అజరామరుడు శేషేంద్ర

  అరవయ్యో దశకంలో తెలుగు సాహితీ లోకంలోకి ఒక కోకిల వచ్చింది. అది తన గానంతో శిశిరమయమైన తోటనంత వసంతంగా మార్చేసింది. ఆ కోకిల గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యానంత ఔపోషణ పట్టాడు. వర్తమాన ప్రపంచ సాహితీ ధోరణులను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. భూగోళమంతట మానవ బాధలని గాధాలని అనాది నుంచి ఏ పరిమితులు లేకుండా నిర్భయంగా తన గొంతును వినిపిస్తున్న వాడు కవి మాత్రమేనని గుర్తించాడు శేషేంద్ర. అందుకే […] The post అజరామరుడు శేషేంద్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అరవయ్యో దశకంలో తెలుగు సాహితీ లోకంలోకి ఒక కోకిల వచ్చింది. అది తన గానంతో శిశిరమయమైన తోటనంత వసంతంగా మార్చేసింది. ఆ కోకిల గుంటూరు శేషేంద్ర శర్మ. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యానంత ఔపోషణ పట్టాడు. వర్తమాన ప్రపంచ సాహితీ ధోరణులను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. భూగోళమంతట మానవ బాధలని గాధాలని అనాది నుంచి ఏ పరిమితులు లేకుండా నిర్భయంగా తన గొంతును వినిపిస్తున్న వాడు కవి మాత్రమేనని గుర్తించాడు శేషేంద్ర. అందుకే శేషేంద్ర శర్మ కవిగా ప్రాదుర్భవించి మహా కవిగా శిఖరాయమానంగా నిలిచాడు.

శేషేంద్ర పద్యంతో తన కవితా ప్రస్థానాన్ని ప్రారంభించి వచన కవిత ప్రక్రియలో తన సృజన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించాడు. విమర్శలో అపూర్వమైన అంశాలను వెల్లడించాడు. ఆత్మ కళాభ్యాసం దక్పథంతో నవీన సాహితీ సిద్ధాంతాన్ని నిర్మించి సాహితీ లోకానికి అందించాడు. కవిత్వంలో కొత్త కొత్త ప్రతీకలు, నూతన అభివ్యక్తి ధోరణులతో తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు. శేషేంద్ర వామపక్ష భావజాలాన్ని సమర్థిస్తూ సమసమాజ స్థాపనే తన సాహితీ లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ తన కంటే ముందు అనుచానంగా వస్తున్న సాహిత్యాన్ని విస్మరించినవాడు కాదు. ఆదికవి వాల్మీకి నుండి మొదలుకుంటే ఆధునిక కాలంలోని ఒక సామాన్యమైన కవి సైతం ఒక బాధ్యతతోనే రచనలు చేశాడని బలంగా విశ్వసించిన కవి శేషంద్ర. అయితే ఏ కవి అయిన తన వర్తమాన కాలపు జీవితాన్ని సాహిత్యంలోకి ప్రవేశపెట్టి వాస్తవీకరణతో కవిత్వాన్ని వైభవోపేతం చేసినవాడే అంటాడు. అయితే కవి ఎంచుకున్న మార్గం, స్వీకరించిన శబ్దకోశం, ప్రయోగించిన అయస్కాంత శబ్దాలు తపోనిష్టతో స ష్టించిన కావ్యం పది కాలాలపాటు మనుగడలో ఉంటూ సకల మానవుల సౌభాగ్యానికి, కళ్యాణానికి ఆ కావ్యం దోహదపడుతుందని శేషంద్ర నిర్ద్వందంగా ప్రకటించాడు.

శేషేంద్ర రచనలన్నీ పైన చెప్పిన అంశాలని ప్రతిఫలింపచేసేవే. ఋతుఘోష, పక్షులు, శేషజ్యోత్స్న, మండే సూర్యుడు, నాదేశం -నాప్రజలు, నీరై పారిపోయింది, గొరిల్లా, సముద్రం నాపేరు, జనవంశవ్‌ు మొదలైన కవితా సంపుటాలు ఆయన సజనాత్మకతకు వెలుగు దివిటీలు. షోడశి, స్వర్ణ హంస, సాహిత్యకౌముది, కాలరేఖ ఆయన వచన రచన విన్యాసానికి, విమర్శకు ఎత్తిన దివిటీలు. ‘విహ్వల’ కథలు, ‘మబ్బుల్లో దర్బారు’ నాటిక వారు సృజించిన ప్రక్రియలే. విశ్వవివేచన, నరుడు నక్షత్రాలు శేషంద్ర వైజ్ఞానిక దష్టికి నిదర్శనాలు.

‘కవిసేన మేనిఫెస్టో’ తెలుగు సాహిత్యానికందించిన అరుదైన ఆధునిక కావ్యశాస్త్రం. విమర్శకులకు, సృజనకారులకు వెలుగుబాటగా నిలిచే కవిసేన మేనిఫెస్టో ఆయన ప్రతిభకు, పాండిత్యానికి లోతైన అధ్యయనానికి , తార్కిక శక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శేషంద్ర జీవితాంతం సాహిత్యమే అధ్యయనం, సృజనగా జీవించాడు. శేషేంద్ర ప్రజా సమస్యలకు ప్రాధ్యాన్యమిస్తూనే ‘ప్యూర్ పోయెట్రీ కాన్సెప్ట్’ ను ప్రవేశ పెట్టాడు. కవిత్వం కేవలం ఆనందం కోసం కాదు, దానికొక మహత్తర లక్ష్యం ఉంటుందని ఆయన గుర్తించాడు. సమాజంపట్ల కవులకు ఎప్పుడూ బాధ్యతలున్నాయని అంటాడు. కవికి ఎప్పుడూ విశ్రాంతి ఉండదంటూ సామాజిక సంఘర్షణలు ఉన్నంత కాలం, సంఘర్షణ కొనసాగినంత కాలం కవి విశ్రాంతి తీసుకోడని తెలిపాడు. కవి విశ్రాంతి తీసుకున్నాడంటే అది మరణతుల్యమైనదని ఆయన విశ్వసించాడు. సమాజంలో ధర్మాధరాలు కాలాన్ని బట్టి కొత్త నిర్వచనాలతో గమిస్తాయి. ఏ కాలాన్నికి ఏది ధర్మమో, ఏది అధర్మమో కవి గుర్తించగలిగినప్పుడే అతను నిరంతరం జ్వలిస్తుంటాడు. కవి జ్వలించకపోతే కవిత్వం లేదు. కవి జ్వలించే దశ రావాలంటాడు శేషేంద్ర. ఆ జ్వలనంలో తాను నమ్మిన సిద్ధాంతంలో కవి బూడిద అయినప్పుడు ఆ కవికి మరణం లేదని శేషంద్ర గాఢంగా విశ్వసించాడు.

శేషేంద్ర రాసిన ‘నా దేశం – నా ప్రజలు’ అనే మహాకావ్యంతో తెలుగు కవిత్వం ఒక నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టింది. ఈ కావ్యం తెలుగు కవితకు, భారతీయ కవితకు కొత్త మలుపు ఇచ్చిందనడంలో సందేహమే లేదు. ఆధునిక సాహిత్య మహా చైతన్యాన్ని దష్టిలో పెట్టుకుంటే నా దేశం – నా ప్రజలు కావ్యం ఆధునికేతిహాసంగా మనం భావించక తప్పదు. విమర్శకులు ఈ కావ్యాన్ని ఆధునిక ఇతిహాసమని నిర్ధారించారు. ఒక ఇతిహాస నిర్మా ణం జరగాలంటే బాధానుభూతి పూర్వక బలి కావాలంటాడు శేషంద్ర. “ నేనే ఆ బలి. నా వయ స్సు, నా సాహిత్యం, నా ప్రతిభ, నా అనుభవం, స్వరం పిండి మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం” అని ‘నా దేశం – నా ప్రజలు’ కావ్యం గూర్చి శేషంద్ర వెలిబుచ్చిన అభిప్రాయం ఇది.

శేషేంద్ర శారీరక శ్రమ, మేధోశ్రమను వేరు చేయాల్సి వచ్చినప్పుడు శారీరక శ్రమ వైపే విస్పష్టంగా నిలిచాడు. శ్రమే సమాజంలో అంతర్గత ప్రవాహంగా ఉంది అని గుర్తించిన శేషేంద్ర భూగోళంలో ఆరుగాలం శ్రమిస్తున్న వాడు కర్షకుడేనని ప్రకటించాడు. ‘ కృషి చేస్తే కాని బతుకు గడవని వాడు కర్షకుడు’ నాగలి పట్టుకుని నేలను దున్నేవాడు ఆ జాతికంతటికీ చిహ్నం. కర్షకుని జీవితంలో ఏ గ్రంథాలుంటాయి “శ్రమ – శ్రమ-శ్రమ” శ్రమ తప్ప అందుకే శేషంద్ర నిరంతరం కర్షకుడి వైపు నిలిచాడు. శ్రమే దూరదూరాలకు కాంతిని వ్యాపింపచేస్తుంది. సమాజ సౌందర్యమంతా చెమట బిందువులోనే ఉందని శ్రామిక పక్షపాతిగా శేషేంద్ర నిలిచాడు. కర్షకుడుకి కార్మికుడికి గడిచిన చరిత్రలో తావు లేదు, వర్తమాన చరిత్రలోనూ చోటు లేదు అనే వాస్తవాన్ని గుర్తించాడు. కనకనే ఈ దుర్మార్గం ఇంకా కొనసాగడానికి వీలు లేదని దీన్ని ఇలాగే సాగనిస్తే భవిష్యత్తులోనూ సాగి తీరుతుందని అలా సాగడానికి వీలు లేదని దానిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని శేషంద్ర బలంగా కాంక్షించాడు.

అందుకే నాది కాని ‘నా దేశంలో ఏమి లేని ప్రదేశంలో ఎందుకు బతుకుతున్నానో తెలియదు’ అనుకుంటున్న సామాన్యుల మనోగతాన్ని తన కలం వాణి ద్వారా శేషేంద్ర ప్రపంచానికి వినిపించాడు. చరిత్రలో చెమట ఒక శాశ్వత అంతర్వాహిని అని గుర్తించాలంటాడు.
“ ధరిత్రిని హలం దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక దేశం. ధరిత్రిని కలం దున్నితే అప్పుడు అవుతుంది ఒక ఇతిహాసం.
హలమూ కలమూ దున్నని ధరిత్రి ధరిత్రి కాదు మట్టి మట్టి” ఇలా కలమూ హలమూ ఒక జాతి వికాసానికి దోహదపడే సాధనాలని శేషేంద్ర అంటాడు. కాని ‘భారతదేశ చిత్రపటమే ఒక నాగలిగా తనకు కనిపిస్తుందనే’ భావనలోనే ఒకింత కర్షకుని వైపు ఆయన మొగ్గు చూపాడని అర్థమౌతుంది. ఇలాంటి అరుదైన భావజాలాన్ని అందించిన శేషేంద్ర తెలుగు కవితా ప్రపంచంలో అజరామరుడు.

మహాకవి శేషేంద్ర 12వ వర్థంతి సాహిత్య సదస్సు

మహాకవి శేషేంద్ర 12వ వర్థంతి, దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్తంగా సాహిత్య సదస్సును ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్టు కోఆర్డినేటర్ సాత్యకి తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రిన్సిపల్ పర్సనల్ ఆఫీసర్ ఎన్.వి.రమణారెడ్డి విచ్చేసి, గ్రంథావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రముఖ సంస్కృత విద్యాంసుడు డా॥ సంగనభట్ల నరసయ్య, శేషేంద్ర 12వ స్మారకోపన్యాసం ఉంటుందని సాత్యకి ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య రవ్వా శ్రీహరి అధ్యక్షతన జరిగే ఈ స్మారక సాహిత్య సదస్సులో డా॥ బి.వాణి తదితర సాహితీ ప్రముఖులు పాల్గొని శేషేంద్ర సాహిత్య విశేషాలు చర్చిస్తారని తెలిపారు.

Story about Guntur Shashindra Sharma Poem

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అజరామరుడు శేషేంద్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: