కూల్చివేత కుట్రలు

       ప్రజాస్వామిక నీతికి నియమ నిబంధనలకు కట్టుబడని అధికార దాహం దేశ హితాన్ని, జాతి శ్రేయస్సును బలి తీసుకుంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు మొదలయినట్టు వస్తున్న సమాచారం వెనుక ఉన్నది అక్కడి ప్రతిపక్షాల అధికార దాహమే తప్ప ఎటువంటి ప్రజా ప్రయోజనమూ కాదు. కర్ణాటకలో ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ జెడి(ఎస్) ప్రభుత్వం ఆది నుంచి కూల్చివేత ముప్పును ఎదుర్కొంటూనే ఉంది. తుమ్మితే ఊడే ముక్కును […] The post కూల్చివేత కుట్రలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

       ప్రజాస్వామిక నీతికి నియమ నిబంధనలకు కట్టుబడని అధికార దాహం దేశ హితాన్ని, జాతి శ్రేయస్సును బలి తీసుకుంటుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు మొదలయినట్టు వస్తున్న సమాచారం వెనుక ఉన్నది అక్కడి ప్రతిపక్షాల అధికార దాహమే తప్ప ఎటువంటి ప్రజా ప్రయోజనమూ కాదు. కర్ణాటకలో ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ జెడి(ఎస్) ప్రభుత్వం ఆది నుంచి కూల్చివేత ముప్పును ఎదుర్కొంటూనే ఉంది. తుమ్మితే ఊడే ముక్కును తలపిస్తున్నది. బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడం కోసం అసెంబ్లీలో ఎక్కువ స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లున్న జెడి(ఎస్)కు మద్దతు ఇచ్చి ఆ పార్టీకి చెందిన కుమార స్వామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తనతో సహకరించడం లేదనే అసంతృప్తిని ముఖ్యమంత్రి కుమార స్వామి ఎప్పుడూ దాచుకోలేదు.

మరోవైపు గవర్నర్ తోడ్పాటుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా సభలో మెజారిటీ నిరూపించుకోలేక భంగపడిన రాష్ట్ర బిజెపి సారథి యడ్యూరప్ప తిరిగి అధికారం చేపట్టడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌లో అసమ్మతిని రెచ్చగొట్టి దాని నుంచి కొంత మంది ఎంఎల్‌ఎల మద్దతు కూడగట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొన్న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఆయనకు కొత్త ఊపునిచ్చాయి. కేంద్రంలో మళ్లీ ఎన్‌డిఎ ప్రభుత్వం ఖాయమని బల్లగుద్ది చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు కర్ణాటకలో బిజెపి ప్రభంజనం వీయనున్నదని కూడా ప్రకటించాయి. ముఖ్యంగా ఇండియా టుడే యాక్సిస్ ఫలితాలు కర్ణాటకలో బిజెపి 21 నుంచి 25 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 3 నుంచి 5, జెడి(ఎస్)కు ఒక్క స్థానం దక్కగలవని జోస్యం చెప్పాయి. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి సదానంద గౌడ బుధవారం నాడు చేసిన వ్యాఖ్య ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోడానికి బిజెపి పడుతున్న ఆరాటాన్ని అద్దం పట్టి చూపింది.

కుమార స్వామి ముఖ్యమంత్రి పీఠమ్మీద ఉండేది మరొక్క రోజేనని, 24న ఆయన ప్రభుత్వ పతనం తప్పదని సదానంద గౌడ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బిజెపి 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటే ఆ తర్వాత 24 గంటల్లో తాను మళ్లీ ముఖ్యమంత్రి కాగలనని యడ్యూరప్ప గత మార్చిలోనే ప్రకటించారు. ఎగ్జిట్ ఫలితాలతో ధైర్యం తెచ్చుకున్న కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకుడు రోషన్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విరుచుకుపడుతూ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లోనైతే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న ఆరాటాన్ని ఆ రాష్ట్ర బిజెపి శాసన సభ పక్ష నాయకుడు గోపాల్ భార్గవ బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి ఎస్‌పి, బిఎస్‌పి, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ (116) కి రెండు తక్కువగా కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు గెలుచుకున్నది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలని, ఇందుకు కోసం అసెంబ్లీని తక్షణం సమావేశపర్చాలని కోరుతూ గవర్నర్‌కు గోపాల్ భార్గవ లేఖ రాశారు. తమ పార్టీలోని కనీసం పది మంది ఎంఎల్‌ఎలకు బిజెపి గాలం వేస్తున్నదని కమల్ నాథ్ స్వయంగా ప్రకటించారు. కేవలం ఎగ్జిట్ ఫలితాల వాపును చూసుకొని భారతీయ జనతా పార్టీ కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాల కూల్చివేతకు ఇంతగా ఆరాటం ప్రదర్శిస్తున్నదంటే నేడు వెలువడనున్న అసలు ఫలితాలతో అది నిజంగానే కేంద్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టినట్లయితే రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను వరుసగా కూల్చివేయగలదనిపించడాన్ని ఆక్షేపించలేము.

కనీసం 40 మంది తృణమూల్ కాంగ్రెస్ శాసన సభ్యులు తనతో మాట్లాడుతున్నారంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచార రంగం మధ్యలోనే ప్రధాని మోడీ బెంగాల్‌లో చేసిన ప్రకటన దేనిని సూచిస్తున్నది? రాష్ట్రాల్లోని పాలక పక్షాల్లో చీలిక ఏర్పడి లేదా పాలక కూటములు చెదిరిపోయి అక్కడి ప్రభుత్వాలు కొనసాగలేని పరిస్థితి తలెత్తితే రాజ్యాంగ సంక్షోభం పెల్లుబికితే అధికారం చేజిక్కించుకోడం కోసం ఇతర పక్షాలు పావులు కదపడాన్ని తప్పుపట్టలేము. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఏ ఇబ్బందీ లేకుండా లక్షణంగా కొనసాగుతూ ఉంటే వాటిని కూలదోయడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఎంతమాత్రం సమర్థించలేము. అది పూర్తిగా అధికార దాహంతో ప్రభుత్వాలను అస్థిరపరిచే దుష్ట పన్నాగమే అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇటువంటి కుట్రలకు పాల్పడాలనుకోడం తీవ్రంగా ఖండించదగినది.

Exit poll results Is Bengal heading for a BJP surge

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కూల్చివేత కుట్రలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: