పెట్టుబడి కోసం అన్నదాత అరిగోస

-రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల కొర్రీలు -ఇబ్బందులు పడుతున్న రైతులు -రైతుబంధుతో అన్నదాతకు ఊరట ఆదిలాబాద్‌ప్రతినిధి : ఖరీఫ్ సీజన్ మొదలవడంతో సాగు పనులకు సిద్దం అవుతున్న అన్నదాత పెట్టుబడుల కోసం పరితపిస్తున్నాడు. ఇప్పటికే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో దుక్కులు దున్నిన రైతులు విత్తనాలు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. రైతుల అవసరం, పెరుగుతున్న డిమాండ్ కారణంగా బహిరంగ మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున నకిలి విత్తనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన విత్తనాలు కొనేందుకు […] The post పెట్టుబడి కోసం అన్నదాత అరిగోస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

-రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల కొర్రీలు
-ఇబ్బందులు పడుతున్న రైతులు
-రైతుబంధుతో అన్నదాతకు ఊరట
ఆదిలాబాద్‌ప్రతినిధి : ఖరీఫ్ సీజన్ మొదలవడంతో సాగు పనులకు సిద్దం అవుతున్న అన్నదాత పెట్టుబడుల కోసం పరితపిస్తున్నాడు. ఇప్పటికే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో దుక్కులు దున్నిన రైతులు విత్తనాలు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. రైతుల అవసరం, పెరుగుతున్న డిమాండ్ కారణంగా బహిరంగ మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున నకిలి విత్తనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన విత్తనాలు కొనేందుకు రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ కూలీలకు కూలీ చెల్లించడం, విత్తనాలకు డబ్బులకు అవసరం అవుతుండడంతో పంట రుణాల కోసం బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. బ్యాంకులు కొత్త రుణాల పంపిణీ విషయాన్ని పక్కనబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పంట రుణాల కోసం రైతులు బ్యాంక్ అధికారులను ప్రాధేయపడుతన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకే తాము వ్యవహరిస్తున్నమంటూ వారు చేతులు ఎత్తేస్తున్నారు. పంట రుణాలు అందక విసిగి పోతున్న రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వం, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దళారుల నేతృత్వంలో దందా సాగిస్తున్నారు. స్వల్ప కాలానికే ఎక్కువ వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. దీని కోసం అన్ని రకాల జమానత్‌లు తీసుకుంటూ ఇక్కట్లకు గురిచేస్తున్నారు. గతంలో ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇచ్చే వారు. ఆ రుణాలతో రైతులు పెట్టుబడులు పెట్టి దిగుబడులు వచ్చిన తరువాత ఆ రుణాలను చెల్లించే వారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల అవసరాన్ని అనుకూలంగా మలుచుకుంటూ వీరు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల్లో ఎక్కువ మంది విత్తనాలు, ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్న వారు కావడం గమనార్హం. వీరికి తోడుగా పంటలను కొనుగోలు చేసే లైసెన్డ్ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, దళారులు కూడా రైతులను బుట్టలో వేసుకొని పెద్ద ఎత్తున అప్పులిస్తున్నారు. కాగా బహిరంగంగా అన్నదాత ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ పెట్టుబడుల కోసం నానా అవస్థతలు పడుతున్నప్పటికీ బ్యాంకులు మాత్రం కనికరించడం లేదు. అలాగే సంబంధిత అధికారులు అన్నదాత అరిగోస పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ఆదుకుంటున్న రైతుబంధు…
జిల్లా రైతాంగం పంటల సాగు కోసం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న దశలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు. జిల్లాలో 90 శాతానికి పైగా రైతులకు రైతుబంధు పథకం కింద రెండు విడతల్లో ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందచేసింది. ఈ ఏడాది నుంచి ఎకరాకు రెండు విడతల్లో 10 వేల రూపాయల చొప్పున ఇవ్వనుంది. మరో రెండు రోజుల్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానుండడంతో కొంత ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం ఎకరాకు 5 వేల రూపాయలు ఖర్చవుతాయని ఈ మొత్తంతో పనులు ప్రారంభించుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తే పంటల సాగులో ఇబ్బందులు దూరమవుతాయని అంటున్నారు. ఇదిలాఉంటే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు గత కొన్నేళ్లుగా పహాణీలు ఇవ్వక పోవడంతో బ్యాంకు రుణాలకు నోచుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఏజెన్సీలోని గిరిజనేతరులు భావిస్తున్నారు.

Farmers Problem Invest in Cultivation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పెట్టుబడి కోసం అన్నదాత అరిగోస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: