శుభారంభం

               దేశాలైనా, రాష్ట్రాలైనా, నివాసాలైనా ఇరుగు పొరుగుల మధ్య సఖ్యత ఎంతైనా అభిలషించదగినది. ఇచ్చు పుచ్చుకొనే సంబంధాలు రెండు వైపులా మేలు కలిగిస్తాయి. నీళ్లు, నిధులు, రవాణా, రాకపోకలు, నేర నిరోధం వంటి అనేక అంశాలలో కరచాలనమే కమనీయ ఉమ్మడి భవితవ్యానికి దారి తీస్తుంది. నిరుద్రిక్త సంబంధాలు సామరస్యాన్ని, సఖ్యతను పెంపొందిస్తాయి. ఇరువంకలా నెలవంకలను ప్రభవించి పండు వెన్నెలలను కాయిస్తాయి. దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత […] The post శుభారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

               దేశాలైనా, రాష్ట్రాలైనా, నివాసాలైనా ఇరుగు పొరుగుల మధ్య సఖ్యత ఎంతైనా అభిలషించదగినది. ఇచ్చు పుచ్చుకొనే సంబంధాలు రెండు వైపులా మేలు కలిగిస్తాయి. నీళ్లు, నిధులు, రవాణా, రాకపోకలు, నేర నిరోధం వంటి అనేక అంశాలలో కరచాలనమే కమనీయ ఉమ్మడి భవితవ్యానికి దారి తీస్తుంది. నిరుద్రిక్త సంబంధాలు సామరస్యాన్ని, సఖ్యతను పెంపొందిస్తాయి. ఇరువంకలా నెలవంకలను ప్రభవించి పండు వెన్నెలలను కాయిస్తాయి. దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంత కాలం ఇటువంటి పరిస్థితి నెలకొనలేదు. పర్యవసానంగా అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విశేష గెలుపు సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ ఉద్యమ సారథి, ప్రత్యేక రాష్ట్ర తొలి, మలి ముఖ్యమంత్రిగా ప్రజల విశేషాదరాభిమానాలు చూరగొంటున్న కె. చంద్రశేఖర రావుకు మధ్య గల సఖ్యత, సతంబంధాలు రెండు రాష్ట్రాల మధ్య నవ శకానికి నాంది పలకగలవనే విశ్వాసాన్ని అంకురింప చేశాయి.

అక్కడ గెలుపును సొంతం చేసుకున్న వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి శనివారం నాడు కెసిఆర్‌ను కలుసుకోడం దీనిని ఇనుమడింప చేసింది. ఇద్దరి మధ్య అత్యంత ఆత్మీయ భేటీ చోటు చేసుకున్న సన్నివేశాలు కనువిందు గావించాయి. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలు వెల్లివిరియగలవనే ఆశాభావాన్ని కలిగించాయి. ఈ ఆశ ముందు ముందు మంచి ఫలితాలను ఇవ్వగలదనే భరోసాకు ఆస్కారం కలిగింది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావలసిన సమస్యలెన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన గత ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఇవి అపరిష్కృతంగా మిగిలిపోయాయి. కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలోనూ ఎపి కపట బుద్ధి బయటపడింది. శ్రీశైలం వద్ద తన వాటాకు మించిన జలాలు వినియోగించుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నదనే అభిప్రాయానికి తావు కలిగింది. ఇటువంటివి అక్కడి నాయకత్వంలోని వక్ర బుద్ధి వల్లనే సంభవిస్తాయి. ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందులో అందె వేసిన చేయి అనిపించుకున్నారు. రాజకీయంగా కూడా అకారణ వైరాన్ని ప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వంతో సహకారానికి ఆయన నిరాకరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన చాలా కాలానికి హైకోర్టు విభజన మాత్రమే అతి కష్టంగా జరిగింది. పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్‌లోని అనేక సంస్థల విభజన అంశం అలాగే మిగిలిపోయింది. ఎపి పట్టిసీమ నుంచి తరలించుకుపోతున్న గోదావరి జలాలకు బదులుగా కృష్ణ నుంచి తెలంగాణకు రావలసిన అదనపు వాటా సంగతీ అయోమయంగానే మిగిలిపోయింది. కృష్ణ, గోదావరి నదులు రెండు రాష్ట్రాలకు ప్రాణధారలందిస్తున్నాయి. పై రాష్ట్రాలలో కృష్ణ నది మీద ప్రాజెక్టులు పెరిగిపోడంతో ప్రవాహం సన్నగిల్లి చివరి రాష్ట్రాలైన తెలంగాణ, ఎపిలకు ఎద్దడి ఎదురవుతున్నది. గోదావరి జలాలు అమితంగా సముద్రంలో కలిసిపోతున్నాయి. రెండు రాష్ట్రాలు మైత్రీ భావంతో తలలు ఒకచోట చేర్చి సామరస్య పూర్వకంగా చర్చించుకుంటే ఈ జలాలను ఉభయ శ్రేయోదాయకంగా వినియోగించుకోవచ్చు. శనివారం నాడు జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్‌లో తనను కలుసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదే హితవు చేశారని సమాచారం. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇందుకు సానుకూలంగా అడుగులు వేయగలరనుకోడం అత్యాశ కాబోదు.

అలాగే విద్యుత్తు రంగంలో తల ఎత్తిన అభిప్రాయ భేదాలనూ సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. 2014 నుంచి తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తు కింద 4400 కోట్ల రూపాయల బకాయి చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ అధికార్లు ఇచ్చిన నోటీసు గతంలో వివాదాస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రూ. 1670 కోట్ల మేరకు బకాయి పడిందంటూ తెలంగాణ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. సామరస్య పూరక వాతావరణంలో ఇటువంటి తేడాలను సరిచేసుకోవచ్చు. అటువంటి మంచి భవిష్యత్తుకు శనివారం నాటి కెసిఆర్ జగన్ భేటీ శుభారంభం పలికింది. హైదరాబాద్ నగరం ఇతర అనేక ప్రాంతాల వారితోపాటు ఆంధ్రులకు కూడా ప్రీతిపాత్రమైన నిలయంగా కొనసాగుతున్నది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఆంధ్రులు హాయిగా నివసిస్తున్నారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రోద్యమానికి సారథ్యం వహించినప్పుడు గాని కొత్త రాష్ట్రం అవతరించిన తర్వాత గాని ఈ గడ్డ అన్ని ప్రాంతాల ప్రజలకూ ప్రేమాస్పదమైనదిగానే నిరూపించుకుంటున్నది. ఇరుగు పొరుగు పాలకుల మధ్య సఖ్యత సుహృద్భావాలు వెల్లివిరిస్తే అటువారు ఇక్కడ ఇటు వారు అక్కడ మరింత సుఖంగా, స్వేచ్ఛగా మనగలిగే వాతావరణం నెలకొంటుంది. కెసిఆర్ వైఎస్ జగన్ మైత్రి అటువంటి మహత్తర భవితవ్యాన్ని ఆవిష్కరిస్తుందని విశ్వసిద్దాం.

Jagan Mohan Reddy To Meet KCR In Hyderabad Today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శుభారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: