లనివ్వండి అని ఎంతో మర్యాద పూర్వకంగా అడిగిన భారత ప్రభుత్వానికి పాకిస్థాన్ వెంటనే బేషరతు గా అంగీకారం తెలిపి ఉండవలసింది. అది దేశాల మధ్య, అందులోనూ ఇరుగు పొరుగుల మధ్య ఉండి తీరవలసిన కనీస సంస్కారయుత సంబంధాలకు ప్రతీక. కాని పాకిస్థాన్ అలా చేయలేదు. ప్రధాని మోడీ విమానం ప్రయాణించడానికి ‘సూత్రప్రాయంగా’ అంగీకరిస్తున్నట్టు పాక్ నుంచి వచ్చిన సమాచారం సహజంగానే భారత ప్రభుత్వాన్ని అసౌకర్యానికి గురి చేసింది. అందుకు ప్రతిగా మోడీ విమాన మార్గాన్నే మార్చుకోవలసి వచ్చింది. ఎంత వైరం ఉన్న ఇరుగు పొరుగులైనా మామూలు పరిస్థితుల్లో ఒకరి వాకిట్లోంచి ఇంకొకరు రాకపోకలు సాగించడాన్ని అడ్డుకోరు.

కశ్మీర్‌లోని పుల్వామాలో మన సిఆర్‌పిఎఫ్ దళాల వాహన శ్రేణిపై జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడి 40 మంది జవాన్లను హతమార్చిన ఘటన తర్వాత గత ఫిబ్రవరి 26న పాక్‌లోని ఆ సంస్థ స్థావరాలపై మన వైమానిక దళం మెరుపు దాడి జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ తన గగన తల మార్గాలను దాదాపు పూర్తిగా మూసివేసింది. మొత్తం 11 దారుల్లో దక్షిణ పాకిస్థాన్ గగనాల గుండా వెళ్లే రెండింటిని మాత్రం తెరిచి ఉంచింది. భారత్‌తో పాక్ నిజంగానే శాంతిని కోరుకుంటూ ఉంటే ప్రధాని మోడీ విమానానికి అడగ్గానే దారిని తెరిచి ఉండేది. సూత్రప్రాయ అంగీకారం అనడంలోనే అర్థమనస్కత స్పష్టపడుతున్నది. మనతో మళ్లీ సఖ్యత సాధించుకోడానికి అందివచ్చిన ఒక మంచి అవకాశాన్ని ఆ విధంగా పాకిస్థాన్ జార విడుచుకున్నది. పైకి మాత్రం భారత దేశంతో గల కశ్మీర్ సహా అన్ని సరిహద్దు, రాజకీయ సమస్యలకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని పాకిస్థాన్ అంటూ ఉంటుంది. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మన ప్రధాని మోడీకి ఇటీవల ఒక లేఖ రాసినట్టు వార్తలు చెబుతున్నాయి.

ఆ ఉద్దేశమే గనుక పాక్ ప్రధానికి నిజంగా ఉండి ఉంటే ప్రధాని మోడీ విమానానికి దారి ఇచ్చే విషయంలో ఈ ‘సూత్రప్రాయతను’ ఆశ్రయించి ఉండేవారు కాదు. షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు ప్రధాని మోడీ పాకిస్థాన్ మీదుగా కాకుండా ప్రతామ్నాయంగా ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాలపైనుంచి వెళ్లారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటి సమాచారం ప్రకారం అక్కడ ఇమ్రాన్‌తో ప్రధాని మోడీ భేటీ కాబోవడం లేదని స్పష్టపడుతున్నది. కిర్గిజ్‌లో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక భేటీ జరుపనున్నారు. అమెరికా, చైనా మధ్య రగులుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. ఇరాన్ నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై అమెరికా ఆంక్షల అంశమూ ఈ ముగ్గురు నేతల మధ్య చర్చకు రానున్నట్టు సమాచారం.

ఇటువంటి సమయంలో భారత, పాకిస్థాన్ అధినేతల మధ్య కూడా ముఖాముఖీ చర్చలు జరిగితే ఎంతో బాగుండేది. గగన తల మార్గాన్ని అనుమతించే విషయంలో భారత్‌ను అవమానపరిచే ధోరణిని అవలంబించడం ద్వారా పాకిస్థాన్ అందుకు సందులేకుండా చేసిందని భావించక తప్పదు. షాంఘై సహకార సంస్థ చైనా నాయకత్వంలో ఏర్పడింది. ఇందులో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు వ్యవస్థాపక సభ్యదేశాలు కాగా, భారత్‌ను, పాకిస్థాన్‌ను 2017లో చేర్చుకున్నారు. భౌగోళికంగా సామీప్యమున్న ఈ ఎనిమిది దేశాల మధ్య సహకారం వర్థిల్లితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల ఉమ్మడి ప్రజానీకం ప్రపంచ జనాభాలో 42 శాతంగా ఉండడమే ఈ సంస్థ ప్రాధాన్యాన్ని చాటుతున్నది.

ఈ ఎనిమిది దేశాల భూభాగం ప్రపంచ భూభాగంలో 22 శాతం. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో ఈ దేశాలది 20 శాతం. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్దవైన చైనా, భారత దేశాలు సభ్యత్వం కలిగి ఉండడమే షాంఘై సహకార సంస్థ సమున్నత స్థితిని చాటుతున్నది. కాని చైనా, పాకిస్థాన్‌లు రెండింటితోనూ భారత్‌కు గల పేచీలు, విభేదాలు గమనించదగినవి. చైనాతో మన సంబంధాలు నెమ్మదిగానైనా మెరుగుపడుతున్న సూచనలున్నప్పటికీ పాకిస్థాన్‌తో మాత్రం మూడడుగులు ముందు కీ ఆరడుగులు వెనక్కి మాదిరిగా ఉన్నాయి. ఉగ్రవాదం సృష్టిస్తున్న దుర్మార్గానికి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలైపోతున్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడ్డానికి రెండు వైపుల నుంచీ గట్టి కృషి జరగాలి.

Pakistan shocked by massive Indian Army retaliation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్‌కు భారత్ షాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: