హ్యాట్రిక్‌పై భారత్ కన్ను

పొంచి ఉన్న వరుణుడు, నేడు కివీస్‌తో పోరు నాటింగ్‌హామ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. గురువారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షం వల్ల మూడు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా కివీస్‌భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం నెలకొంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో […] The post హ్యాట్రిక్‌పై భారత్ కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పొంచి ఉన్న వరుణుడు, నేడు కివీస్‌తో పోరు
నాటింగ్‌హామ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారం పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. గురువారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షం వల్ల మూడు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా కివీస్‌భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం నెలకొంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో భారత్, కివీస్‌లు అజేయంగా కొనసాగుతున్నాయి. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి పాలు కాలేదు. భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో జయభేరి మోగించంది. దీంతో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది. భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని తహతహలాడుతోంది. కిందటి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అయితే ఆస్ట్రేలియాపై సెంచరీతో అలరించిన ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు దూరం కావడం టీమిండియాకు కాస్త ప్రతికూలంగా మారింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశమే. కిందటి మ్యాచ్‌లో టాపార్డర్ అసాధారణ రీతిలో రాణించింది. బౌలర్లు కూడా సత్తా చాటారు. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లి సేనకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండిన న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, మన్రోలు ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ కూడా జోరుమీదున్నాడు. కెప్టెన్ విలియమ్సన్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. టామ్ లాథమ్, నిశమ్, గ్రాండోమ్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌల్ట్, నిశమ్, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, సాంట్నర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్‌మెన్ దూకుడు మీద ఉండడంతో కివీస్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. కాగా, స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత్‌ను ఓడించాలంటే న్యూజిలాండ్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు.
రోహిత్‌పైనే భారం..

స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం వల్ల కివీస్ పోరుకు దూరం కావడంతో జట్టు బ్యాటింగ్ భారమంత మరో ఓపెనర్ రోహిత్ శర్మపై పడింది. ఇప్పటికే ఓ సెంచరీ సాధించిన రోహిత్ ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీతో చెలరేగాడు. ధావన్ లేని పరిస్థితుల్లో రోహిత్ బాధ్యత మరింత పెరగింది. ఈ మ్యాచ్‌లో లోకేశ్ రాహుల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ విజృంభిస్తే భారత్‌కు మరోసారి శుభారంభం ఖాయం. ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా రోహిత్‌కు ఉంది. అతను చెలరేగితే ఆపడం కివీస్ బౌలర్లకు కష్టమనే చెప్పాలి. రాహుల్ కూడా దూకుడు మీదున్నాడు. దీంతో ఈసారి కూడా భారత్‌కు మెరుగైన ఆరంభం లభించే అవకాశాలున్నాయి.
జోరు సాగాలి..
కిందటి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారిన కోహ్లి ప్రపంచకప్‌లో కూడా చెలరేగాలని తహతహలాడుతున్నాడు. ఆస్ట్రేలియాపై కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. వన్డేల్లో కళ్లు చెదిరే రికార్డు కలిగిన కోహ్లి ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. జట్టు ఏదైనా అతని బ్యాట్ నుంచి పరుగుల సునామీ కొనసాగుతూనే ఉంది. కివీస్‌పై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ధావన్ సేవలు అందుబాటులో లేని పరిస్థితుల్లో కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. ధావన్ లేని లోటు లేకుండా ఉండాలంటే కోహ్లి తన బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. ఇక, హార్దిక్ పాండ్య కూడా ఆస్ట్రేలియాపై చెలరేగి ఆడాడు. కీలక సమయంలో వేగంగా ఆడి స్కోరును పరిగెత్తించాడు. ఈసారి కూడా హార్దిక్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. బ్యాట్‌తో, బంతితో హార్దిక్ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. కిందటి మ్యాచ్‌లో సత్తా చాటిన సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. చివరి ఓవర్లలో ధోని చెలరేగి ఆడాడు. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించిన ధోని ఆస్ట్రేలియాపై కూడా ధాటిగా ఆడాడు. దీంతో ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు కూడా బ్యాట్‌ను ఝులిపించే సత్తా కలిగిన వారే. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్, కుల్దీప్, హార్దిక్, కేదార్ తదితరులతో భారత బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో భువీ, బుమ్రా, చాహల్‌లు అసాధారణ రీతిలో రాణించారు. ఈసారి కూడా జట్టు వీరి నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. అదే జరిగితే భారత్‌కు మరో విజయం ఖాయం.
జోరు మీదుంది..


మరోవైపు న్యూజిలాండ్ కూడా జోరుమీదుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఎదురులేని స్థితిలో నిలిచింది. భారత్ వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఓపెనర్లు గుప్టిల్, మన్రోలు ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ విలియమ్సన్ కూడా జోరుమీదున్నాడు. సీనియర్ ఆటగాడు టైలర్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. గ్రాండోమ్, వికెట్ కీపర్ లాథమ్‌లు కూడా ప్రతిభావంతులే. నిశమ్, సాంట్నర్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే కివీస్ ఇప్పటి వరకు ఒక్క బలమైన జట్టుతోనూ తలపడలేదు. ఈ ప్రపంచకప్‌లో వారికి అసలైన పోటీ భారత్ నుంచే ఎదురు కానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లతో పోల్చితే రానున్న మ్యాచ్‌లు కివీస్‌కు సవాలుగా మారనున్నాయి. బలహీన జట్లపైనే విజయం సాధించిన కివీస్ ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించడం ద్వారా మరింత మెరుగైన స్థితికి చేరుకోవాలని భావిస్తోంది. బౌలర్లు హెన్రీ, నిశమ్, బౌల్ట్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగే కివీస్‌కు ప్రధాన అస్త్రంగా మారనుంది.

World Cup 2019: IND vs NZ Match today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హ్యాట్రిక్‌పై భారత్ కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: