మానవుణ్ణి అజేయునిగా నిలబెట్టిన కవిత్వం !

  ఇతివృత్తం ఆకుపచ్చని మనీప్లాంటులా /ఇల్లంతా అల్లుకునే ఉంది/ కానీ, ఇల్లాలి మౌనంలా/ప్రారంభ వాక్యం/ ఇంకా ఆరంభం కాలేదు/…….భావాలు ప్రకటించటానికి /ప్రతీకలు వాడుకోటానికి/ఉపమానాలు ఉపమేయాలు ఉటంకించటానికి / రూపకాలు సిద్ధంగా ఉన్నాయ్/…….. ఒక కవితగా దాని నడక మనస్సులో పడి/సుళ్ళు తిరుగుతుంది/……సమాజ సంఘర్షణలో రైతుల ఆత్మహత్యల్లా/కవిత ఎత్తుగడలో తండ్లాట మొదలయింది/……చివరి వాక్యం చిక్కినట్లే చిక్కి, రద్దీలో తప్పిపోయిన పిల్లాడిలా తప్పించుకు పోతుంది/ ఎట్టకేలకు మెరుపు మెరిసినట్లు/ఒక్క ఊపులో మలుపు తిరిగి కవిత పూర్తయింది ! ఒక కవిత […] The post మానవుణ్ణి అజేయునిగా నిలబెట్టిన కవిత్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇతివృత్తం ఆకుపచ్చని మనీప్లాంటులా /ఇల్లంతా అల్లుకునే ఉంది/ కానీ, ఇల్లాలి మౌనంలా/ప్రారంభ వాక్యం/ ఇంకా ఆరంభం కాలేదు/…….భావాలు ప్రకటించటానికి /ప్రతీకలు వాడుకోటానికి/ఉపమానాలు ఉపమేయాలు ఉటంకించటానికి / రూపకాలు సిద్ధంగా ఉన్నాయ్/…….. ఒక కవితగా దాని నడక మనస్సులో పడి/సుళ్ళు తిరుగుతుంది/……సమాజ సంఘర్షణలో రైతుల ఆత్మహత్యల్లా/కవిత ఎత్తుగడలో తండ్లాట మొదలయింది/……చివరి వాక్యం చిక్కినట్లే చిక్కి, రద్దీలో తప్పిపోయిన పిల్లాడిలా తప్పించుకు పోతుంది/ ఎట్టకేలకు మెరుపు మెరిసినట్లు/ఒక్క ఊపులో మలుపు తిరిగి కవిత పూర్తయింది !

ఒక కవిత పుట్టడానికై కవి పడే తాయిమాయి తనం అది. వేయి భావాల సంఘర్షణలోంచి కవిత రాసిన ఈ కవే నా కవిత్వంలో పడికట్టు పదాలు లేవు వర్ణనలు లేవు/…..క్రమ విస్తృతిలో పేర్చటాలు లేవు! అంటూ వినయం ప్రకటిస్తున్నాడంటే భోళాతనమనుకోవాలా ! వేళాకోళాతనమనుకోవాలా! నా కవిత్వంలో /మనిషి బ్రతకటమే ప్రధానాంశం/చరిత్రను తిరగ రాస్తాడు అన్న తర్వాత భూమ్మీది మానవ జీవన స్పర్శను తనదైన అనుభవైకవేథ్యంలోంచి మాట్లాడుతున్న సుస్పష్ట కవిస్రష్ట అన్న
నిరూపణకు సాక్ష్యం అజేయుడు మానవుడే కవితా సంపుటి. ఆ కవి డా.ఎ.వి.వీరభద్రాచారి, ముద్దుపేరు రాము చలామణిలో.

నా గుండెకు బలాన్నిచ్చింది కవిత్వం/నా గాయాలకు మందు రాసింది కవిత్వం సామాన్యంగా చెప్పినట్లున్నా, స్వచ్ఛంగా, సత్యంగా అనిపించే వాక్యాలు. కవిత్వపు నదిలో మునక … ఆనక మనసు తేలిక, వాస్తవ దర్శనమే. మనిషి కేంద్రకంగా, ప్రధాన ఇతివృత్తంగా, రసాత్మక వాక్యాల సోపానాల అధిరోహిస్తూ తాత్విక చింతనలోంచి, దార్శనిక మధనం లోంచి మనిషిని అప్రతిహత ధీరోదాత్తునిగా ప్రతిష్టించిన కవిత్వం ఇందులో దర్శింపవచ్చు.’ మనిషి మంచోడు/మమతానురాగాలు తెలిసినోడు/………../రేపటి దారి కోసం/రేయింబవళ్లు కష్టించేవాడు’ (మనిషి మంచోడు), ‘మనిషి స్నేహశీలి, ప్రగతి శీలి/……../మెట్టు మెట్టుకు గుట్టు విప్పి /గట్టు తెగి బట్ట బయలవుతున్నాడు/‘(మనిషి స్నేహశీలి), ‘యుద్ధరంగంలో నిలబడి/నిర్దాక్షిణ్యంగా వాస్తవాలతో పోటీపడుతూ’(మొనగాడు), అంటున్న కవి అంతరంగ దృష్టి నిర్దుష్టమైనది, నిరుపమానమైనది.

కదలిక, చైతన్యం ఒక దోవ అయితే, కదిలిపోవడం, చింత పడిపోవడం కూడా సున్నిత, సహృదయ తత్వానికి ఈ కవి మినహాయింపు కాదు, కానీ ప్రత్యేక తీరులో స్పందిస్తడు. ‘సీసాలో బంధించబడ్డ ఈగల్లా /జనం అల్లాడి పోతున్నారు/‘(నేత్రద్వయం),’అవని అంతా అశ్రుధారల ఆర్తనాదం’(అశ్రుధారల అశ్రునాదం), ‘హత్యల నుంచి ఆత్మహత్యల నుంచి/శిధిలమైన పూరిగుడిసెల నుంచి/ఊరిని బతకనివ్వండి!’(ఊరిని బతకనివ్వండి), ‘చరిత్ర వెయ్యికాళ్ల వేగంతో ద్రోహం చేస్తుంది మనుషుల్ని’(గూటిలో దీపం).

హృదయాన్ని చేరుకొనేదే కవిత్వం అనుకుంటున్నాం గదా! ఈ కవి ఆ సాధనలోనే ఆరితేరిండు. సమాజాన్ని ప్రశ్నించడం వేరు, తన్ను తాను ప్రశ్నించుకోవడం వేరు. ఆత్మగతమైన,అంతర్ముఖీనమైన ఒక తత్వవేత్తలా, రుషిలా కవిత్వీకరణ ఈ సంపుటిలో చూడొచ్చు.’ మంట ఎక్క వైనా/ఎసరు తక్కువైనా /కాంతి వుండదు అన్నం ఉడకదు!’(స్థితి), ‘తను చేసిన తప్పు తర తరాలుగా ఉంటుందని / తెలియని వాళ్లు ఓడిపోతూనే వుంటారు!’(ఓడిపోతూనే ఉంటారు),’జాతి జీవన స్వభావాలలో /జీవనదిలా ప్రవహించేది అనుభవం!’(వర్తులం).

మనిషిని ప్రేమించడం, జీవితాన్ని ప్రేమించడం కవి మంచి లక్షణం, ఇంకా కవిని, కవిత్వాన్ని ప్రేమించడం అతి మంచి లక్షణం. దాదాపు చాలా కవితల్లో కవి ప్రస్థావన, కవిత్వ ప్రస్తావన అంతర్లీనంగానైన ప్రవహించడం చూస్తం. పరిశీలించితే ‘ఒక పద్యం నీళ్లల్లో /స్నానం చేసి /ముగ్ధ మందారంలా తాజాగా చేతికందింది’ -‘పద్యం తన పని తను చేసుకుపోతుంది/పది మంది చేతిలో చేయి కలిపి సాగిపోతుం ది’- మరోచోట ‘కలలుగన్న కవులు వెల్తురును దాచుకున్న సుగంధాలు’- ప్రభాత వేళ కవిత్వ పఠన సుందర దృశ్యం దర్శించు’- అలంకారాలు అల్లుకోవాలి/అంత్య ప్రాసలతో ఆడుకోవాలి’ ఇట్లా అలవికాని మోహపరవశంగా, ఆరాధనీయంగా మెలగడం ఈ కవి నిజ ప్రకృతి.

‘కవులేంజేస్తారు’ అన్న కవిత శివారెడ్డి గారు రాసింది ఎంత పాపులర్ అయిందో సాహిత్యలోకమంతటికి అనుభవైక వేద్యమే. ఆ థీమ్ మీద అట్లాంటి, అంతకుమించి కవిత రాయడానికెవరూ సాహసించ లేదు. చిత్రంగా తను అదే శీర్షికతో రాయడం సాహసం కన్నా ‘అన్నయ్యా’ అని పిలుచుకునే అవ్యాజానురాగమే పురిగొల్పిందని నమ్మొచ్చు.

ఆ సాన్నిహిత్యమే వారు హాస్పిటల్‌లో వున్నప్పుడు ‘దుఃఖం’ కవితై జలజలారాలింది. ఖలీల్ జిబ్రాన్ మనం సంతోషాలను విచారాలను ఎన్నుకునే ముందు, వాటిని అనుభవించాలి అన్న వాక్యం ఈ కవికి అపాదించవచ్చు. అవార్డులకో, మెచ్చుకోలుకో కలం పట్టినవాడు కాదు.’ ఆకలి పేగులతో ఉండ చుట్టుకుపోయి అదృశ్యంగా మిగిలిపోయి/వృద్ధాప్య నీడల్లో ఏకాకిగా మిగిలిపోయిన జనం కనబడతారు’ గనకే -‘కుర్చీలో కూలబడ్డ పెద్దమనిషి /రెండు తలల పాములా ఎట్లాగైనా కాటేయగలడు /చర్చిలో ఫాదర్ గాని గుడిలో పూజారి గాని /మసీదులో ఫకీరు గాని ఏం చేయలేరు’ గనకే ‘పద్యం పరుసవేది /నేననుకున్నట్లు అది /సుడిగాలిలా ప్రజల గుండెల్లో చేరిపోతుంది’ అన్న నమ్మికే కలంధారి గ తనను నిలబెట్టింది. ఉప్పుప్పద్దుకుని తిన్నట్టు జీవితం, ఒక్కొక్కక్షరం కళ్ళకద్దుకున్నట్టు రాసె కవిత్వం, దూరంగా మిత్రుడు కనబడ్డా , అంతెత్తు చెయ్యెత్తి పిలవడం వెరసి ‘రాము’. గాలివాటు ఎటున్నా, గాలిపటంలా కొట్టుకుంటు న్నా నేలమీద కురిసే వానజల్లంత సహజంగా కవిత్వవాటు, వేటు అభినందించదగింది, ఆహ్వానించదగింది.

Ajeyudu Manavude book written by Dr. A V Veera Bhadra chary

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మానవుణ్ణి అజేయునిగా నిలబెట్టిన కవిత్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: